కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది

    • రచయిత, యోగిత లిమాయే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నిత్యం ఉరుకులు పరుగులతో ఉండే మహా నగరం ముంబయి. అందరూ చెప్పే విషయం ఇదే కావచ్చు. కానీ నేను నా జీవితంలో చాలా కాలం అక్కడే గడిపాను కనుక ఆ మాటలు ముమ్మాటికి నిజం.

2008లో ముంబయి దాడుల సమయంలో కూడా మిగిలిన ముంబయిలో జన జీవనం యధాతథంగానే ఉంది. రైళ్లు తిరిగాయి, లక్షలాది మంది ఎవరి ఉద్యోగాలు వారు చేసుకున్నారు. రెస్టారెంట్లు తెరిచే ఉన్నాయి. ఆఫీసులు కూడా పని చేశాయి.

కానీ కోవిడ్-19 మాత్రం ఈ మహా నగరాన్ని నిర్మానుష్య నగరంగా మార్చివేసింది. ఇప్పటికీ లాక్ డౌన్ సడలించకపోవడంతో ముంబయి రోడ్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి.

కరోనావైరస్ దెబ్బకు ఒకప్పుడు అత్యుత్తమ వైద్య సౌకర్యాలకు పెట్టింది పేరుగా ఉన్న ముంబయిలో ఇప్పుడు కోవిడ్-19 రోగులకు చికిత్స అందించడం కూడా కష్టమైపోతోంది.

ముంబయి ఇప్పుడు భారత్‌లో కరోనావైరస్‌కి కేంద్ర బిందువుగా మారిపోయింది. దేశంలోని మొత్తం కేసుల్లో ఐదో వంతు అంటే 38 వేలకు పైగా కేసులు అక్కడ నమోదయ్యాయి. కోవిడ్-19 మరణాల విషయానికి వస్తే నాల్గో వంతు అక్కడే సంభవించాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయిలో ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది?

“గత రాత్రి కేవలం ఆరు గంటల వ్యవధిలో 18 మంది మరణించారు. వారిలో 15 మంది కోవిడ్-19 కారణంగానే ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్క షిఫ్టులో ఇంత మంది చనిపోవడాన్ని ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు” అంటూ కేఈఎమ్ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైద్యుడు ఇటీవల ఒక రోజు నాతో చెప్పారు.

“ఇదో యుద్ధ భూమిలా ఉంది. ఒక్కో బెడ్‌పై ఇద్దరు ముగ్గురు రోగులు ఉంటున్నారు. కొంత మందికి నేలపై, మరి కొంత మందికి వసారాలోనే చికిత్సనందిచాల్సిన పరిస్థితి నెలకొంది. మా దగ్గర అవసరమైనన్ని ఆక్సిజన్ పోర్టులు లేవు. కొంత మంది రోగులకు ఆక్సిజన్ అవసరం ఉన్నప్పటికీ మేం వారికి అందించలేకపోతున్నాం” అని ఆయన అన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్న మరో ఆస్పత్రి సియాన్. అక్కడ ఒక్కో ఆక్సిజన్ సిలిండర్‌ను ఇద్దరు ముగ్గురు రోగులకు వినియోగిస్తున్నామని అదే ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు నాతో అన్నారు. ఆస్పత్రిలోని పరుపుల మధ్య దూరాన్ని తగ్గించడం ద్వారా మరింత మందికి చోటు కల్పించగల్గుతున్నామని ఆయన చెప్పారు. పీపీఈ కిట్లను ధరించే ప్రాంతంలో కనీస పరిశుభ్రత కూడా లేదని అక్కడ ఉన్న పరిస్థితిని ఆయన వివరించారు.

అసలే వేసవి కాలం, ముంబయి తీర ప్రాంతం కావడంతో అక్కడ గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా చెమట విపరీతంగా పడుతుంది. పీపీఈ కిట్లను ధరిస్తున్న వైద్యులు నిమిషాల వ్యవధిలోనే చెమటలో తడిసి ముద్దవుతున్నారు.

సియాన్, కేఈఎం ఆస్పత్రుల్లో శవాల పక్కనే రోగుల్ని ఉంచి చికిత్స అందిస్తున్న దృశ్యాలు, అలాగే రోగులతో కిటకిటలాడుతున్న వార్డుల దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ ప్రచారమయ్యాయి.

"కలల నగరం" ఒకప్పుడు...

“నిజానికి అత్యుత్తమ వైద్య సౌకర్యాలు, వైద్యులు ఉన్న నగరాల్లో ముంబయి కూడా ఒకటి. కానీ ప్రస్తుతం ఈ కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు తగిన విధంగా సిద్ధం కాలేదు. ఒకప్పుడు కలల నగరంగా పేరున్న ముంబయి ఇప్పుడు పీడకలల నగరంగా మారిపోయింది” అని ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ స్వాతి రాణే వ్యాఖ్యానించారు.

దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబయి మహానగరం అరేబియా సముద్ర తీరాన్ని ఆనుకొని ఉంటుంది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి కోసం ఈ నగరానికి తరలివస్తుంటారు. కరోనావైరస్‌తో యుద్ధం చేయడంలో ముంబయి నగరానికి అవరోధంగా నిలుస్తున్న ప్రధాన సమస్య జన సాంద్రత. 2017లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత జన సాంద్రత ఉన్న మహానగరాల్లో ముంబయి రెండవస్థానంలో ఉంది.

“నిజానికి వీడియోల్లో హైలెట్ చేసిన పరిస్థితులు ఇక్కడ కొన్నేళ్లుగా తిష్ట వేసి ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఒక మహమ్మారి వస్తే తప్ప మన వైద్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ప్రజలకు అర్థం కాలేదు” అంటూ ప్రస్తుత పరిస్థితులపై ఓ వైద్యుడు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.

ప్రభుత్వ నివేదికల ప్రకారం ముంబయిలో 70 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. వాటిలో మొత్తం 20,700 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రుల విషయానికి వస్తే మొత్తం 1500 ఆస్పత్రులు ఉండగా అక్కడ సుమారు 20వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా నగరంలో ప్రతి 3 వేల మందికి ఒక బెడ్ అందుబాటులో ఉంది. కానీ డబ్ల్యూహెచ్ఓ సూచనల ప్రకారం ప్రతి 550 మందికి ఒక బెడ్ అందుబాటులో ఉండాలి.

ప్రభుత్వ వైద్యులపై తీవ్రమైన పని ఒత్తిడి

కోవిడ్-19 కారణంగా ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులకు పని భారం పెరిగి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

“మొత్తం భారమంతా ప్రభుత్వాసుపత్రులపైనే పడింది. ప్రైవేటు ఆస్పత్రుల భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంది. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు అవి ముందుకొస్తున్నాయి” అని డాక్టర్ రాణే అన్నారు.

ప్రైవేటు ఆస్పత్రులన్నీ తమ ఆస్పత్రులలో 80 శాతం వనరుల్ని కోవిడ్-19 రోగులకు చికిత్సనందించేందుకే వినియోగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఫీజులకు కళ్లెం వేయాలని నిర్ణయించింది.

“నిజానికి వ్యాధి సోకుతుందన్న భయం కారణంగా మొదట్లో చాలా మంది ప్రైవేటు వైద్యులు ముందుకు రాలేదు” అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహారాష్ట్ర ప్రెసిడెంట్ డాక్టర్ అవినాశ్ భోండ్వే అన్నారు.

అయితే అటు ప్రైవేటు వైద్యులకు చెందిన ఓ సంఘం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 వేల మంది వైద్యులు చికిత్సనందించేందుకు అంగీరిస్తూ సంతకాలు చేశారని చెబుతోంది. ప్రస్తుతం తమకు అందుబాటు ధరల్లో పీపీఈ కిట్లు కావాలని, అవి ఇప్పటికీ దొరకడం లేదని ఆ సంఘం వాదన.

అయినా ప్రైవేటు వైద్యులు ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రులపై భారం తగ్గదు.

“తక్షణ సాయం అవసరం. మేం సెలవులు కూడా లేకుండా పని చేస్తున్నాం. కనీసం క్వారంటైన్లో ఉండేందుకు కూడా మాకు సమయం చిక్కడం లేదు” అని సియాన్ ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడు నాతో అన్నారు.

నగరంలో క్షేత్రస్థాయిలో సుమారు 4 వేల మంది రోగులకు చికిత్స అందించేందుకు వీలున్న ఆస్పత్రుల నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. అలాగే ఏ ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీలు ఉన్నాయన్న సంగతిని తెలిపే డ్యాష్ బోర్డ్ ‌కూడా సిద్ధమవుతోంది.

అయితే ఇవేవీ ఇప్పటికిప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోవడం చాలా మందిని చిక్కుల్లో పడేస్తోంది.

తన తండ్రి శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతుండగా దాదాపు 8 ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లానని, అందులో కొన్ని భారీ సౌకర్యాలున్న ఆస్పత్రులు కూడా చికిత్స అందించేందుకు నిరాకరించాయని చివరకు సియాన్ ఆస్పత్రికి తీసుకొచ్చానని నిత్యగణేశ్ పిళ్లై చెప్పారు.

“ఆస్పత్రిలో అడుగు పెట్టగానే నాకు రక్తం మరకలతో కూడిన ఓ స్ట్రెచర్ కనిపించింది. ఆ తరువాత ఎలాగోలా ఓ వీల్ చైర్‌ను సంపాదించగల్గాను. ఆస్పత్రిలోకి నా తండ్రిని తీసుకెళ్లాను. వెంటనే నా తండ్రిని ఐసీయూలో చేర్చాలని అక్కడ సిబ్బంది సూచించారు. కానీ ఐసీయూలో ఖాళీ లేదు. అదే సమయంలో డాక్టర్ నా తండ్రి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. కొన్ని క్షణాల తర్వాత ఆయన ఇక ఎంతో సేపు బతకరని నాతో చెప్పారు” అని నిత్య గణేశ్ నాతో అన్నారు.

