కరోనావైరస్‌తో తల్లి మృతి.. ఆస్పత్రిలో నానమ్మ అదృశ్యం... 8 రోజుల తర్వాత అదే ఆస్పత్రి టాయిలెట్‌లో విగతజీవిగా లభ్యం

    • రచయిత, అనఘా పాఠక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫోన్ రింగ్ అయిన ప్రతిసారీ గత నాలుగు నెలలుగా “మనం ఈ వ్యాధితో పోరాడాలి ఈ వ్యాధికి గురైన రోగులతో కాదు. కోవిడ్-19 రోగులను జాగ్రత్తగా చూసుకోండి. వారి పట్ల వివక్ష చూపకండి” అనే కాలర్ ట్యూన్ వినిపిస్తుంటుంది.

హర్షల్ నెహెతే కూడా ఈ ట్యూన్‌ను కనీసం వంద సార్లైనా వినే ఉంటారు. అది విన్న తర్వాత ఆయనకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించగానే నా గుండె పిండేసినట్లయ్యింది. ఆయన విషయంలో ఆ మాటలు ఎప్పుడూ నిజం కాలేదు.

ఆయన కుటుంబాన్ని ఎవరూ చూసుకోలేదు. వారి బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు. వారికి ఎవరూ సమాధానం కూడా ఇవ్వలేదు. ఈ వ్యాధితో పోరాడేందుకు వారికెవరూ అండగా నిలవలేదు. బదులుగా వారు ఆ వ్యవస్థతో పోరాడాల్సి వచ్చింది. ఆయన తల్లి కోవిడ్-19వల్ల చనిపోయారు. కానీ అతడి కథలో విషాదం అక్కడితో ఆగలేదు. జలగావ్ ప్రభుత్వ ఆస్పత్రిలో కనిపించకుండాపోయిన ఆయన నానమ్మ 8 రోజుల తర్వాత అదే ఆస్పత్రి టాయిలెట్లో శవమై కనిపించారు.

హర్షల్ నెహెతే ఆయన కుటుంబానికి గత కొన్ని వారాలు పీడకలగా మారాయి. జలగావ్ జిల్లాలో ముంబయికి దాదాపు 450 కిలోమీటర్ల దూరంలోని యావల్‌కు చెందిన హర్షల్ ఇప్పుడ పుణెలో ఉంటున్నారు.

“మొదట మా నాన్నకు కోవిడ్-19 ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. కానీ లక్షణాలేవీ లేవు. ఆయన్ను భుసావల్ రైల్వే ఆస్పత్రిలో చేర్పించాం. మూడు రోజుల తర్వాత మా అమ్మ జబ్బు పడ్డారు. ఆమెకు కూడా కరోనా రావడంతో, ఆరోగ్యం వేగంగా క్షీణించింది. భుసావల్‌ డాక్టర్లు, ఆమెను జలగావ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అక్కడ మాకు ఐసీయూలో బెడ్ దొరకలేదు. తర్వాత ఆమె మరణించింది” అని హర్షల్ చెప్పాడు.

దెబ్బ మీద దెబ్బ

60 ఏళ్ల తల్లి మరణం తర్వాత ఆ కుటుంబానికి మరో కష్టం వచ్చిపడింది. 82 ఏళ్ల ఆయన నానమ్మ మాలతి నెహెతేకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆమెను కూడా వెంటనే జలగావ్ మెడికల్ కాలేజీకే తీసుకెళ్లారు.

“మేం మా నాన్నమ్మను జూన్ 1న అక్కడ చేర్పించాం. 2న నేను ఆస్పత్రికి ఫోన్ చేస్తే, ఆమెను అనుమానిత కరోనా రోగుల వార్డులో ఉంచామని చెప్పారు. కరోనా ధ్రువీకరించకుండా రిపోర్టుల కోసం వేచిచూస్తున్న వారిని అక్కడ ఉంచుతారు. మేం వాళ్లతో మా నాన్నమ్మకు కరోనా ఉందని చెప్పాం. ఆమెను కరోనా వార్డుకు షిఫ్ట్ చేయమన్నాం” అన్నారు.

