కరోనావైరస్: విదేశీ చదువులకు కోవిడ్ దెబ్బ - బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో వర్సిటీలు సంక్షోభంలో పడతాయా?

    • రచయిత, జాంటీ బ్లూమ్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్

కరోనావైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని మీరు భావిస్తున్నారు? నిర్మాణ రంగమా? రిటైల్ రంగమా? రవాణా రంగమా? నిజానికి ఈ రంగాలన్నీ సంక్షోభంలో పడనున్నాయన్న మాట వాస్తవమే. అయితే వాటితో పాటు అత్యంత కీలకమైన విద్యా రంగం కూడా ఈ పెను సంక్షోభం ధాటికి విలవిలలాడనుంది.

ఆర్థిక వ్యవస్థలో విద్యారంగం భాగమే. సాధారణంగా ఈ విషయం గురించి చాలా మంది ఆలోచించరు. విద్యారంగం అంటే కేవలం చదువు మాత్రమే కాదు.. దాన్ని ఆధారంగా చేసుకొని ఉన్న ఇతర విభాగాలు కూడా ఆయా సంస్థలకు కీలక ఆదాయ మార్గాలే.

అన్ని వ్యవస్థల్లా విద్యా వ్యవస్థకు కూడా డబ్బే ప్రాణం. ప్రముఖ విద్యాలయాలకు అనేక ఆదాయ మార్గాలుంటాయి. బాగా సంపాదించిన పూర్వ విద్యార్థులు ఇచ్చే డొనేషన్లు కావచ్చు, వసతి, భోజనాలకు గానూ వసూలు చేసే ఫీజులు కావచ్చు, ఆపై సమావేశాలని, సౌకర్యాలని ఇలా అనేక రూపాల్లో సొమ్మును విద్యార్థుల నుంచి వసూలు చేస్తూనే ఉంటాయి విద్యా సంస్థలు.

ఇప్పుడు కరోనావైరస్ దెబ్బకు విద్యారంగం మొత్తం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది.

అనేక విశ్వ విద్యాలయాల్లో ఉన్న విద్యార్థుల్ని ఇప్పటికే ఇంటికి పంపించేశారు. చాలా కోర్సులన్నీ ఇప్పుడు ఆన్‌లైన్ విధానానికి మారిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలాగే లాక్‌డౌన్ కొనసాగితే రానున్న రోజుల్లో కాంపస్‌లో కొత్త విద్యార్థుల కళ అన్నదే లేకుండా పోతుంది.

అంతేకాదు.. ఇకపై ఎటువంటి సమావేశాలు జరగవు. సంపన్నులైన పూర్వ విద్యార్థులు కూడా ఇకపై అలా ఉండకపోవచ్చు.

ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఉన్న ఇంగ్లిష్ మాట్లాడే యూనివర్శిటీలకు ఇది కచ్చితంగా పెద్ద దెబ్బే. వాళ్లు దేశీయ విద్యార్థుల నుంచి కూడా ట్యూషన్ ఫీజుల పేరుతో భారీగా వసూలు చేస్తారు. అంతేకాదు ఆన్ సైట్ క్యాటరింగ్, వసతి పేరుతోనూ బాగానే గుంజుతారు.

అటు, విదేశీ విద్యార్థుల నుంచి కూడా బాగానే ఫీజులు దండుకుంటారు. నిజానికి చాలా విశ్వ విద్యాలయాలకు వీళ్లే ప్రధాన ఆదాయ వనరు. ఉదాహరణకు బ్రిటన్‌లో అండర్‌గ్రాడ్యుయేషన్ చేసే విదేశీ విద్యార్థుల నుంచి వార్షిక ఫీజు పేరిట 9 వేల పౌండ్లకు బదులు ఏకంగా 58,600 పౌండ్లను వసూలు చేస్తారు.

ప్రపంచీకరణ మొదలైన తర్వాత చవగ్గా ఉత్పత్తి అయ్యే వస్తువులను దాదాపు అన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. విదేశీ విద్యార్థులను ఆకర్షించడం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఇటీవల సాధించిన గొప్ప ఆర్థిక విజయమని చెప్పవచ్చు.

