"మేం దానిని బంతి అనుకున్నాం"- బాంబులు ఇక్కడి పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి, వికలాంగులుగా మారుస్తున్నాయి

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్, నుపుర్ సోనార్, తనుశ్రీ పాండే
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్, పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌లో గడిచిన మూడు దశాబ్దాలలో నాటు బాంబుల కారణంగా 565 మంది గాయపడటం, వికలాంగులుగా మారడం, లేదా చనిపోవడమో జరిగిందని బీబీసీ ఐ పరిశోధనలో తేలింది.

ఈ ప్రాణాంతక ఆయుధాలకు, పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింసతో ఉన్న సంబంధం ఏమిటి? అనేక మంది బెంగాలీ చిన్నారులు ఎందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది?

1996 మేలో మండు వేసవి ఉదయం పూట పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఒక మురికివాడకు చెందిన ఆరుగురు బాలురు ఇరుకైన సందులో క్రికెట్ ఆడటానికి బయటికి వచ్చారు.

జోధ్‌పూర్ పార్కు సమీపంలోని బస్తీలో సందడి వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆ రోజు సెలవు.

ఆ పిల్లల్లో ఒకరైన 9 ఏళ్ల పుచు సర్దార్, క్రికెట్ బ్యాట్ పట్టుకుని నిద్రపోతున్న తన తండ్రిని దాటుకుని నిశ్శబ్దంగా బయటికి వచ్చాడు. ఆ తరువాత బంతిని బ్యాటుతో కొట్టిన శబ్దం ఆ వీధి అంతటా ప్రతి ధ్వనించింది.

ఒక బంతిని బౌండరీ అవతలకు కొట్టడంతో అది సమీపంలోని చిన్న గార్డెన్‌ దగ్గర పడింది. దీంతో వారంతా ఆ బాల్ వెతకడానికి వెళ్లారు. అక్కడ ఒక నల్లని ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఆరు గుండ్రటి వస్తువులను గుర్తించారు.

అవి ఎవరో వదిలిపెట్టిన క్రికెట్ బంతుల్లా కనిపించాయి. దీంతో వాటితో ఆడుకుందామని తీసుకువచ్చారు.

ఆ బ్యాగ్‌లోని ఒక బంతిని వేయగానే పుచు తన బ్యాట్‌తో కొట్టాడు. వెంటనే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఎందుకంటే అది బంతి కాదు, బాంబు.

వెంటనే పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల ఉన్నవారంతా హుటాహుటిన అక్కడికి వచ్చారు. పుచు, ఇంకా ఐదుగురు బాలురు వీధిలో పడిపోయి ఉండటాన్ని వారు చూశారు. ఆ పిల్లల చర్మం నల్లగా మారిపోయింది. బట్టలు కాలిపోయాయి. తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద పెద్ద అరుపులతో అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ ప్రమాదంలో 7 ఏళ్ల రాజుదాస్, గోపాల్ బిస్వాస్‌ చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. రాజుదాస్ ఒక అనాథ, తన ఆంటీ దగ్గర పెరిగాడు.

పుచు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఛాతి, ముఖం, పొట్టపై తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో, నెలకు పైగా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇంటికి తిరిగి వచ్చాక శరీరంలోనే మిగిలి ఉన్న పదునైన ముక్కలను తొలగించేందుకు వంట గదిలో ఉండే పట్టుకార్లను ఉపయోగించారు. ఎందుకంటే పుచుకు మరింత మెరుగైన వైద్యం అందించే స్తోమత వారి కుటుంబానికి లేదు.

పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దాలుగా ఆధిపత్యం కోసం జరుగుతున్న హింసాత్మక రాజకీయపోరాటంలో బాంబుల వల్ల మరణించిన లేదా వికలాంగులైన పిల్లల జాబితాలో పుచు, ఆయన స్నేహితులు ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఈ నాటుబాంబుల దాడులలో మృతి చెందిన పిల్లల సంఖ్య బహిరంగంగా అందుబాటులో లేదు.

దీంతో, ఆ రాష్ట్రంలోని ప్రముఖ దినపత్రికలైన ఆనంద బజార్ పత్రిక, వర్తమాన్ పత్రికలను 1996 నుంచి 2024 మధ్యలోని ప్రతి ఎడిషన్‌నూ బీబీసీ పరిశీలించింది. ఈ రకమైన బాంబు దాడుల్లో చనిపోయిన పిల్లల గురించి అన్వేషించింది.

