కరోనా వైరస్‌-రెమ్‌డెసివిర్‌: బ్లాక్‌ మార్కెట్‌లో కోవిడ్‌-19 మందులు..దిల్లీలో రూ.5,400 సీసా రూ.30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం

ఇండియాలో కోవిడ్‌-19 చికిత్సకు వాడే రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌ అనే రెండు ప్రధానమైన ఔషధాలను దిల్లీలో అధిక ధరలకు బ్లాక్‌లో అమ్ముతున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది. డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ఇవి బ్లాక్‌ మార్కెట్‌కు చేరాయని తెలుస్తోంది. బీబీసీ ప్రతినిధి వికాస్‌పాండే అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్‌.

తీవ్రమైన జ్వరం, శ్వాస సమస్యలు రావడంతో తన అంకుల్‌కు దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు అభినవ్‌ శర్మ. ఆయనకు టెస్టులో కరోనా పాజిటివ్‌ అని తేలడంతో రెమ్‌డెసివిర్‌ మందు తీసుకురావాలని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌తోపాటు, అత్యవసర పరిస్థితుల్లో యాంటీ వైరల్ డ్రగ్‌గా ఈ మందును వాడటానికి ప్రభుత్వం అనుమతించింది.

కానీ దిల్లీలో ఆ మందును కొనుక్కురావడం అసాధ్యంగా మారింది. ఎక్కడ అడిగినా 'లేదు' అనే సమాధానమే వినిపించింది. గంటగంటకు తన అంకుల్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఈ మందు కోసం అనేకమందిని సంప్రదించారు శర్మ. కానీ ఫలితం లేదు.

"నా కళ్ల వెంట నీళ్లు తిరుగుతున్నాయి. నా అంకుల్‌ మృత్యువుతో పోరాడుతున్నారు. ఆ మందు ఉంటేనే ఆయన ప్రాణాలు దక్కుతాయి'' అని శర్మ అన్నారు. "అనేక డజన్ల కాల్స్‌ చేశాక, దాని అసలు రేటుకన్నా ఏడింతలు ఎక్కువ చెల్లించడంతో చివరకు మెడిసిన్‌ దొరికింది. నేను ఆ ఖర్చును భరించగలను. కానీ అంత ధర పెట్టి కొనలేని వారి గురించి తలుచుకుంటే నా గుండె బరువెక్కుతోంది'' అన్నారు శర్మ.

దిల్లీలో చాలామంది శర్మ ఎదుర్కొన్న సమస్యలాంటివే ఎదుర్కొంటున్నారు. తమవారి ప్రాణాలను రక్షించుకోడానికి తపన పడుతున్నారు. చాలామంది ఎక్కువ ధర పెట్టి ఈ మందును కొనాల్సి వస్తోంది. పాత దిల్లీలోని మెడిసిన్‌ మార్కెట్‌లో మాత్రమే ఇది లభిస్తుందని తేలింది.

కట్టడి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ సీసాలను బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

ఈ ఇంజెక్షన్‌ను నిర్ణీత ధరకంటే ఎక్కువకు విక్రయించకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ డాక్టర్ వీజీ సొమాని ఆదేశాలు ఇచ్చారు.

బ్లాక్ మార్కెట్‌ను, ఎక్కువ ధరకు అమ్మకాలను నియంత్రిస్తూ తీసుకున్న చర్యలను అన్ని రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు కేంద్ర ప్రభుత్వానికి వెల్లడించాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఎక్కడా దొరకని ఈ మందును తాము ఇవ్వగలమని చెప్పిన వ్యక్తులను బీబీసీ సంప్రదించింది. కానీ వారు చెప్పిన రేటుకే దొరికింది. "నేను మీకు మూడు సీసాల మందును ఇప్పించగలను. కానీ ఒక్కోటి రూ.30,000. డబ్బు తీసుకుని నేరుగా నా దగ్గరకు రండి'' అని ఔషధ వ్యాపారంలో ఉన్నట్లు చెప్పుకుంటున్న ఆ వ్యక్తి బీబీసీ ప్రతినిధికి చెప్పారు.

వాస్తవానికి రెమ్‌డెసివిర్‌ ఖరీదు రూ.5,400. ఒక్కో పేషెంట్‌కు ఐదు నుంచి ఆరు డోసులు అవసరమవుతుంది. ఇంకో వ్యక్తి ఒక్కో మందు సీసాకు రూ.38,000 ధర చెప్పారు. క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత కోవిడ్‌-19 లక్షణాలను 15 నుంచి 11 రోజులకు రెమ్‌డెసివిర్‌ తగ్గించగలదన్న గుర్తింపు రావడంతో ఆ ఔషధానికి డిమాండ్‌ పెరిగింది. కానీ అది దివ్యౌషధమేమీ కాదని నిపుణులు హెచ్చరించారు. అయితే ఇంతకన్నా మెరుగైన ఔషధాలు లేకపోవడంతో డాక్టర్లు ఈ మందును సూచిస్తున్నారు. దీంతో దిల్లీ సహా భారతదేశంలోని అనేక నగరాలలో ఈ మందుకు డిమాండ్‌ పెరిగింది.

దిల్లీలోని అనేకమంది పేషెంట్లు ఈ మందు కోసం అత్యధిక ధరలు చెల్లిస్తున్నారని బీబీసీ పరిశీలనలో తేలింది. కొంతమంది తమ జీవితాంతం సంపాదించిన సొమ్మును ఈ మందు కోసం వెచ్చించారని కూడా తేలింది. తమ ఆప్తుల ప్రాణాలను కాపాడుకోవడం కోసం వారు ఎంత చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారు.

డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య భారీ అంతరం ఉండటంతో ఈ మందు ధరలకు రెక్కలు వచ్చాయి. అమెరికాకు చెందిన గైలీడ్‌ సైన్సెస్ సంస్థ మొదట ఎబోలా జబ్బును నయం చేయానికి ఈ మందును తయారు చేసింది. భారత్‌కు చెందిన సిప్లా, జూబ్లియంట్‌ లైఫ్‌, హెటెరో డ్రగ్స్‌, మైలాన్‌ అనే నాలుగు కంపెనీలకు ఈ ఔషధాన్ని తయారు చేసుకోడానికి అమెరికా కంపెనీ అనుమతి ఇచ్చింది. కానీ హెటెరో డ్రగ్స్‌ కంపెనీ మాత్రమే ఈ మందును తయారు చేస్తోంది.

ఇప్పటి వరకు తాము ఐదు రాష్ట్రాలకు 20,000 డోసులను సప్లయి చేశామని బీబీసీకి చెప్పింది ఆ సంస్థ. అయితే అవి బయటకు ఎలా వచ్చాయో తమకు అర్ధం కావడం లేదంది. "మేము వీటిని డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వడం లేదు. నిబంధనల ప్రకారం నేరుగా ఆసుపత్రులకే పంపుతున్నాం'' అని హెటిరో డ్రగ్స్‌ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్ సందీప్‌ శాస్త్రి తెలిపారు.

"అవసరమైనంత డ్రగ్‌ను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ బ్లాక్‌మార్కెట్‌కు చేరడం దురదృష్టకరం'' అని శర్మ అన్నారు. " చాలాఫ్యామిలీలు పడుతున్న ఇబ్బంది గురించి మాకు తెలుసు. మందు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని అక్కడికి పరుగెత్తలేక ఇబ్బంది పడుతున్నారు. మేం మందు ఉత్పత్తిని పెంచుతాం. రాబోయే కొద్ది రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని అనుకుంటున్నాము'' అని ఆయన వివరించారు.

మెడికల్ షాపుల వాళ్లు మాత్రం తమ వద్ద ఆ డ్రగ్‌ లేదని చెబుతున్నారు."హైదరాబాద్‌ నుంచి ఒక మహిళ ఫోన్‌ చేశారు. ఆమె తండ్రి దిల్లీలోని ఆసుపత్రిలో ఉన్నారు. రెమ్‌డెసివిర్‌ మందు కోసం ఎంతయినా చెల్లించడానికి ఆమె సిద్ధపడ్డారు. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు'' అని ఘజియాబాద్‌కు చెందిన కెమిస్ట్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్ రాజీవ్‌ త్యాగీ అన్నారు.

మరి దిల్లీకి వచ్చిన మందు ఏమైపోతోంది? ఇందులో మెడికల్ షాప్‌ ఓనర్ల పాత్ర కూడా ఉందన్న వాదనను ఆలిండియా కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ జనరల్ సెక్రటరీ రాజీవ్‌ సింఘాల్‌ ఖండించారు. " మా సంస్థ సభ్యులెవరు ఇలాంటి వ్యవహారాలు నిర్వహించరని నేను చెప్పగలను. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'' ఆయన చెప్పారు.

ఈ సమస్య ఒక్క రెమ్‌డెసివిర్‌దే కాదు. టోసిలిజుమాబ్‌లాంటి కోవిడ్‌-19 చికిత్సలో వాడే ఇతర మందులకు కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉంది. పాజిటివ్‌ కేసుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి ఆక్టెమ్రా అనే మందును ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. అయితే దాని ప్రభావం ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటుండగా, తమకు సానుకూల ఫలితాలు వచ్చాయని పలువురు డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఈ డ్రగ్‌ను రుమటాయిడ్‌ ఆర్ద్రరైటిస్‌ జబ్బు ఉన్న వారికి ఉపయోగిస్తారు. సహజంగానే దీని సప్లయి తక్కువగా ఉంటుంది.

స్విట్జర్లాండ్‌కు చెందిన రోచీ కంపెనీ తరఫున సిప్లా కంపెనీ ఈ మందును అమ్ముతోంది. కానీ అర్జెంట్‌గా కావాలనుకుంటే మాత్రం ఇది అంత తొందరగా దొరకదు.

గత కొద్దివారాలుగా ఈ మందుకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిందని సిప్లా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. "మేం ఇప్పటికే సప్లయి పెంచాం. కానీ రాబోయే రోజుల్లో డిమాండ్‌ ఇంకా ఎక్కువగా ఉంటుంది'' అని ఆయన అన్నారు.

చాలా ఆసుపత్రులు ఈ మందును మీరే కొనుక్కురావాలంటూ ఆసుపత్రులు రోగుల బంధువులకు చెబుతున్నట్లు బీబీసీ దృష్టికి వచ్చింది." నేను కనీసం 50 షాపులకు వెళ్లాను. అందరూ ఇస్తామని అన్నారు. కానీ రెండు మూడింతల రేటు చెప్పారు. మా ఆంటికీ అవసరమైన డోసుల కోసం నేను రెండు రోజులు దిల్లీలో తిరిగాను'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి బీబీసీకి చెప్పారు.

అయితే టోసిలిజుమాబ్‌ ఔషధం బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముతున్నారన్న వాదనను సిప్లా కంపెనీ ప్రతినిధి అంగీకరించ లేదు." మేం ప్రతి డోసు ఎక్కడికి వెళ్లిందో గుర్తిస్తాం. దీనిని లాభాల కోసం వాడుకోవడాన్ని మేం అనుమతించం. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు" అని ఆయన తేల్చి చెప్పారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)