You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
చంద్రుడి మీద ఇప్పుడు టైమెంత అంటే ప్రస్తుతానికైతే ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ, భూమి మీద ఉన్నట్లే అంతరిక్షంలో కూడా సమయం ఉంటుంది.
అయితే రానున్న రోజుల్లో అనేక దేశాలు చంద్రుడి మీద అడుగు పెట్టి, అక్కడ పని చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో చంద్రుడి మీద కూడా అధికారికంగా సమయాన్ని నిర్ణయించడం మంచిది కదా అనే దానిపై చర్చ జరుగుతోంది.
చంద్రుడి మీద అందరూ అంగీకరించిన అధికారిక సమయం ఉండటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ అంతరిక్ష పరిశోధన సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటోంది.
సమయంతో పాటు చంద్రుడికి సంబంధించిన మ్యాప్ తయారు చేయాలని.. చంద్రుడి మీద ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగేందుకు వీలుగా ప్రాంతాలను గుర్తించాలని ఆ సంస్థ చెబుతోంది.
ఈ దిశగా నాసాతో కలిసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పని చేస్తోంది.
ప్రస్తుతం చంద్రునికి సొంత టైమ్ జోన్ లేకపోవడం వల్ల అన్ని మిషన్లకు యూనివర్సల్ టైమ్(యూటీసీ)ను వాడుతున్నారు. అయితే రోజురోజుకు చంద్రుని మీదకు చేపట్టే మిషన్ల సంఖ్య పెరుగుతున్నందున యూటీసీ మీద ఎక్కువ కాలం ఆధారపడలేమని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటోంది.
స్పేస్‌క్రాఫ్ట్స్ వంటివి సమర్థవంతంగా పని చేయాలంటే కచ్చితమైన సమయం చాలా ముఖ్యం.
చంద్రుడి మీద ఇప్పుడు సమయం ఎందుకు లేదు?
చంద్రుడి కాలమానాన్ని ఏర్పాటు చేసేందుకు ఏదో ఒక అంతరిక్ష సంస్థ బాధ్యత తీసుకోవాలని యూరోపియన్ స్పేస్ అధికారులు చెబుతున్నారు.
చంద్రుడి కాలమానాన్ని నిర్ణయించడంలో భూమి మీద ఏదో ఒక దేశం సమయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా లేక దాన్ని మరెక్కడా వీలు లేకుండా చంద్రుడికి మాత్రమే పరిమితం చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
చందమామ మీద గడియారాలు భూమి కంటే కాస్త వేగంగా తిరుగుతాయి కాబట్టి అక్కడ సమయాన్ని గణించడం కాస్త ఇబ్బందికరమైన వ్యవహారం.
భూమి మీద 24 గంటలతో పోల్చి చూస్తే చంద్రుడి గడియారం 56 మైక్రో సెకన్లు ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండటమే దీనికి కారణం.
అందుకే చంద్రుడి మీదకు వెళ్లే వ్యోమగాములు తమ అపాయింట్‌మెంట్స్‌ను ముందుకు జరుపుకోవడానికి ఇదే కారణం కావచ్చు. భూమి మీద ఉన్న టైమ్ జోన్లను చంద్రుడి మీద అనుసరించడం సరికాకపోవచ్చు.
టైమ్ జోన్ అంటే ఏమిటి?
మెరీడియన్స్ అని పిలిచే ఊహాజనిత రేఖల ఆధారంగా భూమి మీద ప్రాంతాలను కొన్ని టైమ్ జోన్లుగా విభజించారు. అవి సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వరకూ ఉన్నాయి.
లండన్‌కు సమీపంలోని గ్రీనిచ్ గుండా వెళ్లే రేఖాంశం ఆధారంగా నిర్ణయించిన సమయాన్ని గ్రీనిచ్ ప్రామాణిక సమయం లేదా జీఎంటీ అంటున్నారు.
భూమి మీద ఒక రోజుని 24 గంటలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖకు తూర్పు వైపున ఉన్న దేశాల సమయం బ్రిటన్ కంటే ముందు ఉంటుంది.
పశ్చిమాన ఉన్న దేశాల సమయం బ్రిటన్ కంటే వెనుక ఉంటుంది. భారత దేశపు ప్రామాణిక సమయం గ్రీనిచ్ రేఖ కంటే ఐదున్నర గంటల ముందుంది.
చంద్రుడి మీద ప్రామాణిక సమయాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల.. రానున్న రోజుల్లో మార్స్ సహా ఇతర గ్రహాల మీద జరిపే పరిశోధనల్లోనూ ఇలాంటి విధానాన్ని ఆచరించవచ్చని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త బెర్న్‌హార్డ్ హుఫెన్‌బాచ్ అన్నారు.
దీని వల్ల చంద్రుడి ఉపరితలం మీద పని చేసే వ్యోమగాములకు ఇది ప్రాక్టికల్‌గా ఉంటుందని చంద్రుడి మీద ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రుడి మీద ఒక రోజు భూమి మీద సుమారు 28 రోజులకు సమానం. అంతే కాకుండా చంద్రుడి మీద రెండు వారాల పాటు ఉండే గడ్డకట్టించే శీతల రాత్రుల వంటి వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు.
అయితే చంద్రుని మీద టైమ్ జోన్‌కు సంబంధించి అనేక ప్రశ్నలు కూడా ఉన్నాయి. చంద్రుని టైమ్ జోన్‌ను భూమితో అనుసంధానించాలా? లేక దాన్ని ఇండిపెండెంట్‌గా ఉంచాలా? అనేది ముందుగా నిర్ణయించాల్సి ఉంటుంది.
50 ఏళ్లలో తొలిసారిగా చంద్రుడి మీదకు మనిషిని తీసుకెళ్లే మిషన్‌ను 2025లో ప్రయోగించడానికి నాసా షెడ్యూల్ రూపొందించింది.
అర్టెమిస్ మిషన్‌తో అమెరికా నుంచి మొదటిసారి మహిళను చంద్రుడి మీదకు పంపనున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)