You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NPS Vatsalya: ఏటా రూ.10వేల డిపాజిట్‌తో మీ చిన్నారి రిటైర్మెంట్ నాటికి రూ. 10 కోట్ల నిధి...
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ కోసం
తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తు గురించిన బెంగ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వారు పెద్దయ్యాక, వారి ఆర్థిక భద్రత గురించి చాలా చాలా ఆలోచిస్తారు. ఎన్నో ప్రణాళికలు వేస్తారు. ఎంతోకొంత పొదుపు కూడా చేస్తారు. ఈ బెంగను కొంతైనా తీర్చే ఓ కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చింది. అదే NPS Vatsalya.
భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన ‘నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వాత్సల్య’ పథకాన్ని బుధవారం నాడు (సెప్టెంబర్ 19వ తేదీన) అధికారికంగా ప్రారంభించారు.
ఇది 18 సంవత్సరాల వయసు నిండని చిన్నారుల కోసం ఉద్దేశించిన ఒక సేవింగ్ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకం కింద.. తల్లిదండ్రులు, గార్డియన్లు తమ పిల్లల పేరు మీద చిన్నప్పటి నుంచే పెన్షన్ ఖాతా తెరవవచ్చు. ఈ ఖాతాలో కంట్రిబ్యూషన్లు జమచేస్తూ పిల్లల కోసం పొదుపు చేయవచ్చు. ఆ పొదుపు వృద్ధి చెందుతూ పిల్లలు పెద్దయ్యేసరికి వారికి గణనీయమైన మూలనిధి సమకూరటానికి తోడ్పడుతుంది.
NPS Vatsalya ఖాతాలో చిన్నారి పేరు మీద వార్షికంగా కనీసం 1,000 రూపాయలు మొదలుకుని, ఆపైన ఎంత మొత్తమైనా జమ చేయవచ్చు. ఈ వెసులుబాటు వల్ల తల్లిదండ్రుల ఆర్థిక నేపథ్యం ఏదైనా సరే వారు తమ పిల్లల కోసం ఈ ఖాతా తెరిచేందుకు వీలుంటుంది.
భారతదేశంలో పెన్షన్ ఫండ్ల (భవిష్య నిధుల)ను పర్యవేక్షించే ‘‘భవిష్య నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ - PFRDA)’’ పర్యవేక్షణలోనే NPS Vatsalya పథకం అమలవుతుంది. ఈ పథకం భారత పెన్షన్ వ్యవస్థలో ఒక గొప్ప ముందడుగుగా ప్రభుత్వం చెప్తోంది.
NPS Vatsalya పథకం వల్ల ప్రయోజనాలేమిటి? ఎవరు అర్హులు? అకౌంట్ ఎలా తెరవాలి? ఎంత డిపాజిట్ చేయాలి? ఎప్పుడు, ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చు? అనే వివరాలివీ...
NPS Vatsalya ఖాతా తెరవటం వల్ల మీ చిన్నారికి లభించే ప్రయోజనాలేమిటి?
మీ చిన్నారి ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కల్పించటం కోసం NPS Vatsalya అకౌంట్ పలు ప్రయోజనాలను అందిస్తుంది.
తల్లిదండ్రులు తమ బిడ్డ రిటైర్మెంట్ కోసం ఆ బిడ్డ చిన్నప్పటి నుంచే ఈ పథకంలో పొదుపు ప్రారంభించవచ్చు.
తద్వారా ఆ చిన్నారిలో చాలా ముందుగానే ఆర్థిక క్రమశిక్షణ, బాధ్యతలు అలవడతాయి.
ఈ పథకం చక్రవృద్ధి శక్తిని ఉపయోగించుకుంటూ.. పెట్టుబడులు కాలక్రమంలో గణనీయంగా వృద్ధి చెందటానికి వీలుకల్పిస్తుంది.
తద్వారా మీ చిన్నారికి 18 సంవత్సరాల వయసు నిండేసరికి గణనీయమైన నిధి సమకూరుతుంది.
చిన్నారి వయసు 18 సంవత్సరాలు నిండగానే NPS Vatsalya పథకం రెగ్యులర్ NPS పథకంగా మారుతుంది.
NPS Vatsalya ఖాతాను ఎవరు ఓపెన్ చేయవచ్చు?
