You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మొబైల్ ఫోన్ కొట్టేసి, దాన్నుంచి లోన్ అప్లై చేసి మరీ డబ్బు కాజేసిన దొంగ
- రచయిత, మైఖేల్ రేస్, సీన్ డిల్లీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
నయల్ మెక్ నామీ లండన్‌లోని లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, సరిగ్గా ట్రైన్ తలుపులు మూసుకునే సమయానికి ఒక దొంగ ఫ్లాట్‌ఫామ్ వైపు నుంచి వచ్చి నయల్ ఫోన్‌ను చప్పున లాక్కొనిపోయాడు.
రెండు రోజుల తరువాత తన బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోయినట్లు ఆయనకు తెలిసింది. అక్షరాలా 21 వేల పౌండ్ల ( సుమారు రూ. 22లక్షలు) వరకు పోగొట్టుకున్నారు.
అందులో ఆయన పేరు మీద ఆ దొంగ లోన్‌గా తీసుకున్న 7 వేల పౌండ్లు ( సుమారు రూ. 7.5 లక్షలు) కూడా ఉన్నాయి.
‘‘గతంలో అమ్మేసుకోడానికి ఫోన్లను దొంగలించేవారు. కానీ ఇప్పుడు మీ సమాచారాన్ని, డబ్బుని దొంగిలించడానికి కూడా ఫోన్లను చోరీ చేస్తున్నారు’’ అని నయల్ బీబీసీతో అన్నారు.
ఇలాంటి నేరాలలో ఇది ఒక్కటే కాదు
బ్రిటన్‌లో ఈ తరహా నేరాల కారణంగా నష్టపోయింది నయల్ ఒక్కరే కాదు. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు కథనాలు వస్తూనే ఉన్నాయి.
బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్ (బీటీపీ) అందించిన సమాచారం ప్రకారం బ్రిటన్ వ్యాప్తంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో దొంగతనాలు 2018 నుంచి 2023 మధ్యలో 53 శాతం పెరిగిపోయాయి.
ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్‌లలోని రైళ్లు, అండర్ గ్రౌండ్ వ్యవస్థలను పర్యవేక్షించే అధికారిక విభాగమైన బీటీపీ ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా డిసెంబర్ నెలలో అత్యధిక చోరీ కేసులు నమోదవుతున్నాయి.
సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో త్వరగా చీకట్లు కమ్ముకుంటాయి కాబట్టి ఈ కాలంలో దొంగలు రెచ్చిపోతుంటారని బీటీపీకి చెందిన సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ లవ్‌లెస్ అన్నారు.
ఈ దొంగలు పాల్పడే మూడు రకాల దొంగతనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీటీపీ హెచ్చరిస్తోంది.
ప్లకర్: ట్రైన్ సీట్‌లో పడుకున్న వారి ఫోనును, వారి నిద్రకు భంగం కలగకుండా చాకచక్యంగా కాజేసేవారు.
గ్రాబర్ - ఎవరైనా ఫోనును ఎక్కడైనాపెట్టి, సీరియస్‌గా తమపనిలో నిమగ్నమైనప్పుడు వారిని ఏమార్చి ఫోన్‌ను దొంగిలించేవారు.
స్నాచర్ - ట్రైన్ కదిలే వరకు డోర్ దగ్గరే తచ్చాడుతూ, ఎవరైనా దగ్గర్లో మొబైల్ ఫోన్ వాడుతున్నప్పుడు సరిగ్గా డోర్ మూసుకునే టైమ్‌కు దాన్ని లాగేసుకుని అక్కడి నుంచి పరిగెత్తేవాళ్లు. ఇలాంటి సందర్భాలలో బాధితుడు స్పందించేలోపు తలుపులు మూసుకుంటాయి.
లండన్‌లో 12 సంవత్సరాలుగా ఉంటున్నారు నయల్. తన మొబైల్ ఫోన్ దొంగతనం కాగానే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వెంటనే తన బ్యాంకుకు సమాచారం ఇవ్వాలనిగానీ, క్రెడిట్, డెబిట్ కార్డులను బ్లాక్ చేయాలనిగానీ ఆయనకు ఆలోచన రాలేదు.
‘‘అంతా దోచేశారు. నేను ఆన్‌లైన్‌లో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి చూసేసరికి జీరో అని కనిపించింది.’’ అన్నారు నయల్.
అంతే కాదు, ఆ దొంగ తన పేరు మీద ఒక బ్యాంకు నుంచి 7 వేల పౌండ్లకు లోన్ అప్లై చేసి, వచ్చిన డబ్బును ( సుమారు రూ. 7.5 లక్షలు) కూడా కాజేశాడని నయల్ చెప్పారు.
‘‘ఆ విషయం తెలియగానే నా ఒళ్లంతా చెమటలు పట్టాయి’’ అని నయల్ గుర్తు చేసుకున్నారు.
‘‘ఫోన్ పోగొట్టుకున్న తర్వాత రెండు రోజుల వరకు నాకు నిద్ర పట్టలేదు. ఫోన్‌ను ఎలా తిరిగి సంపాదించాలా అన్న ఆలోచనతో రోజంతా నా కిచెన్‌లోనే అటూ ఇటూ తిరుగుతూ, అందరితో మాట్లాడుతూ గడిపా.’’ అన్నారాయన.
‘‘నాకు రెండు బ్యాంకు ఖాతాలున్నాయి. వాళ్లు రెండింటినీ ఎలా హ్యాక్ చేసారో నాకు అర్ధం కావడం లేదు.’’ అన్నారు నయల్.
