You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిజ్బుల్లా, హమాస్, ఇరాన్‌లతో ఇంతగా పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యుద్ధాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయా?
- రచయిత, జెరెమీ హోవెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇజ్రాయెల్ దాదాపు 13 నెలలుగా గాజాలోని హమాస్‌తో, లెబనాన్‌లోని హిజ్బుల్లాతో పోరాడుతోంది. వేల మంది సైనికులను గాజా, దక్షిణ లెబనాన్‌లలో మోహరించింది. శత్రువుల మీద వేల కొద్దీ వైమానిక దాడులు చేసింది.
ప్రత్యర్థులు చేసే క్షిపణి, డ్రోన్ దాడుల్ని ఎదుర్కొనేందుకు గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు లక్షల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తోంది.
హమాస్, హిజ్బుల్లాలతో యుద్ధాలను కొనసాగించడానికి 60 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు అవుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ యుద్ధాలు ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
యుద్ధాల వల్ల ఇజ్రాయెల్‌పై ఆర్థిక భారం ఎంత?
“మేము దేశ చరిత్రలోనే సుదీర్ఘమైన, ఖరీదైన యుద్ధంలో ఉన్నాం. సైనిక చర్య వల్ల అయ్యే ఖర్చు 54 బిలియన్ డాలర్ల నుంచి 64 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చు” అని ఇజ్రాయెల్ ఆర్థికమంత్రి బిజలెల్ స్మోట్రిక్ 2024 సెప్టెంబర్‌లో చెప్పారు.
లెబనాన్ మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు, దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం చొరబాటు, దీంతో పాటు ఇరాన్ మీద క్షిపణులతో ఎదురుదాడులు లాంటివన్నీ యుద్ధానికి అవుతున్న వ్యయాన్ని మరింత పెంచాయి.
ఈ యుద్ధం 2025లో కూడా కొనసాగితే ఖర్చు దాదాపు 93 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని బ్రిటన్‌లోని షెఫీల్డ్ హల్లమ్ యూనివర్సిటీలో ఆర్థికవేత్తగా ఉన్న డాక్టర్ అమ్ర్ అల్గారి అంచనా వేస్తున్నారు.
ఇది ఇజ్రాయెల్ వార్షిక ఆదాయంలో ఆరింట ఒక వంతుకు సమానం. ఇజ్రాయెల్ జీడీపీ 1.99 ట్రిలియన్ షెకెల్స్ (530 బిలియన్ డాలర్లు).
ఇజ్రాయెల్ యుద్ధానికి నిధులెలా సమకూర్చుతోంది?
యుద్ధాలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ది బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రభుత్వ బాండ్ల అమ్మకాలను పెంచింది. అందిన చోటల్లా అప్పులు తెస్తోంది. 2024 మార్చిలో రికార్డు స్థాయిలో 8 బిలియన్ డాలర్ల నిధులు సేకరించింది.
ఇజ్రాయెల్‌లో ఉన్న వారితో పాటు విదేశాల్లో ఉన్న వారికి కూడా “విదేశీ బాండ్లు” పేరుతో ఇజ్రాయెల్ బ్యాంక్ బాండ్లు అమ్ముతోంది. వీటిని విదేశాల్లో ఉన్న యూదులు కొంటున్నారు.
బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ గణాంకాల ప్రకారం, విదేశాల్లో ఉన్న వారు ఈ బాండ్లు కొనేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేయడానికి ముందు 2023 సెప్టెంబర్‌లో విదేశీ బాండ్ల అమ్మకాలు 14.4 శాతం జరిగాయి. ఆ తర్వాత వాటి సంఖ్య 8.4 శాతానికి పడిపోయిందని బ్యాంక్ తెలిపింది.
“దీని ఫలితంగా ప్రభుత్వ బాండ్లను విదేశాల్లో ఉన్న వారితో కొనిపించేందుకు వాటి మీద ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ రేటు పెరిగింది” అని టెల్ అవీవ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ మాన్యువల్ ట్రలెన్‌బర్గ్ చెప్పారు.
“ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన రుణాల భారం 1.5 శాతం పెరిగింది” అని ఆయన తెలిపారు.
దీనికి తోడు, మూడు ప్రధాన రేటింగ్ ఏజెన్సీలు మూడీస్, ఫిచ్, స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్&పీ) సంస్థలు 2024 ఆగస్టు నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వ రుణాల రేటింగ్‌లను తగ్గించాయి.
ప్రభుత్వం బాండ్లకు తిరిగి నిధులు చెల్లించలేదేమోననే భయంతో ఈ సంస్థలు తమ రేటింగ్స్‌ను తగ్గించలేదని డాక్టర్ తోమెర్ ఫద్లాన్ చెప్పారు.
