You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హార్వర్డ్ గ్రాడ్యుయేట్ల గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు
- రచయిత, సీన్ కాఫ్‌లాన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హార్వర్డ్ యూనివర్సిటీ ఎన్నో ఉన్నతస్థాయి కెరీర్‌లకు వేదికలాంటిది. ఈ వేసవిలో మరికొంత మంది గ్రాడ్యుయేట్లు అమెరికాలోని ఆ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నారు. మరి ఈ రాబోయే తరం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నమ్మకాలు, అనుభవాలు ఎలా ఉన్నాయి?
'ద హార్వర్డ్ క్రిమ్‌సన్' అన్న విద్యార్థుల వార్తాపత్రిక రాజకీయాలు, సెక్స్, టెక్నాలజీ మీద ఈ గ్రాడ్యుయేట్ల అభిప్రాయం తెలుసుకొనేందుకు ఒక సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో వెల్లడైన 10 ఆసక్తికరమైన అంశాలు:
1.ఎంతో వ్యాకులతతో ఉన్న తరం: వీరిలో సుమారు 41 శాతం మంది విద్యార్థులు ఏదో ఒక సమయంలో మానసిక ఆరోగ్యం విషయంలో యూనివర్సిటీ వైద్యుల సహాయం పొందారు. క్యాంపస్‌లో ఒత్తిడి పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో వీరు ఇలా వైద్య సహాయం పొందడం ఆసక్తికరం.
2. లైంగిక అనుభవం : ప్రతి ఐదుగురిలో ఒకరికన్నా ఎక్కువ మంది హార్వర్డ్ నుంచి లైంగిక అనుభవం లేకుండానే బయటపడుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎలాంటి డేటింగ్ అనుభవమూ లేకుండా బయట పడుతున్నవారి సంఖ్య కూడా అంతే ఉంది. డేటింగ్ జరిగిన సందర్భంలో 69 శాతం మంది డేటింగ్ యాప్స్ ఉపయోగించారు. ఈ నూతన గ్రాడ్యుయేట్లలో ఐదోవంతు మంది విద్యార్థులుగా తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.
3.ట్రంప్ యుగంలో ఉదారవాదులు: ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు హార్వర్డ్‌లో వీరంతా తమ చదువు ప్రారంభించారు. ప్రస్తుతం ట్రంప్ విధానాలను వీరు వ్యతిరేకిస్తున్నారు. అమెరికా తప్పుడు మార్గంలో వెళుతోందని 72 శాతం మంది గ్రాడ్యుయేట్లు పేర్కొన్నారు. కేవలం 3 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతు తెలిపారు. మొత్తం గ్రాడ్యుయేట్లలో మూడింట రెండొంతుల మంది తమను తాము ఉదారవాదులుగా లేదా అత్యంత ఉదారవాదులుగా చెప్పుకున్నారు.
4.క్యాంపస్‌లో భావప్రకటనా స్వేచ్ఛ: విద్యార్థులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడం లేదని, బహిరంగంగా చర్చించడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడింట రెండొంతుల మంది విద్యార్థులు, విద్యాసంస్థల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తే ఇతరులు నొచ్చుకుంటారనే కారణంతో తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించలేదని తెలిపారు. ఇలాంటి వారిలో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ మంది ఉన్నారు.
5.మద్యపానం: మైండ్ డైవర్షన్‌కు ఎక్కువ మంది విద్యార్థులు మద్యాన్ని ఆశ్రయించారు. 90 శాతం మందికి పైగా విద్యార్థులు మద్యం సేవించారు. వీరంతా దాదాపు ప్రతి వారం మద్యం సేవించేవారు. కానీ సిగరెట్లు తాగడం మాత్రం దాదాపు లేదనే చెప్పొచ్చు. రోజూ సిగరెట్లు తాగేవాళ్లు దాదాపు ఎవరూ లేరు. దాదాపు ముప్పాతిక శాతం విద్యార్థులు ఒక్కసారి కూడా సిగరెట్ తాగలేదు. సిగరెట్లకన్నా గంజాయి ప్రయత్నించిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
6.పాఠశాలల్లో కాల్పులు : అమెరికాలోని పాఠశాలల్లో కాల్పులపై యువత పెద్ద ఎత్తున ప్రతిస్పందించింది. మారణాయుధాలను పొందే విషయంలో నియంత్రణ ఉండాలని హార్వర్డ్ విద్యార్థులు కోరారు. గన్ కంట్రోల్‌ను కఠినంగా అమలు చేయాలని పది మందిలో తొమ్మిది మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
7.స్మార్ట్ విద్యార్థులు, స్మార్ట్ ఫోన్లు: ఇది నిరంతరం డిజిటల్ టెక్నాలజీలో మునిగి తేలే తరం. ఈ గ్రాడ్యుయేట్లలో దాదాపు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంది. చాలా మంది వద్ద ఐఫోన్‌లు ఉన్నాయి. హార్వర్డ్ నుంచి బయట పడుతున్న గ్రాడ్యుయేట్లలో 87 శాతం మంది వద్ద ఐఫోన్‌లు ఉన్నాయి. 80 శాతం మంది విద్యార్థులు ఇతర ఆపిల్ డివైజెస్ వాడుతున్నారు.
8.హార్వర్డ్ గౌరవం: చదువులో తాము మోసానికి పాల్పడమంటూ హార్వర్డ్ విద్యార్థులు ప్రమాణం చేస్తారు. అయితే కేవలం ప్రమాణం వల్ల విద్యార్థుల స్వభావం మారలేదని ఈ సర్వే వెల్లడించింది. చదువులో మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఐదో వంతు మంది విద్యార్థులు ఏదో ఒక దశలో తాము మోసానికి పాల్పడ్డట్లు తెలిపారు. కొద్ది మంది మాత్రం తాము పట్టుబడ్డట్లు అంగీకరించారు.
9.హార్వర్డ్‌లో ప్రవేశంపై వివాదం: టాప్ యూనివర్సిటీలలో సీటు దొరకడం ఎప్పుడూ వివాదాస్పదమే. కొంతమందికి జాతుల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వడాన్ని 60 శాతం మందికి పైగా విద్యార్థులు సమర్థించారు.
10.తర్వాత ఏమిటి? : ప్రపంచం అనేక భిన్నాభిప్రాయాలుగా చీలిపోయిన సమయంలో వీరు బైటపడుతున్నారు. వీరంతా ప్రధానంగా న్యూయార్క్, మసాచుసెట్స్, కాలిఫోర్నియాలలో తమ కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్నారు. కేవలం పదింట ఒక వంతు మంది విద్యార్థులు మాత్రం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. ఎక్కువ మంది కన్సల్టింగ్, ఫైనాన్స్, టెక్నాలజీలలో తమ కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)