You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికాలో 'చైనా గూఢచారి' అరెస్టు
చైనా కోసం గూఢచారిగా పనిచేసేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది.
విమానంలో చైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా 58 యేళ్ల రాన్ రాక్‌వెల్ హాన్సెన్‌ను సియాటెల్ విమానాశ్రయంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
నిందితుడు అమెరికా నిఘా విభాగంలో పనిచేసిన మాజీ అధికారి.
రహస్య సమాచారం చేరవేసేందుకు అతడు ప్రయత్నించాడని, చైనాకు ఏజెంట్‌గా వ్యవహరిస్తూ ఆ దేశం నుంచి 8 లక్షల డాలర్లకు పైగా డబ్బు తీసుకున్నారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది.
చెరకు రైతులకు కేంద్రం తీపి కబురు
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చక్కెర మిల్లులను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.8,000 కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించింది.
అందులో రూ.1,200 కోట్లతో రైతుల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు కొనుగోలు చేయనున్నారు.
మరో 4,400 కోట్లు ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు ఖర్చు చేస్తారు.
చెరకుకు కనీస ధర కిలోకి రూ.29 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2017 అక్టోబర్ నుంచి 2018 సెప్టెంబర్ మధ్యకాలంలో రికార్డుస్థాయిలో దేశంలో 3.16కోట్ల టన్నుల చక్కెర ఉత్పత్తి అయ్యిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది.
అయితే, అంతర్జాతీయంగా ధరలు భారీగా పతనమవ్వడంతో పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.
ప్యాసింజర్ రైళ్లను పరుగులు పెట్టిస్తాం: రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్
దూర ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్ల వేగాన్ని పెంచనున్నట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గొహైన్ వెల్లడించారు.
2022 నాటికల్లా ప్యాసింజర్ రైళ్ల వేగం ఇప్పుడున్న కంటే అదనంగా గంటకు 25 కి.మీ పెంచాలని యోచిస్తున్నామన్నారు.
అప్పటికి సరకు రవాణా రైళ్ల వేగం కూడా రెట్టింపు చేసే దిశగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
కోల్‌కతాలో సంత్రాగచీ-చెన్నై సెంట్రల్ వీక్లీ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ విషయం వెల్లడించారు.
రైళ్ల ఆలస్యం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వేగం పెంపు నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
షిల్లాంగ్‌కు అదనపు బలగాలు
ఘర్షణలతో అట్టుడుకుతున్న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు అదనంగా 6 కంపెనీల పారామిలటరీ సిబ్బందిని పంపించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇప్పటికే 10 కంపెనీలకు చెందిన వెయ్యి మందిని అక్కడికి పంపించారు.
గత గురువారం ఓ బస్సు నిర్వాహకుడిపై కొందరు దాడి చేసిన నేపథ్యంలో షిల్లాంగ్‌లోని పంజాబీ లైన్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. అవి క్రమంగా మరింత పెరగడంతో పరిస్థితి అదుపు తప్పింది.
అక్కడి 14 ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం కూడా సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది.
కెన్యాపై ఛెత్రి సేన విజయం
ఇంటర్నేషనల్ కప్‌లో భాగంగా సోమవారం ముంబైలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కెన్యాపై 3-0తో భారత్ విజయం సాధించింది.
అంతకు ఒకరోజు ముందు.. స్టేడియంకు వచ్చి తమ మ్యాచ్ చూడాలంటూ భారత్ జట్టు కెప్టెన్ ఛెత్రి ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేసిన విషయం ట్రెండ్ అయ్యింది.
ఛెత్రి ట్వీట్‌కు విరాట్ కొహ్లీ, తెలంగాణ మంత్రి కేటీఆర్, దర్శకుడు రాజమౌళితోపాటు దేశవ్యాప్తంగా చాలా మంది మద్దతు తెలిపారు.
ఈ నేపథ్యంలో సోమవారం కెన్యాతో జరిగిన మ్యాచ్ చూడ్డానికి 9000 మంది ప్రేక్షకులు స్టేడియంకు వచ్చారు. మైదానం.. కరతాళధ్వనులతో మారుమ్రోగిపోయింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)