సరిగా పరీక్షలు చేయడం లేదని, తమను పట్టించుకోవడంలేదని ఆస్పత్రి మీద చాలా మంది రోగులు, బంధువులు ఫిర్యాదు చేస్తున్నారు. కరోనా ఉందో, లేదో తెలీకుండానే అందరూ అనుమానిత వార్డులో ఉంచేశారు. దాంతో కరోనా లేనివారికి కూడా అది వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది. దాంతో, చాలామంది రోగులు ఆ వార్డులో ఉండకుండా బయట కారిడార్లోనే ఉంటున్నారు.

బీబీసీ కొంతమంది రోగులు, వారి బందువులను సంప్రదించినపుడు పేరు వెల్లడించవద్దనే షరతుపై మాట్లాడిన ఒకరు “కరోనా పాజిటివ్ రోగులు బయట బహిరంగంగానే తిరుగుతున్నారు. వాళ్లు ఆస్పత్రి బయటకు కూడా వెళ్తున్నారు. ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉండడంతో బంధువులే రోగులను చూసుకోవాల్సొస్తోంది. ఎలాంటి ప్రొటెక్షన్ గేర్ లేకుండానే వారితో ఉండాల్సి వస్తోంది” అని చెప్పారు.

“మా నానమ్మకు సీరియస్ అయ్యేసరికి ఆమెను ఐసీయూకు తరలించాలని మేం అడిగాం. కానీ భుసావల్ డాక్టర్లు ఇచ్చిన లెటర్లో ఆమె అనుమానిత రోగి అనే ఉందన్నారు” అని హర్షల్ కన్నీళ్లు పెట్టాడు.

ఆస్పత్రి టాయిలెట్లో శవం

భుసావల్ రైల్వే ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన లెటర్లో తన నాన్నమ్మ పేరు కూడా తప్పుగా ఇచ్చారని, ఆమెను ఐసీయూకు షిఫ్ట్ చేయాలని గట్టిగా అడిగామని హర్షల్ చెప్పారు. కానీ, మాలతి నెహెతేను వేరే వార్డుకు తరలించాలని చూసినప్పుడు వాళ్లకు ఆమె బెడ్ మీద కనిపించలేదు. దాంతో వారు ఆస్పత్రి అంతా ఆమె కోసం వెతికారు. దాదాపు అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో ఆమె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.

“నేను జూన్ 3న మళ్లీ ఆస్పత్రికి కాల్ చేసి మా నాన్నమ్మ గురించి అడిగాను. ఒక డాక్టర్ ఆమె కనిపించిందని, కరోనా పాజిటివ్ రోగుల వార్డుకు షిఫ్టు చేశామని చెప్పారు. ఇప్పుడు నాకు ఆస్పత్రి సిబ్బందే అబద్ధాలు చెప్పారా, లేక ఏదైనా పొరపాటు జరిగిందా అనేది నాఅర్థం కావడం లేదు” అన్నారు హర్షల్.

జూన్ 5న మాలతి కుటుంబ సభ్యులు మళ్లీ ఆమె గురించి అడిగారు. వారు కరోనా వార్డులో ఆ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. దాంతో వారు మళ్లీ పోలీస్ రిపోర్టు ఇచ్చారు. వారు మేం ఆస్పత్రి అంతా వెతికినా ఆమె కనిపించలేదన్నారు. పోలీసులు అప్పుడు ఆమె కోసం సరిగా వెతకలేదని హర్షల్ ఆరోపిస్తున్నాడు.

మాలతి నెహెతే మృతదేహం, ఆమె కనిపించకుండా పోయిన 8 రోజుల తర్వాత జూన్ 10న వార్డు ఏడో నంబరు వార్డు టాయిలెట్లో దొరికింది. ఆమె నిజానికి ఎప్పుడు చనిపోయారు? ఆమె గురించి ఎవరూ ఎందుకు తెలుసుకోలేకపోయారు? 8 రోజులు శవం టాయిలెట్లో పడివున్నా, ఎవరూ ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఈప్రశ్నలకు హర్షల్ సమాధానాలు వెతికే పనిలో ఉన్నాడు.

రిపోర్ట్ కరోనా పాజిటివ్, డెత్ సర్టిఫికెట్‌లో న్యుమోనియా

భుసావల్‌కు చెందిన చున్నీలాల్ మహాజన్ మామగారు కొన్నిరోజుల క్రితం చనిపోయారు. జలగావ్ మెడికల్ ఆస్పత్రిలో రోగులకు సరిగా చికిత్స అందించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు.

