IPL 2020: స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడం కొత్త కుర్రాళ్లకు కలిసొచ్చిందా?

రియాన్ పరాగ్

ఫొటో సోర్స్, BCCI/IPL

    • రచయిత, సి.వెంకటేష్
    • హోదా, క్రీడా విశ్లేషకులు

అసోం జానపద నృత్యం 'బిహు ' గురించి ఈమధ్య సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు చర్చించుకోవడం ఆశ్చర్యంగానే కనిపిస్తుంది.

అయితే, దీనికి ఓ ప్రత్యేక కారణముంది. ఐపీఎల్ మ్యాచ్‌లో తమ జట్టు గెలిచినప్పుడు అసోం ఆటగాడు రియాన్ పరాగ్ ఆ డ్యాన్సుతో సెలెబ్రేట్ చేసుకోవడంతో బిహు వార్తలకెక్కింది.

మామూలుగానైతే ఈశాన్య రాష్ట్రాలకు, క్రికెట్‌కు ఆమడ దూరం. కానీ ఈ క్రీడ దేశంలోని మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తున్నదనడానికి, అలాంటి ప్రాంతాల నుంచి వచ్చే యువ ఆటగాళ్ళను ప్రపంచానికి ఐపీఎల్ పరిచయం చేస్తున్నదనడానికి ఇదే ఉదాహరణ.

కల్లోల కాశ్మీరం నుంచి వచ్చిన అబ్దుల్ సమద్ కూడా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నాడు.

అంతే కాదు పానీపూరీ అమ్మిన యశస్వి జైస్వాల్, రోజు కూలీ కొడుకైన టి.నటరాజన్ లాంటి క్రికెటర్లు తమ టాలెంట్‌ ప్రదర్శించడానికి ఐపీఎల్ ఓ పెద్ద రంగస్థలాన్ని అందిస్తున్నది.

ఈ లీగ్ వేల కోట్ల రూపాయల వ్యాపారమే కావొచ్చు, దీని ద్వారా ఆటలో కమర్షియల్ ధోరణులు వెర్రితలలు వేస్తుండొచ్చు. అయినా సరే, ప్రతి ఏటా చాలా మంది యువ క్రికెటర్ల ప్రతిభ ఈ టోర్నమెంటు వల్ల వెలుగులోకి వస్తున్నది.

కొత్త కుర్రాళ్ళకు టీమిండియాలో చోటు దక్కాలంటే ఆ మార్గం 'వయా' ఐపీఎల్ గానే జరుగుతోంది.

ఈ ఏడాది ఐపీఎల్‌లో కొత్త కుర్రాళ్ళు ఎన్నడూ లేనంతగా సందడి చేస్తున్నారు. బహుశా స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడమనేది ఈ కుర్రాళ్ళపై ఎలాంటి ఒత్తిడి లేకుండా జోరుగా ఆడే వీలు కల్పించిందేమో.

శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవి బిష్నోయి, ప్రియమ్ గర్గ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి, రియాన్ పరాగ్ లాంటి యంగ్ గన్స్ ఈసారి మెరుపులు మెరిపిస్తున్నారు.

కుర్రాళ్ళనే కాదు, గతంలో పెద్దగా గుర్తింపు పొందని రాహుల్ తేవతియా, సూర్యకుమార్ యాదవ్ లాంటి దేశవాళీ క్రికెటర్లు కూడా దుమ్ము రేపుతున్నారు.

ఎంఎస్ ధోనీ

ఫొటో సోర్స్, BCCI/IPL

హోమ్ అడ్వాంటేజ్ లేదు

మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ, గ్లెన్ మ్యాక్స్‌ వెల్, డేల్ స్టెయిన్ లాంటి సూపర్ స్టార్లు నిరాశపరుస్తున్నారు.

అందుకే జట్టు మేనేజ్‌మెంట్ల ఆలొచనా ధోరణిలో కూడా మార్పు వచ్చి, స్టార్ క్రికెటర్లను పక్కనబెట్టి యువ ఆటగాళ్ళను నమ్ముకుంటున్నారు.

అందుకే, టీ20 ఫార్మాట్‌లో 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్‌కు ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో కూడా ఆడే చాన్స్ దక్కలేదు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం కాని దేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2020 ఈసారి మిగతా సీజన్ల కన్నా స్పెషల్‌గా కనిపిస్తున్నది. మ్యాచ్‌లు ఎన్నడూ లేనంత పోటాపోటీగా సాగుతున్నాయి.

మొదటి పది రోజుల్లోనే రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్ దాకా వెళ్ళడమే ఇందుకు నిదర్శనం. 'హోమ్ అడ్వాంటేజ్' అనేది లేకపోవడమే ఇందుకు కారణం కావొచ్చు.

ఇండియాలో జరిగివుంటే ప్రతి జట్టూ సగం మ్యాచ్‌లు బాగా అలవాటైన గ్రౌండ్‌లో, తమ ఫ్యాన్స్ సందడి మధ్య ఆడేవారు.

కానీ ఇప్పుడు అన్నీ తటస్థ వేదికలే కాబట్టి ఏ జట్టుకు కూడా అదనపు ప్రయోజనం లేకుండా ఉంది.

విదేశీ ఆటగాళ్ళు అందరూ పూర్తిగా అందుబాటులో ఉండడం ఈ సారి మనం చూస్తున్న హోరా హోరీ పోరాటాలకు మరో కారణం కావొచ్చు.

