You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయనుకున్నా...’ చిన్నప్పుడే విడిపోయిన అక్క, తమ్ముడు 42 ఏళ్ల తర్వాత ఎలా కలిశారు?
- రచయిత, మోహన్
- హోదా, బీబీసీ కోసం
1970లలో మేరీ క్యాథరీన్ అనే మహిళ కోయంబతూర్ లో బ్లూ మౌంటైన్స్ అనే చిన్నారుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహించేవారు.
అదే సమయంలో అయవు, సరస్వతి దంపతులు తమ ఇద్దరి పిల్లలు విజయ, రాజ్ కుమార్‌లను ఆ కేంద్రంలో విడిచిపెట్టారు.
1979లో ఆ అబ్బాయిని ఒక డానిష్ దంపతులు పెంపకానికి తీసుకున్నారు. ఆ అబ్బాయికి వారు క్యాస్పర్ ఆండర్సన్ అనే పేరు పెట్టారు.
అదే సమయంలో రాజ్ కుమార్ సోదరి విజయను అమెరికాకు చెందిన దంపతులు పెంచుకున్నారు. విజయ పేరును డైయేన్‌గా మార్చారు.
42 సంవత్సరాల తర్వాత ఈ అక్కా, తమ్ముడు కలుసుకున్నారు. ఇదంతా డిఎన్‌ఏ పరీక్షల సాంకేతికత వల్ల సాధ్యమయింది.
డైయేన్ ను ఫిబ్రవరి 01, 1979లో దత్తత తీసుకున్నారు. ఆమె తల్లితండ్రులు ఆమెను అమెరికా తీసుకుని వెళ్లారు. క్యాస్పర్‌ను అదే ఏడాది ఫిబ్రవరి 09న దత్తత తీసుకుని డెన్మార్క్ తీసుకుని వెళ్లారు.
తనకు ఒక సోదరుడు ఉన్నట్లు డైయేన్ కు గుర్తు ఉంది. కానీ, క్యాస్పర్‌ను దత్తత తీసుకునేటప్పటికి ఆ అబ్బాయి చాలా చిన్న వాడు.
ఆ అబ్బాయికి మాత్రం తనకొక సోదరి ఉన్నట్లు గుర్తు లేదు.
ఈ అక్కా తమ్ముడు గురించి ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ అమ్మ బయట నుంచి తినేందుకు ఏదైనా తెస్తానని చెప్పి బయటకు వెళ్లే నాటికి తనకు మూడు సంవత్సరాలని డైయేన్ చెప్పారు.
"నన్ను వదిలిపెట్టి వెళ్లవద్దని అమ్మ చేతిని పట్టుకుని ఏడ్చాను. అదే నేనామెను ఆఖరి సారి చూడటం" అని ఆమె ఆ డాక్యుమెంటరీలో చెప్పారు.
మూలాలు కనుక్కోండి
విదేశాల్లో ఒక శ్వేత జాతీయుల కుటుంబంలో చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేదినిని అని డైయేన్ బీబీసీకి చెప్పారు.
"మా అమ్మను మర్చిపోలేకపోయాను. నాకు భారతదేశంతో జ్ఞాపకాలున్నాయి. కానీ, నన్ను పెంచుకున్న కుటుంబం నన్ను బాగా చూసుకున్నారు" అని చెప్పారు.
క్యాస్పర్ మాత్రం తనతో పాటు ఉన్న కుటుంబం తన స్వంత కుటుంబం కాదని చిన్న వయసులోనే గ్రహించారు. ఆయన యూరప్ లో ఉన్నప్పటికీ, ఆయన చర్మం రంగు బట్టీ ఆయనకు భారత్ లో మూలాలు ఉన్నాయని అనిపించేదని చెప్పారు.
"అయితే, నా మూలాలు కనుక్కునే అవకాశం నాకెప్పుడూ దొరకలేదు. నేను 2015లో ఒకసారి, 2019లో ఒకసారి కోయంబత్తూర్ వెళ్లాను.
నేనుండే పిల్లల సంరక్షణ కేంద్రాన్ని మూసేశారు. నాకు అక్కడ పూర్తి సమాచారం ఏమి లభించలేదు. దాంతో, నేను నిరుత్సాహ పడి డెన్మార్క్ వెళ్ళిపోయాను" అని చెప్పారు.
డిఎన్‌ఏ పరీక్ష
అయితే, క్యాస్పర్ స్నేహితుడొకరు డీఎన్ఏ పరీక్ష చేయించుకోమని సూచించారు. డీఎన్ఏ నమూనాలను పరీక్షించే సంస్థలుంటాయని, వాళ్ళ స్టోర్స్‌లో ఉన్న శాంపిళ్ళతో పోల్చి చూస్తారని చెప్పారు.
