You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గ్రహాంతర జీవులు భూమి మీద మనుషుల్ని గమనిస్తున్నాయా?
- రచయిత, జాన్ ఒకెల్లహాన్
- హోదా, బీబీసీ కోసం
గ్రహాంతర జీవుల (ఏలియన్స్) ఉనికిని గుర్తించేందుకు దశాబ్దాలుగా మనుషుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. శక్తివంతమైన రేడియో సిగ్నళ్లను అంతరిక్షంలోకి పంపుతూ వాటికోసం అన్వేషణ సాగిస్తున్నారు మానవులు.
ఈ అన్వేషణలో భాగంగా శాస్త్రవేత్తలు భూమి పరిమాణంలో ఉండే రెండు గ్రహాలను గుర్తించారు. దీనితోపాటు అంతరిక్షం నుంచి ఒక అంతు తెలియని సిగ్నల్ వచ్చిందని కూడా మనం విన్నాం. ఇవి తప్ప గ్రహాంతర వాసుల ఉనికిని ధృవీకరించే బలమైన ఆధారాలేవీ లభించలేదు.
అయితే, ఒకవేళ నిజంగానే గ్రహాంతర వాసులు ఉంటే? మనం చేస్తున్న ప్రయత్నాలు వాళ్లకి తెలిసి, వారు మనల్ని గమనిస్తే? భూమిపై జీవరాశి ఉందని వారికి తెలిసే అవకాశం ఉంటుందా? శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది.
“మనం నిరంతరాయంగా విశ్వంలోకి సిగ్నళ్లను పంపుతున్నామంటే, మన ఉనికిని అద్దంలో చూపిస్తున్నట్లే. ఒకవేళ వారు(ఏలియన్లు) మనల్ని చూస్తే, మనల్ని ఏమని గుర్తిస్తారు?” అని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన ఆస్ట్రో ఫిజిసిస్ట్ జాక్వలిన్ ఫాహెర్టీ ప్రశ్నించారు.
"మనం వారి కోసం చూస్తున్నామంటే, మనల్ని వారు కూడా చూసే అవకాశం ఉంటుంది కదా " అన్నారు.
మన ఉనికి తెలిసే ఉంటుందా?
ఇప్పటి వరకు గెలాక్సీలో 5500లకు పైగా గ్రహాలు, నక్షత్రాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని బాహ్య గ్రహాలు (ఎక్సో ప్లానెట్స్)గా పిలుస్తాం. కానీ ఈ సంఖ్య ఇంకా ఉంటుంది. మిల్కీ వే గెలాక్సీలో ట్రిలియన్ల కొద్దీ గ్రహాలు ఉండొచ్చని సైంటిస్టుల అంచనా.
బాహ్య గ్రహాల్లో జీవరాశి ఉనికి గురించి, అక్కడి సాంకేతికత మూలంగా వెలువడి, మన దిశగా ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా వచ్చిన రేడియో సిగ్నళ్ల ఆధారంగా కూడా అన్వేషణ కొనసాగిస్తున్నాం.
"భూమి 100 ఏళ్లుగా అంతరిక్షంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. ఇది 1900ల నుంచి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రేడియో ప్రసారాల్లో చోటు చేసుకున్న మార్పుల వరకు భూగ్రహ ఉనికిని చాటే పరిస్థితులు ఉన్నాయని " అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఖగోళ పరిశోధకులు హోవర్డ్ ఐజాక్‌సన్ అన్నారు .
"ఆ సమయంలో ప్రజల దగ్గర ఉన్న రేడియాల్లోని రిసీవర్లు అంత శక్తివంతమైనవి కానందున, పంపే రేడియో సిగ్నళ్లను శక్తివంతంగా పంపాల్సి వచ్చింది" అని అన్నారు.
టీవీ షో ల నుంచి మొదలుకొని శాటిలైట్ కమ్యూనికేషన్ల వరకు రేడియో తరంగాల ప్రసారాలపైనే ఆధారపడి పని చేస్తున్నాం. అయితే వీటిని అంతగా గుర్తించలేని పరిస్థితి ఉంది.
