సూర్యుడు సరిగ్గా మీ ఎదురుగా ఉదయించడం ఎప్పుడైనా చూశారా?

ప్రపంచ నలుమూలల నుంచి ఈ వారం సేకరించిన కొన్ని చిత్రాలు మీ కోసం.

న్యూయార్క్‌‌లోని మాన్‌హటన్ ప్రాంతంలో తూర్పు, పశ్చిమ వీధికి సరిగ్గా ఎదురుగా సూర్యుడు ఉదయించి, నిటారుగా పైకి వెళ్తాడు. ఈ అద్భుతం ఏడాదికి రెండు సార్లు మాత్రమే కనిపిస్తుంది. ఈ సారి మే 30న కనిపించిన ఆ వింతను చూసేందుకు జనాలు పెద్దఎత్తున వచ్చారు.

జర్మనీలోని రస్ట్ పట్టణంలో ఉన్న ఓ థీమ్ పార్కులో మే 26న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో సందర్శకులందరినీ ఖాళీ చేయించారు.

భారత్: రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో భారీ లోడుతో ఉన్న డీసీఎం వ్యానును రోడ్డు పక్కన ఆపి, దాని కింద డ్రైవర్, క్లీనర్ ఇలా సేద తీరుతూ కెమెరా కంటికి చిక్కారు.

ఐర్లాండ్‌లో అబార్షన్ 'చట్ట సవరణ'కు కారణమైన వారిలో భారత్‌కు చెందిన సవిత హలప్పన్‌వార్ ఒకరు. ఆమె 2012లో ఐర్లాండ్‌లో ఉన్నపుడు అబార్షన్‌పై అక్కడ నిషేధం అమల్లో ఉన్నందు వల్ల చనిపోయారు. ఇటీవల ఆ చట్టాన్ని సవరించేందుకు అనుకూలంగా రెఫరెండం ఫలితాలు రావడంతో సవిత ఫొటో వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఆమెకు నివాళులర్పించారు.

పారిస్‌లో పోలీసుల నిరసన ప్రదర్శన ఇది. విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఫైర్‌వర్క్స్‌ నుంచి పొగ వస్తుండగా సివిల్ డ్రెస్‌లో ఇలా నిరసన చేపట్టారు.

పడుకున్న సింహం ఆకారంలోని ముత్యం ఇది. ప్రపంచంలోనే దీన్ని అతిపెద్ద సహజ ముత్యంగా భావిస్తుంటారు. ఒకప్పుడు కేథరిన్ ది గ్రేట్ వద్ద ఇది ఉండేది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో వేలం వేయడానికి ముందు ఈ ముత్యాన్ని ఇలా ప్రదర్శించారు.

హవాయ్ ద్వీపంలోని కిలౌయియా అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా పొహైకి రోడ్‌ను దాటి ప్రవహిస్తోంది. ఆ లావా నుంచి బయటకువస్తున్న గ్యాస్ ఇది. మేలో బద్ధలైన ఈ అగ్నిపర్వతం ఆకాశంలోకి సుమారు 30వేల అడుగుల ఎత్తు వరకు దట్టమైన పొగ, లావాను వెదజిమ్మింది.

మే 29న ఉక్రెయిన్‌లో హత్యకు గురైనట్లు వార్తలు వచ్చిన రష్యా జర్నలిస్టు ఆర్కాదీ బాబ్షెంకో (మధ్యలో ఉన్న వ్యక్తి) అకస్మాత్తుగా కీవ్‌ నగరంలో ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కనిపించారు. తన మరణ వార్తను వెల్లడిస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే కనిపించి ఆర్కాదీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

మధ్య లండన్‌లో ఆకాశంలో కనిపించిన మెరుపుల దృశ్యమిది. బ్రిటన్‌లో 4 గంటల వ్యవధిలో సుమారు 15 వేల మెరుపులు నమోదయ్యాయి.

గమనిక: ఈ ఫొటోలన్నీ కాపీరైట్ అయి ఉన్నాయి.