టమాటా రేటు తగ్గుతోంది.. ఎందుకు?
టమాట, ఉల్లిపాయ ఈ రెండు నిత్యావసరాల ధరల్లో వచ్చినన్ని హెచ్చుతగ్గులు మరే కూరగాయల్లోనూ రావు. తాజాగా టమాటా ధర ఆల్ టైం రికార్డులు సృష్టించి మళ్లీ వెనక్కు తగ్గుతోంది. సాధారణంగా శీతాకాలంలో దేశంలో టమాటాల ధరలు బాగా తగ్గిపోతాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి తారుమారైంది. కొన్ని నగరాల్లో టమాటా ధరలు మండిపోతున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతుందో చూద్దాం.
భారీ వర్షాలు కురిస్తే టమాటా పంట బాగా దెబ్బతింటుంది. కొన్నిసార్లు ఇతర కారణాల వల్లా టమాటా దెబ్బతిని దిగుబడి రాదు. కానీ అదే సమయంలో డిమాండ్ ఎక్కువ ఉంటే ధర పెరుగుతుంది. ఒకవేళ ఎక్కువ మంది రైతులు టమాటా పండించి మార్కెట్‌కు తెస్తే ధర పడిపోతుంది. మిగతా కూరగాయలు ఎంత రేటు తగ్గినా, ఎంతో కొంత దక్కుతుంది. కానీ టమాటాకు మాత్రం కేజీకి రూపాయి కూడా రైతుకు దక్కకుండా, రోడ్లపై పారబోసే సందర్భాలు అనేకం.

ఇది చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్. పెద్ద టమాటా మార్కెట్లలో ఇదొక్కటి. ఈ మార్కెట్లో ఎక్కడ చూసినా టమాటా రాసులు కనిపిస్తాయి. ట్రేలలో నింపిన ఎర్రని టమాటాలతో మర్కెట్ కళకళలాడుతుంది. స్థానిక రైతులతో పాటు, కర్నాటక సరిహద్దు రైతుల నుంచి కూడా పంట వస్తుంది. ఇక్కడి నుంచి టమాటా దేశం మొత్తం వెళ్తుంది.
తాజాగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిని ధర పెరిగిందని స్థానిక వ్యాపారులు చెప్తున్నారు
నిత్యం టమాటాలు గుట్టలుగా దొరికే మదనపల్లి వీధుల్లోనూ వీటి ధర పెరిగింది.
ఇక్కడ విచిత్రం ఏంటంటే.. టమాటా రైతులకు కేజీకి వంద రూపాయలు దక్కినా, వాళ్లు హ్యాపీగా లేరు. టమాటా ధర కేజీ వంద రూపాలయ్యే సరికి, ఏ రైతు దగ్గరా పంట లేదు. కొందరి దగ్గర పంట ఉన్నా గతంలో వచ్చిన నష్టాలను పూడ్చడానికే ఈ రాబడి సరిపోయిందని రైతులు చెబుతున్నారు.
ఏడాదిలో ఏదో ఒక్కసారి టమాటా ధర పెరిగినా, రైతులు సంతోషంగా లేరు. ఏడాది మొత్తం స్థిరమైన ధర ఉంటేనే అటు రైతుకూ, ఇటు వినియోగదారులకూ లాభం అంటున్నారు.
టమాటా ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు రావాలని కోరుతున్నారు. రైతు దగ్గర్నుంచి వసూలు చేసే కమీషన్ శాతాన్ని తగ్గించాలని కోరుతున్నారు.

ఈ విషయంలో రైతులది కూడా ఒక పొరపాటు ఉంది. రైతులంతా ఒకేసారి టమాటా సాగు చేయడం వల్ల ధర పడిపోతుంటుంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా టమాటా విస్తీర్ణం కూడా ధర పడిపోడానికి కారణం అవుతోంది. ఈ మధ్య మదనపల్లె ప్రాంత రైతులు ఏడాదంతా టమాటా పండేలా విడతల వారీగా పంట వేస్తున్నారు.
టమాటా రైతు నుంచి వినియోగదారుడికి చేరే మధ్యలో మొత్తం ముగ్గురు వ్యక్తులుంటారు. రైతులు తమ పంటను మార్కెట్ కి తీసుకొచ్చాక, మార్కెట్లో వాటిని కొనే కమీషన్ ఏజెంట్ మొదటి వ్యక్తి. ఆ కమీషన్ ఏజెంట్ వేర్వేరు ప్రాంతాల్లోని హోల్ సేల్ వ్యాపారికి టమాటాను ఎగుమతి చేసి పంపుతాడు. ఆ హోల్‌సేల్ వ్యాపారి రెండవ వ్యక్తి. ఆ హోల్ సేల్ వ్యాపారి నుంచి చిన్న కూరగాయల దుకాణాలు వారు కొని, వినియోగదారులకు అమ్ముతారు. ఇక్కడ కూరగాయల షాపు యజమాని మూడో వ్యక్తి అవుతాడు.
ఇవి కూడా చదవండి:
- ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? దీనిని భారత ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?
- ఆకాశ హర్మ్యాలకు ఇక కాలం చెల్లిందా, ఇది కూడా కోవిడ్ ఎఫెక్టేనా?
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- చెక్క, గడ్డి, గంజాయితో 1941లోనే కారు తయారీ.. దీన్ని ఫోర్డ్ సంస్థ ఎందుకు ధ్వంసం చేసింది?
- లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది, భాగస్వాముల్ని మోసం చేస్తున్నాయి, ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి
- క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు నష్టపోయి ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు...’
- కొందరు వందేళ్లకు పైగా జీవించడానికి కారణమేంటి... ఏమిటీ మిస్టరీ?
- రూ. 7 కోట్ల లాటరీ తగిలితే ఇన్ని కష్టాలా?
- బీజింగ్ ఎయిర్పోర్ట్ ఫొటోను నోయిడా ఎయిర్పోర్ట్ అంటూ కేంద్ర మంత్రులు ఎందుకు పోస్ట్ చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