“రేడియో స్టేషన్లు కూడా తమ ప్రసారాలు అంతరిక్షంలోకి చేరాలని అనుకోవడం లేదు. నేలకు పరిమితమైతే చాలని అనుకుంటున్నాయి” అని అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ పరిశోధకులు థామస్ బియట్టీ అన్నారు.
అయితే, మొబైల్ సిగ్నళ్ల వంటివి బహుశా గుర్తించి ఉండొచ్చు. అయితే, అన్ని సిగ్నళ్లు గుర్తించేలా ఉండవు.
సౌర వ్యవస్థలో చాలా వ్యోమనౌకలు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ కదలికలను పరిశీలిస్తున్నాయి. బృహస్పతి, అంగారక గ్రహాలతోపాటు సూర్యూడికి దూరంగా ఉన్న గ్రహాలను కూడా అన్వేషిస్తున్నాయి.
నాసా వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ భూమికి 24 బిలియన్ కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై, అంతరిక్ష కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.
ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్‌సన్ “20 కిలోవాట్ల శక్తితో ప్రసారమయ్యే సిగ్నళ్లు అంతరిక్షంలోని ఇతర నక్షత్రాలను చేరగలవు” అని ఈ ఏడాది ఏప్రిల్‌లో అంచనా వేశారు.
2300 సంవత్సరం నాటికి భూమి నుంచి పంపే సిగ్నళ్లను 1000కి పైగా నక్షత్రాలు వినగలుగుతాయని అన్నారు.
2031 నాటికి భూమికి దగ్గరగా ఉండే గ్రహాలు, నక్షత్రాలు ఈ తరంగాలను విశ్లేషించి, తిరిగి భూమికి పంపేంతగా మెరుగుపడతాయని అన్నారు.
ఒకవేళ ఏలియన్లు మనల్ని గుర్తిస్తే?
ఒకవేళ గ్రహాంతర ఖగోళ పరిశోధకులు (ఏలియన్ ఆస్ట్రనామర్స్) గనుక శ్రద్ధతో ఉంటేగనుక, వారు మనం పంపే సిగ్నళ్లను రిసీవ్ చేసుకోవడానికి ముందే మన గురించి తెలుసుకునే అవకాశం ఉంది.
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తున్న సమయంలో వారు భూ గ్రహాన్ని చూసి ఉంటే గనుక, సూర్యరశ్మి భూగ్రహంపై పడినప్పుడు, వాతావారణం, పలు రకాల వాయువులను కూడా చూసి ఉండొచ్చు.
2021లో భూమికి 300 కాంతి సంవత్సరాలోపునే దాదాపు 2000 నక్షత్రాలు ఉన్నాయని ఫాహెర్టీ గుర్తించారు. ఇవన్ని 'ట్రాన్సిట్'ను చూడగలవని అన్నారు. ఇది ప్రపంచాల సమూహం అని ఫాహెర్టీ అన్నారు.
భూ గ్రహంపై జీవరాశి మనుగడ ఉందనడానికి ఆక్సిజన్, నైట్రోజన్, నీటి ఆవిర్లు సూచికలుగా ఉండే అవకాశం ఉందని యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోకెమిస్ట్ పాల్ రిమ్మెర్ చెప్పారు.
"స్థిర ద్రవరూపంలో ఉన్న సముద్రం కూడా సూచికనే" అన్నారు.
"నైట్రోజన్ డై ఆక్సైడ్ కూడా కొన్ని సంకేతాలను వదులుతుంది. ఈ వాయువు మండిచడం వలన వెలువడేది" అని స్పెయిన్‌లోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త హెక్టార్ సోకాస్-నవర్రో అన్నారు. దీని వలన వారికి మనం ఇక్కడ ఏదో మండిస్తున్నామని తెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఏరోసిల్స్, రిఫ్రిజిరెంట్స్ ఇతరత్రాల నుంచి ఉద్గారమయ్యే క్లోరోఫోరో కార్బన్లు కూడా మన గ్రహంపై పరిశ్రమల ఉనికిని తెలియజేస్తాయి.
“ఇలాంటివి కేవలం సాంకేతికతతోనే సాధ్యపడతాయి” అని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఖగోళ పరిశోధకులు మేసీ హట్సన్.
