కరోనావైరస్‌ చికిత్సకు చైనా సంప్రదాయ వైద్యం.. 92 శాతం కేసుల్లో విజయవంతమైంది అంటున్న చైనా

    • రచయిత, ప్రతీక్ జఖర్
    • హోదా, బీబీసీ మానిటరింగ్

చైనాలో 92 శాతం కోవిడ్-19 కేసులకి సాంప్రదాయ చైనా మందు(టీసీఎం)తోనే చికిత్స చేసినట్లు చైనా ప్రభుత్వం విడుదల చేసిన ఒక శ్వేత పత్రంలో పేర్కొన్నారు.

మూలికలతో తయారు చేసిన కాషాయాలు, ఆక్యుపంక్చర్, తాయి చి లాంటి వైద్య విధానాలను వాడి టీసీఎం చికిత్స చేస్తుంది.

ఈ వైద్యం పట్ల అప్పుడప్పుడూ ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చలు, వాదోపవాదాలు జరిగినప్పటికీ, ఈ వైద్య విధానం చైనాలో కొన్ని తరాలుగా ప్రాముఖ్యం పొందింది.

ఈ విధానాన్ని చైనా ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం చెయ్యాలని భావిస్తున్నప్పటికీ, వైద్య నిపుణులు మాత్రం ఈ విధానం ఎంత వరకు పని చేస్తుందనే అంశం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఔషధం ప్రభావం పట్ల కచ్చితమైన ఆధారాలు లేవు - అమెరికా

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ విడుదల చేసిన కరోనావైరస్ నియమావళిలో టీసీఎం కోసం ప్రత్యేక విభాగాన్ని కేటాయించింది. 2003లో సార్స్ వైరస్ వ్యాపించిన సమయంలో ఈ విధానం వహించిన పాత్ర గురించి చైనా జాతీయ మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తోంది.

కోవిడ్-19 చికిత్స కోసం 6 సాంప్రదాయ వైద్య విధానాలను చైనా ముఖ్యంగా ప్రస్తావిస్తోంది. ఫోర్స్తియా సస్పెన్స్, రోడి యోలా రోజ్ లాంటి 13 రకాల మూలికలుండే లియాన్ హువా కింగ్వెన్, జిన్హువా కింగన్ లాంటి ఔషధాలను ముఖ్యంగా చెబుతోంది. తేనె, పుదీనా లాంటి 12 రకాల పదార్ధాలతో కూడిన జిన్హువా కింగన్ ని 2009లో హెచ్ 1 ఎన్ 1 వచ్చినప్పుడు అభివృద్ధి చేశారు.

ఈ ఔషధాన్ని వాడటం వలన దుష్ప్రభావాలేమి ఉండవని టీసీఎం మద్దతుదారులు చెబుతున్నప్పటికీ, ఇలాంటి వాటిని ప్రచారం చేసే ముందు శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి ఇందులో వాడిన ఫార్ములాలు సురక్షితమని తేల్చాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ విధానాల వాడకం వలన కరోనావైరస్ లక్షణాల నుంచి కాస్త ఉపశమనం దొరకవచ్చేమో గానీ, ఇది కరోనావైరస్ కి పూర్తి చికిత్సగా పని చేస్తుందని చెప్పలేమని అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెబుతోంది.

"ఈ విధానం కచ్చితంగా పని చేస్తుందని టీసీఎం దగ్గర కచ్చితమైన ఆధారాలు లేవని , ఇది వాడటం ప్రమాదకరమని రిటైర్డ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ పరిశోధకుడు ఎడ్జర్డ్ ఎర్న్స్ట్ నేచర్ జర్నల్ రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

ఈ వైద్య విధానం పట్ల భిన్న వాదనలున్నప్పటికీ చైనాలో మాత్రం టీసీఎం ప్రాముఖ్యం పొందుతోంది. అంతర్జాతీయంగా కూడా ఈ విధానానికి డిమాండ్ పెరుగుతున్నట్లు చైనా చెబుతోంది. 2020 సంవత్సరాంతానికి టీసీఎం పరిశ్రమ విలువ 420 బిలియన్ డాలర్లు ఉంటుందని చైనా స్టేట్ కౌన్సిల్ గత సంవత్సరం అంచనా వేసింది.

చైనా అధ్యక్షుడు క్సీ ఈ వైద్య విధానాన్ని చైనా నాగరిక సంపదగా భావిస్తారు.

టీసీఎం ఔషధాలు ఎంత వరకు సురక్షితమనే విషయంపై చాలా అనుమానాలున్నాయని, చాలా మంది చైనా ప్రజలు ఆధునిక వైద్యం వైపే మొగ్గు చూపుతున్నారని యాన్జోంగ్ హుయాంగ్ అనే సీనియర్ పరిశోధకుడు అన్నారు.

చైనా జాతీయ ఆహార, ఔషధ నియంత్రణ గత సంవత్సరం కొన్ని టీసీఎం శాంపిళ్ళలో విషపూరిత పదార్ధాలున్నాయని కనుగొంది.