ఆయన టెల్ అవీవ్‌లోని నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం నిధుల నిర్వహణ చక్కగా చేస్తోందని అన్నారు.
“2025 వరకు ప్రభుత్వ వ్యయం గురించి ఆర్థిక వ్యూహం ఎలా ఉందనే దాని గురించి తాము ఆందోళన చెందుతున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు తమ నివేదికల్లో ప్రస్తావించాయి” అని ఆయన అన్నారు.
2025 బడ్జెట్ కోసం డిమాండ్లు
“బడ్జెట్‌లో రెవెన్యూ లోటును అదుపు చేసేందుకు కేటాయింపుల్లో కోతలు, పన్నుల పెంపుదల వంటి వాటి ద్వారా 37 బిలియన్ షెకెల్స్ (9.9 బిలియన్ డాలర్లు) రాబట్టుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది” అని ఇజ్రాయెల్ డెమోక్రసీ ఇన్‌స్టిట్‌ట్యూట్‌లో విద్యావేత్త, బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ మాజీ గవర్నర్ ప్రొఫెసర్ కర్నిట్ ఫ్లగ్ చెప్పారు.
ఏది ఏమైనప్పటికీ “ప్రభుత్వం తీసుకునే కొన్ని ప్రణాళికాబద్దమైన నిర్ణయాల వల్ల కార్మిక సంఘాలు, కూటమి ప్రభుత్వంలోని కొంతమంది సభ్యుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది” అని ఆమె చెప్పారు.
పెరుగుతున్న సైనిక వ్యయాన్ని భర్తీ చేసేందుకు కొన్ని నిర్దిష్టమైన పొదుపు చర్యలతో 2025 బడ్జెట్ ప్రవేశ పెట్టాలని అనేక మంది ఆర్థిక వేత్తలు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
“యుద్ధానికయ్యే ఖర్చుల కోసం నిధులు కేటాయించేందుకు బడ్జెట్‌లో కోతల గురించి ఎలాంటి సీరియస్ ప్రణాళికలు లేవు. సైనిక వ్యూహాలకు తగినట్లుగా ఆర్థికంగా ఎలాంటి వ్యూహాలూ లేవు” అని జెరూసలేంలోని హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్టెబన్ క్లోర్ చెప్పారు.
ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ మీద యుద్ధం ప్రభావం ఎలా ఉంది?
2023 అక్టోబర్ వరకు ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, బలంగా వృద్ధి చెందుతూ వచ్చింది. అయితే, యుద్ధం ప్రారంభమైన తర్వాత అది దారి తప్పింది. గతేడాది మొత్తంగా తలసరి జీడీపీ 0.1శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.
2024లో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం 0.5 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధిస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ అంచనా వేసింది. 2024 జులై నాటి అంచనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని జులైలో అంచనా వేశారు.
2023 నుంచే ఇజ్రాయెల్‌లోని అనేక కంపెనీల్లో సరిపడా సిబ్బంది లేరు. దీంతో సంస్థల వ్యాపారం కూడా తగ్గింది.
హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం 3.60 లక్షల మందిని రిజర్వ్‌డ్ బలగాల్లోకి తీసుకుంది. యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉండటంతో దేశంలో కీలకమైన శ్రామిక శక్తి వృథాగా మారింది. ఇదిలా ఉండగానే లెబనాన్‌లో భూతల దాడుల కోసం మరో 15 వేల మంది రిజర్వ్‌డ్ బలగాలను నియమించింది.
భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాల నుంచి పనుల కోసం ఇజ్రాయెల్‌కు వచ్చే 2 లక్షల 20 వేల మంది పాలస్తీనీయుల్ని దేశంలోకి రాకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం అడ్డుకుంది.
ఈ నిర్ణయం ఇజ్రాయెల్ నిర్మాణ రంగాన్ని బాగా దెబ్బ తీసింది. ఇజ్రాయెల్ ప్రస్తుతం భారత్, శ్రీలంక, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల నుంచి వేల మంది తాత్కాలిక కూలీలను నియమించుకుంటోంది.
యుద్ధ కాలంలో ఆర్థిక వ్యవస్థ మందగించడం నుంచి “తిరిగి వేగంగా కోలుకునే అవకాశం” ఉందని ప్రొఫెసర్ ఫ్లగ్ చెప్పారు.
యుద్ధం ముగిస్తే ఇజ్రాయెల్ టెక్నాలజీ రంగంలో విజృంభిస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు ఈ రంగానిదే.
ఏదేమైనప్పటికీ “గతంలో జరిగిన యుద్ధాల కంటే ఇప్పుడు చేస్తున్న యుద్ధాలు ఇంకా ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలున్నాయి. దానివల్ల దేశ జనాభాపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టవచ్చు” అని ఫ్లగ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)