విదేశీ విశ్వవిద్యాలయాలకు మధ్యతరగతి ప్రజలే వరం

ప్రపంచంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ ఉండటం పశ్చిమ దేశాల విశ్వ విద్యాలయాలకు వరంగా మారుతోందని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలోని ఉన్నత విద్యా విభాగానికి చెందిన ప్రొఫెసర్ సైమన్ మార్గిన్సన్ వ్యాఖ్యానించారు.

“గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా మధ్య తరగతి కుటుంబాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. వారిలో ఎవ్వరైనా ఇప్పుడు తమ పిల్లల్ని విదేశాల్లో చదివించగల్గుతున్నారు” అని ఆయన అన్నారు.

అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల్లో ఆ ప్రమాణాలతో సరిపోయే విద్యావ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందలేదు. అందుకే వాళ్లు ఆ పని చేస్తున్నారు. అంటే విదేశాల్లో చదివిన విద్యార్థికి ప్రతిష్ఠాత్మక డిగ్రీ చేతుల్లో ఉంటుంది. అలాగే తగిన భాషా పరిజ్ఞానం, చాలా మందితో పరిచయాలు, స్నేహాలు ఉంటాయి. లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించేందుకు కారణాలు ఇవే.

ఈ విషయంలో విజేతలు ఎవరన్న విషయానికి వస్తే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు ముందుంటాయి. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య, ఇంగ్లిష్‌లో బోధన కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల విద్యార్థులను ఆకర్షించగల్గుతున్నాయి.

సుమారు 3,60,000 మంది చైనా విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో అమెరికాలోని వివిధ విద్యాలయాల్లో చేరారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ విద్యార్థుల వల్ల వచ్చే ఆదాయం సుమారు 4,500 కోట్ల డాలర్లుంటుంది.

అదే ఆస్ట్రేలియా విషయానికి వస్తే విదేశీ విద్యార్థుల కారణంగా ఏటా 2వేల కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. ఆస్ట్రేలియా విశ్వ విద్యాలయాలు కొన్నేళ్లుగా లక్ష్యంగా పెట్టుకున్న మార్కెట్ విలువ ఇది.

1980 నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆండ్రూ నార్టన్ తెలిపారు.

“దాదాపు అదే టైం జోన్‌లో ఉండటం, ఆకర్షణీయమైన వాతావరణం ఇవన్నీ విద్యార్థులు ఇక్కడకు వలస వచ్చేందుకు కారణమవుతున్నాయి” అని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ సంక్షోభ సమయంలో కాన్‌బెర్రా ప్రభుత్వం మాత్రం ఈ రంగానికి పెద్దగా సహాయ సహకారాలను అందించడం లేదు. ప్రధాని స్కాట్ మారిసన్ కూడా లాక్ డౌన్ సమయంలో విదేశీ విద్యార్థులు ఇబ్బందిపడుతుంటే తిరిగి తమ స్వదేశాలకు వెళ్లేందుకు సహాయం అందిస్తామని స్పష్టం చేయడమే అందుకు నిదర్శనం.

“ఆయన మాటలు భవిష్యత్తులో విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా లేవు. నిజానికి అది చాలా ప్రభావం చూపిస్తుంది” అని ప్రొఫెసర్ నార్టన్ అభిప్రాయపడ్డారు.

“ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఇక్కడ తమ డిగ్రీ చదువును ప్రారంభించకపోతే రాబోయే మూడేళ్లు వాళ్లు ఇక్కడ ఉండరు. అంటే దానర్థం మున్ముందు విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కోనున్నాయి. ఈ పరిస్థితి కేవలం ఆస్ట్రేలియాకి మాత్రమే పరిమితం కాదు” అని నార్టన్ అన్నారు.

