‘ది మర్చంట్ ఆఫ్ డెత్‌’ విక్టర్ బౌట్‌ను అమెరికా ఎందుకు విడుదల చేసింది, అతని చరిత్ర ఏంటి?

విక్టర్ బౌట్, ప్రపంచంలో అత్యంత చెడ్డ పేరున్న ఆయుధ వ్యాపారులలో ఒకరు.

రష్యా, అమెరికాల మధ్య ఖైదీల మార్పిడిలో భాగంగా, బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిటనీ గ్రైనర్‌కు విడిచిపెట్టినందుకు, విక్టర్ బౌట్‌ను అమెరికా విడిచిపెట్టింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రైనర్‌ను మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. రష్యాలో టోర్నమెంట్ ఆడి, అమెరికాకు తిరిగివస్తుండగా, ఆమె సంచీలో గంజాయి నూనె కనిపించిందని మాస్కో విమానశ్రయ అధికారులు వెల్లడించారు.

గ్రైనర్‌ విడుదలకు బదులుగా ఆయుధాల వ్యాపారిని విడుదల చేసేందుకు అమెరికా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్టు గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపించాయి. 

ఆయుధాల వ్యాపారిగా మారిన మాజీ సోవియట్ ఎయిర్ ఫోర్స్ అధికారి విక్టర్ బౌట్ అత్యంత హేయమైన దోపిడీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

'మర్చంట్ ఆఫ్ డెత్' (మృత్యు వ్యాపారి) అనే పేరు గడించారు. ఆయన కథతో ఒక హాలీవుడ్ మూవీ కూడా వచ్చింది.

ఇంతకీ ఈ డెత్ డీలర్ కథేంటి?

2010లో బౌట్‌ను థాయ్‌లాండ్ నుంచి అమెరికాకు రప్పించారు.

అందుకోసం రెండేళ్ల ముందు నుంచి అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్‌మెంట్ ఏజెన్సీ (డీఈఏ) ఒక స్టింగ్ ఆపరేషన్ అమలుచేసింది.

డీఈఏ ఏజెంట్లు, రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (ఫార్క్) అధికారులుగా మారువేషం వేసి ఆయుధాల కొనుగోలుకు బేరం కుదుర్చుకున్నారు.

వెనువెంటనే, ఫార్క్ సంఘాన్ని మూసివేశారు. దాన్ని ఒక ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది.

అయితే, తాను కేవలం అంతర్జాతీయ స్థాయిలో రవాణా హక్కులున్న వ్యాపారవేత్తనని, దక్షిణ అమెరికా తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేసినట్లు తనపై తప్పుడు నేరం మోపారని బౌట్ వాదించారు. 

కానీ, న్యూయార్క్‌లోని జ్యూరీ ఆయన వాదనను నమ్మలేదు.

2012 ఏప్రిల్‌లో బౌట్‌కు 25 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అమెరికా పౌరులను, అధికారులను చంపేందుకు కుట్రపన్నడం, విమాన నిరోధక క్షిపణులను విక్రయించడం, ఒక ఉగ్రవాద సంస్థకు సహాయం చేయడం వంటి నేరాలు రుజువుకావడంతో బౌట్‌కు జైలుశిక్ష పడింది.

బౌట్ నేరాలపై మూడు వారాల పాటు విచారణ సాగింది. బౌట్ విక్రయించబోయే ఆయుధాలను కొలంబియా అధికారులతో కలిసి పనిచేస్తున్న అమెరికన్ పైలట్‌లను చంపడానికి వినియోగించనున్నారన్న సంగతి ఆయనకు ముందే తెలుసునని విచారణలో తేలింది.

దీనిపై న్యాయవాదులు బౌట్‌ను ప్రశ్నించగా, "మా అందరికీ ఒకరే శత్రువు" అని జవాబిచ్చారు.

విక్టర్ బౌట్ సోవియట్ పాలనలో ఉన్న తజికిస్తాన్‌లో జన్మించిన రష్యా పౌరుడు. 1990లలో సోవియట్ యూనియన్ పతనం తరువాత ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగంతో ఆయన తన కెరీర్ ప్రారంభించారు.

'మర్చంట్ ఆఫ్ డెత్’

2007లో 'మర్చంట్ ఆఫ్ డెత్' పేరుతో రక్షణ రంగ నిపుణులైన డగ్లస్ ఫరా, స్టీఫెన్ బ్రాన్.. బౌట్‌పై ఒక పుస్తకం రాశారు.

1990ల ప్రారంభంలో కూలిపోతున్న సోవియట్ సామ్రాజ్యం ఎయిర్‌ఫీల్డ్‌లలో వదిలివేసిన సైనిక విమానాలను ఉపయోగించి బౌట్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని ఆ పుస్తకంలో రాశారు.

ఆ సమయంలో సోవియట్ యూనియన్‌కు చెందిన దృఢమైన ఆంటోనోవ్‌లు, ఇల్యుషిన్‌లను వాటి సిబ్బందితో పాటు అమ్మకానికి పెట్టారు.

అవి ప్రపంచంలో పలు విమానాశ్రయాలకు సరుకులు సరఫరా చేయడానికి అనువైనవి.

జైలుశిక్ష పడిన నాటికి బౌట్‌కు 45 ఏళ్లు. పలు కంపెనీల ద్వారా ఆఫ్రికాలో యుద్ధంతో నలిగిపోయిన ప్రాంతాలకు ఆయుధాలు సరఫరా చేసినట్టు విచారణలో వెల్లడైంది.