“మొదటి రిపోర్టులో మా మామకు పాజిటివ్ అని వచ్చింది. తర్వాత ఆయనకు రెండోసారి టెస్ట్ చేశారు. కానీ ఆ రిపోర్టు రాకముందే చనిపోయారు. తర్వాత డాక్టర్లు ఆయన న్యుమోనియాతో చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ ఇచ్చాడు. అంటే ఆయన కరోన రోగి కాదని అర్థమా?” అన్నారు చున్నీలాల్

తన కుటుబంలో న్యుమోనియా చరిత్ర ఉందని, ఆ వ్యాధితో కొన్నేళ్ల క్రితం తమ కుటుంబంలో ఇద్దరు చనిపోయారని కూడా చున్నీలాల్ చెప్పారు. మామగారి ఆరోగ్యం క్షీణించగానే ఆయన జలగావ్‌లో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారు కాదనడంతో జలగావ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

“మా మామను జాగ్రత్తగా చూసుకోలేదు. ఆయన ఎక్కడకూ ప్రయాణాలు చేయలేదు. ఆయన అప్పటికే న్యుమోనియాతో బాధపడుతున్నారు. అలాంటప్పుడు ఆయనకు కరోనా ఎలా వచ్చింది. ఆస్పత్రిలో మాకు వివరాలేవీ చెప్పడం లేదు, మాకు అర్థం కావడం లేదు” అన్నారు.

చనిపోయిన ఆయనకు అసలు కరోనా ఉందా, లేదా అనేది చున్నీలాల్ కుటుంబానికి ఇప్పటికీ తెలీడం లేదు.

మరణాల రేటు మహారాష్ట్రలోనే అత్యధికం

జలగావ్‌లో మరణాల రేటు మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉంది. ఈ జిల్లా కోవిడ్-19కు కేంద్రంగా మారింది. దేశంలోనే మహారాష్ట్రలో మరణాల రేటు అత్యధికంగా 2.87 ఉంటే, ఇక్కడ మరణాల రేటు దాదాపు 7.36 ఉంది. అంతకు ముందు అది 10.4 శాతం ఉండేది.

జలగావ్‌లో సామాజిక కార్యకర్త దీప్‌కుమార్ గుప్తా, జలగావ్‌ ఆస్పత్రుల్లో దారుణంగా ఉన్న పరిస్థితి గురించి ప్రధాని కార్యాలయానికి లేఖ రాశాడు.

ఆయన బీబీసీతో “జనాలు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎవరినైనా అక్కడి ఆస్పత్రుల్లో చేరిస్తే వారు తిరిగిరారేమో అని భావిస్తున్నారు. ఇక్కడ వైద్య సదుపాయాలు దారుణంగా ఉన్నాయి. డాక్టర్లు, జిల్లా అధికారులు జనాలను పట్టించుకోవడం లేదు. పరీక్షల పలితాలు తరచూ ఆలస్యం అవతున్నాయి” అన్నారు.

మాలతి శవం ఆస్పత్రి టాయిలెట్లో దొరికిన తర్వాత నుంచి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ మెడికల్ కాలేజీ డీన్, మరో ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లను పరిశీలించేందుకు ప్రతి వార్డులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మరణాల రేటు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. మరణాల రేటు తగ్గేలా పరిష్కారం వెతికేందుకు ఐదుగురు సభ్యుల కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

“మాలతి శవం ఆస్పత్రి టాయిలెట్లో పడి ఉందని మాకు తెలీదని వారు చెప్పడం చాలా పెద్ద తప్పు” అని ఇప్పుడు ఆ జిల్లా నుంచి బదిలీ అయిన కలెక్టర్‌ అవినాష్ ధకనే మీడియాతో అన్నారు.

ఆస్పత్రిలో ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జలగావ్‌కు చెందిన మంత్రి గులాబ్‌రావ్ పాటిల్ చెప్పారు.

హర్షల్ తండ్రి ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తల్లి, నాన్నమ్మను చివరిచూపు కూడా చూడలేకపోయిన హర్షల్ తన తండ్రిని కూడా ఇంకా కలవలేదు. నిండు గర్భిణి అయిన భార్య ఏ క్షణమైనా ప్రసవించే అవకాశం ఉండడంతో అతడు ఇంకా పుణెలోనే ఉన్నాడు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)