ఇజ్రాయెల్: రక్షణ మంత్రిని మళ్లీ తొలగించిన నెతన్యాహు.. దేశవ్యాప్తంగా నిరసనలు

    • రచయిత, జాన్ డానిసన్, జార్జ్ రైట్
    • హోదా, బీబీసీ న్యూస్

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించడంపై ఇజ్రాయెల్‌లో నిరసనలు చెలరేగాయి.

ఇద్దరు నేతల మధ్య ''విశ్వాసం లోపించడం'' ఈ నిర్ణయానికి దారితీసిందని నెతన్యాహు చెప్పారు.

ఇటీవలి కాలంలో గాలంట్‌పై తనకు నమ్మకం సన్నగిల్లిందని, ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ బాధ్యతలు చేపడతారని నెతన్యాహు తెలిపారు.

మరోవైపు గాలంట్ కూడా దీనిపై స్పందించారు. తనను తొలగించడానికి మూడు కారణాలున్నాయని ఆయన చెప్పారు.

రాయితీలు ఇవ్వడం ద్వారా గాజా నుంచి మిగిలిన బందీలను తిరిగి తీసుకురావొచ్చని, వాటిని భరించక తప్పదనే తన వాదన కూడా తన ఉద్వాసనకు కారణమని ఆయన అన్నారు.

కాగా, ఇజ్రాయెల్ వీధుల్లో నిరసనలకు దిగిన ఆందోళనకారులు ప్రధాన మంత్రి నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బందీల విడుదల ఒప్పందానికి నూతన రక్షణ మంత్రి ప్రాధాన్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నెతన్యాహు, గాలంట్ మధ్య చాలాకాలంగా విభేదాలున్నాయి. గత ఏడాది కాలంలో, ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలపై ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

మిలిటరీ విధుల నుంచి ఇజ్రాయెల్ సంప్రదాయ పౌరులకు ఇస్తున్న మినహాయింపును కొనసాగించే ప్రణాళికలపై గాలంట్ అసంతృప్తిగా ఉన్నారు.

ఇంతకుముందు 2023 అక్టోబర్‌లో, గాజాలో యుద్ధం ప్రారంభం కావడానికి కొద్దినెలల ముందు రాజకీయ విభేదాల కారణంగా గాలంట్‌ను నెతన్యాహు తొలగించారు. కానీ, ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో తిరిగి గాలంట్‌ను నియమించాల్సి వచ్చింది.

అయితే, మంగళవారం నెతన్యాహు మాట్లాడుతూ.. ''యుద్ధం మధ్యలో ఉన్నాం, ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రధాన మంత్రికి, రక్షణ మంత్రికి మధ్య విశ్వాసం చాలా అవసరం. యుద్ధం ప్రారంభ నెలల్లో ఆ నమ్మకం, పని కూడా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో అది దెబ్బతింది.'' అన్నారు.

''క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్‌లో నాకు, గాలంట్‌కు మధ్య అంతరాలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి'' అని నెతన్యాహు చెప్పారు.

" వాటితో పాటు ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధమైన ప్రకటనలు, చర్యలు కూడా ఉన్నాయి" అని ఆయన అన్నారు.

రక్షణ మంత్రి పదవి నుంచి తొలగించినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో గాలంట్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ''ఇజ్రాయెల్ దేశ భద్రతే నా జీవిత లక్ష్యం'' అని పోస్ట్ చేశారు.

''మూడు అంశాల్లో అసమ్మతి కారణం''గానే తనను పదవి నుంచి తొలగించారని మంగళవారం రాత్రి ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

మిలిటరీ సేవల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి జాతీయ స్థాయి విచారణ అవసరమని, అలాగే బందీలను వీలైనంత త్వరగా విడిపించి తీసుకురావాలని ఆయన భావించారు.

బందీల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ''ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని నేను విశ్వసిస్తున్నా. అయితే దీనికి ఇజ్రాయెల్ కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా వాటిని భరించగలదు'' అన్నారు.

గాలంట్‌కు మద్దతు తెలుపుతూ నిరసనల్లో పాల్గొన్న వారిలో ఒకరైన యాయిర్ అమిత్ మాట్లాడుతూ, ''నెతన్యాహు మొత్తం దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. బాధ్యతగా వ్యవహరించే వ్యక్తులు ఇజ్రాయెల్‌ను ముందుకు నడిపించాలి'' అన్నారు.

కొంతమంది నిరసనకారులు అయాలోన్ హైవేపై నిప్పుపెట్టారు, రెండు వైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.

అక్టోబర్ 7 దాడిలో హమాస్ బందీలుగా తీసుకెళ్లిన వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక గ్రూప్ కూడా గాలంట్‌ను నెతన్యాహు పదవి నుంచి తొలగించడాన్ని ఖండించింది. బందీల విడుదల ఒప్పందానికి విఘాతం కలిగించే ప్రయత్నంగా పేర్కొంది.

''రాబోయే రక్షణ మంత్రి యుద్ధం ముగించేందుకు నిబద్ధతతో ప్రయత్నించాలని, అపహరణకు గురైన వారందరినీ వెంటనే తిరిగి తీసుకొచ్చేందుకు సమగ్ర ఒప్పందానికి ప్రయత్నించాలి'' అని బందీలు, కనిపించకుండా పోయిన వారి కుటుంబాల ఫోరమ్ పిలుపునిచ్చింది.

యుద్ధం ప్రారంభమై ఏడాది దాటినప్పటికీ అక్టోబర్ 7న హమాస్ బందీలుగా తీసుకెళ్లిన 251 మందిలో 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు.

గాలంట్ స్థానంలో రానున్న ఇజ్రాయెట్ కట్జ్ యుద్ధం విషయంలో మరింత కఠిన వైఖరి ఉన్న వ్యక్తిగా పేరుంది.

గతంలో ఎలాంటి కేబినెట్ పదవి లేని నెతన్యాహు మరో మిత్రుడు గిడియాన్ సార్ నూతన విదేశాంగ మంత్రి కానున్నారు.

గాలంట్ తొలగింపు నిర్ణయం 48 గంటల్లో అమల్లోకి వస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)