కేవలం రేడియో సిగ్నళ్లు, వాతావరణంలోని ఇతర కాలుష్య కారకాలే కాకుండా విద్యుద్దీపాలు కూడా మన ఉనికిని తెలిపేవే.
2021లో బియట్టీ విశ్లేషణను అనుసరించి దీపాల నుంచి వెలువడే సోడియం ఉనికిని వాతావరణంలో గుర్తించొచ్చు. “ఇది సహజమైన ప్రక్రియలో ఉత్పన్నం కాదు” అని బియట్టీ అన్నారు.
మన టెలిస్కోపుల నుంచి గుర్తించిన ప్రకారం, ప్రస్తుతం భూమిపై పట్టణికీకరణ గుర్తించదగ్గ రీతిలో అభివృద్ధి చెందలేదు. భూమిపై 1% కన్నా తక్కువ పరిధిలోనే నగరాలు ఉన్నాయి.
“ఇది ఇంకా వృద్ధి చెందాల్సి ఉంది. హాలీవుడ్ సినిమా స్టార్‌వార్స్‌లో చూపించినట్లుగా భూగ్రహం మొత్తం ఒకే నగరం (ఎక్యుమెనోపలీస్)గా మారాలి. లేదా అభివృద్ధి మరింతగా జరిగి, 2150 నాటికి ఇప్పుడు ఉన్న పరిస్థితితో పోల్చితే 10 రెట్లు పట్టణికీకరణ జరిగితే, మోడ్రన్ టెలిస్కోపుల్లో మన ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది” అని బియట్టీ అన్నారు.
“ఏలియన్ల పరిణామక్రమం వేగంగా, అభివృద్ధి చెందిన సాంకేతికతతో ఉన్నట్లైతే, వారి టెలిస్కోపుల ద్వారా ఈ పాటికే మనల్ని చూసి ఉంటారు. 100మీటర్ల అంతరిక్ష టెలిస్కోపును తయారు చేస్తే గనుక, దాని సాయంతో గ్రహాంతర ఖగోళ పరిశోధకులు మనల్ని చూడటానికి అవకాశం లేకపోలేదు” అన్నారు.
“ఒకవేళ వారి దగ్గర చిన్న టెలిస్కోప్ మాత్రమే ఉంటే, దాని సాయంతో చూస్తే, మన గ్రహం చిన్న బిందువు రూపంలో కనిపిస్తుంది. పరిభ్రమిస్తున్న భూ గ్రహం అవాసయోగ్యమైనది అని వారు గుర్తించే అవకాశం ఉంది. భూమి నుంచి వచ్చే కాంతి వలన భూగ్రహంలోని సముద్రాలు, భూమి, తీరప్రాంతాలతో కలిపి ఓ పటం వారికి కనిపించొచ్చు” అని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని ఆస్ట్రోఫిజిసిస్ట్ జొనాథన్ జియాంగ్ అన్నారు.
“కాంతిని నువ్వు గుర్తించినంత కాలం నువ్వు దానిని విశ్లేషించవచ్చు” అని జొనాథన్ జియాంగ్ అన్నారు.
“ఇవన్ని పరిశీలిస్తే, ఏలియన్లు మనల్ని గుర్తించాలని మనం నిజంగానే ప్రయత్నిస్తున్నామా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. కానీ మనం చూసే సినిమాల్లో చాలాసార్లు మనం ఏలియన్ల నుంచి ఆక్రమణలకు గురైనట్లుగానే చూస్తుంటాం” అన్నారు బియట్టీ.
వాస్తవానికి, శాస్త్రవేత్తలు మన ఉనికిని ఏలియన్లు గుర్తించాలని ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. విశ్వంలోకి సందేశాలు పంపుతున్నారు. 1974లో ప్రత్యేకంగా రూపొందించిన అరేసిబో రేడియో టెలిస్కోప్ ద్వారా అత్యంత శక్తివంతమైన రేడియో తరంగాలను విశ్వంలోకి పంపారు. ఈ తరంగాలు మానవ ఉనికి గురించి తెలిసేలా చేసేవి.
