You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సల్మా హయెక్: వైన్‌స్టీన్ నన్ను చంపేస్తానన్నాడు!
హాలీవుడ్ మొగల్ హార్వే వైన్‌స్టీన్ ఒక క్రూర ‘రాక్షసుడ‘ని, అతడు తనను లైంగికంగా వేధించి బెదిరించాడని ప్రముఖ నటి సల్మా హయెక్ ఆరోపించారు.
‘‘నేను నిన్ను చంపేస్తాను. చంపలేనని అనుకోవద్దు’’ అంటూ వైన్‌స్టీన్ తనను ఒకసారి బెదిరించాడని ఆమె న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
ఏంజెలినా జోలీ, రోస్ మెక్‌గోవన్, గ్వెనెత్ పాల్త్రోలు సహా డజన్ల సంఖ్యలో నటీమణులు తమను వేధించాడనో, తమపై దాడి చేశాడనో వైన్‌స్టీన్ మీద ఆరోపణలు చేశారు.
అయితే అనంగీకార సెక్స్ ఆరోపణలను ఆయన తిరస్కరిస్తున్నారు.
సల్మా హయెక్ వ్యాసం మీద ప్రతిస్పందన కోసం వైన్‌స్టీన్ ప్రతినిధులను బీబీసీ సంప్రదించింది.
మెక్సికన్-అమెరికన్ అయిన సల్మా హాయెక్ వయసు ఇప్పుడు 51 సంవత్సరాలు. మెక్సికన్ కళాకారిణి ఫ్రిదా కాలో కథతో తీసిన సినిమాలో నటించాలన్నది తనకున్న అతి పెద్ద ఆశయమని.. ఆ కథతో తీసిన సినిమా కోసం వైన్‌స్టీన్‌తో కలిసి పనిచేశానని ఆమె వివరించారు.
ఆ సినిమా 2002లో ’ఫ్రిదా‘ పేరుతో విడుదలైంది. దానికి ముందు సినిమా హక్కుల కోసం వైన్‌స్టీన్‌తో ఒప్పందం ఖరారు చేసుకునే సమయంలో ఆయనను ‘‘తిరస్కరించిన వరుసలో నేను కూడా చేరాను’’ అని సల్మా పేర్కొన్నారు.
‘‘ఆయనతో కలిసి షవర్ స్నానం చేయటానికి నేను నో చెప్పాను.’’
‘‘నేను షవర్ స్నానం చేయటాన్ని ఆయన చూడటానికి నో చెప్పాను.’’
‘‘ఆయనకు మసాజ్ చేయటానికి నో చెప్పాను.’’
‘‘ఆయన స్నేహితుడొకరు నాకు నగ్నంగా మసాజ్ చేయటానికి నో చెప్పాను.’’
‘‘నాతో అతడు ఓరల్ సెక్స్ చేయటానికి నో చెప్పాను.’’
‘‘మరొక మహిళతో నేను నగ్నంగా మారటానికి నో చెప్పాను’’ అని ఆమె రాశారు.
మరొక నటితో కలిసి నగ్నంగా సెక్స్ దృశ్యాలను చిత్రీకరించకపోతే ఆ సినిమాను ఆపివేస్తానని కూడా వైన్‌స్టీన్ తనను బెదిరించినట్లు సల్మా ఆరోపించారు.
‘‘నేను ఆందోళనను తగ్గించుకోవటానికి మత్తు మందులు వాడాల్సి వచ్చింది. దానివల్ల నేను ఏడవటం తగ్గింది కానీ నాకు విపరీతంగా వాంతులయ్యాయి’’ అంటూ.. ఒక అనవసరమైన సీన్ చిత్రీకరించేటపుడు తాను అనుభవించిన మనోవేదనను సల్మా వివరించారు.
‘‘మీరు ఊహించగలిగినట్లుగా అది సెక్సీగా ఉండదు. కానీ నేను ఆ సీన్ పూర్తిచేయాలంటే నాకున్న దారి అదొక్కటే’’ అని పేర్కొన్నారు.
ఫ్రిదా సినిమాకు గాను.. సల్మా హయెక్‌కు ఉత్తమ నటి కేటగిరీ సహా ఆరు ఆస్కార్ నామినేషన్లు లభించాయి. ఉత్తమ మేకప్, ఉత్తమ ఒరిజనల్ సంగీతం అవార్డులు వరించాయి.
అత్యాచారం, లైంగిక దాడి, వేధింపులు వంటి ఆరోపణలు హార్వే వైన్‌స్టీన్ మీద వచ్చాయి. ఆరోపణలను ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)