You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ఓ మై గాడ్, అది భూమి'.. ఉచితంగా స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన తల్లీకూతుళ్ల అనుభవాలు
- రచయిత, అమండ రగ్గెరి
- హోదా, బీబీసీ ట్రావెల్
దశాబ్దం కిందటి వరకూ స్పేస్ టూరిజం ( అంతరిక్ష పర్యాటకం) అంటే ఎప్పటికో భవిష్యత్తులో జరుగుతుందేమో అనుకునేలా ఉండేది. కానీ, ఇటీవల జరిగిన సంఘటనలతో ప్రపంచ పర్యాటకానికి తదుపరి గమ్యం స్పేస్ టూరిజమేనేమో అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి.
వర్జిన్ గెలాక్టిక్ సంస్థఆగస్టులో తన తొలి స్పేస్ టూరిజం మిషన్‌లో పర్యాటకులను రోదసిలోకి తీసుకెళ్లింది. ఒక్కో టిక్కెట్ ధర 4,50,000 డాలర్లు (అంటే దాదాపు 3.7 కోట్ల రూపాయలు). కానీ, లాభాపేక్ష లేని స్పేస్ ఫర్ హ్యుమానిటీ సంస్థ 1.7 మిలియన్ డాలర్ల ప్రోగ్రామ్‌లో భాగంగా కొందరు అదృష్టవంతులు ఉచితంగా అంతరిక్షంలోకి వెళ్లే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.
ఆ అదృష్టవంతుల్లో కీషా షాఫ్, అనా మేయర్స్ కూడా ఉన్నారు. రోదసిలోకి వెళ్లి వచ్చిన తొలి తల్లీకూతుళ్లు కూడా వీరే. అంటిగ్వాకు చెందిన వీరిద్దరూ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి కరీబియన్ మహిళలుగానూ నిలిచారు. ఈ అంతరిక్ష నౌకలో రోదసిలోకి వెళ్లిన వారిలో మహిళలే ఎక్కువ.
ఈ చరిత్రాత్మక ప్రయాణం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కీషా, అనాతో బీబీసీ ట్రావెల్ మాట్లాడింది. అంతరిక్షంలోకి వెళ్లడం ఎలా అనిపించింది, ఈ ప్రయాణం జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది, భూమిని ఎలా చూస్తారు వంటి విషయాలపై వారితో చర్చించింది.
స్పష్టత, సులభంగా అర్థమవడం కోసం ఈ ఇంటర్వ్యూను ఎడిట్ చేసి, మీకు అందిస్తున్నాం.
కీషా, మీరు ఈ అవకాశం కోసం పోటీ పడ్డారని విన్నాం, ఎందుకు?
నాకు చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలనే కోరిక ఉండేది. అది నన్ను విడిచిపెట్టలేదు. నేను ఎప్పటికైనా చేయాలనుకునే వాటిలో ఇదొకటి. ఆ నీలి ఆకాశంలోకి ఎలా వెళ్లాలో, భూమిని వదిలి నిశీధిలాంటి అంతరిక్షంలోకి ఎలా వెళ్లాలో నాకు తెలియదు.
మరి ఇదెలా జరిగింది?
నేను వర్జిన్ గెలాక్టిక్ విమానంలో అంటిగ్వా నుంచి బార్బడోస్ వెళ్తున్నా. అప్పుడు నా కూతురు కూడా నాతో ఉంది. అప్పుడు మీరు అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటున్నారా అనే రిచర్డ్ బ్రాన్సన్ ప్రకటన చూశాను. నేను అవునని చెప్పాను. లాటరీ ఫాం నింపాను.
కొద్ది వారాల తర్వాత ఆశ్యర్యకరంగా హోం ఆఫీస్, ఆస్ట్రోనాట్ ఆఫీస్, అలాగే వర్జిన్ గెలాక్టిక్ ఆఫీస్ నుంచి సంప్రదింపులు జరిగాయి. ఆ లాటరీలో నాకు అవకాశం వచ్చిందని చెప్పారు.
ఆ తర్వాత రిచర్డ్ బ్రాన్సన్ పెద్ద టీంతో ఇంటికి వచ్చి ''మీరు అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు'' అని చెప్పారు.
అనా, దీని గురించి మీరేమనుకుంటున్నారు?
అది నిజమేనని రిచర్డ్ బ్రాన్సన్ నాకు చెప్పకముందు, మా అమ్మ మోసపోయిందని అనుకున్నా. కానీ, అది నిజమేనని తెలిసిన తర్వాత, అంతరిక్షంలోకి వెళ్లబోతున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది.
కీషా, మీరు మీ కూతురిని ఎందుకు తీసుకెళ్లాలనుకున్నారు?