తమ ఫీజులు తిరిగి ఇవ్వాలంటూ విద్యార్థుల డిమాండ్

అమెరికా విషయానికి వస్తే విశ్వ విద్యాలయాలు వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని చారిత్రక విశ్వ విద్యాలయాలు, ప్రముఖ కాలేజీలుకు బిలియన్ల డాలర్ల నిధులు ఉన్నాయి. దాతృత్వం పేరిట కూడా భారీ ఎత్తున నిధులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆయా విద్యాలయాల పేరు ప్రతిష్ఠల్ని పెంచడం మాత్రమే కాదు.. వాటిల్లో చదివే విద్యార్థులపై ఫీజుల భారాన్ని కూడా పెంచుతాయి. కానీ ఇప్పుడు మూసివేయడం వల్ల వాటికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు.

చాలా మంది విదేశీ విద్యార్థులు ఇప్పటికే చాలా పాఠాలను కోల్పోయిన నేపథ్యంలో ఫీజులో కొంత తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రస్తుతం చాలా అమెరికన్ యూనివర్శిటీలలో విద్యార్థులు ఇంకా అక్కడే ఉన్నారు. దీంతో వసతి, భోజన సౌకర్యాలను కల్పించేవారు కూడా భారీగానే ఆదాయం పొందుతున్నారు. మరోవైపు, బ్రిటన్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థులు కూడా తమ ఫీజుల్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

“రాబోయే విద్యా సంవత్సరంలో తిరిగి క్యాంపస్ క్లాసుల్ని ఎలా మొదలు పెడతామో నాకైతే తెలియడం లేదు” అని

బ్రిటన్‌లోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన డార్ట్‌మౌట్ కాలేజ్ ప్రొఫెసర్‌ విజయ్ గోవిందరాజన్ అన్నారు.

అందుకే విశ్వ విద్యాలయాలన్నీ వెంటనే ఆన్ లైన్ తరగతులను ప్రారంభించాయి. నిజానికి అవి విదేశీ విద్యార్థులను అంతగా ఆకర్షించలేవని తెలిసినప్పటికీ ప్రస్తుతం వాటికి అంత కన్నా మరో దారి లేదని ప్రొఫెసర్ మార్గిన్సన్ అభిప్రాయపడ్డారు.

“విద్యార్థులకు ఏ తరహా విద్యా విధానం కావాలని అడిగినప్పుడు కచ్చితంగా ప్రత్యక్ష విద్యా బోధనను అంటే ముఖా-ముఖి బోధననే ఎంచుకుంటారు” అని గోవిందరాజన్ అన్నారు.

రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి అన్నిపాఠాలను ఆన్‌లైన్ ద్వారా బోధిస్తామని బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం ప్రకటించింది. అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని కూడా తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు ఒక్కసారిగా ఆన్ లైన్ బోధన, రిమోట్ బోధన వైపు మళ్లాయి. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్‌లో ఉండటం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో అంతకు మించి వారు కూడా చెయ్యగల్గింది ఏదీ లేదు. అంతే కాదు.. ఎంతో కొంత ఆదాయం సంపాదించడానికి వారికి ఇది ఒక్కటే మార్గం కూడా.

అయితే తమ ఆదాయం ఒక్కసారిగా పడిపోయిన తర్వాత కూడా ఎన్ని విశ్వవిద్యాలయాలు బతికి బట్టకట్టగల్గుతాయి? ఈ ఆన్ లైన్ విధానాన్ని ఇక అవి శాశ్వతంగా కొనసాగించాల్సిందేనా? అన్న విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఒకే చోట కల్పించి అత్యుత్తమ విద్యా బోధన చెయ్యడం అన్నది సుదీర్ఘ కాలంగా విజయవంతంగా నడుస్తున్న వ్యాపార నమూనా. ఇప్పటికీ ఆ తరహా సంస్థలకే పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. ఆదాయం కూడా ఉంది. మరి మున్ముందు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందా.. లేదా మారుతుందా అన్నది భవిష్యత్తే తేల్చాలి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)