NPS Vatsalya ఖాతాను 18 సంవత్సరాల వయసు లోపు భారత పౌరులు ఎవరైనా తెరవచ్చు
అలాగే, 18 సంవత్సరాల వయసు లోపు ప్రవాసభారతీయులు (నాన్-రెసిడెంట్ ఇండియన్లు - NRIలు), ఓవర్‌సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (OCIలు) కూడా అర్హులే
తమ మైనర్ పిల్లల తరఫున NPS Vatsalya ఖాతా తెరవాలని కోరుకునే తల్లిదండ్రులు, గార్డియన్లు కూడా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
ఈ పథకంలో ఎంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు?
NPS Vatsalya ఖాతాను కనీసం 1,000 రూపాయలు డిపాజిట్‌తో ప్రారంభించాలి.
తదనంతరం వార్షిక కంట్రిబ్యూషన్ కనీసం 1,000 రూపాయలు ఉండాలి.
వార్షిక డిపాజిట్ మీద మొత్తం మీద ఎలాంటి గరిష్ట పరిమితీ లేదు.
అంటే ఏటా 1,000 రూపాయలకు మించి ఎంతైనా వార్షిక డిపాజిట్ చేయవచ్చు.
దీనివల్ల విభిన్న ఆర్థిక నేపథ్యాల కుటుంబాల వారికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
నెలకు కనిష్టంగా 500 రూపాయలు కంట్రిబ్యూట్ చేయవచ్చు.
చిన్నారికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఏమవుతుంది?
ఈ పథకంలో అకౌంట్ ఉన్న చిన్నారికి 18 ఏళ్లు నిండి వయోజనులు అయిన తర్వాత NPS Vatsalya అకౌంట్ రెగ్యులర్ NPS అకౌంట్‌గా మారుతుంది.
అదే PRAN నంబరుతో రెగ్యులర్ ఖాతా కొనసాగుతుంది. ఖాతాదారుకు 18 ఏళ్లు నిండిన మూడు నెలల లోపు తాజా కేవైసీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
తద్వారా పెట్టుబడుల వృద్ధి కొనసాగటంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం నిధులు అందుబాటులో ఉంటాయి.
చిన్నారికి 18 ఏళ్లు నిండి వయోజనులు అయ్యాక, NPS Vatsalya ఖాతాను రెగ్యులర్ NPS ఖాతాగా మార్చుకోవాలా, లేదంటే ఖాతా నుంచి వైదొలగాలా అనేది ఆ చిన్నారి ఎంచుకోవచ్చు.
రెగ్యులర్ NPS ఖాతాగా మారిన తర్వాత NPS ఫీచర్లు, ప్రయోజనాలు, ఖాతా నుంచి వైదొలగే నిబంధనలు వర్తిస్తాయి.
ఈ ఖాతా నుంచి ఎప్పుడు, ఎంత నగదు విత్‌డ్రా చేయవవచ్చు?
ఈ ఖాతా గల చిన్నారి వయసు 18 సంవత్సరాలు నిండకముందు నిర్దిష్ట నిబంధనలకు లోబడి పాక్షిక నగదు ఉపసంహరణకు వీలుంటుంది.
ఖాతా తెరిచి మూడేళ్ల లాకిన్ గడువు ముగిసిన తర్వాత తల్లిదండ్రులు లేదా గార్డియన్.. కంట్రిబ్యూట్ చేసిన మొత్తంలో 25 శాతం వరకూ నగదు విత్‌డ్రా చేయవచ్చు.
చిన్నారి వయసు 18 సంవత్సరాలు నిండకముందు అయితే, మూడుసార్లు ఈ విత్‌డ్రాయల్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.
అయితే, PFRDA నిర్వచించిన మేరకు విద్య, నిర్దిష్ట జబ్బులకు వైద్యం, 75 శాతం పైగా అంగవైకల్యం వంటి నిర్దిష్ట అవసరాల కోసం మాత్రమే ఈ పాక్షిక విత్‌డ్రాయల్స్ చేయవచ్చు.