అలా ఈ నవంబర్ 10 నాటి వరకు చూస్తే, బాధితులుగా 565 మంది చిన్నారులు ఉండగా, వారిలో 94 మంది చనిపోయారు. 471 మంది గాయాల పాలయ్యారు. ఈ లెక్కన చూస్తే సగటున ప్రతి 18 రోజులకు ఒక చిన్నారి ఈ బాంబుల బారినపడ్డారు.

అంతేకాదు, ఈ రెండు ప్రధాన పత్రికలు రిపోర్టు చేయని ఘటనలను కూడా బీబీసీ గుర్తించింది. దీనిని బట్టి చూస్తే, ఈ బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు.

ఇందులో 60 శాతానికిపైగా ఘటనలు.. పిల్లలు ఆడుకునే బహిరంగ ప్రదేశాలు, పార్కులు, వీధులు, పొలాలు, పాఠశాలల దగ్గరలో జరిగాయి. ఎన్నికల వేళ ప్రత్యర్థులను భయపెట్టడానికి ఉపయోగించే బాంబులను ఆయా ప్రదేశాల్లో దాచి ఉంచారు.

బీబీసీతో మాట్లాడిన బాధితుల్లో చాలా మంది పేదలు, వ్యవసాయ కార్మికుల పిల్లలు, కూలీ పనులకు వెళ్లేవారి పిల్లలు, ఇళ్లలో పనిచేసేవారి పిల్లలు ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో బాంబుల చరిత్ర

పది కోట్లకుపైగా జనాభాతో దేశంలో నాల్గవ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్ సుదీర్ఘకాలంగా రాజకీయ హింసతో సతమతమవుతోంది.

స్వాతంత్య్రం అనంతరం ఈ రాష్ట్రాన్ని వివిధ పార్టీలు పాలించాయి. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత మూడు దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌ పాలించింది. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

1960ల చివరలో మావోయిస్టులు (నక్సలైట్లు), ప్రభుత్వ బలగాల మధ్య సాయుధ పోరాటంతో రాష్ట్రం అతలాకుతలమైంది.

అప్పటి నుంచి అన్ని ప్రభుత్వాలు, తిరుగుబాటుదారులు ప్రత్యర్థులను బెదిరించడానికి బాంబులను ఒక సాధనంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో వీటిని ఎక్కువగా వాడుతున్నారు.

"ప్రతీకారం తీర్చుకోవడానికి బాంబులను ఉపయోగించేవారు. బెంగాల్‌లో 100 సంవత్సరాలకుపైగా ఇలా జరుగుతోంది" అని పశ్చిమ బెంగాల్‌కు చెందిన మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ పంకజ్ దత్తా బీబీసీతో చెప్పారు.

బెంగాల్‌లో బాంబుల తయారీకి మూలాలు 1900 తొలినాళ్లలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్ల నుంచే కనిపిస్తాయి.

తొలినాళ్లలో ఈ బాంబుల తయారీలో భాగంగా పరీక్షించేటప్పుడు ప్రమాదాలు సర్వ సాధారణంగా జరిగేవి. ఒక తిరుగుబాటుదారు తన చేతిని కోల్పోగా, మరొక తిరుగుబాటుదారుడు బాంబును పరీక్షించే క్రమంలో చనిపోయారు.

ఒక తిరుగుబాటుదారుడు అయితే బాంబు తయారీ నైపుణ్యంతో ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చారు.

ఆయన "బుక్ బాంబ్" తయారు చేశారు. క్యాడ్‌బరీ కోకో టిన్‌లో దాచిన ఆ పేలుడు పదార్థాన్ని ఒక లా పుస్తకం మధ్యలో ఉంచి.. దాన్ని తెరిస్తే తాము లక్ష్యంగా చేసుకున్న బ్రిటిష్ మేజిస్ట్రేట్‌ చనిపోయేలా రూపొందించారు.

1907లో మిడ్నాపూర్ జిల్లాలో తొలి పేలుడు సంభవించింది. రైలు పట్టాలపై విప్లవకారులు బాంబు పెట్టడం వల్ల ఒక సీనియర్ బ్రిటిష్ అధికారి ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది.

