You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రేప్ కేసులో హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ అరెస్ట్
కొందరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో హాలీవుడ్ సినీ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌పై న్యూయార్క్ పోలీసులు అత్యాచార అభియోగాలు నమోదు చేశారు.
అంతకు ముందు వైన్‌స్టీన్ స్వయంగా వెళ్లి న్యూయార్క్ పోలీసుల ముందు లొంగిపోయారు.
ఆయనపై పదుల సంఖ్యలో మహిళలు అత్యాచార, లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
అయితే, పరస్పర అంగీకారం లేకుండా తాను ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదని వైన్‌స్టీన్ చెబుతూ వచ్చారు.
కొన్ని నెలల క్రితమే అతనిపై ఆరోపణలు వచ్చినా అభియోగాలు నమోదు చేయడం ఇదే తొలిసారి.
"వైన్‌స్టీన్‌ను అరెస్టు చేశాం. అతడు ఇద్దరు మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపులు, లైంగిక దౌర్జన్యం, క్రూరమైన లైంగిక చర్యలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశాం" అని న్యూయార్క్ పోలీసు విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
"న్యాయం కోసం ధైర్యంగా ముందుకొచ్చిన బాధితులకు ధన్యవాదాలు" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
అయితే, ఆ అభియోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
#MeToo లో వెల్లువెత్తిన ఆరోపణలు
#MeToo ఉద్యమంలో భాగంగా అనేక మంది నటీమణులు బయటకు వచ్చి వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేశారు.
ఆ ఆరోపణలు చేసిన వారిలో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీతో పాటు, రోస్ మెక్‌గోవాన్ లాంటివారు కూడా ఉన్నారు.
హాలీవుడ్ మూవీ మొఘల్‌గా పేరు తెచ్చుకున్న వైన్‌స్టీన్ నిర్మాతగా వ్యవహరించిన దాదాపు 300 సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. 81 ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి.
అయితే, లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ఏడాది ఆస్కార్ బోర్డు అతన్ని బహిష్కరించింది.
ఎవరెవరు లైంగిక ఆరోపణలు చేశారు?
1996లో ఎమ్మా సినిమాలో ప్రధాన పాత్రధారి అవకాశం ఇచ్చిన తర్వాత, వైన్‌స్టీన్ అతని హోటల్ గదికి తనను పిలిచాడని న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ప్రకటనలో అమెరికన్ నటి గ్వెనెత్ పాల్‌ట్రో చెప్పారు.
1990ల్లో లండన్‌లోని ఒక హోటల్ గదిలో తనను కింద పడేసి అసభ్యంగా ప్రవర్తించాడని, తాను పెనుగులాడి పాకుతూ తప్పించుకోగలిగానని మరో నటి ఉమా తుర్మాన్ ఆరోపించారు. అయితే, ఆమె చెప్తున్న మాటలు ‘అవాస్తవం’ అని వైన్‌స్టీన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
1998లో 'ప్లేయింగ్ బై హార్ట్' విడుదల సందర్భంగా వైన్‌స్టీన్ ఒక హోటల్ గదిలో తనతో శృంగారానికి ప్రతిపాదించినట్లు న్యూయార్క్ టైమ్స్‌తో ఏంజెలినా జోలి చెప్పారు.
ఆసియా అర్జెంటో, కారా డెలవీన్, హెథర్ గ్రాహమ్, జో బ్రోక్ , లూసియా స్టోలర్, మీరా సార్వినో, లూయిసెట్ గైస్ కూడా హార్వేపై ఆరోపణలు చేసిన వారి జాబితాలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'కాస్టింగ్ కౌచ్' భావితరాన్ని భయపెడుతోందా?
- చీర్‌లీడర్స్: ‘మమ్మల్ని కేవలం అందమైన ఆట బొమ్మల్లా చూస్తారు’
- పేదలకూ, సంపన్నులకూ మధ్య తేడా తెలియాలంటే ఈ ఫొటోల్ని చూడాల్సిందే!
- గ్రౌండ్ రిపోర్ట్: ‘‘భయపడొద్దమ్మా, జంతువులు నన్నేమీ చేయలేవు’’ అని చెప్పేవాడు
- BBC Exclusive: ఒకప్పుడు తాలిబాన్.. ఇప్పుడు కార్పెంటర్!
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)