You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కొత్త జైలు: అనుమానితులకు గుండు గీసి, పచ్చబొట్లు వేసి, కాళ్లూ చేతులకు గొలుసులతో ఎందుకు తరలిస్తున్నారు?
ఎల్ సాల్వడార్‌లో కొత్తగా నిర్మించిన భారీ జైలుకు మొదటి విడతగా వివిధ ముఠాలకు చెందిన 2000 మందిని తరలించారు.
నేరాలపై యుద్ధం చేస్తానని చెప్పుకొంటున్న ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలె ఈ జైలును నిర్మించారు.
దేశంలో హత్యలు, ఇతర నేరాలు పెరిగిపోవడంతో అత్యయిక పరిస్థితి విధించి, నేర ముఠాలలో తిరిగే వేలాదిమందిని చుట్టుముట్టారు పోలీసులు.
కొత్తగా కట్టిన ఈ జైలులో 40,000 మంది ఖైదీలను ఉంచొచ్చు.
దేశవ్యాప్తంగా అరెస్ట్ చేస్తున్న నేరస్తులు, అనుమానితులను ఈ జైలుకు తరలిస్తున్నారు. వందలాది మంది చెప్పుల్లేకుండా, కాళ్లకు చేతులకు గొలుసులతో, ఒంటిపై పచ్చబొట్లతో నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
మరికొందరికి గుండు కొట్టించి, చేతులు మెడపై వెనక్కు పెట్టించి, కిక్కిరిసిన ప్రదేశంలో ఒకరి పక్కన మరొకరిని కూర్చోబెట్టిన ఫొటోలూ కనిపిస్తున్నాయి.
శనివారం పొద్దున్నే 2000 మంది నేరస్తులు, ఉగ్రవాదులను ఈ కొత్త జైలుకు తరలించినట్లు అధ్యక్షుడు బుకెలె ప్రకటించారు.
అమెరికా ఖండాల్లోనే ఇంత పెద్ద జైలు ఎక్కడా లేదని ఆయన చెప్పారు.
‘ఈ జైలే వారి కొత్త ఇల్లు. ఇక్కడే వారు కొన్ని దశాబ్దాల పాటు ఉండబోతున్నారు. ప్రజలకు వాళ్లిక ఎలాంటి హాని చేయలేరు’ అన్నారు.
ఎల్ సాల్వడార్ రాజధాని సాన్ సాల్వడార్‌కు ఆగ్నేయంగా 74 కిలోమీటర్ల దూరంలోని టెకోలుకాలో నిర్మించిన ఈ భారీ జైలులో 8 భవనాలున్నాయి.
ఒక్కో బిల్డింగులో 32 పెద్ద గదులుంటాయి.
ఒక్కో గది వంద చదరపు మీటర్ల (1076 చదరపు అడుగులు) వైశాల్యం ఉంటుంది.
ఒక్కో గదిలో 100 కంటే ఎక్కువ మంది ఉండొచ్చని ప్రభుత్వం చెప్తోంది.
అయితే, ఒక్కో గదికి రెండు టాయిలెట్లు, రెండు సింక్‌లు మాత్రమే ఉంటాయి.
ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు బుకెలె గత ఏడాది మార్చిలో ముఠాలు, నేరాలపై యుద్ధం ప్రకటించారు. అందులో భాగంగా ఆయన అత్యవసర చర్యలకు ఆదేశించారు.
ఇందులో భాగంగా అధికారులు, పోలీసులకు కల్పించిన అత్యవసర అధికారాలపై విమర్శలు చెలరేగాయి. రాజ్యాంగ హక్కులకు స్థానం లేకుండా అధికారాలున్నాయన్న విమర్శలు వచ్చాయి.
భద్రతా బలగాలకు అనుమానం వస్తే చాలు, ఈ అత్యవసర అధికారాలతో ఎవరినైనా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు.
ఈ అత్యవసర డ్రైవ్‌లో ఇప్పటివరకు 64 వేల మందిని అరెస్ట్ చేశారు.
ఎంఎస్-13, బారియో-18 వంటి క్రిమినల్ గ్యాంగ్స్ అక్కడ వేలాది హత్యలు, దోపిళ్లు, డ్రగ్స్ సరఫరా వంటి నేరాలకు కారణమని ప్రభుత్వం చెప్తోంది.
గ్యాంగ్‌లను పూర్తిగా లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ విధానంలో అమాయకులు కూడా అరెస్ట్ అవుతున్నారని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. అరెస్టయినవారిలో ఎంతోమందిని క్రూరంగా, అమానుషంగా, అవమానకరంగా హింసించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అయితే, బుకెల్ చేపట్టిన ఈ యాంటీ గ్యాంగ్ డ్రైవ్‌కు మాత్రం ప్రజల్లో ఆదరణ లభిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)