You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హార్వే వైన్‌స్టీన్‌ను బహిష్కరించిన ఆస్కార్ బోర్డు
హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌ను ఆస్కార్ బోర్డు బహిష్కరించింది. పలువురు నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆస్కార్ గవర్నర్ల బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
హాలీవుడ్ మూవీ మొఘల్‌గా పేరు తెచ్చుకున్న వైన్‌స్టీన్ నిర్మాతగా వ్యవహరించిన దాదాపు 300 సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. 81 ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి.
అయితే అతను తమపై లైంగిక వేధింపులకు, దౌర్జన్యాలకు పాల్పడ్డాడంటూ అనేక మంది నటీమణులు మీడియా ముందుకు వచ్చారు. బాధితుల్లో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీతో పాటు, రోస్ మెక్‌గోవాన్ కూడా ఉన్నారు.
ఆస్కార్ బహుమతులు ఇచ్చే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో వైన్‌స్టీన్ సభ్యుడిగా ఉన్నారు. శనివారం జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో అతని సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు ఓటింగ్ నిర్వహించారు. అందులో మెజారిటీ సభ్యులు అతనికి వ్యతిరేకంగా ఓటు వేశారని అకాడమీ వెల్లడించింది.
"కేవలం సహోద్యోగుల గౌరవానికి భంగం కలిగించాడని దూరం పెట్టడం మాత్రమే కాదు, సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యక్తులను సహించకూడదు. లైంగిక వేధింపులను ఉపేక్షించబోమని హెచ్చరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని అకాడమీ తెలిపింది.
వైన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలపై అమెరికా, బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
65 ఏళ్ల వైన్‌స్టీన్, తనకు వ్యతిరేకంగా పలువురు నటీమణులు చేసిన ఆరోపణలపై ప్రతిస్పందించాడు.
తన ప్రవర్తన చాలా మందికి బాధ కలిగించి ఉంటుందని ఒప్పుకున్న వైన్‌స్టీన్, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు.
పరస్పర అంగీకారం లేకుండా ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదని స్పష్టం చేశాడు.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)