కరోనావైరస్: కొన్ని చోట్ల కేసులు తగ్గుతుంటే.. మరి కొన్ని చోట్ల పెరగటానికి కారణాలు ఏమిటి?

    • రచయిత, డేవిడ్ షుక్మన్
    • హోదా, బీబీసీ సైన్స్ ఎడిటర్

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య ఒక కోటి మందికి పెరగటంతో.. ఈ మహమ్మారి వ్యాప్తి ప్రమాదకరమైన కొత్త దశకు చేరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ హెచ్చరించారు.

పశ్చిమ యూరప్, ఆసియాల్లోని అనేక దేశాలు వైరస్‌ని కొంతమేరకు నియంత్రణలోకి తెచ్చినప్పటికీ.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది.

మొదటి 10 లక్షల మందికి వైరస్ సోకడానికి మూడు నెలలు పడితే.. ఈ కోటి కేసుల్లో చివరి పది లక్షల కేసులు కేవలం ఎనిమిది రోజుల్లోనే పెరిగాయి.

అలాగే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య కూడా సోమవారం నాడు ఐదు లక్షలు దాటింది.

నమోదైన కేసుల సంఖ్య కూడా కేవలం పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కేసులేనని.. ఇంకా నిర్ధారణ కాని కేసుల సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు ఉండవచ్చునని లాటిన్ అమెరికాకి చెందిన ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు.

కేసులు ఎక్కువగా ఎక్కడ పెరుగుతున్నాయి?

అమెరికా, దక్షిణ ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కేసుల సంఖ్య పెరుగుతోంది.

అమెరికాలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గత కొన్ని రోజుల్లో 40,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ సడలించాలనుకుంటున్న సమయంలో అరిజోనా, టెక్సస్ , ఫ్లోరిడాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది రెండో వెల్లువ అనలేం.

బ్రెజిల్లో సావో పాలో, రియో డి జెనీరో నగరాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఇలాంటి పరిస్థితే భారతదేశంలో కూడా కనిపిస్తోంది. ఇటీవల ఒకే రోజులో 15,000 కేసులు నమోదయ్యాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు ఎక్కువగా నిర్వహించకపోవడం వలన కూడా ఈ మహమ్మారి వలన పొంచి ఉన్న ప్రమాదం పూర్తి స్థాయిలో బయట పడటం లేదు.

ఇలా ఎందుకు జరుగుతోంది?

అభివృద్ధి చెందుతున్న దేశాలలో కిక్కిరిసిన ప్రాంతాలలో ప్రజలు నివసించే చోట వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది.

“కరోనా వైరస్ పేద ప్రజల జబ్బని” ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 ప్రతినిధి డేవిడ్ నబర్రో అన్నారు.

ఒకే గదిలో నివసించే చాలా కుటుంబాలకి భౌతిక దూరం పాటించడం చాలా కష్టం. చాలా ఇళ్లల్లో కుళాయిలు ఉండవు. ఇలాంటి చోట్ల చేతులు తరచుగా కడుక్కోవడం కూడా ఒక సవాలే.

దైనందిన జీవితం గడపడానికి రోజువారీ కూలి మీద ఆధారపడే వారికి మార్కెట్లలో, వీధుల్లో సామాజిక దూరం పాటించడం కష్టం.

అమెజాన్ అడవుల వంటి మారు మూల ప్రాంతాలలో నివసించేవారికి వైద్య సదుపాయాలు అరకొరగా ఉండవచ్చు. లేదా ఒక్కొక్కసారి పూర్తిగా ఉండవు.

ఇన్ఫెక్షన్ పెరుగుతున్న స్థాయి చాలా విచారకరంగా ఉంది. మెక్సికోలో టెస్ట్ చేసిన వారిలో సగం మందికి పాజిటివ్ వస్తోంది. ఇది న్యూయార్క్ నగరంలోని హాట్‌స్పాట్లలో కానీ, ఉత్తర ఇటలీలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటి కంటే ఎక్కువ.

నిధుల కొరత ఉన్న చోట కోవిడ్ 19 వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల సరఫరా కూడా ఒక సమస్యగా నిలుస్తోంది.

ఈక్వడార్‌లో ఒక సమయంలో అధికారులు శవాలను వీధుల్లో పడేసే పరిస్థితి ఏర్పడింది. వైరస్ పరీక్షలు చేసే ఒక ముఖ్యమైన లేబరేటరీలో అవసరమైన రసాయనాల కొరత ఏర్పడింది.

ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉన్న చోట లాక్‌డౌన్ విధించడం వలన ఆ దేశాల ఆర్థిక పరిస్థితులు మరింత బలహీనపడ్డాయి.

అంతర్జాతీయ సహకారంతోనే ఇన్ఫెక్షన్లు తగ్గించే వీలు కలుగుతుందని డాక్టర్ నబర్రో అన్నారు. "అవసరమైన వారికి ఉత్పత్తులు, ఆర్థిక సహాయం సరిగ్గా అందుతుందో లేదోననే విచారం ఉంది” అని అన్నారు.

రాజకీయ కోణం

కానీ, ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరగడానికి కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని దేశాలలో రాజకీయ నాయకులు వైద్య నిపుణుల సలహాలను పాటించలేదు.