ఆ తరువాత కొద్దిగంటలకే 62 ఏళ్ల సెల్వరాజ్ పిళ్లై మరణించారు. ఆ తరువాత వచ్చిన మెడికల్ రిపోర్టులో ఆయకు కూడా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.

ఆపై నిత్య గణేశ్ తన తల్లితో సహా క్వారంటైన్‌లో ఉన్నారు. “ప్రతి రోజునూ నేను వార్తల్లో కరోనావైరస్ గురించి చూసే వాణ్ణి. అయితే, అది నన్ను, నా కుటుంబాన్ని కబళిస్తుందని కలలో కూడా ఊహించలేదు. మాది ఉన్నత మధ్య తరగతి కుటుంబం. అయితే ఎంత డబ్బు ఉన్నా నువ్వు ప్రేమించే వాళ్లను అది కాపాడలేదు” అంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

'ధారవి' పరిస్థితి మరీ ఘోరం

ఇక ముంబయిలోని ధారవి వంటి మురికివాడల పరిస్థితి ఇప్పుడు మరీ ఘోరంగా మారింది. కేవలం ఒక చదరపు మైలు కన్నా తక్కువ భూభాగంలో సుమారు పది లక్షల మంది నివసిస్తున్నారు ధారవిలో. న్యూయార్క్‌లోని మాన్ హట్టన్ జన సాంద్రతతలో పోల్చితే ఇది పది రెట్లు ఎక్కువ.

“50 మంది కలిసి ఒక్కటే బాత్రూంను ఉపయోగిస్తారు. చిన్న చిన్న గదుల్లో పది నుంచి 12 మంది వరకు కలిసి జీవిస్తుంటారు. అలాంటి చోట భౌతిక దూరం ఎలా సాధ్యమవుతుంది?” అని ధారవికి చెందిన మహమ్మద్ రెహమాన్ ప్రశ్నించారు.

లాక్ డౌన్ కారణంగా ధారవిలో మెజార్టీ జనానికి ఉపాధి లేకుండా పోయింది. దీంతో రెహమాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ రోజూ వేలాది మందికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తోంది. “నా జీవితంలో ఎప్పుడూ ఇంత క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేదు. ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆహారం అందించేందుకు తగిన నిధులు లేకపోవడంతో ఇప్పుడు పంచడం నిలిపేశాం. మేం మాత్రం ఎంత కాలం చెయ్యగలం?” అని రెహమాన్ అన్నారు.

ఆర్థికంగా చితికిపోతున్న ముంబయి

ఇక నా వరకు వస్తే లాక్ డౌన్ ముందు ఉదయాన్నే వీధిలో నెలకొన్న సందడితో నా రోజు మొదలయ్యేది. ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్న నా ఆఫీసుకి వెళ్లే దారిలో కనీసం ఓ పాతిక మంది జనం తారసపడేవారు.

ఖాళీగా ఉంటే అందంగానే ఉంటుంది. ఇప్పుడు ఆకాశం ప్రతి రోజు చాలా నిర్మలంగా కనిపిస్తోంది. నగరానికి ఏటా వచ్చే అతిథులైన ఫ్లెమింగో పక్షులు నీలాకాశంలో ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది వాటి సంఖ్య పెరిగింది కూడా.

కానీ లాక్ డౌన్ కారణంగా ముంబయి ఆర్థిక పరిస్థితి దారుణంగా చితికిపోయింది. లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. వీటన్నింటికీ తోడు కరోనావైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. చూస్తుంటే ఇప్పట్లో తగ్గేటట్టు కూడా కనిపించడం లేదు.

“మేం ఇప్పటికీ కొత్తగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. కానీ అవన్నీ ఒక్క రోజులో నిండిపోతాయి. వైరస్ వ్యాప్తి చెందడానికి కారణాలను కనుక్కొని దానికి అడ్డుకట్ట వెయ్యకపోతే ముంబయి మహానగరం రానున్న నెలల్లో కూడా లాక్ డౌన్‌లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది” అని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ రాహుల్ ఘులే హెచ్చరించారు.

“తాజాగా ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ “చేజ్ ద వైరస్” అనే కార్యక్రమాన్ని ఈ వారంలో మొదలు పెట్టింది. ఎక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోందో తక్షణం కనుక్కోవడమే ఆ కార్యక్రమం లక్ష్యం. “మురికి వాడల్లో 15 కోవిడ్-19 పాజిటివ్ కేసులు బయట పడటంతో వారితో కాంటాక్ట్‌లో ఉన్న చాలా మందిని క్వారంటైన్‌కి తరలించాం. ఇప్పటి వరకు నగరంలో మొత్తం 42 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాం” అని ముంబయిమున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ చాహల్ బీబీసీకి చెప్పారు.

మరో భయం పొంచే ఉంది

మరోవైపు రుతుపవనాలు సమీస్తున్నాయి. వర్షాకాలం మొదలైతే మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంది. ముంబయి నగరంలో వర్షాకాలం వచ్చిదంటే అత్యవసర సేవలు అందించడం మరింత కష్టమవుతుంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)