ఖాతాలో మొత్తం నిధి రూ. 2.5 లక్షల కన్నా తక్కువగా ఉన్నట్లయితే మొత్తం నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఒకవేళ ఖాతాలో మొత్తం నిధి రూ. 2.5 లక్షల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, మొత్తం నిధిలో కనీసం 80 శాతాన్ని తప్పనిసరిగా ఏదైనా యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడిగా పెట్టాలి. మిగతా 20 శాతం మొత్తాన్ని ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఖాతాదారు లేదా గార్డియన్ మరణించినట్లయితే ఏమవుతుంది?
ఒకవేళ ఖాతాదారు అయిన మైనర్ మరణించినట్లయితే, ఖాతాలోని మొత్తం నిధిని రిజిస్టర్ అయిన గార్డియన్ (నామినీ)కి ఇస్తారు.
ఒకవేళ గార్డియన్ మరణించినట్లయితే, కొత్త గార్డియన్ తాజా కేవైసీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ మరణించినట్లయితే, లీగల్ గార్డియన్ ఈ పథకాన్ని ఎలాంటి కంట్రిబ్యూషన్లు లేకుండానే చిన్నారికి 18 సంవత్సరాలు నిండేవరకూ కొనసాగిస్తారు.
NPS Vatsalya ఖాతాలో పెట్టుబడి చాయిస్‌లు ఏమిటి?
ఎన్‌పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడుల కోసం డిఫాల్ట్, ఆటో, యాక్టివ్ చాయిస్‌లు ఉంటాయి.
రిస్క్ విషయంలో తల్లిదండ్రులు తమ చాయిస్‌ను బట్టి పై పెట్టుబడి వ్యూహాలను ఎంచుకోవచ్చు.
డిఫాల్ట్ చాయిస్: మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ – ఎల్‌సీ50 (50 శాతం ఈక్విటీ)
ఆటో చాయిస్: ఈ ఆప్షన్‌లో గార్డియన్ ‘లైఫ్ సైకిల్ ఫండ్ – అగ్రెసివ్ – ఎల్‌సీ75 (75 శాతం ఈక్విటీ), లేదా, మోడరేట్ ఎల్‌సీ-50 (50 శాతం ఈక్విటీ), లేదా, కన్జర్వేటివ్ ఎల్‌సీ-25 (25 శాతం ఈక్విటీ) – వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు.
యాక్టివ్ చాయిస్: గార్డియన్ క్రియాశీలంగా ఫండ్ల కేటాయింపును ఈక్విటీకి (75 శాతం వరకూ), కార్పొరేట్ రుణం (100 శాతం వరకూ), ప్రభుత్వ సెక్యూరిటీలకు (100 శాతం వరకూ), ఆల్టర్నేట్ అసెట్ (5 శాతం వరకూ) కేటాయించవచ్చు.
ఏటా రూ. 10,000 డిపాజిట్‌తో రూ. 10 కోట్ల నిధి ఎలా సాధ్యమంటే...
రెగ్యులర్ NPS పథకంలో ఈక్విటీల ద్వారా 14 శాతం, కార్పొరేట్ రుణాల ద్వారా 9.1 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా 8.8 శాతం రాబడులు లభించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ NPS Vatsalya పథకం ప్రారంభ సమయంలో చెప్పారు.
చండీగఢ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తాజాగా సోషల్ మీడియా వేదిక X (ఇంతకుముందు ట్వీటర్)లో షేర్ చేసిన పోస్టులో అంచనాల ప్రకారం చిన్నారి పేరు మీద ఏటా రూ. 10,000 డిపాజిట్ చేసినట్లయితే, ఆ చిన్నారి రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి మొత్తం రూ. 10 కోట్ల పైనే నిధి సమకూరవచ్చు.
ఇది పెట్టుబడులపై రాబడి రేటు (రేట్ ఆఫ్ రిటర్న్) ఎంత అనే దాని మీద అధారపడి ఉంటుంది.
ఆ పోస్టులో పేర్కొన్న అంచనాలు ఇలా ఉన్నాయి:
వార్షిక కంట్రిబ్యూషన్: రూ. 10,000
పెట్టుబడి కాల పరిమితి: 18 సంవత్సరాలు
18 ఏళ్లు నిండేసరికి మూల నిధి అంచనా: రూ. 5 లక్షలు (10 శాతం రాబడి రేటుతో)
ఆ తర్వాత కూడా కంట్రిబ్యూషన్ కొనసాగించినట్లయితే, 60 ఏళ్లు నిండేసరికి సమకూరే నిధి అంచనాలు:
10 శాతం రాబడి రేటుతో: రూ. 2.75 కోట్లు
11.59 శాతం రాబడి రేటుతో: రూ. 5.97 కోట్లు
12.86 శాతం రాబడి రేటుతో: రూ. 11.05 కోట్లు
(గమనిక: ఈ అంచనాలు కేవలం వివరణ కోసం మాత్రమే. రాబడి రేట్లను గత గణాంకాల ఆధారంగా అంచనా వేశారు.)