టాంజానియా అధ్యక్షుడు తమ దేశంలో వైరస్ వ్యాప్తి లేదని ప్రకటించి సాహసం చేశారు. వైరస్’తో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ మే నెల నుంచి ఆ దేశంలో నమోదవుతున్న ఇన్ఫెక్షన్ల సమాచారాన్ని విడుదల చేయలేదు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచీ వైరస్ ప్రభావాన్ని తేలిక చేసి మాట్లాడటం, ప్రపంచ ఆరోగ్య సంస్థని, చైనాని నిందించడం, అమెరికా ఆర్థిక వ్యవస్థని తెరిచే ఉంచాలని చెప్పడం లాంటి పనులు చేశారు.

టెక్సస్‌లో లాక్‌డౌన్ సడలించినందుకు గాను ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్‌‌ని ప్రశంసించారు. కానీ, అక్కడ కేసుల సంఖ్య పెరగడంతో లాక్‌డౌన్‌ని తిరిగి విధించాల్సి వస్తోంది.

అలాగే, మాస్కులు ధరించడం పట్ల కూడా అమెరికా రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలున్నాయి.

ఒకవైపు కాలిఫోర్నియా గవర్నర్ మాస్కులు ధరించడం వలన రక్షణ లభిస్తుందని సైన్స్ చూపుతోందని చెబుతుంటే మరోవైపు ట్రంప్ మాత్రం మాస్క్ ధరించటానికి తిరస్కరించారు.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కూడా ఇదే వాదన చేస్తున్నారు. బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్థని దెబ్బతీసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆయన అధికారులకు సూచించారు.

ఆయన మాస్క్ ధరించకుండా పదే పదే బయటకు వస్తుండడంతో, ఆయన కచ్చితంగా మాస్క్ ధరించాలని బ్రెజిల్ న్యాయస్థానం ఆదేశించింది.

ఈ వైఖరుల నేపథ్యంలో.. ‘‘వైరస్ కన్నా గానీ అంతర్జాతీయ ఐకమత్యం, ప్రపంచ నాయకత్వం లేకపోవటమే పెద్ద ముప్పు’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ వ్యాఖ్యానించవలసి వచ్చింది.

కేసులు అదుపులో ఎక్కడ ఉన్నాయి?

వరుసగా 24 రోజుల పాటు కొత్త కేసులు నమోదు కాని దేశంగా న్యూజీలాండ్ ప్రధాని ప్రపంచ ప్రజల ప్రశంసలు అందుకున్నారు.

ఆ దేశంలో పరిస్థితులు తిరిగి యధాస్థితికి నెమ్మదిగా రావడం మొదలుపెట్టాయి. కానీ, న్యూజీలాండ్ పాటించిన పర్యవేక్షణ విధానం పటిష్టంగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దక్షిణ కొరియా కూడా టెక్నాలజీ, కాంటాక్ట్ ట్రేసింగ్‌ ఉపయోగంచుకుని కేసుల సంఖ్యను తగ్గించగలిగారని, వరసగా మూడు రోజుల పాటు కొత్త కేసులు నమోదు కాలేదని ప్రశంసలందుకుంది. కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ సియోల్‌లో నైట్ క్లబ్‌లలో క్లస్టర్లు ఎక్కువగా ఉండటంతో దక్షిణ కొరియాలో సెకండ్ వేవ్ మొదలైందని అధికారులు చెబుతున్నారు.

ఇంకొక మూడు రోజుల్లో గనక 30 కేసులు నమోదైతే, తిరిగి భౌతిక దూరం నియమాలను విధించనున్నట్లు సియోల్ మేయర్ హెచ్చరించారు.

బ్రిటన్‌లో రోజుకు 1,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి.

వియత్నాంలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. ఆ దేశంలో లాక్‌డౌన్ చర్యలు, సరిహద్దు నియంత్రణ, ఇన్ఫెక్షన్ స్థాయిని నియంత్రణలో ఉంచడానికి పనికివచ్చాయి.

ఆఫ్రికాలో కొన్ని దేశాలలో భయపడినంత రీతిలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి జరగలేని విషయంపై స్పష్టత లేదు.

అధిక సంఖ్యలో పరీక్షలు చేయటానికి తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా వైరస్ వ్యాప్తి గురించి పూర్తిగా తెలియకపోవడానికి ఒక కారణమని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. కొన్ని దేశాలలో జనాభాలో యుక్త వయసు వారు ఎక్కువగా ఉండటం వలన కూడా వైరస్ బారిన పడే వారు తక్కువగా ఉన్నారని ఇంకొక వాదన ఉంది.

అలాగే, బయట దేశాలతో సంబంధాలు లేని దేశాలలో కూడా ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి తక్కువగా ఉందని మరొక వాదన.

వైరస్‌ని అదుపులోకి తెచ్చిన దేశాలలో కూడా తిరిగి సాధారణ పరిస్థితులు రావడానికి మరి కొంత సమయం పడుతుంది.

కానీ, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్ నబర్రో వేసిన అంచనా మాత్రం చాలా దేశాలను భయపెడుతోంది. ఈ మహమ్మారి మరింత పెరిగే లోపే అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగినంత సహాయం అందడం అవసరం.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)