గతంలో అయితే, తమ దేశం తరఫున ఆడాల్సిన సీరీస్‌లు ఉంటాయి కాబట్టి విదేశీ స్టార్స్, టోర్నమెంటు ప్రారంభంలోనో, చివరిలోనో చాలా మ్యాచ్‌లు మిస్సయ్యేవారు.

కానీ ఈ సారి ఐపీఎల్ టైములో మరెక్కడా వేరే సీరీస్‌లు జరగడం లేదు కాబట్టి బయటి స్టార్స్ అందరూ పూర్తి టోర్నమెంట్ ఆడుతున్నారు.

సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, BCCI/IPL

అంచనాలు గల్లంతు

యూఏఈలో పరిస్థితులపైన సరైన అవగాహన లేక టీమ్ కెప్టెన్లు ప్రారంభంలో వ్యూహాత్మక తప్పిదాలు చేశారు. టాస్ గెలిచిన కెప్టెన్ మ్యాచ్ ఓడిపోవడమనే ట్రెండ్ మొదటి రెండు వారాల్లో కనిపించింది.

మ్యాచ్ ద్వితీయార్థంలో మంచు కురుస్తుందని బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ల వ్యూహం బెడిసికొట్టింది. మంచు ప్రభావం ఉన్నా సరే మొదట బ్యాటింగ్ చేసిన జట్లే అన్ని చోట్లా ఎక్కువ విజయాలు నమోదు చేసుకున్నాయి.

బౌలింగ్ విషయంలో కూడా అంచనాలు తప్పాయి. అక్కడి మందకొడి పిచ్‌లపైన స్పిన్నర్లదే హవా అని మొదట అనుకున్నారు కానీ, గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లే ఎక్కువ ప్రభావం చూపారు.

ఎక్కువ వికెట్లు సాధించిన మొదటి పది మంది బౌలర్లలో ఏడుగురు ఇలాంటి పేస్ బౌలర్లే ఉన్నారు.

అయితే పోను పోను పిచ్‌లు మందగిస్తాయి కాబట్టి టోర్నమెంట్ రెండో సగంలో స్పిన్నర్లదే పైచేయిగా ఉండే అవకాశముంది.

సగం టోర్నమెంటు పూర్తయ్యేసరికి అందరినీ ఆకట్టుకున్న జట్లు ముంబయి, దిల్లీ అని చెప్పాలి. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఈ రెండు టీమ్స్ పాయింట్ల పట్టికలో కూడా టాప్‌లో ఉన్నాయి.

ఐపీఎల్ ట్రోఫీ

ఫొటో సోర్స్, Getty Images

ప్లే-ఆఫ్స్ అవకాశం ఎవరికి

విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ కూడా మొదట్లో తడబడినా తర్వాత పుంజుకుని పై రెండు జట్లకి గట్టి పోటీ ఇస్తున్నది. ఈ మూడు జట్లు ప్లే-ఆఫ్ దశకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ప్లే-ఆఫ్స్ లో నాలుగో స్థానం కోసం పోటీ ఉండేలా ఉంది.

ఇక మిగిలిన మూడు జట్లు - పంజాబ్, రాజస్థాన్, చెన్నై రెండో సగంలో అద్భుతాలు చేస్తే తప్ప నాకౌట్ దశకు చేరేలా లేవు.

ముఖ్యంగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్లే-ఆఫ్స్ మిస్సవ్వని చెన్నై ఈసారి చాలా నిరాశపరిచింది.

టోర్నమెంట్ మొదలవ్వకముందే జట్టు సభ్యులు కొందరికి కోవిడ్ సోకడం, సురేశ్ రైనా లాంటి ముఖ్యమైన ప్లేయర్ నిష్క్రమణ లాంటి ఇబ్బందులు ఎదురైనాయి వారికి.

ధోనీ బ్యాటింగ్ ఫామ్ అందుకోలేకపోవడంతో అతనిచ్చే ఫినిషింగ్ టచ్ దొరకడంలేదు. అయితే ఈ మూడు జట్లకు కూడా సమయం ఇంకా మించిపోలేదు.

మొత్తం జట్లన్నిటికీ సరైన కాంబినేషన్ విషయంలో స్పష్టత వచ్చింది కాబట్టి రాబోయే మ్యాచ్‌లు మరింత పోటాపోటీగా ఉండే అవకాశముంది.

కోహ్లీ, అనుష్క శర్మ

ఫొటో సోర్స్, TV GRAB

మితిమీరిన సోషల్ మీడియా

సినిమా లాంటి వేరే ఎంటర్‌టైన్‌మెంట్ ఏదీ లేకపోవడంతో ఈసారి ఐపీఎల్ చూసేవారి సంఖ్య బాగా పెరిగినట్టు చెబుతున్నారు.

అంతా బాగానే ఉంది గానీ సోషల్ మీడియాలో అభిమానుల ఆగడాలు మాత్రం మితిమీరుతున్నాయి. చెన్నై వైఫల్యాలకు సంబంధించి ధోనీ ఆరేళ్ళ కూతురిని కూడా టార్గెట్ చేయడం కంటే దౌర్భాగ్యం మరొకటుండదు.

అలాగే కోహ్లీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ సునిల్ గవాస్కర్, అనుష్క ప్రస్తావన తేవడం కూడా ఇబ్బందిపెట్టింది.

మాఫియా గ్యాంగ్ వార్స్‌ లో కూడా ఫ్యామిలీల జోలికెళ్ళరనే నియమం ఉంటుందని రాంగోపాల్ వర్మ సినిమాలలో చెబుతారు. కానీ క్రికెటర్ల వ్యవహారంలోకి వారి కుటుంబాలను లాగడం మాత్రం దురదృష్టకరం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)