మొదట అనుకుంది ఆమెను కాదు. నా భర్తతో వెళ్దామనుకున్నా. కానీ ఆయన రానన్నారు. ఆ సమయంలో మా అమ్మాయికి అంతరిక్షంలోకి వెళ్లాలనే ఆసక్తి ఉందని కూడా తెలియదు. 'అమ్మా, ఇది నిజంగా జరిగితే, నేను నీతో అంతరిక్షంలోకి వస్తాను' అని నా కూతురు నాతో చెప్పేంత వరకూ నేను ఒంటరిగానే వెళ్తున్నానని అనుకున్నా.
అంతరిక్షంపై మీ అంచనాలేంటి? అక్కడ ఎలా ఉంది?
అనా: నాకు ఎలాంటి అంచనాలు లేవు. ఏదైనా జరగొచ్చని అనుకున్నా.
కీషా: నేను అసలు అంతరిక్షం అంటే ఏంటి? అక్కడ ఏముంది? అనే ఆసక్తితో ఉన్నా. సైన్స్, అంతరిక్షం ఫోటోలు, మీడియాలో చూపించేవి, అలాగే సినిమాల వల్ల అంతరిక్షం అంటే ఏంటో ఒక ఆలోచన ఉండేది. అది మన మనసులలో ఒక ఊహాజనిత ప్రదేశాన్ని సృష్టిస్తుంది. అంతరిక్షం అంటే ఇలా ఉంటుంది అనే ఒక ఊహ ఉంటుంది.
అయితే, వాస్తవానికి ఎలా ఉంది?
కీషా: ఒక గ్రహం నుంచి బయటికి వెళ్లడం చాలా గొప్పగా అనిపించింది. అదో గొప్ప సాహసంగా ఉంది. అక్కడి నుంచి భూమిని చూడడం, మీకు కనిపించే అతిపెద్ద ప్రదేశం అదే.
మీరు ఊహించినట్టే ఉందా, లేదా అంతకంటే ఎక్కువనా?
కీషా: అంతకుమించి, అంతకుమించి ఉంది. అది వర్ణించేందుకు నా దగ్గర మాటల్లేవు. నేను ఎలా ఫీలయ్యానో చెప్పేందుకు నాకు పదాలు కావాలి. గొప్ప అనుభవం.
అనా, అక్కడ మీకు ఎలా అనిపించింది?
అనా: అంతా నిశ్శబ్దం అయిపోయింది. నాకు పెద్దగా అంచనాలు లేవు. ఒకవిధంగా చెప్పాలంటే అంచనాలు కూడా మించిపోయాయి. భూమి ఎలా ఉంటుందోనని షాక్ అవలేదు. కానీ, చాలా దూరం నుంచి అది ఎలా ఉంటుందో చూసి, దాని వెలుగును, నా సొంత కళ్లతో చూసి షాకయ్యాను.
మీరు భూమి వైపు చూసినప్పుడు షాక్ కాకుండా ఇంకేమనిపించింది?
అనా: మొదటిసారి కిటికీ లోనుంచి చూడడానికి చాలా భయమేసింది. ''ఓ మై గాడ్ - అది భూమి'' అనిపించింది. చాలా పెద్దగా కనిపించింది.. అసలు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆ ఫుటేజీలో కూడా, నేను నా సీట్ బెల్టుని పట్టుకుని ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని ప్రయత్నిస్తున్నట్లు మీకు కనిపిస్తుంది. ఎందుకంటే అది 'వావ్' అంతే. అస్సలు నమ్మలేకపోతున్నా. నాకేమీ అనిపించలేదు. భయం లేదు, కానీ చాలా అయోమయంగా అనిపించింది. 'ఓ మై గాడ్' అనే ఫీలింగ్ నిజంగా అనిపించింది. ఏంటీ..? ఇది భూమి? అనిపించింది. ఒక్కసారిగా ఏదో జరిగిపోయినట్టు ఉంది. కానీ, అంతా ప్రశాంతంగానే జరిగింది.
కీషా: నాకు, అది ప్రశాంతమైన ప్రదేశంగా అనిపించింది. స్వేచ్ఛా ప్రదేశం, ఏదో బంధం. అయితే, నా భయం ఏంటంటే అది చూసినప్పుడు నా కూతురు భయపడుతుందా? లేక ఎలా స్పందిస్తుందనేదే. ఎందుకంటే అది నా బాధ్యత. కానీ, ఆమె చాలా ధైర్యంగా ఉంది. అంతరిక్షం ఒక ఆధ్యాత్మిక సంబంధం, ఆధ్యాత్మిక ప్రదేశం. నేను చాలా సంతోషించాను. నాతో పాటు నా కూతురు వాటన్నింటినీ చూడగలగడం ఇంకా సంతోషం కలిగించింది.
