మన్నెగూడ కిడ్నాప్: సినిమా తరహాలో యువతి అపహరణ, ఏమిటీ కేసు?

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మన్నెగూడ కిడ్నాప్ కేసులో బాధిత యువతిని పోలీసులు కాపాడారు.

కిడ్నాప్ ఫిర్యాదు వచ్చిన ఆరు గంటల్లోనే ఆమెను కాపాడినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 31 మందిని పట్టుకున్నారు.

ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నా, పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

 అసలేం జరిగింది?

శుక్రవారం మధ్యాహ్నం హైదారాబాద్ శివార్లలోని మన్నెగూడలో నివాసం ఉంటోన్న దామోదర రెడ్డి ఇంటిపైకి దాదాపు 50 మందికి పైగా తీసుకొచ్చిన నవీన్ రెడ్డి అనే వ్యక్తి, ఇంటిపై దాడి చేశాడు.

‘మిస్టర్ టీ’ పేరుతో టీ షాపుల చైన్, ఫ్రాంఛైజీ మోడల్‌లో నవీన్ రెడ్డి నడుపుతున్నారు. దామోదర రెడ్డి ఇంట్లో ఆ సమయానికి కూతురు వైశాలి నిశ్చితార్థం జరుగుతోంది.

అక్కడ దామోదర రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులపై దాడి చేసి, ఇంట్లో వస్తువులు, కారు ధ్వంసం చేసి వైశాలిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. దారిలో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.

ఒకేసారి పదుల సంఖ్యలో మనుషులు ఇంటి మీద దాడి చేసి ఒక మహిళను ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టించింది.

కిడ్నాప్ చేసిన తీరు, నిందితులు వచ్చిన పద్ధతి సినిమాను తలపించింది. బాధితులతో పాటూ స్థానికులనూ ఈ ఘటన భయపెట్టింది.

ఆ ఘటన జరిగిన వెంటనే దామోదర రెడ్డి తరపు బంధువులు హైవేపై ధర్నాకు దిగి, అమ్మాయిని కాపాడాలని డిమాండ్ చేశారు.

తమ ఇంటి ఎదురుగా ఉన్న నవీన్ రెడ్డి షాపును తగలబెట్టారు.

పోలీసుల కేసు

దామోదర రెడ్డి ఫిర్యాదుతో ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో సెక్షన్147,148,307,324,363,427,506,452,380r/w 149IPC కింద కేసులు పెట్టారు.

వైశాలి తండ్రి దామోదర రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం, ‘షటిల్ బ్యాడ్మింటన్ ఆడేందుకు వెళ్లినప్పుడు నా కూతురికి నవీన్ రెడ్డితో పరిచయమైంది. ప్రేమ, పెళ్లి పేరుతో అప్పటి నుంచి నా కూతురుని వేధిస్తున్నాడు.

శుక్రవారం నవీన్ రెడ్డి, రూబెన్‌తో పాటు 50 మంది నా ఇంటిపై దాడి చేశారు. టీఎస్07హెచ్ఎక్స్2111 అనే వోల్వో కారు, టీఎస్ 07యు4141 అనే బొలెరో వాహనంతో పాటు మరికొన్ని బండ్లలో వారు వచ్చారు.

కార్లలో ఐరన్ రాడ్లు, రాళ్లు తెచ్చారు. నన్ను నా కూతుర్ని మా కుటుంబ సభ్యులను చంపాలని ఇంట్లోకి దూసుకొచ్చారు. నవీన్ నా తలపై ఇనుప రాడ్‌తో కొట్టాడు. ఆపబోయిన నా స్నేహితులను కూడా కొట్టారు.

తరువాత నా కూతుర్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఇంట్లో సామాగ్రితో పాటూ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు’ అని దామోదర రెడ్డి ఫిర్యాదులో రాశారు.

వాళ్లిద్దరికీ ముందే పరిచయం ఉందా?

వైశాలితో తనకు ముందే పెళ్లి అయిందని నవీన్ రెడ్డి చెబుతున్నారు. ఇందుకు ఎల్బీనగర్ కోర్టులో వేసిన పిటిషన్‌ను ఆధారంగా చూపిస్తున్నారు.

ఆ పిటిషన్లో నవీన్ రెడ్డి అనేక ఆసక్తికర విషయాలు రాశారు.

తన భార్య అయిన వైశాలికి పెళ్లి అయిందన్న విషయం దాచి, వారి తల్లితండ్రులు మళ్లీ పెళ్లి చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం...

‘మేం జనవరి 2021 నుంచి ప్రేమించుకుంటున్నాం. వాళ్ల తల్లితండ్రులకు నేను తెలుసు. నా ఖర్చుతో వైశాలి కుటుంబ సభ్యులు దూర ప్రాంతాలకు టూర్లు వేశారు.

