ఇక తెలుగులోనూ బీబీసీ వార్తలు

ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తావిశేషాల మేలు కలయికగా బీబీసి న్యూస్ తెలుగు వెబ్‌సైట్ ఇపుడు మీ ముందుంది.

తెలుగు ఒక్కటే కాదు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో కూడా వార్తావెబ్‌సైట్లను బీబీసి అందుబాటులోకి తెచ్చింది. తెలుగు వెబ్‌సైట్‌తో పాటు ప్రతిరోజూ అరగంట బులెటిన్‌ను బీబీసి తెలుగులో ప్రసారం చేస్తుంది.

'బీబీసీ ప్రపంచం' పేరుతో ఈ బులెటిన్ సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ రాత్రి 10.30కి ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానెళ్లలో ప్రసారమవుతుంది. హిందీలోనూ 'బీబీసీ దునియా' పేరుతో న్యూస్ బులెటిన్‌ను పున:ప్రారంభిస్తోంది. ఇది 'ఇండియా టీవీ' ఛానల్‌లో ప్రసారమవుతుంది.

ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ న్యూస్ తెలుగు సర్వీసులను ఇప్పటికే ఆరంభించింది. ప్రపంచం కుగ్రామంగా మారిపోతున్న తరుణాన బీబీసీ అంతర్జాతీయ దృక్పథాన్ని తెలుగువారి చెంతకు తీసుకొస్తోంది.

తెలుగు నేలపై జరిగే ఘటనలను పరిణామాలను విస్తృత ప్రపంచం దృష్టికి తీసుకువెళ్తుంది. భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి తపిస్తున్న యువతపై, పాత కాలపు సంకెళ్లు విప్పుకుని కొత్త చరిత్ర లిఖిస్తున్న ఆధునిక మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టి కథనాలను అందిస్తుంది.

న్యూస్ అప్‌డేట్స్, విశ్లేషణలతో పాటు విజ్ఞానం పంచే, వినోదం పెంచే కథనాలను కూడా అందిస్తుంది. విశ్వసనీయత బీబీసీ శ్వాస. వార్తా ప్రపంచంలో నమ్మకమైన నేస్తంగా బీబీసీ మీ వెంట ఉంటుంది.

బీబీసీ దిల్లీ బ్యూరోను పెద్దఎత్తున విస్తరించడంతో బ్రిటన్‌ తరువాత ఇప్పుడు దిల్లీ బ్యూరోయే అతిపెద్దది. దక్షిణాసియా మొత్తానికి ఇది వీడియో, టీవీ, డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్ హబ్‌గా మారనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నైపుణ్యాన్వేషణ జరిపి 150కి పైగా పాత్రికేయులను బీబీసీ నియమించింది.

ఈ కొత్త సేవల ప్రారంభం కోసం భారత్ వచ్చిన బీబీసీ డైరెక్టర్ జనరల్, లార్డ్ హాల్ ఆఫ్ బిర్కన్‌హెడ్ మాట్లాడుతూ.. ''బీబీసీ కీలక మైలురాయిని చేరుతున్న సందర్భంగా భారత్‌లో ఉండడం ఆనందంగా ఉంది. నిష్పాక్షికమైన, స్వతంత్రమైన వార్తలనందించే బీబీసీని భారతీయులు దశాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు మరిన్ని కోట్ల మంది తమ భాషల్లో బీబీసీ వార్తలను పొందే అవకాశమేర్పడుతోంది.'' అన్నారు.

భారతదేశ వ్యాప్తంగా బీబీసీకి మంచి ఆదరణ ఉందని, ఇప్పుడు మరింత మందికి బీబీసీని చేర్చడమే లక్ష్యమని, ముఖ్యంగా కొత్త తరానికి చేరాలని అన్నారు. కొత్త భాగస్వాములు ఇండియా న్యూస్, ఈనాడు టీవీలతో బీబీసీ కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

ఈనాడు టీవీ నెట్‌వర్క్ సీఈవో కె.బాపినీడు మాట్లాడుతూ.. ''విశ్వసనీయమైన న్యూస్ ఛానల్‌గా బీబీసీకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అంతర్జాతీయ వార్తాకథనాలను తెలుగులో అందించేందుకు బీబీసీ ముందుకొస్తూ, వాటిని ఈటీవీ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయాలనుకోవడం తమ వార్తాసేవలకు అదనపు విలువ జోడించినట్లవుతుంద''ని చెప్పారు. ఇండియా న్యూస్ యజమాని, ఐటీవీ నెట్‌వర్క్ ప్రమోటర్, వ్యవస్థాపకుడు కార్తికేయ శర్మ మాట్లాడుతూ.. ''నిష్పక్షపాతానికి పెట్టింది పేరైన బీబీసీ వార్తలు ఇప్పుడు మా వీక్షకులకూ చేరనున్నాయి. మా రెండు సంస్థలు కలిసి పనిచేయనుండడంతో వీక్షకులకు మరింత మెరుగ్గా, విశ్వసనీయమైన అంతర్జాతీయ వార్తలను అందించగలం'' అన్నారు.

