లంగ్ క్యాన్సర్ బాధితుల గొంతుకగా నిలిచిన జర్నలిస్ట్ రవి ప్రకాష్ కన్నుమూత

చాలా కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్న బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ శుక్రవారం కన్నుమూశారు.

ఇటీవలే, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ లంగ్ క్యాన్సర్ (డబ్ల్యూసీఎల్‌సీ-2024)లో ఆయనను పేషెంట్ అడ్వకసీ ఎడ్యుకేషనల్ అవార్డుతో సత్కరించారు.

అమెరికాలోని శాన్ డియాగోలో సెప్టెంబర్ 7న ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది భారత్ నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి రవి ప్రకాష్.

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ (ఐఏఎస్‌ఎల్‌సీ) ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల గొంతుగా మారిన వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డును అందజేస్తుంది.

ఈ ఏడాది భారత్‌కు చెందిన రవి ప్రకాష్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన మరో 9 మందికి ఈ అవార్డు లభించింది.

శాన్ డియాగో కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 దేశాల ప్రతినిధుల సమక్షంలో రవి ఈ అవార్డును అందుకున్నారు.

2021 జనవరి నుంచి రవి ప్రకాష్ నాల్గవ దశ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. క్యాన్సర్ ఊపిరితిత్తుల నుంచి మెదడుకు పాకింది.

ముంబయిలోని ఓ ఆస్పత్రిలో సుదీర్ఘ కాలం చికిత్స పొందారు రవి ప్రకాష్.

తాను పొగతాగకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చిందని, అందుకే పొగతాగే వారికి మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుందనుకోవడం సరికాదని తేలిపోయిందని రవి ప్రకాష్ బీబీసీకి రాసిన కథనంలో పేర్కొన్నారు.

2021 ఫిబ్రవరిలోనే చికిత్స ప్రారంభించినప్పటికీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నాలుగో దశలో ఉండటంతో, అప్పటి నుంచి మరో 18 నెలలు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు ఆయనతో చెప్పారు.

అయినా, రవి ప్రకాష్ కుంగిపోలేదు. పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివిధ వేదికలపై మాట్లాడటం, కథనాలు రాయడం, అవగాహన కల్పించడం లాంటివి చేశారు.

క్యాన్సర్‌ మందుల ధరలు, ఖరీదైన వైద్యం గురించి రవి ప్రకాష్ చాలా కథనాలు రాశారు.

"భారతదేశంలో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది. 30 టాబ్లెట్ల ధర రూ.5 లక్షలు అని నాకు ఒక మందు గురించి చెప్పారు. ఒక నెల ఆ మందు కొనుగోలు చేస్తే, రెండు నెలలు ఉచితం అని చెప్పారు. అంటే మూడు నెలలకు రూ.5 లక్షలు ఖర్చవుతుంది. కానీ, నా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ చికిత్సకు బదులు మరో పద్ధతికి వెళ్లాల్సి వచ్చింది. ఏడాదికి రూ.20 లక్షలు పెట్టి కొనేందుకు నా ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఆ మందులు తీసుకోలేదు" అని రాశారు.

క్యాన్సర్‌ రవి ప్రకాష్‌ మెదడుకు వ్యాపించిందని జూన్‌లో నిర్వహించిన పరీక్షల్లో తేలింది.

రవి ప్రకాష్‌ కుమారుడు దిల్లీలోని ఐఐటీలో బీటెక్‌ చదువుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)