ఐక్యరాజ్య సమితి బౌట్‌ను మాజీ లైబీరియా అధ్యక్షుడు చార్లెస్ టేలర్‌కు సహచరుడిగా పేర్కొంది.

2012లో చార్లెస్ టేలర్‌, సియెర్రా లియోన్ అంతర్యుద్ధంలో యుద్ధ నేరాలను ప్రేరేపించారనే నేరం రుజువైంది. 

"బౌట్ ఒక వ్యాపారవేత్త, ఆయుధాల సరఫరాదారు. సియెర్రా లియోన్‌లో అనిశ్చితి నెలకొల్పడానికి, యుద్ధ వాతావరణాన్ని ప్రేరేపించడానికి మాజీ అధ్యక్షుడు చార్లెస్ టేలర్‌కు సహకరించాడు. అక్రమ మార్గంలో వజ్రాలను పొందేందుకు ప్రయత్నించాడు" అని ఐరాస పత్రాలలో పేర్కొన్నారు. 

బౌట్ మిడిల్ ఈస్ట్‌లో అల్-ఖైదాకు, తాలిబాన్లకు తుపాకులు అందించారన్న రిపోర్టులు వచ్చాయి.

అంగోలా అంతర్యుద్ధంలో రెండువైపుల వారికీ ఆయుధాలు అందించారని, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి సుడాన్, లిబియాలలో సైనికులకు, ప్రభుత్వాలకు ఆయుధాలను సరఫరా చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

2009లో బ్రిటన్‌లోని ఛానల్ 4కు ఇచ్చిన ఇనటర్వ్యూలో బౌట్.. అల్-ఖైదాకు, తాలిబాన్లకు ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలను ఖండించారు.

అయితే, 1990ల మధ్యలో అఫ్గానిస్తాన్‌కు ఆయుధాలు సరఫారా చేసిన విషయాన్ని అంగీకరించారు. కానీ, వాటిని తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమాండర్ల కోసం పంపానని చెప్పారు.

రువాండాలో మారణహోమం తరువాత, ఆ దేశానికి సరుకులను పంపేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వానికి సహకరించానని, అలాగే ఐరాస శాంతిపరిరక్షకుల బృందాన్ని కూడా తన విమానాలలో పంపించానని బౌట్ చెప్పారు.

బౌట్ కోసం వేట

2000 ప్రారంభం నుంచి బౌట్ కోసం వేట మొదలైంది. 2002లో బెల్జియంలో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగానే, ఆ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు.

ఆ తరువాత మారుపేర్లతో బౌట్ అనేక దేశాలు తిరిగారని అనుమానించారు. చివరకు 2003లో రష్యాలో కనిపించారు. 

అదే ఏడాది, బ్రిటిష్ విదేశాంగ శాఖ మంత్రి పీటర్ హెయిన్, బౌట్‌కు 'మర్చంట్ ఆఫ్ డెత్ ' అనే పేరు పెట్టారు. 

"తూర్పు ఐరోపా, ప్రధానంగా బల్గేరియా, మోల్డోవా, యుక్రెయిన్ మొదలుకొని లైబీరియా, అంగోలా వరకు పలు దేశాలకు గగనతలం ద్వారా ఆయుధాలను సరఫరా చేసిన మృత్యు వ్యాపారి. ఆయుధాల వ్యాపారులు, వజ్రాల బ్రోకర్లు, యుద్ధాలకు సహకరించే అక్రమ రవాణాలకు బౌట్ కేంద్ర బిందువన్న విషయాన్ని ఐరాస బయటపెట్టింది" " అని హెయిన్ పేర్కొన్నారు.

2000ల నుంచి అమెరికా బౌట్‌ను పట్టుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. 2006లో బౌట్ ఆస్తులను జప్తుచేసింది. కానీ, అమెరికాలో బౌట్‌కు శిక్ష వేయగల చట్టం ఏదీ లేదు. 

చివరికి, 2008లో అమెరికా ఏజెంట్లు ఫార్క్ సభ్యులుగా మారువేషం కట్టి, ఆయుధాలు కొనుగోలు చేసే నెపంతో బౌట్ మాజీ సహచరుడిని కలుసుకున్నారు.

అమెరికా అండర్ కవర్ ఏజెంట్లతో బౌట్ ఆయుధాల ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే థాయ్‌లాండ్ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు.

అప్పటి నుంచి బౌట్‌ను అమెరికా రప్పించడానికి సుదీర్ఘమైన చట్ట ప్రక్రియ నడిచింది.

రాజకీయ కుట్రలతో అమెరికా తనపై కేసు వేసిందని బౌట్ ఆరోపించారు.

బౌట్‌పై కేసు నడుస్తున్నంత కాలం ఆయన్ను రక్షించేందుకు రష్యన్ అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

బౌట్‌ను ఎలాగైనా రష్యాకు తీసుకువచ్చేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రతిజ్ఞ చేశారు.

థాయ్ కోర్టు తీర్పు"అన్యాయమని, రాజకీయమని" సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. 

2005లో బౌట్ జీవితం ఆధారంగా వచ్చిన 'లార్డ్ ఆఫ్ వార్' సినిమాలో చివరకు బౌట్ పాత్ర చట్టం నుంచి తప్పించుకుంటుంది.

కానీ, నిజ జీవితంలో బౌట్‌కు అది సాధ్యం కాకపోవచ్చని అందరూ అనుకున్నారు. వారి నమ్మకాలను వమ్ము చేస్తూ, 12 ఏళ్ల తరువాత బౌట్ జైలు నుంచి బయటికొచ్చి స్వదేశానికి పయనమయ్యారు. 

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)