1940 తరువాత అతిపెద్ద విస్తరణ

బీబీసీ న్యూస్ ప్రసారాలు ఇప్పటికే బెంగాలీ, హిందీ, ఉర్దూ భాషల్లో 28 మిలియన్ల మందికి చేరుతున్నాయి. 1940 తరువాత బీబీసీ వరల్డ్ సర్వీస్ చేపట్టిన భారీ విస్తరణలో భాగంగా భారత్‌లో ఈ కొత్త సర్వీసుల కోసం బ్రిటన్ ప్రభుత్వం 291 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టింది. మరోవైపు బీబీసీ ఇప్పటికే పిజిన్, అఫాన్ ఒరోమో, అమ్హారిక్, తిగ్రిన్యా, కొరియా భాషల్లో సర్వీసులను ప్రారంభించింది. యొరూబా, ఇబో, సెర్బియన్ సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది.

* 'బీబీసీ ప్రపంచం' సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10.30కు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణల్లో ప్రసారమవుతుంది.

* 'బీబీసీ దునియా' సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటలకు ఇండియా న్యూస్‌లో ప్రసారమవుతుంది.

* మరాఠీ, గుజరాతీ టీవీ న్యూస్ బులెటిన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి.

* ఈ నాలుగు భాషల్లో బీబీసీన్యూస్ వార్తలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంటాయి.

కొత్త వెబ్‌సైట్ల లింకులివీ:

బీబీసీ వరల్డ్ సర్వీస్, బీబీసీ వరల్డ్ న్యూస్ టెలివిజన్ ఛానల్, bbc.com/news సహా బీబీసీ ఇంటర్నేషనల్ సర్వీసులను ప్రపంచవ్యాప్తంగా వారానికి 346 మిలియన్ల మంది చూస్తున్నారు.

బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇంగ్లిష్‌తో పాటు 30 ఇతర భాషల్లో రేడియో, టీవీ, డిజిటల్‌లో వార్తలను అందిస్తోంది. వీటిని వారానికి 269 మిలియన్ల మంది చూస్తున్నారు. బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వీక్షకులకు బీబీసీ లెర్నింగ్ ఇంగ్లిష్ పేరుతో ఇంగ్లిష్ బోధన ఉంది.

బీబీసీ వరల్డ్ సర్వీస్ విస్తరణ

289 మిలియన్ పౌండ్ల పెట్టుబడి

11 కొత్త భాషలు

12 కొత్త టీవీ, డిజిటల్ బులెటిన్లు

* విస్తరణ తరువాత మొత్తం 40 భాషల్లో కవరేజి

* 2022 నాటికి 500 మిలియన్ల మందికి చేరువకావడం.

* 1300 కొత్త ఉద్యోగాలు. ఎక్కువగా యూకే వెలుపల

(ఆధారం: బీబీసీ)

బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ ఫ్రాన్ అన్స్‌వర్త్ ఏమన్నారంటే.. ''యుద్ధాలు, విప్లవాలు, ఏవైనా కొత్త మార్పులు చోటుచేసుకున్న సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వతంత్రమైన, నిష్పక్షపాతమైన, విశ్వసనీయమైన వార్తల కోసం వరల్డ్ సర్వీస్‌పై ఆధారపడ్డారు.''

''భావ స్వేచ్ఛ పెద్దగా లేని అనేక ప్రాంతాల్లోనూ ఎప్పటిలాగే మేం ఒక స్వతంత్ర ప్రసారమాధ్యమంగా 21వ శతాబ్దంలోనూ వ్యవహరించాం''

''ఈరోజు ప్రకటన వెనుక ఉద్దేశం భవిష్యత్తు విస్తరణ కోసం వరల్డ్ సర్వీస్‌పరివర్తనం''

''వార్తలను ఏ విధానంలో చూస్తున్నారన్న విషయంలో మనం వీక్షకులను అనుసరించాలి. వరల్డ్ సర్వీస్‌ను టీవీలో చూస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. కానీ, చాలా సర్వీసులు ఇప్పుడు కేవలం డిజిటల్ రూపంలోనే ఉన్నాయి.''

''డిజిటల్ రూపంలోకి మారడానికి మనం వేగం పెంచగలగాలి. ప్రత్యేకించి ఇది యువత కోసం. వీడియో న్యూస్ బులెటిన్ల దిశగానూ విస్తరించాలి.''

''ఎన్ని మార్పులొచ్చినా స్వతంత్ర, నిష్పక్షపాత జర్నలిజానికే కట్టుబడి ఉండాలి''

ఇంగ్లిష్ సహా 40 భాషల్లో బీబీసీ వరల్డ్ సర్వీస్ అందుబాటులోకొస్తోంది.

బీబీసీ శతవసంతాలు పూర్తిచేసుకునే 2022 నాటికి 500 మిలియన్ల వీక్షకులను చేరాలని లార్డ్ హాల్ లక్ష్యం విధించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)