తన కుటుంబం గురించి తెలుసుకునేందుకు క్యాస్పర్ అన్సెస్ట్రీ అనే సంస్థకు డీఎన్ఏ శాంపిల్ ఇచ్చారు.
తల్లిని వెతుకుతుంటే అక్క కనిపించింది
మొదట్లో క్యాస్పర్ కు ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపించలేదు.
కానీ, కొన్ని నెలల తర్వాత అమెరికాలోని ఉటా కు చెందిన మైఖేల్ అనే వ్యక్తి ఆయనకు కాల్ చేశారు. ఆయన డీఎన్ఏ శాంపిల్ క్యాస్పర్ శాంపిల్ తో కొంత వరకు పోలుతున్నట్లు చెప్పారు.
‘‘నేను నా డీఎన్ఏ శాంపిల్ ఇచ్చిన సమయంలోనే ఆ వ్యక్తి కూడా తన శాంపిల్‌ను ఇచ్చారు" అని క్యాస్పర్ వివరించారు.
డైయేన్ తన కథను వివరించారు. "నా కొడుకు మైఖేల్ పని మీద బెంగళూరు వెళ్లారు.
అక్కడ నుంచి ఆయన ఫోన్ చేసి "అమ్మ, నీ బంధువు ఒకరిని నేను కనిపెట్టాను" అని చెప్పారు.
డైయేన్ కు ఒక సోదరుడు ఉన్నాడని గుర్తుంది. కానీ, ఆమె మొదట్లో ఎవరో దూరపు బంధువును కనిపెట్టారేమో అని అనుకున్నారు. కానీ, ఆమె కొడుకు తన సొంత సోదరుడినే కనిపెట్టినట్లు తెలిసింది.
తన కుటుంబం కోసం తెలుసుకునేందుకు డైయేన్ కూడా మరొక సంస్థకు తన డీఎన్ఏ శాంపిల్ ఇచ్చారు. "నేను పిల్లల సంరక్షణ కేంద్రంలో ఉన్నప్పుడు నాతో పాటు ఒక చిన్న బిడ్డ కూడా ఉన్నట్లు గుర్తు ఉంది. నేను తనకు తినుబండారాలు ఇస్తూ ఉండేదానిని" అని గుర్తు చేసుకున్నారు.
ఆ సంరక్షణ కేంద్రం నుంచే తన తల్లిని కూడా దత్తతకు తీసుకున్నట్లు మైఖేల్ చెప్పినట్లు క్యాస్పర్ చెప్పారు.
నా తల్లితండ్రులను వెతుక్కుంటూ నేను ఇండియా వచ్చాను. కానీ, నాకొక సోదరి ఉందని నాకు తెలియదు. నేను 2019లో ఆమెతో మొదటిసారి ఫోన్ లో మాట్లాడాను.
తిరిగి కలయిక
ఇటీవల కాలంలో లాక్ డౌన్ విధించడంతో, ఈ అక్కా తమ్ముడు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఆగాల్సి వచ్చింది.
క్యాస్పర్ మరొకసారి ఆయన డీఎన్ఏ ను '23&మీ' అనే సంస్థకు ఇచ్చారు.
డైయేన్ కూడా తన శాంపిల్‌ను గతంలో ఈ సంస్థకు ఇచ్చారు.
‘‘మా ఇద్దరి డిఎన్‌ఏ 100 శాతం సరిపోయింది" అని క్యాస్పర్ చెప్పారు.
"నా అక్కను కనిపెట్టడానికి ముందే నా పక్కన నిల్చున్న ఆమె చిన్నప్పటి ఫోటోను సంరక్షణ కేంద్రంలో చూశాను. అయితే, అప్పటికి నేను తనను ఫొటోలో మాత్రమే చూశాను. అప్పటి నుంచి తనను కలవాలనే కోరిక పెరిగిపోయింది" అని అన్నారు.
"నా తల్లితండ్రుల కోసం వెతుక్కుంటూ వస్తే అక్క దొరుకుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇలాంటి సంఘటనలు నవలలు, సినిమా కథల్లోనే జరుగుతాయని విన్నాను. నాలో కలుగుతున్న భావోద్వేగాలను నేను మాటల్లో చెప్పలేను" అని అన్నారు.
"నేను క్యాస్పర్‌తో మొదటి సారి మాట్లాడుతున్నప్పుడే అతను నా సోదరుడని అర్ధమైపోయింది. ఈ డీఎన్ఏ పరీక్ష కేవలం నామమాత్రానికే" అని డైయేన్ చెప్పారు.
డైయేన్, క్యాస్పర్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వారిద్దరూ కలిసి ఇండియాలో ఉన్న తమ కుటుంబ సభ్యులను కనుక్కోవాలని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆసియా దేశాలు ఆహార ఎగుమతులను ఎందుకు నిలిపేస్తున్నాయి? దీనిని ఫుడ్ నేషనలిజం అంటారా?
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)