You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫోన్ ఎత్తగానే ‘హలో’ అని ఎందుకు అంటాం, ఆ పదం ఎలా పుట్టింది?
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
చేతిలో ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోన్ ఎత్తగానే పలికే మొదటి మాట ‘హలో’.
అలాగే కొత్తవారితో కూడా ‘హలో’ అని పలకరింపుతోనే మాటలు కలుపుతుంటాం.
పరిచయాలకు, సంభాషణలకు తొలి మెట్టు అయిన హలో అనే పదం ఎలా పుట్టింది? మన వాడుకలోకి ఎలా వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 21ని ‘వరల్డ్ హలో డే’గా ఎందుకు జరుపుకుంటున్నారు? తదితర ఆసక్తికర అంశాలు ఈ కథనంలో చూద్దాం.
హలో అనే పదం ఎలా వచ్చింది?
హలో అనే పదానికి రెండు మూలాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రకారం, హలో అనే పదం holla, hollo అనే రెండు పదాల నుంచి వచ్చింది. సాధారణంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తిని పిలిచేందుకు ఈ పదాలను వాడతారు.
అమెరికన్-బ్రిటిష్ జర్నలిస్ట్, రచయిత బిల్ బ్రిసన్ ప్రకారం హలో అనే పదం 'hale be thou' అనే ఓల్డ్ ఇంగ్లిష్ ఫ్రేజ్ నుంచి వచ్చింది. దీనర్థం ‘ఆరోగ్యంగా ఉండాలని ఆశించడం’.
ఒక విధంగా టెలిఫోన్ ఆవిష్కరణ కంటే ముందు నుంచే ఈ పదం ఉనికిలో ఉంది. మరి, ఒక ఫోన్ కాల్ సంభాషణను మొదలుపెట్టడానికి ‘హలో’ అనే పదాన్ని వాడాలని నిర్ణయించింది ఎవరు?
హలో, అహోయ్ (Ahoy)ల మధ్య పోటీ
అలెగ్జాండర్ గ్రాహంబెల్ 1876లో టెలిఫోన్‌ను కనిపెట్టారు.
టెలిఫోన్ వచ్చిన తొలినాళ్లలో ఫోన్‌లో సంభాషణ మొదలుపెట్టడానికి ఒక నిర్ధిష్ట పదమేదీ లేదు.
గ్రాహంబెల్ మాత్రం ‘అహోయ్’ అనే పదం వైపు మొగ్గు చూపారని హెర్బర్ట్ ఎన్ కాసన్ రాసిన ‘ద హిస్టరీ ఆఫ్ టెలిఫోన్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.
కేంబ్రిడ్జి డిక్షనరీ ప్రకారం, అహోయ్ అంటే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి వేసే కేక. ముఖ్యంగా ఈ పదాన్ని పడవ నడిపే వ్యక్తులు ఉపయోగించేవారు.
కానీ, థామస్ అల్వా ఎడిసన్ కారణంగా ‘హలో’ పనేది పలకరింపు పదంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలా మన రోజువారీ మాటల్లో ఒకటిగా స్థిరపడిపోయింది.
హలోను 19వ శతాబ్దపు పదంగా చెప్పవచ్చు. ఉచ్ఛారణా పరంగా చూస్తే ఇది కచ్చితంగా ఒక ఆధునిక పదం. ఇందులో మొదటి అక్షరం కంటే రెండో అక్షరాన్నే ఎక్కువగా ఒత్తి పలుకుతారు. ఇంగ్లిష్ భాషలో ఇది కాస్త అరుదనే అనుకోవాలి.
‘హలో’ ఎలా స్థిరపడింది?
హలో అనేపదం స్థిరపడటానికి టెలిఫోన్ డైరెక్టరీలను ఒక కారణంగా చెప్పవచ్చు. తొలినాళ్లలో వచ్చిన టెలిఫోన్ డైరెక్టరీలలో టెలిఫోన్‌ను ఎలా ఉపయోగించాలనే సూచనలు ఇచ్చేవారు. అలాగే సంభాషణను హలో అంటూ మొదలుపెట్టాలని సూచించేవారు. అలా ఈ పదం స్థిరపడిపోయింది.
అహోయ్ అనే పదానికి సముద్రానికి, పైరేట్లతో సంబంధం ఉంటుంది. కాబట్టి గంభీరమైన చర్చలకు ఇది సరైన పదం కాదని భావించేవారు. పైగా హలో అనేది చాలా తటస్థ పదం కావడంతో పాటు పలకరించడానికి వైవిధ్యంగా ఉంటుందని ఎడిసన్ నమ్మారు. పలకడానికి కూడా హలో అనేది సులువుగా ఉండటంతో ఇది ప్రజలకు బాగా అలవాటు అయిపోయింది.
అయితే, కాలం మారుతున్న కొద్దీ ఫోన్ పలకరింపుల్లో కాస్త మార్పు వచ్చింది. నేటి యువతరం వాట్సాప్ బ్రో, హేయ్, హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ తమవారిని పలకరిస్తుండగా, కాల్ సెంటర్ ఉద్యోగులు గుడ్ మార్నింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటూ సంభాషణను మొదలుపెడుతున్నారు. కానీ, సాధారణ సంభాషణల విషయానికొస్తే మాత్రం హలో అనే పదమే నిలిచిపోయింది.
వరల్డ్ హలో డే
ప్రతీ ఏటా నవంబర్ 21న వరల్డ్ హలో డే గా జరుపుకుంటారు. సంభాషణలు, చర్చల ద్వారా సంఘర్షణలను పరిష్కరించుకోవాలనే అవగాహన కల్పించడానికే ఈ రోజును ఒక అవకాశంగా వాడుకుంటారు.
శాంతిని కాపాడటంలో వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం (పర్సనల్ కమ్యూనికేషన్) ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో చూపడానికి ఈ రోజున అందరూ ఒక పది మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని హలో అంటూ నవ్వుతూ పలకరిస్తారు.
శాంతిని కోరుతూ దేశాధినేతలకు, నాయకులకు ఉత్తరాలు రాస్తుంటారు.
‘యోమ్ కిప్పుర్’ యుద్ధానికి స్పందనగా 1973నుంచి ప్రపంచ హలో డేను పాటిస్తున్నారు. మొత్తం 180 దేశాలు ఈ వేడుకను జరుపుకుంటాయి. ‘గ్రీటింగ్ ఫర్ పీస్’ అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు జరుపుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)