NPS వాత్సల్య అకౌంట్ తెరవటానికి అవసరమైన పత్రాలు ఏమిటి?
NPS వాత్సల్య అకౌంట్ తెరవటానికి ఈ కింది ధ్రువపత్రాలు అవసరం:
- గార్డియన్ (సంరక్షకులు) గుర్తింపు ధ్రువపత్రం: గుర్తింపు ధ్రువీకరణగా ఆధార్ కార్డు, పాన్ (PAN) కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాల్లో ఏదైనా సరిపోతుంది.
- గార్డియన్ చిరునామా ధ్రువపత్రం: సంరక్షకుల ప్రస్తుత చిరునామాను నిరూపించే ఏ అధికారిక ధ్రువపత్రమైనా సరిపోతుంది.
- మైనర్ వయసు ధ్రువపత్రం: చిన్నారి జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్) లేదా జనన తేదీని నిర్ధరించటానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ధ్రువపత్రం
- మైనర్ గుర్తింపు ధ్రువపత్రం: అందుబాటులో ఉన్నట్లయితే ఆధార్ కార్డును ఉపయోగించటం మంచిది.
- సంప్రదించటానికి (కాంటాక్ట్) సమాచారం: రిజిస్ట్రేషన్ కోసం, అలాగే సమాచార సంప్రదింపుల కోసం ఒక పని చేస్తున్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అవసరం.
- ఫోటోలు: సంరక్షుకుడికి సంబంధించి ఇటీవలి పాస్‌పార్ట్ సైజు ఫోటోలు
NPS Vatsalya ఆన్‌లైన్ అకౌంట్ (eNPS) ఓపెన్ చేయటం ఎలా?
NPS వాత్సల్య అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయటానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి:
ముందుగా, NPS వాత్సల్య స్కీమ్‌ను హోస్ట్ చేసే అధికారిక eNPS వెబ్‌సైట్‌కు https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html వెళ్లండి. అందులో ‘National Pension System (NPS)’ డ్రాప్‌డౌన్ లిస్ట్ చూడండి. ఆ లిస్ట్‌లో 'NPS Vatsalya (Minors)' మెనూను క్లిక్ చేయండి. ఆ మెనూలో 'Register Now' క్లిక్ చేయండి
ఇనీషియల్ ప్రాసెస్‌లో గార్డియన్ (సంరక్షకుల) వివరాలు ఎంటర్ చేయండి – జనన తేదీ, PAN నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మొదలైనవి.
తర్వాత 'Begin Registration' క్లిక్ చేయండి.
గార్డియన్ మొబైల్ నంబర్‌కు, ఈమెయిల్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి.
వెరిఫికేషన్ తర్వాత ఒక అకనాలెడ్జ్‌మెంట్ నంబర్ కనిపిస్తుంది.
ఆ తర్వాత 'Continue' క్లిక్ చేయండి
మైనర్ వివరాలు, గార్డియన్ వివరాలు నింపండి
అవసరమైన ధ్రువ పత్రాలను అప్‌లోడ్ చేయండి
తర్వాత 'Confirm' క్లిక్ చేయండి
ప్రారంభ కంట్రిబ్యూషన్ 1,000 రూపాయలు చెల్లించండి
మైనర్ సబ్‌స్క్రైబర్ (ఖాతాదారు)కు పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (PRAN) జనరేట్ అవుతుంది.
మైనర్ పేరు మీద NPS Vatsalya అకౌంట్ ఓపెన్ అవుతుంది
‘NPS వాత్సల్య అకౌంట్’ను బ్యాంకులు, పోస్టాఫీసులు సహా PFRDA లో రిజిస్టరయిన పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీ)ల ద్వారా కూడా తెరవచ్చు.
ఈ పీఓపీల పూర్తి జాబితా PFRDA వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)