లతా మంగేష్కర్: ‘ఎందరో గాయకులు రావచ్చు కానీ లతా జీ లేని లోటు పూరించలేం’
భారతీయ సంగీత ప్రపంచంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలతో పాటు, అత్యంత గౌరవప్రదమైన స్థాయిని దక్కించుకున్న ప్లే బ్యాక్ సింగర్ లతా మంగేష్కర్. కేవలం గాయనిగానే కాదు, నటిగా, సంగీత దర్శకురాలిగా కూడా ప్రపంచానికి తెలియని కోణాలు ఎన్నో ఆమె జీవితంలో దాగిఉన్నాయి.
లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
భారతదేశపు సారాన్ని, సౌందర్యాన్ని వివరించే పాటలు - రామ్‌నాథ్ కోవిద్, భారత రాష్ట్రపతి
‘‘లతాజీ అస్తమయంతో ప్రపంచమంతటా కోట్లాది మంది లాగానే నా గుండె బద్దలైంది. భారతదేశపు సారాన్ని, సౌందర్యాన్ని వివరించే విస్తారమైన ఆమె పాటల్లో.. ఎన్నో తరాల వారు తమ అంతర్లీన భావాల వ్యక్తీకరణను చూసుకున్నారు. భారతరత్న అయిన లతాజీ విజయాలు అసమానంగా నిలిచిపోతాయి’’ అని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
భారతదేశం తన గళాన్ని కోల్పోయింది - వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
‘‘భారతీయ సినీ కోకిల, లెజండరీ గాయని లతా మంగేష్కర్ గారి అస్తమయంతో నేను తీవ్ర విచారంలో మునిగిపోయాను. ఎన్నో దశాబ్దాల పాటు తన మధురమైన, ఉదాత్తమైన స్వరంతో భారత్‌లోనూ ప్రపంచమంతటా సంగీత ప్రియులను అలరించిన లతాజీ మరణంతో భారతదేశం తన గళాన్ని కోల్పోయింది’’ అని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతిలో ఒక మహోన్నతురాలు - నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
‘‘నేను మాటల్లో చెప్పలేనంతగా క్షోభిస్తున్నాను. జాలీదయా గల లతా దీదీ మనను వీడిపోయారు. మన జాతికి ఆమె లేని వెలితి పూడ్చలేనిది. ప్రజలను సమ్మోహనం చేయగల అసామాన్య సామర్థ్యం గల సుమధుర స్వరం ఆమెది. భారతీయ సంస్కృతిలో ఒక మహోన్నతురాలిగా రాబోయే తరాలు ఆమెను గుర్తుపెట్టుకుంటాయి.
లతా దీదీ పాటలు ఎన్నో రకాల భావోద్వేగాలను వెలికితెచ్చాయి. భారతీయ సినీ ప్రపంచం పరివర్తనాలను దశాబ్దాలుగా సన్నిహితంగా చూశారామె. సినిమాల వెలుపల భారతదేశ అభివృద్ధిని ఆమె ఎప్పుడూ గాఢంగా కాంక్షించేవారు. బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని ఆమె ఎప్పుడూ కోరుకునేవారు.
లతా దీదీ నుంచి నేను ఎల్లప్పుడూ ఎంతో అభిమానం పొందటం నా గౌరవంగా భావిస్తాను. ఆమెను నేను కలిసిన ఘట్టాలు మరువలేనివి. లతా దీదీ మరణం పట్ల నా సహచర భారతీయులతో కలిసి నేను దుఃఖిస్తున్నాను. ఆమె కుటుంబంతో మాట్లాడి సంతాపం తెలియజేశాను. ఓం శాంతి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
‘పాట మూగ బోయినట్లైంది, సంగీత మహల్ ఆగిపోయింది’ - కేసీఆర్
ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
లతా జీ మరణంతో ‘పాట మూగ బోయినట్లైంది, సంగీత మహల్ ఆగిపోయింది’ అని విచారం వ్యక్తం చేశారు.
వెండితెర మీది నటి హావభావాలను అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని అని, సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్ల ను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు, కానీ, సింగర్ గా లతా జీ సమయం ఇచ్చినంక నే సినిమా షూటింగ్ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు అని కేసీఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
‘‘ఎందరో గాయకులు రావచ్చు కానీ లతా జీ లేని లోటు పూరించలేనిది" అని సీఎం స్మరించుకున్నారు.
సంగీతంలో తిరుగులేని స్థానం - వైఎస్ జగన్మోహన్ రెడ్డి
భారతరత్న లతామంగేష్కర్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఏడు దశాబ్దాలకు పైగా వీనులవిందైన సంగీతాన్ని అందించారని గుర్తుచేశారు. శాస్త్రీయ, సినీ సంగీతంలో ఆమెది తిరుగులేని స్థానం అన్నారు. ఆమె మరణించడం భారతీయ సంగీతానికి తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచి, ఆమె దూరమయ్యారని విచారం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- షేక్ రషీద్: టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన 17 ఏళ్ల తెలుగు కుర్రాడి కథ
- వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి.. ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు
- గాలిచొరబడకుండా సీల్ చేసిన బబుల్.. లోపల జీవితం ఎలా ఉందంటే..
- ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ వివాదం: సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఉద్యోగ సంఘాలు
- 600 రోజులుగా జూమ్‌లోనే పాఠాలు, 4 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడనుంది
- ‘నేను ప్రేమించటానికి ఎవరైనా కావాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