కొన్ని నెలల తరువాత ముజఫర్‌పూర్‌లో ఒక మేజిస్ట్రేట్‌ను చంపడానికి ప్రయత్నించే క్రమంలో గుర్రపు బండిపై జరిగిన బాంబు దాడిలో ఇద్దరు ఇంగ్లిష్ మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ చర్యను ఒక వార్తా పత్రిక "పట్టణాన్ని షాక్‌కు గురిచేసిన ఓ విపరీతమైన పేలుడు"గా అభివర్ణించింది. ఈ ఘటన ఖుదీరామ్ బోస్ అనే యువ తిరుగుబాటుదారుడిని అమరవీరుడిగా, అలాగే భారతీయ విప్లవకారుల జాబితాలో తొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా మార్చింది.

ఆ బాంబులు కేవలం ఆయుధాలు మాత్రమే కాదని కొత్త రకమైన "మాయా విజ్ఞానమని" బెంగాల్ నుంచి భారత్‌లోని మిగతా ప్రాంతాలకు వ్యాపించే ఒక మంత్ర విద్యగా 1908లో జాతీయవాద నాయకుడు బాల గంగాధర్ తిలక్ పేర్కొన్నారు.

ప్రస్తుతం బెంగాల్‌లోని నాటు బాంబులను స్థానికంగా "పెటో" అని పిలుస్తారు. వాటి లోపల పదునైన మేకులు, గాజు ముక్కలు పెడతారు. పైనుంచి జనపనారతో చుడతారు.

ఇవే కాకుండా, స్టీల్ డబ్బాలు లేదా గాజు సీసాలలో ప్యాక్ చేసిన పేలుడు పదార్థాలు కూడా ఉంటాయి. వీటిని ప్రధానంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీల మధ్య హింసాత్మక ఘర్షణలలో ఉపయోగిస్తారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రాజకీయ కార్యకర్తలు తమ ప్రత్యర్థులను భయపెట్టడానికి, పోలింగ్ కేంద్రాలలో గందరగోళం సృష్టించడానికి, శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి వీటిని ఉపయోగిస్తుంటారు.

ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌లలో విధ్వంసం సృష్టించడానికి లేదా ఆయా ప్రాంతాలపై పట్టు సాధించడానికి వీటిని తరచుగా ఉపయోగిస్తారు.

పౌలోమి హల్దార్ వంటి పిల్లలు ఈ తరహా హింసకు ప్రధాన బాధితులుగా ఉన్నారు.

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని గోపాల్‌పూర్‌లో చెరువులు, వరి పొలాలు, కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ గ్రామంలో 2018 ఏప్రిల్‌లో ఒక రోజు ఉదయం 7 ఏళ్ల బాలిక పూజ కోసం పూలు తెంపుతోంది. పంచాయతీ ఎన్నికలకు అప్పటికి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది.

పొరుగింటి వారి నీటి పంపు దగ్గర పడి ఉన్న ఒక బంతిని పౌలోమి చూసింది.

"నేను ఆ బంతిని పట్టుకుని మా ఇంటికి తీసుకువచ్చాను" అని పౌలోమి గుర్తు చేసుకున్నారు.

ఆమె ఇంట్లోకి అడుగుపెట్టే సమయానికి టీ తాగుతున్న తాతయ్య, ఒక్కసారిగా ఆమె చేతిలోని వస్తువును చూసి షాక్‌కు గురయ్యారు.

"అది బంతి కాదు, అది బాంబు. బయట పడేయ్.. అని తాత చెప్పారు. దాన్ని బయటపడేసే లోపే నా చేతిలో ఆ బాంబు పేలింది" అని పౌలోమి చెప్పారు.

ఆ పేలుడుతో ఒక్కసారిగా ఆ గ్రామంలో నిశ్శబ్దం అలుముకుంది. పౌలోమి కళ్లు, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. ఆ గందరగోళ పరిస్థితిలో ఆమె సొమ్మసిల్లి కిందపడిపోయారు.

"చుట్టుపక్కనున్న వారు నా వైపు పరుగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ నేను వారిని సరిగ్గా చూడలేకపోతున్నాను. అప్పుడు తీవ్రంగా గాయపడ్డాను" అని పౌలోమి చెప్పారు.

