You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టప్పర్‌వేర్ దివాలా
ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ల తయారీ సంస్థ టప్పర్‌వేర్, దాని అనుబంధ కంపెనీలు దివాలా పిటిషన్ దాఖలు చేశాయి. తీవ్రనష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
దివాలా ప్రక్రియ సమయంలోనూ కార్యకలాపాలు కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పిన కంపెనీ, వ్యాపారాన్ని విక్రయించడానికి తగిన ప్రక్రియ కోసం కోర్టు అనుమతి కోరుతామని వివరించింది.
కొత్త ఆర్ధిక వనరులను సమకూర్చుకోకపోతే వ్యాపారం మూతపడే ప్రమాదం ఉందని ఈ 78 ఏళ్ల సంస్థ నిరుడు తెలిపింది.
తమ అమ్మకాలు భారీగా పడిపోతున్న తరుణంలో యువ వినియోగదారులను ఆకర్షించడం ద్వారా వ్యాపారంలో నిలదొక్కుకోవాలని టప్పర్‌వేర్ ప్రయత్నిస్తోంది.
‘‘దివాలా ప్రక్రియ కొనసాగుతున్నా.. మా విలువైన కస్టమర్లకు అత్యుత్తమ ఉత్పత్తులను అందించాలనుకుంటున్నాం’’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లారీ అన్ గోల్డ్‌మాన్ ఇన్వెస్టర్స్ కోసం జారీచేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కంపెనీ దివాలా పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తోందనే వార్తల నేపథ్యంలో టప్పర్‌వేర్ షేర్ల విలువ 50 శాతం పైగా పడిపోయింది.
మార్కెట్‌లో చౌక ఉత్పత్తుల నుంచి టప్పర్‌వేర్ చాలాకాలంగా పోటీ ఎదుర్కొంటోంది. తన అమ్మకాలు పడిపోకుండా ఉండేందుకు టప్పర్‌వేర్ చాలా కాలంగా కష్టపడుతోంది.
పెరుగుతున్న ముడిసరకుల ధరలు, అధిక వేతనాలు, రవాణా ఖర్చులు కంపెనీ లాభాలను దెబ్బతీశాయి.
టప్పర్‌వేర్ చాలాకాలం మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించింది.
ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రజలకు ఏ స్థాయిలో దగ్గరయ్యాయి అంటే... ఏ ప్లాస్టిక్ కంటైనర్‌ను అయినా జనం టప్పర్‌వేర్ అని పిలిచేంతగా ప్రసిద్ధి చెందాయి.
ఈ కంపెనీని 1946లో ఎర్ల్ టప్పర్ స్థాపించారు.
కంటైనర్ల ఫ్లెక్సిబుల్ ఎయిర్ టైట్ సీల్‌పై ఆయన పేటెంట్ పొందారు .
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)