You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్, హారిస్: ప్రజాస్వామ్యం, ఆర్థిక పరిస్థితులే ఫలితాన్ని నిర్ణయిస్తున్నాయా
అమెరికాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న సరళి ప్రకారం ట్రంప్ ఎక్కువ రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
అయితే, కమలాహారిస్ కూడా 180కిపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉండడంతో పోటీ హోరాహోరీగా ఉంది.
జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా వంటి కీలక రాష్ట్రాలలో ట్రంప్‌కు ఆధిక్యం లభించింది.
ప్రస్తుత ఎన్నికలో ప్రజలు ప్రజాస్వామ్యం, దేశ ఆర్థిక పరిస్థితులను ప్రధానాంశాలుగా తాము ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.
కీలక అంశాలుగా ప్రజాస్వామ్యం, ఆర్థిక పరిస్థితి
ఈసారి జరిగిన అమెరికా ఎన్నికల్లో దేశంలో ప్రజాస్వామ్యం, దేశ ఆర్థిక పరిస్థితి కీలక అంశాలుగా ఓటర్లు భావించినట్లు ఎగ్జిట్ పోల్స్ తొలి అంచనాలు సూచిస్తున్నాయి.
ఐదు కీలక అంశాల్లో మూడోవంతు కంటే ఎక్కువ మంది ప్రజాస్వామ్యంపై ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి రెండో ప్రధానాంశంగా ఉంది. అబార్షన్, వలసలు, విదేశాంగ విధానం తదుపరి ప్రాధాన్యాలుగా ఉన్నాయి. ముందస్తు డేటాతో అంచనా వేసిన ఈ ప్రాధాన్యతా క్రమం మారే అవకాశం ఉంది.
2008 అధ్యక్ష ఎన్నికల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ అనేది అమెరికా ఎన్నికల్లో ఓటర్లను ప్రేరేపించే ప్రధానాంశంగా ఉంటోంది.
అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. స్వింగ్ స్టేట్స్‌లో ఒక్కో రాష్ట్రానికి 6 నుంచి 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. మొత్తం ఓట్లలో 270 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు పొందిన అభ్యర్థి విజయం సాధిస్తారు.
గత మూడు ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు..
2020 ఎన్నికల్లో రిపబ్లికన్, డెమొక్రాట్ల మధ్య జరిగిన ఎన్నికల పోరులో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించి అమెరికా అధ్యక్షుడయ్యారు.
మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో జో బైడెన్ 306 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 232 ఓట్లతో ఓడిపోయారు.
2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, డోనల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీపడ్డారు.
బరాక్ ఒబామా తర్వాత డెమొక్రాట్ల అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీపడిన హిల్లరీ క్లింటన్ ఈ ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయారు.
మొత్తం ఓట్లలో డోనల్డ్ ట్రంప్ 306 ఓట్లు సాధించి గెలుపొందారు. హిల్లరీ క్లింటన్ 232 ఓట్లతో ఓటమి చవిచూశారు.
అంతకుముందు జరిగిన 2012 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి బరాక్ ఒబామా 332 ఓట్లతో విజయం సాధించగా, రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ 206 ఓట్లతో పరాజయం పాలయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)