You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం - Newsreel
కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు.
కర్ణాటక బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నిన్న బసవరాజ్ ఎస్.బొమ్మైని తమ నేతగా ఎన్నుకుంది. దీంతో ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కర్ణాటక బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో తదుపరి నేతగా బసవరాజ్ పేరును యడియూరప్ప స్వయంగా ప్రతిపాదించారు.
యడియూరప్ప, బీజేపీ నేషనల్ సెక్రటరీ సీటీ రవితో కలిసి బసవరాజ్ బొమ్మై గవర్నర్ తవార్ చంద్ గహ్లోత్‌ను కలిశారు.
ఇది చాలా పెద్ద బాధ్యతని, పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని బసవరాజ్ చెప్పారు.
బసవరాజ్ ఎవరు
ఇటీవల రాజీనామా చేసిన బీఎస్ యడియూరప్పకు అత్యంత విశ్వాసపాత్రుడిగా బసవరాజ్ బొమ్మైకి పేరుంది. గతంలో ఆయన మంత్రి వర్గంలో బసవరాజ్ హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఆర్.బొమ్మై కుమారుడైన బసవరాజ్, ఇటీవలే జనతాదళ్ (సెక్యులర్) నుంచి బైటికి వచ్చి బీజేపీలో చేరారు.
మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన బసవరాజ్ గతంలో పుణెలోని టాటా మోటార్స్‌లో మూడేళ్ల పాటు పని చేశారు.
ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా సీఎం పీఠాన్ని అధిరోహించిన రెండో వ్యక్తి బసవరాజ్ బొమ్మై. గతంలో హెచ్.డి. కుమారస్వామికి ఆ ఘనత ఉంది.
కోర్టుకు రాకపోతే అరెస్టుకు అవకాశం-కంగనా రనౌత్ కు ఆఖరి ఛాన్స్ ఇచ్చిన జడ్జి
పరువు నష్టం కేసులో తదుపరి విచారణకు హాజరు కాకపోతే కంగనా రనౌత్ అరెస్ట్ వారెంట్‌కు పిటిషన్ పెట్టుకోవచ్చని అంధేరి మెట్రోపాలిటన్ కోర్టు జావేద్ అఖ్తర్ కు అనుమతి ఇచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
కంగనా రనౌత్‌పై గీత రచయిత, కవి జావేద్ అఖ్తర్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం తన ఎదుట హాజరు అయ్యేందుకు కంగనాకు కోర్టు "చివరి అవకాశం" ఇచ్చింది.
పదేపదే విచారణకు హాజరుకాని కంగనా పై అరెస్టు వారెంట్ జారీ చేయాలని అఖ్తర్ కోర్టును కోరగా అందుకు నిరాకరించిన న్యాయమూర్తి ఆర్ఆర్ ఖాన్ , తదుపరి విచారణకు కంగనా రాకపోతే ఆమె పై అరెస్ట్ వారెంట్‌కు పిటీషన్ పెట్టుకోవచ్చని సూచించారు.
మంగళవారం కోర్టులో అఖ్తర్ పిటిషన్ పై విచారణ జరిగింది. వ్యక్తిగత కారణాల రీత్యా తన క్లయింట్ కంగనా రనౌత్ కోర్టుకు నేరుగా హాజరు కాలేరని, అందుకు మినహాయింపు కోరుతూ ఆమె తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.
అయితే, కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. మినహాయింపు దరఖాస్తుకు ఇది "చివరి అవకాశం" అని, తదుపరి విచారణకు కంగనా తప్పనిసరిగా హాజరు కావాలని జడ్జి తెలిపారు.
ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 1వ తేదీన ఉంటుంది.
తన పరువు ప్రతిష్టలను దెబ్బ తీసే విధంగా కంగనా ఒక టీవీ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారని గత ఏడాది నవంబర్‌లో జావేద్ అఖ్తర్ కోర్టులో కేసు వేశారు.
కిందటి ఏడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత, కంగనా ఒక టీవీ షోలో మాట్లాడుతూ బాలీవుడ్‌లో ఒక "గుంపు" ఉందంటూ తన పేరు ప్రస్తావించారని అఖ్తర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: స్పెయిన్‌పై భారత హాకీ జట్టు గెలుపు
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- కంగనా రనౌత్‌కు 'వై ప్లస్' కేటగిరీ సెక్యూరిటీ... ఏమిటిది? ఎలా ఉంటుంది?
- అందమైన షేప్ కోసం కాస్మొటిక్ సర్జరీలు, ఆపరేషన్ ఖర్చుల కోసం సెక్స్ ఒప్పందాలు
- ‘‘నెలలో పదిహేను రోజులు దేవతలా వుంటుంది... మిగిలిన సగం మాత్రం రాక్షసిలా చేస్తుంది...’’: పీఎంఎస్ అంటే ఏమిటి?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- కంగనా రనౌత్ వెనుక ఎవరున్నారు? ఎవరి అండతో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు చేస్తున్నారు?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'