గ్రామస్థులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడటంతో ఆమె ఎడమ చేతిని తీసేశారు. దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు.

అలా సాధారణంగా రోజూ ఉదయం చేసే ఒక పని ఆమెకు పీడకలను మిగిల్చింది. ఒక్క క్షణంలో పౌలోమి జీవితం మారిపోయింది.

ఈ బాధితుల్లో పౌలోమి ఒక్కరే లేరు.

2020 ఏప్రిల్ నెలలో ముర్షిబాద్ జిల్లాలోని జిత్‌పూర్‌లో 10 ఏళ్ల వయసులో సబీనా ఖాతున్ చేతిలో నాటు బాంబు పేలింది.

మేకను మేతకోసం తీసుకెళుతుంటే, గడ్డిలో పడి ఉన్న ఒక బాంబుపై ఆమె పడిపోయింది. కుతూహలంతో ఆమె దానిని పట్టుకుని ఆడుకోవడం మొదలు పెట్టింది.

కొన్ని క్షణాల తరువాత ఆ బాంబు ఆమె చేతిలో పేలింది.

"ఆ పేలుడు శబ్దం విన్న సమయంలో ఈ సారి వికలాంగులయ్యేది ఎవరో అని అనుకున్నాను. కానీ, సబీనా గాయపడుతుందని అనుకోలేదు?" అని ఆమె తల్లి అమీనా బీబీ బాధతో చెప్పారు.

"నేను బయట అడుగుపెట్టగానే కొందరు సబీనాను తీసుకురావడాన్ని చూశాను. ఆమె చేయి మాంసం ముద్దలా కనిపించింది" అని అమీనా అన్నారు.

వైద్యులు సబీనా చేతిని తొలగించాల్సి వచ్చింది.

ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి ఆమె ఎంతో కష్టపడ్డారు. తన భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొనడంతో ఆమె తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. వారి భయాలు సమంజసమే. ఎందుకంటే, భారత్‌లో వైకల్యంతో బాధపడే మహిళలు పెళ్లి, ఉద్యోగం తదితర విషయాల్లో సమాజం నుంచి అవమానాలు ఎదుర్కొంటారు.

"ఇక నా చేయి ఎప్పటికీ తిరిగి రాదంటూ నా బిడ్డ ఏడుస్తోంది" అని అమీనా చెప్పారు.

"నీ చేయి మళ్లీ వస్తుంది, నీ చేతి వేళ్లు మళ్లీ పెరుగుతాయని ఆమెను ఓదార్చుతూనే ఉన్నాను" అని అమీనా చెప్పారు.

ఒక చేతిని కోల్పోవడంతో సబీనా రోజువారి పనులను చేసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు.

"నీళ్లు తాగడానికి, భోజనం చేయడానికి, స్నానం చేయడానికి, బట్టలు వేసుకోవడానికి, టాయిలెట్‌కు వెళ్లడానికి ఇబ్బందిపడుతున్నాను" అని సబీనా తెలిపారు.

బాంబు దాడిలో గాయపడిన ఈ పిల్లలు అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డారు. కానీ, వారి జీవితాలు శాశ్వతంగా మారిపోయాయి.

పౌలోమికి ప్రస్తుతం 13 ఏళ్లు. తనకు కృత్రిమ చేతిని అమర్చినా, బరువు కారణంగా ఆమె దానిని ఉపయోగించలేకపోతోంది. 14 ఏళ్ల సబీనా దృష్టి లోపంతో బాధపడుతోంది.

సబీనా కంటిలోని బాంబు అవశేషాలను తొలగించేందుకు మరో ఆపరేషన్ అవసరమని, కానీ చేయించే స్తోమత తమకు లేదని వారి కుటుంబ సభ్యులు చెప్పారు.

పుచుకు ప్రస్తుతం 37 ఏళ్లు. తల్లిదండ్రులు భయపడిపోవడంతో అతడు స్కూల్ మానేయాల్సి వచ్చింది. చాలా సంవత్సరాలు పుచు అడుగు బయట పెట్టడానికి కూడా వారు నిరాకరించారు. ఏ చిన్న శబ్దం వినిపించినా పుచు మంచం కింద దాక్కునేవారు. ఆ ఘటన తరువాత పుచు మళ్లీ ఎప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకోలేదు. ఆ ఘటన అతడి బాల్యాన్ని దూరం చేసింది.