ఇలాంటి పెద్ద సంఘటన జరిగింది, మీకు ఎలా అనిపించింది, దీని గురించి ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకున్నారా?
అనా: దాని గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. ఎందుకంటే, మా ఇద్దరికీ కలిగిన అనుభూతులు వేర్వేరుగా ఉండే అవకాశముంది. మా ఇద్దరికీ అవి వేర్వేరుగా అనిపించొచ్చు. అవి మా ఇద్దరికీ ఒకేలా కనిపించకపోయి ఉండొచ్చు. కానీ, అది మా ఇద్దరినీ చాలా దగ్గర చేసిందని అనుకుంటున్నా. మేం ఇద్దరం కలిసి ఏదైనా నిజాయితీగా మాట్లాడుకోవచ్చు. మేం మంచి స్నేహితులం. ఇది మా మధ్య బంధాన్ని బలపరిచిందని నేను నిజాయితీగా అనుకుంటున్నా.
ఒక వ్యక్తిగా మీపై ఎలాంటి ప్రభావం చూపించింది?
కీషా: ఎక్కడికో చాలా లోతుకు తీసుకెళ్లినట్లు అనిపించింది. అంతరిక్షంలోకి వెళ్లే కొద్దీ మీరు ఎంత లోతుగా వెళ్లారని భావిస్తారో మీరు అంత ఆస్వాదిస్తారు. కాబట్టి, నేను, అనాతో కలిసి ఎలాంటి భయాలు లేకుండా అంతరిక్షాన్ని ఆస్వాదించాను. ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఏం జరుగుతుంది లాంటివేవీ పట్టించుకోలేదు. అవన్నీ వదిలిపెడితే, ఇప్పుడైనా మీ పిల్లలతో కూడా మీ బంధం మరింత మెరుగుపడుతుంది.
మీరిద్దరూ భూమిని ఎలా చూస్తున్నరనే దానిపై ఇది ప్రభావం చూపిందా?
అనా: అక్కడ ఏదో ఉంది అంతే. ఇదే నా ఇల్లు, ఇక్కడే ఉండాలి, ఇవన్నీ నాకు గుర్తున్నాయి. కానీ, నేను భూమిని చూసేటప్పుడు అలాంటి ఆలోచన కాస్త తక్కువగా అనిపించింది. నాకు పర్యావరణం అంటే ఆసక్తి, కానీ, ఇది నాకు చాలా పెద్ద విషయం. నేను భూమిని చూశాను. మనం దీనిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని అనిపించింది. భూమిని అభినందిస్తున్నాను.
కీషా: మీరు మీ గ్రహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చాలా మంది దగ్గర విన్నాం. చాలా మంది దీని గురించి చెబుతుంటారు. నేను కూడా, అంటిగ్వా ఐలండ్‌లో బీచ్‌లు శుభ్రంగా ఉంచుకోవాలి.. అలా చెబుతుంటాను. కానీ, బయటి నుంచి భూమిని చూసినప్పుడు దానితో నాకు ఇంకా ఎక్కువ సంబంధముందని అనిపించింది. ఈ జీవితంలో మనం తీసుకునే విషయాలు చాలా చిన్నవి, అసలు వాటిని పట్టించుకోవాల్సిన పనేలేదు. ఎందుకంటే, ఈ అంతులేని విశ్వంలో మనం ఒక చిన్న చుక్క మాత్రమే.
మీ అనుభవాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే?
అనా: ఒకటుంది. ఇది మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది. మీకు హద్దులు లేనట్టుగా అనిపిస్తుంది.
కీషా: గతంలో అందరిలో ఐక్యత ఉండాలని అనిపించేది. కానీ ఇప్పుడు అది 'శాంతి'గా మారింది.
ఇవి కూడా చదవండి:
- రాకేశ్ శర్మ అంతరిక్ష యానానికి ఎలా ఎంపికయ్యారు? ఆయన అనుభవాలు ఏమిటి?
- చంద్రయాన్-3: ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు కీలకమైన చివరి 15 నిమిషాల్లో ఇస్రో ఏం చేసింది?
- చంద్రయాన్-3 విజయం వెనుక ఉన్న కీలక శాస్త్రవేత్తలు ఎవరంటే...
- ‘శివ శక్తి, తిరంగా’ పేర్లకు ఐఏయూ ఒప్పుకుంటుందా? చంద్రుడిపై ప్రదేశాలకు పేర్లు ఎలా పెడతారు?
- చంద్రయాన్ -3: ఇస్రోకు ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటి వరకు ఏం సమాచారం ఇచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)