చైనా, భారత్ ఉద్రిక్తతలు: మంచుకొండల్లో దారితప్పిన చైనీయులకు ఆక్సిజన్, ఆహారం అందించి బతికించిన ఇండియన్ ఆర్మీ - BBC Newsreel

సిక్కిం ఉత్తర ప్రాంతంలో భారత్, చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయిన చైనా ప్రజలను ఇండియన్ ఆర్మీ రక్షించింది.

17,500 అడుగుల ఎత్తున ఏమాత్రం అనుకూలంగా లేని వాతావరణంలో చిక్కుకున్న కొందరు చైనా ప్రజలకు ఆక్సిజన్, ఆహారం, దుస్తులు అందించి వారు అక్కడి నుంచి బయటపడేలా చేసినట్లు భారత సైన్యం ట్విటర్‌లో తెలిపింది.

భారత సైన్యం అన్నిటికంటే మానవత్వానికి ప్రాధాన్యమిస్తుందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సరిహద్దుల్లోని మంచుకొండల్లో మైనస్ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో ముగ్గురు చైనా పౌరులు దారి తప్పారని.. వారిని చూసిన భారత సైనికులు ఆహారం, వెచ్చని దుస్తులు అందివ్వడమే కాకుండా ఆక్సిజన్ అందించి, మందులు, వైద్య సహాయం కూడా చేశారని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

కాగా చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఆ దేశ ప్రజలను రక్షించి భారత సైన్యం మానవత్వం చాటుకోగా చైనా మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించిందని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని శుభాన్ సిరి జిల్లాలో అయిదుగురు బాలురను చైనా ఆర్మీ అపహరించిందని నినాంగ్ ఆరోపించారు.

చైనా రక్షణ మంత్రితో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం అవుతున్న సమయంలోనే చైనా ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపిస్తూ ఆయన నినాంగ్ ట్వీట్ చేశారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి సోదరుడు శోవిక్ చక్రవర్తి.. సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాందాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)కి సెప్టెంబరు 9 వరకు కస్టడీ ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

శనివారం సుశాంత్ ఇంట్లో సహాయకుడు దీపేశ్ సావంత్‌ను ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.

శోవిక్, శామ్యూల్‌లను శుక్రవారం అరెస్ట్ చేశారు.

కాగా శోవిక్ డ్రగ్స్ వ్యవహారాలలో పలువురి పేర్లను బయటపెట్టాడని ఎన్‌సీబీ అధికారులు చెప్పారు.

జూన్ నెలలో చనిపోయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధించి.. మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీ శుక్రవారం వారిని ప్రశ్నించింది.

అంతకుముందు శుక్రవారం ఉదయం శోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరాండాల నివాసాల్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది. శోవిక్, రియాలు ఒకే ఇంట్లో ఉంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు కరోనావైరస్ సోకింది.

కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, రిపోర్టు పాజిటివ్ అని వచ్చిందని ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.

కాగా, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన వెల్లడించారు.

అయితే, గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ కూడా టెస్టు చేయించుకోవాలని, ఎవరికి వారు ఐసొలేట్ కావాలని సూచించారు.

ఇరాన్‌లో పరిమితికన్నా పదిరెట్లు ఎక్కువగా యురేనియం నిల్వలు

ఇరాన్‌లో యురేనియం నిల్వలు పరిమితికన్నా పదిరెట్లు ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి యూరేనియం నిల్వల తనిఖీ బృందం వెల్లడించింది.

ప్రస్తుతం ఇరాన్‌ వద్ద శుద్ధి చేసిన యురేనియం 2,105 కేజీల వరకు ఉందని ఇంటర్నేషనల్ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) కూడా వెల్లడించింది.

అయితే, తాము శాంతియుత ప్రయోజనాల కోసమే యురేనియాన్ని వాడుకుంటున్నామని ఇరాన్‌ వాదిస్తోంది.

గతంలో ఉపయోగించిన ఓ అణు కేంద్రం వద్ద తనిఖీల సందర్భంగా ఈ వ్యవహారం బైటపడిందని, రెండో అణుకేంద్రాన్ని కూడా త్వరలోనే పరిశీలిస్తామని IAEA తెలిపింది.

2015లో ఇరాన్‌తోపాటు చైనా, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, రష్యా, యూకే సంతకాలు చేసిన ఒప్పందాన్ని ఇరాన్‌ గత ఏడాది నుంచి ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

అమెరికా విధించిన ఆంక్షలకు నిరసనగా ఇరాన్‌ ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే అణుబాంబుల తయారీకి అవసరమైన దానికన్నా తక్కువ యురేనియమే ఇరాన్‌ దగ్గర ఉందని, అణుబాంబు తయారీకి మరో 1050 కేజీల యురేనియం అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)