2021 ఆగస్టు 4న బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలోని గుడిలో మాకు పెళ్లి అయింది. అయితే తన బీడీఎస్ కోర్సు పూర్తయ్యే వరకూ ఎవరికీ పెళ్లి గురించి చెప్పవద్దు అంది. కాలేజీలో నవ్వుతారని తాళి, మెట్టెలు వేసుకునేది కాదు.

కానీ ఆ తరువాత వాళ్లు అసలు పెళ్లి కాలేదని చెప్పడం మొదలుపెట్టారు. పెళ్లికి సంబంధించిన ఆధారాలన్నీ వారి దగ్గరే ఉన్నాయి. అవన్నీ వారు ధ్వంసం చేశారు. అందుకే వాటిని కోర్టుకు సమర్పించలేకపోతున్నాను.

వైశాలిని వదిలేయమని ఆ కుటుంబ సభ్యులు నన్ను బెదిరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయింది. మా మధ్య జరిగింది సహజీవనమే తప్ప పెళ్లి కాదని ఆమె తల్లితండ్రులు వేధిస్తున్నారు.

నేను వోల్వో కారు కొన్నప్పుడు ఇన్సూరెన్సు నామినీగా భార్య స్థానంలో వైశాలి పేరే ఉంది. నాకున్న షాపుల్లో పెద్దదైన అంబర్‌పేట షాపులో డబ్బులు తీసుకునే స్కానర్ ఆమె పేరునే పెట్టాను. ఆ డబ్బు వారికే వెళ్లేది’ అంటూ కోర్టులో వేసిన పిటిషన్‌లో నవీన్ పేర్కొన్నారు. తన భార్యను కాపురానికి పంపాల్సిందిగా ఫిర్యాదులో రాశారు.

అయితే నవీన్‌తో పెళ్లి ఇష్టం లేదని గతంలోనే పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

‘కోర్టులో కూడా తనకు పెళ్లి ఇష్టం లేదని ఆమె స్టేట్‌మెంట్ ఇచ్చింది. తనని కాదని మరో వ్యక్తితో వివాహం చేస్తున్నారని కోపంతో నవీన్ కక్ష పెంచుకున్నాడు. అందుకే దాడి చేశాడు. తమ కులానికి చెందిన కొందరు తమ అమ్మాయిని నవీన్‌కే ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు’ అని వైశాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

నన్ను కొట్టాడు: వైశాలి

ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసులో మొత్తం 31 మందిని అరెస్టు చేశారు. వారిలో తెలంగాణ వారితో పాటూ వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

‘వైశాలి షాక్‌లో ఉంది. ఆమెను కొట్టారు, భయపెట్టారు. వైశాలి మాట్లాడే స్థితిలో కూడా లేదు. కిడ్నాప్ అయిన ఆరు గంటల్లో అమ్మాయిని రెస్క్యూ చేశాం.

ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్. అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత భయపెట్టారు. నవీన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అతని కోసం టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి. దొరికిన నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వాళ్ళని పట్టుకుంటాం’ అని రాచకొండ అదనపు కమిషనర్ సుధీర్ బాబు మీడియాతో చెప్పారు. మరోవైపు ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు.

తన కొడుక్కి, ఆ అమ్మాయి ముందు నుంచే తెలుసని నవీన్ రెడ్డి తల్లి మీడియాతో అన్నారు. ‘పెళ్లి సంబంధం కోసమని, పప్పు అన్నమని మా ఇంటికి వచ్చారు.

ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని నా కొడుకు చెప్పాడు. కానీ నేను పెళ్లి చూడలేదు’ అని ఆమె తెలిపారు.

తనను కిడ్నాప్ చేసి హింసించినట్లు వైశాలి మీడియాకు తెలిపారు.

‘నన్ను పెళ్లి చేసుకుంటానని బంధువుల ద్వారా అడిగితే నేను ఇష్టం లేదని చెప్పా. అప్పటి నుంచి నవీన్ రెడ్డి నన్ను వేధించడం ప్రారంభించాడు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. తను చూపిన ఫోటోలు అన్నీ మార్ఫింగ్ చేసినవి.

నన్ను ఇంటి దగ్గర నుంచి ఎత్తుకెళ్లిన తరువాత కారులో నవీన్ రెడ్డి నన్ను కొట్టాడు. జుట్టు పట్టుకుని ముఖం మీద దాడి చేశాడు.

నాకు ఇష్టం లేదు... అని చెబితే... నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు... నాకు దక్కకుంటే నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను అంటూ హింసించాడు.

తాను చెప్పినట్లు వినకపోతే మా నాన్నను చంపేస్తానని బెదిరించాడు. నవీన్ రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. పెళ్లి జరిగింది అని చెప్పిన రోజు నేను ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నా.

కారు ఇన్సూరెన్స్‌లో తనే నా పేరును నామినీగా పెట్టాడు. దానికీ నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను సంతకం పెట్టలేదు’ అని మీడియాతో మాట్లాడుతూ వైశాలి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)