ప్రస్తుతం పుచు చిన్న చిన్న పనులు చేస్తున్నారు. కానీ, ఇంకా గతం తాలుకూ బాధను భరిస్తూనే ఉన్నారు.

కానీ వీరంతా తమ ఆశలు కోల్పోలేదు.

పౌలోమి, సబీనాలిద్దరూ ఒంటి చేత్తో సైకిల్ తొక్కడం నేర్చుకున్నారు. సైకిల్‌పైనే స్కూల్‌కు వెళుతున్నారు. టీచర్‌ అవ్వడమే వారిద్దరి లక్ష్యం.

పుచు తన 5 ఏళ్ల కుమారుడు రుద్ర భవిష్యత్‌లో పోలీస్ యూనిఫాం ధరించాలని ఆశిస్తున్నారు.

ఇంతటి నష్టాన్ని కలిగించినప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లో నాటు బాంబు హింస అంతమయ్యే సూచనలు కనిపించడం లేదు.

రాజకీయ లబ్ధి కోసం బాంబులను ఉపయోగించినట్లు ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు.

ఈ నాటు బాంబుల తయారీ లేదా వాడకంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉందా అని పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలను బీబీసీ ప్రశ్నించింది.

అధికారంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ స్పందించలేదు.

ఇలాంటివాటిలో తమ ప్రమేయాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐ-ఎమ్) తీవ్రంగా ఖండించింది. "మేం చట్టాన్ని గౌరవిస్తాం.. హక్కులు, జీవితాల పరిరక్షణ విషయానికొస్తే పిల్లలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం" అని ఆ పార్టీ తెలిపింది.

రాజకీయ లబ్ధి కోసం నాటు బాంబులను ఉపయోగించడాన్ని భారతీయ జాతీయ కాంగ్రెస్ కూడా తీవ్రంగా ఖండించింది. "వ్యక్తిగత లేదా రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు హింసను ప్రేరేపించలేదు" అని ఆ పార్టీ తెలిపింది.

ఏ రాజకీయ పార్టీ దీనికి బాధ్యత వహించకపోయినప్పటికీ, హింసతో కూడిన బెంగాల్ రాజకీయ సంస్కృతిలో ఇది పాతుకుపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదని బీబీసీతో మాట్లాడిన నిపుణులు అన్నారు.

"ఏ ప్రధాన ఎన్నికలు వచ్చినా సరే ఈ బాంబులను ఉపయోగిస్తుంటారు" అని పంకజ్ దత్తా బీబీసీకి తెలిపారు.

"పిల్లలపై తీవ్రమైన వేధింపులు జరుగుతున్నాయి. సమాజానికి వీరిపై సరైన పట్టింపు లేకపోవడమే దీనికి కారణం" అని పంకజ్ దత్తా అన్నారు.

పంకజ్ దత్తా నవంబర్‌లో మరణించారు.

"ఎవరైతే బాంబులు పెట్టారో వాళ్లు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇకపై ఏ చిన్నారి కూడా దీనికి బాధితులుగా మారొద్దు" అని పౌలోమి అన్నారు.

‘వాళ్లు నా కొడుకును ఏం చేశారో చూడండి’

కానీ, ఈ విషాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

హుగ్లీ జిల్లాలో ఈ ఏడాది మే నెలలో ముగ్గురు బాలురు ఒక చెరువు దగ్గర ఆడుకుంటూ అనుకోకుండా బాంబులపై పడిపోయారు. ఆ పేలుడులో 9 ఏళ్ల రాజ్ బిస్వాస్ చనిపోయాడు. ఒక బాలుడు తన చేతిని కోల్పోగా, మరొక బాలుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.

"చూడండి వాళ్లు నా కొడుకును ఏం చేశారో" అని తన కొడుకు నుదురును నిమురుతూ రాజ్ బిస్వాస్ తండ్రి విలపించారు.

తన కొడుకు శవాన్ని సమాధిలో పెడుతుండగా, చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల ర్యాలీలో నుంచి రాజకీయ నినాదాలు వినిపించసాగాయి. ‘‘జయహో బెంగాల్’’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు.

అది ఎన్నికల సమయం. మరొకసారి పిల్లలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)