You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మెక్సికో: 'ఏలియన్స్'కు ల్యాబ్‌లో పరీక్షలు, ఫోరెన్సిక్ నిపుణులు ఏం తేల్చారు?
గ్రహాంతర వాసులవని చెబుతున్న వింత అవశేషాలపై మెక్సికో ల్యాబ్‌లో వైద్యులు పరిశోధనలు జరుపుతున్నారు.
గత వారం మెక్సికోలో 'గ్రహాంతర వాసుల అవశేషాలు'గా చెబుతూ రెండు వింత వస్తువులను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
జర్నలిస్టు, తనకు తాను యూఎఫ్‌వో(అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్) నిపుణుడిగా చెప్పుకునే జైమ్ మౌసాన్ మెక్సికో పార్లమెంట్‌లో ఈ రెండు అవశేషాలను చూపించారు. వాటి ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
మెక్సికో జర్నలిస్ట్‌లకు ఈ అవశేషాల గురించి జైమ్ మౌసాన్ వివరించారు.
వీటిని 2017లో పెరూలోని కుస్కోలో గుర్తించినట్లు ఆయన చెప్పారు. రేడియోకార్బన్ టెస్ట్ చేయగా ఆ రెండు 1,800 ఏళ్ల కిందటివని తేలిందని వివరించారు.
అయితే వాటిని చాలా మంది కొట్టిపారేశారు. ఇదంతా కట్టుకథగా అభివర్ణించారు. చాలా మంది నవ్వుకున్నారు కూడా.
తాజాగా మిలటరీ డాక్టర్, ఫోరెన్సిక్ నిపుణుడైన జోస్ డి జీసస్ జల్సే బెనితేజ్ ఆధ్వరంలో ఈ రెండు ‘అవశేషాల’కు ల్యాబ్‌లో పరీక్షలు జరిగాయి.
ఏలియన్స్ అవశేషాలుగా చెబుతున్న ఈ రెండింటికి సీటీ స్కానింగ్, ఎక్స్ రే తదితర టెస్టులు చేశారు.
ఈ అవశేషాలు రెండూ ఒకే రకానికి చెందిన అస్థి పంజరాలని, తయారుచేసినవి కావని బెనితేజ్ తెలిపారు.
ఈ పరీక్షలను పరిశీలించడానికి జర్నలిస్టులనూ పిలిచారు.
అవి మానవుల మమ్మీ అవశేషాలు: శాస్త్రవేత్తలు
ఈ అవశేషాల విశ్వసనీయతపై శాస్త్రవేత్తల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఏలియన్స్ అవశేషాలు కావని, మానవుల మమ్మీ అవశేషాలని శాస్త్రవేత్తలు చెప్పారు.
వీటి డేటాను ఎందుకు బహిరంగపరచలేదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) సైంటిస్ట్ డాక్టర్ డేవిడ్ స్పెర్గెల్ గత వారమే ప్రశ్నించారు.
ప్రపంచ శాస్త్రవేత్తలకు ఈ శాంపిళ్లను ఇవ్వాలని, అప్పుడు వీటిలో ఏముందో తాము పరిశీలిస్తామని డేవిడ్ స్పెర్గెల్ అన్నారు.
అమెరికా కాంగ్రెస్‌లో ఈ ఏడాది జులైలో యూఎఫ్‌వోల గురించి అక్కడి అధికారులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన అనంతరం మెక్సికోలో ఈ అవశేషాలు బయటికి రావడం చర్చనీయాంశమైంది.
ఇదే సమయంలో నాసా విడుదల చేసిన యూఎఫ్‌వో నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది.
అన్-ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్‌వో)లపై నాసా జరిపిన సుదీర్ఘ పరిశోధనలలో గ్రహాంతరవాసులు ఉన్నట్లు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు దొరకలేదని తేలింది.
అలా అని గ్రహాంతర జీవులు లేవని కొట్టిపారేయలేమని, అయితే ఆధారాలు ఇంతవరకు దొరకలేదని చెప్పింది.
ఇవి కూడా చదవండి
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎదురయ్యే అడ్డంకులు ఇవే...
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)