‘‘నేను రెండేళ్ల నుంచి లోన్ కోసం అప్లై చేస్తున్నా. కానీ తిరస్కరిస్తున్నారు. కానీ, నా ఫోన్ దొంగతనం చేసిన వాళ్లు మాత్రం నా నెంబర్ సాయంతోనే లోన్ తీసుకున్నారు. ఇది తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది.’’ అన్నారు నయల్.
భారత సంతతి ఎంపీ కూడా బాధితురాలే..
స్ట్రాట్‌ఫోర్డ్ అండ్ బో నియోజకవర్గానికి చెందిన భారత సంతతి ఎంపీ ఉమా కుమరన్ కూడా ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు. తన నియోజక వర్గంలో ఫోన్ దొంగతనాలు, దోపిడీల సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. .
"అంతెందుకు, నా ఫోన్ కూడా దొంగిలించారు. అదంతా సెకండ్లలో జరిగిపోయింది. నా చేతిలో ఉన్న ఫోన్‌ను అప్పుడే జేబులో పెట్టుకున్నాను. ఆ తర్వాత 30 సెకండ్లలో ఎవరో దాన్ని కొట్టేశారు’’ అన్నారామె.
"ఈ రోజుల్లో మీ లైఫంతా మీ ఫోన్‌లోనే ఉంటుంది. ఫోన్ పోవడం చాలా చిన్న విషయం అనుకోవచ్చు. కానీ, అది పోగొట్టుకున్న వ్యక్తికి తన జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది.’’ అన్నారామె.
ఫోన్ స్నాచర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎలా పట్టుకుంటారో చిత్రించేందుకు బీబీసీ ప్రయత్నించింది. చాలామందిని అరెస్టు చేయడాన్ని కూడా గమనించింది.
అయితే, అందులో ఒక దొంగ చాలా ఖరీదైన ఫోన్‌ను దొంగిలించాడు. దానికి సిగ్నల్ అందకుండా నిరోధించేందుకు దాన్ని ఒక టిన్ (ఒక రకమైన లోహం)తో చేసిన కవర్‌లో దాచి పెట్టాడు. ఇలా చేయడం ద్వారా పోలీసులు తనను ట్రేస్ చేసే అవకాశం ఉండదన్నది ఆ దొంగ ఆలోచన.
‘సమాధానం చెప్పలేకపోయిన బ్యాంకు’
మొత్తం మీద నయల్ కేసును పోలీసులు ఛేదించలేకపోయారు. సీసీకెమెరాలో ఎలాంటి ఆధారాలు దొరకనందున ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు చెప్పారు.
అయితే, ఫిర్యాదు ఆధారంగా దొంగిలించిన దానిలో మూడింట రెండు వంతుల డబ్బును బ్యాంకు రీయింబర్స్‌మెంట్ చేసిందని నయల్ బీబీసీతో చెప్పారు. కానీ, ఆ దొంగ తీసుకున్న లోన్‌ను మాత్రం క్లోజ్ చేయలేదని ఆయన అన్నారు.
‘‘ లోన్ చెల్లించడానికి నా దగ్గర 7 వేల పౌండ్లు లేవని హెచ్‌ఎస్‌బీసీ వాళ్లకు అర్ధమైనట్లు లేదు’’ అని నయల్ అన్నారు.
‘‘నా పేరు మీద లోన్ ఎలా ఇచ్చారో ఇప్పటికీ బ్యాంకు వాళ్లు వివరించలేకపోయారు. ఈ విషయంలో వాళ్లు నాకు ఏమాత్రం సాయం చేయలేదు.’’ అన్నారాయన.
‘‘నయల్ మెక్‌నామీ ఫోన్ దొంగతనానికి గురికావడం, మోసం కారణంగా డబ్బు పోగొట్టుకోవడం దురదృష్టకరం. దానికి ఆయన ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటారో అర్ధం చేసుకోగలం’’ అని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ ప్రతినిధి బీబీసీతో అన్నారు.
ఈ విషయంలో విచారణ జరిపేందుకు తాము ఆయనతో టచ్‌లో ఉన్నామని వారు తెలిపారు.
ఫోన్ దొంగతనానికి గురైతే ఏం చేయాలి?
ఫోన్ దొంగతనానికి గురైనప్పుడు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాదాపు అన్ని దేశాలలో ఒకేలా ఉంటాయి.
పోలీసులకు ఫిర్యాదు చేయడం: ఫిర్యాదు చేయడంతోపాటు మీ ఫోన్ ఐఎంఈఐ ( IMEI-International Mobile Equipment Identity) వారికి అందించాలి. ఇది 15 అక్షరాలు, నంబర్లు ఉన్న ఒక కోడ్. మీరు ఫోన్ కొన్నప్పుడు ఈ కోడ్ దాని బాక్స్ మీద ఉంటుంది. ఒకవేళ ఆ బాక్స్ మీ దగ్గర లేకపోతే సర్వీస్ ప్రొవైడర్ దగ్గర్నుంచి ఆ కోడ్‌ను పొందే అవకాశం ఉంది.
మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు: మీ ఫోన్ నంబర్‌ను దుర్వినియోగం చేయకుండా, సిమ్‌ను బ్లాక్ చేయాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్ ( మొబైల్ కంపెనీ)ను కోరవచ్చు.
బ్యాంకుకు ఫిర్యాదు: మొబైల్ ఫోన్‌లో బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించిన కీలకమైన సమాచారం ఉండొచ్చు. అలాంటప్పుడు వెంటనే బ్యాంకులకు ఈ విషయం వివరించి, బ్యాంకింగ్ సర్వీసులను బ్లాక్ చేయాలని కోరవచ్చు.
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్: మీ ఫోన్ డివైజ్‌ను ట్రస్టెడ్ డివైజ్ లిస్టు నుంచి తొలగించాలి. అలాగే ఈమెయిల్ పాస్‌వర్డ్‌లను కూడా మార్చడం మంచిది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)