You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అవినీతి కేసులో థాయిలాండ్ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలుశిక్ష
థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి ఇంగ్లక్ షినవత్రాకు ఆ దేశ సుప్రీంకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బియ్యం పథకం అమలులో ఆమె నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడినట్లు న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.
బియ్యం సబ్సిడీ పథకాన్ని దుర్వినియోగం చేశారని కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. ఈ పథకంలో దాదాపు 8 బిలియన్ డాలర్లు (రూ. 52,364 కోట్లు) మేరకు నిధులు దారిమళ్లినట్లు ఆరోపణలొచ్చాయి.
2014లో సైనిక తిరుగుబాటు అనంతరం ఆమె అభిశంసనకు గురయ్యారు. అయితే షినవత్రా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తీర్పు వెలువడకముందే ఆమె దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె దుబాయిలో ఉన్నట్లు సమాచారం.
అయితే ప్రజల్లో దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గ్రామీణ, పేద ఓటర్లలో ఇంకా ఆమెకు ఇంకా ప్రజాదరణ ఉంది.
సబ్సిడీ బియ్యం పథకంలో అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసినా ఆమె దాన్ని అడ్డుకోలేకపోయారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
'ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి బియ్యం కాంట్రాక్టు ఇవ్వడం చట్టవిరుద్ధం. ఆ విషయం తెలిసి కూడా ఆమె అడ్డుకోలేకపోయారు' అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
'ఇది చట్టవిరుద్ధంగా ప్రయోజనాలు పొందే పద్ధతి. అందువల్లే ఆమె చేసిన పనిని విధినిర్వహణలో నిర్లక్ష్యంగా పరిగణిస్తున్నాం' అని కోర్టు తెలిపింది.
అయితే ఈ పథకం రోజువారీ అమలుకు తాను బాధ్యురాలిని కానని ఆమె కోర్టు విచారణ సమయంలో వాదించారు. తాను రాజకీయ బాధితురాలినని చెప్పుకొచ్చారు.
ఈ తీర్పుపై బీబీసీ జర్నలిస్టు జొనాథన్ హెడ్… బ్యాంకాక్ లో మాట్లాడుతూ, "ఒక పథకానికి గాను దేశ ప్రధానమంత్రిని దోషిగా ప్రకటించడమనేది గతంలో ఎన్నడూ చూడని పరిణామం. ఈ పథకం ఆమె తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తీసుకొచ్చారు" అన్నారు. 'అవినీతిలో ప్రత్యక్షంగా ఆమె ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు' అని ఆయన విశ్లేషించారు.
ఇంతకూ ఏమిటా బియ్యం పథకం?
- ఈ పథకాన్ని షినవత్రా తన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైన హామీగా పేర్కొన్నారు. ఆమె 2011 లో అధికారంలోకి రాగానే దీన్ని ప్రారంభించారు.
- గ్రామీణ పేదరికాన్ని రూపుమాపేందుకు రైతులకు మార్కెట్ ధర కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ ధర చెల్లిస్తారు.
- అయితే ఈ పథకం దేశంలో బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు రూ. 800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు మిలిటరీ ప్రభుత్వం పేర్కొంది.
- గ్రామీణ ఓటర్లలో ప్రజాదరణ లభించినప్పటికీ, ఈ పథకం అమలు బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని, అవినీతికి దారులు తెరిచినట్లైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఇప్పుడామె ఎక్కడున్నారు?
షినవత్రా ప్రసుత్తం దుబాయిలో తన సోదరుడు, మాజీ ప్రధాని థస్కిన్ షినవత్రా దగ్గర ఉన్నట్లు భావిస్తున్నారు. ఆయన కూడా 2008 లో అవినీతి ఆరోపణలు రుజువై జైలు శిక్షపడటంతో విదేశాలకు పారిపోయారు.
థస్కిన్ కు శిక్ష ఖరారైన తర్వాతే షినవత్రా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెను థస్కిన్ ప్రతినిధిగా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి.
గ్రామీణ ఓటర్లలలో ఈ తోబుట్టువుల పట్ల ఇప్పటికీ ప్రజాదరణ ఉన్నా, పట్టణ మధ్యతరగతి, ధనికులు మాత్రం వీరిని వ్యతిరేకిస్తున్నారు.
ప్రస్తుతం విదేశాలలో ఉన్న ఆమె ఎలాంటి శిక్ష అనుభవించడానికి ఇష్టపడకపోవచ్చు.
ఈ విచారణ రెండేళ్లు సాగింది. రూలింగ్ ఇవ్వడంతో ఆగస్టు చివరి వారానికి వాయిదాపడింది. అయితే షినవత్రా కోర్టుకు హాజరుకాకపోవడంతో తీర్పు వాయిదా వేసి ఆమెను అరెస్టు చేసేందుకు వారెంట్ కూడా జారీ చేశారు.
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.