ఈ సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఎడింబరా యూనివర్సిటీలో ఖగోళ పరిశోధకులు బెత్ బిల్లర్ “నేను హాలివుడ్ చిత్రం ఇండిపెండెన్స్ డే తరహాలో ఏమీ జరగదని గట్టిగా అనుకుంటున్నాను” అన్నారు.
ఏలియన్లు మనల్ని గుర్తించడానికి ఏం చేయొచ్చు?
ఒకవేళ యుద్ధం, లేదా ఏ ఇతర కారణాల వలన గానీ, మానవజాతి అంతరించకుండా, భూమిపై మానవ మనుగడ కొనసాగితే గనుక అంతరిక్షంలో భూగ్రహం ఉనికి అంతరిక్షంలో గుర్తించదగినదిగా మారొచ్చు.
“ప్రస్తుతం మన భూమి చుట్టూ ఉన్న శాటిలైట్ల సమూహాలను గ్రహాంతర ఖగోళ పరిశోధకులు గుర్తించొచ్చు. కానీ అందుకు కొన్ని ఏళ్ల సమయం పట్టొచ్చు. ఇది ఎలాంటిదంటే, మనం ఒక్క కారు నుంచి మొదలుపెట్టి బిలియన్ల కార్లకు చేరుకునే క్రమం లాంటిది. కానీ బిలియన్ల కొద్దీ కార్లను చేరుకోవడానికి కొన్ని దశాబ్దాల సమయమే తీసుకున్నాం కదా” అన్నారు సోకాస్-నవార్రో.
ఇదిలా ఉంచితే, మనం తొలుత మనమే గ్రహాంతర వాసులను సంప్రదించాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి, అందుకోసం మనం ఇంకా చాలా ప్రయత్నాలు చేయాలి.
"వారు(ఏలియన్లు) మనల్ని గుర్తించేలా 'అరేసిబో' సందేశాల వంటివి పంపాలి. ఈ ప్రయత్నాలు పరిమితంగానే జరిగాయి. ఇలా అని నా అభిప్రాయం మాత్రమే కాబట్టి, నేను అంతరిక్షంలోకి సందేశం పంపి, ఏదైనా సమాధానం వస్తుందేమో అని ఆశిస్తాను" అని రిమ్మెర్ అన్నారు.
“ఒకవేళ ప్రజలు కూడా సానుకూలంగా ఉంటే గనుక, ఓ ఆలోచన చేయొచ్చు. అంతరిక్షంలో పెద్ద నిర్మాణాలను చేపట్టొచ్చు” అని బియట్టీ అన్నారు.
“ఒక పేద్ద గ్రహంలాంటి పరిమాణంలో త్రిభుజం, లేదా చతురస్రం ఆకారంలో సన్నటి కృతిమ పదార్థంతో నిర్మించాలి. ఇది ఏలియన్లకు కృతిమమైనదిగానే అనిపిస్తుంది. మనం ఒకవేళ గ్రహాంతర వాసుల దృష్టిని ఆకర్షించాలంటే, ఇది కచ్చితంగా ఉపయోగపడే ఆలోచనే” అన్నారు బియట్టీ.
ప్రస్తుతానికైతే అంతరిక్షంలో మన ఉనికి తెలిపే అవకాశాలు అంత ఎక్కువగా లేనప్పటికీ, గుర్తించదగినవే. “వారికేమీ అద్భుతాలు కనిపించాల్సిన అవసరం లేదు” అని సెటి ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ ఖగోళ పరిశోధకులు సెత్ షోస్తక్ అన్నారు.
“వారికి కూడా మన దగ్గర ఉన్నసాంకేతికత,పెద్ద స్థాయిలో కావాలి” అన్నారు.
ఇన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రశ్న మాత్రం అలాగే ఉంది. ‘ఇంతకీ ఎవరైనా మనల్ని గమనిస్తున్నారా?’
ఇవి కూడా చదవండి..
- స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై చదివితే మెదడుకు ఏమవుతుంది?
- ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ పర్యటనకు వస్తే స్కూల్స్ ఎందుకు మూసేస్తున్నారు?
- టెన్నిస్ ఆటగాళ్ల చేతి ఎముక మిగతా వారికంటే ఎందుకు పొడవు ఉంటుంది?
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)