టీసీఎం వైద్య విధానాన్ని అంతర్జాతీయంగా ప్రాచుర్యం చెయ్యాలని బీజింగ్ భావిస్తోంది. చైనా అవతల చాలా మందికి ఈ విధానం గురించి తెలియదు.

చైనా మాత్రం టీసీఎం ఉత్పత్తులను ఆఫ్రికా, సెంట్రల్ ఆసియా, యూరోప్ కి ఎగుమతి చేస్తోంది.

"ఈ మందు కోవిడ్-19 చికిత్సకి ఎలా పని చేస్తుందో మేము ప్రపంచ దేశాలతో పంచుకోవాలనుకుంటున్నాం’’ అని చైనా నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ డిప్యూటీ హెడ్ యు యాన్ హాంగ్ చెప్పారు. “చైనా వైద్య విధానాల గురించి మరిన్ని దేశాలు అర్ధం చేసుకుని, వాడాలని చూస్తున్నట్లు” చెప్పారు.

ఈ వైద్య విధానాన్ని విదేశాల్లో ప్రచారం చేయడం ద్వారా చైనా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వీలవుతుందని హువాంగ్ భావిస్తున్నారు. "ఈ మందు కోవిడ్-19కి వ్యతిరేకంగా పని చేస్తుందని చెప్పడం ద్వారా చైనా ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని చూపాలని చూస్తోందని” ఆయన అన్నారు.

ఈ విధానాన్ని గత సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆమోదించడంతో అంతర్జాతీయ మార్కెట్ లో టీసీఎం మంచి స్థానాన్ని దక్కించుకుంది. అయితే దీనిని అంతర్జాతీయ వైద్య నిపుణులు ఖండించారు.

కోవిడ్-19కి సాంప్రదాయ వైద్య విధానాల వాడకంలో ఉండే నష్టాల గురించి సాధారణంగా చేసే హెచ్చరికలను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలగించడంతో అది మరిన్ని వివాదాల్లో ఇరుక్కుంది.

ఈ విధానాలపై ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ జరపకపోవడంతో టీసీఎం వాడకం పట్ల అనుమానాలు ఉన్నాయి. మే నెలలో స్వీడన్ అధికారులు లియాన్ హువా కింగ్వెన్ ని పరిశీలించి అందులో మెంథాల్ తప్ప మరేమీ లేదని తేల్చారు.

వన్యజీవుల వాపారంతో సంబంధాలు

టీసీఎం పరిశ్రమకి వన్య జీవుల వ్యాపారంతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఎలుగుబంటు పైత్యంతో చేసే పొడితో కూడిన ఇంజెక్షన్లను కరోనావైరస్ కి చికిత్సగా వాడమని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సూచించిన తర్వాత అనేక విమర్శలు ఎదుర్కొంది.

చైనా ఇటీవల అంతరించిపోతున్న పంగోలిన్ అనే ఒక వింత జంతువు చర్మంపై పొరని కొన్ని జానపద ఔషధాల్లో వాడటాన్ని నిషేధించింది.

టీసీఎం ఉత్పత్తులను ప్రచారం చేయడం ద్వారా వన్య జీవుల అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉందని వన్య జీవుల సంరక్షకులు భావిస్తున్నారు.

"ఒకవేళ అంతరించిపోతున్నఈ జీవుల వలన చికిత్స జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా, టీసీఎం ఉత్పత్తుల్లో వృక్ష ఉత్పత్తులు వాడితే మంచిదని” హాంగ్ కాంగ్ స్కూల్ ఆఫ్ చైనీస్ మెడిసిన్ లో హానరరీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ లిక్సింగ్ లావ్ అన్నారు.

చైనా జాతీయ మీడియా, కొంత మంది అధికారులు ఈ ఉత్పత్తులను విరివిగా ప్రచారం చేయడం కొంత వరకు వారి ప్రయత్నాలను తిప్పి కొట్టింది.

యునాన్ ప్రాంతంలో పిల్లలు ఈ మందుని వాడి స్కూల్ కి తిరిగి వెళ్లవచ్చని అధికారులు చెప్పడంతో చైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే టీసీఎం గురించి అవమానించి మాట్లాడితే పరువు నష్టం కింద పరిగణిస్తామని బీజింగ్ ప్రభుత్వం ప్రకటించడంతో ఆన్‌లైన్‌లో ప్రజలు తీవ్రంగా స్పందించారు.

"సైన్స్ ని ప్రశ్నించవచ్చు కానీ, సాంప్రదాయ చైనా వైద్య విధానాలను మాత్రం ప్రశ్నించకూడదా” అని ఒక ఆన్‌లైన్ యూజర్ వీబోలో పోస్ట్ చేశారు.

అనవసర ప్రచారం కంటే శాస్త్రీయ ఆధారాలతో ప్రపంచం దీనిని ఆమోదించేటట్లు చేస్తే బాగుంటుందని డాక్టర్ లావ్ అభిప్రాయపడ్డారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)