You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యడియూరప్ప: “నా మీద ఎవరూ ఒత్తిడి చేయలేదు. సీఎం పదవికి నేనే రాజీనామా చేశా”
కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప సమర్పించిన రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదించారు. సీఎంగా వేరొకరు బాధ్యతలు తీసుకునే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న గవర్నర్ సూచనకు యడియూరప్ప అంగీకరించారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో యడియూరప్ప మాట్లాడారు.
''రాజీనామా చేయాలని నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. నేను సొంతంగానే రాజీనామా చేశాను. రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో, కొత్త వ్యక్తిని సీఎంగా ఎంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేను కృషి చేస్తాను. నా తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై నేను ఎలాంటి సూచనలూ చేయలేదు'' అని ఆయన వివరించారు.
''బీజేపీ అధినాయకత్వం ఎంచుకునే కొత్త సీఎం నేతృత్వంలో మేమంతా పనిచేస్తాం. నేను 100 శాతం శక్తివంచన లేకుండా పనిచేస్తాను. మా మద్దతుదారులు కూడా అలానే పనిచేస్తారు. నేను అసంతృప్తితో ఉన్నానని ఎవరూ అనుకోవాల్సిన పనిలేదు''
''రెండేళ్లపాటు సీఎంగా కొనసాగేందుకు అవకాశం ఇచ్చిన మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాలకు ధన్యవాదాలు. కర్ణాటక ప్రజలకు, నా నియోజకవర్గ ప్రజలకు కూడా ధన్యవాదాలు. నేను రాజీనామా చేయాలని రెండు రోజుల క్రితం నిర్ణయించుకున్నాను. దీన్ని గవర్నర్ కూడా ఆమోదించారు'' అని యడియూరప్ప చెప్పారు.
గవర్నర్‌గా అవకాశం వస్తే వెళ్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు యడియూరప్ప స్పందించారు.
''రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాననే సందేహం అక్కర్లేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నేను కృషి చేస్తాను'' అని మీడియాతో ఆయన చెప్పారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
యడియూరప్ప ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు.
గతంలో మూడుసార్లు మధ్యలోనే పదవికోల్పోయారు
యడియూరప్ప తొలిసారి 2007 నవంబరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అప్పుడు ఆయనకు మద్దతిస్తామని చెప్పిన జేడీఎస్ మనసు మార్చుకోవడంతో నాలుగు రోజులకే ఆయన పదవి కోల్పోయారు.
ఆ తరువాత ఏడాది 2008లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడేళ్ల పాలన తరువాత అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీ ఒత్తిడితో పదవికి రాజీనామా చేశారు.
2018 ఎన్నికల్లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన బలం నిరూపించుకోలేక రెండు రోజులకే రాజీనామా చేశారు.
అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీఎస్ నేత కుమారస్వామి 14 నెలల పాలన తరువాత ఎమ్మెల్యేల రాజీనామాతో బలం కోల్పోయి పదవి పోగొట్టుకోవడంతో 2019లో యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
యడియూరప్ప ఎవరు?
కర్ణాటకలో ప్రాబల్యం ఉన్న లింగాయత్ సముదాయానికి చెందిన వ్యక్తి యడియూరప్ప.
ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) మూలాలున్న వ్యక్తి. శికారిపుర శాఖ ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు.
జనసంఘ్ నేతగా ఎమర్జెన్సీ సమయంలో జైలుకు కూడా వెళ్లారు. 1975లో శికారిపుర పురపాలక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
2006లో జేడీ(ఎస్) మద్దతుతో అధికారంలో కొనసాగుతున్న ధరమ్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో యడియూరప్ప కీలకపాత్ర పోషించారు.
2008లో తొలిసారిగా కర్ణాటక పగ్గాలు చేపట్టారు. కానీ, కుమారస్వామి మద్దతు ఉపసంహరించడంతో వారం రోజుల్లోనే సీఎం పదవిలోంచి దిగిపోవాల్సి వచ్చింది.
2011లో మైనింగ్ కుంభకోణం ఆరోపణలతో ముఖ్యమంత్రి పదవి నుంచి, సొంత పార్టీ నుంచి యడియూరప్ప తప్పుకొన్నారు.
బీజేపీ నుంచి బయటకు వచ్చాక 'కర్ణాటక జన పక్ష' అనే పేరుతో ఆయన సొంతంగా పార్టీ పెట్టారు.
2014 పార్లమెంట్ ఎన్నికల ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేసి ఆ పార్టీ తరఫున శివమొగ్గ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి గెలిచారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)