You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: కొనసాగుతున్న లెక్కింపు, ఏ రాష్ట్రంలో ఎవరిది విజయం?
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. 2020లో ఫలితాలు ఆలస్యమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలోనూ పోలింగ్ ముగింపు దశకు చేరింది.
పోలింగ్ పూర్తయిన రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి.
ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో ట్రంప్, హారిస్‌ల మధ్య ఓట్ల వ్యత్యాసం 4 శాతానికి పైగా ఉంది. కమలాహారిస్ కంటే ట్రంప్ 4 శాతం ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
డోనల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాలు:
జార్జియా
నార్త్ కరోలినా
పెన్సిల్వేనియా
విస్కాన్సిన్
ఆరిజోనా
మిషిగన్
ఇండియానా
కెంటకీ
మిసిసిపీ
ఒహాయో
కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాలు:
డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా
మేరీల్యాండ్
మసాచుసెట్స్
కాలిఫోర్నియా
న్యూజెర్సీ
ఇల్లినోయీ
కొలరాడో
(భారతీయ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయానికి లెక్కించిన ఓట్ల ప్రకారం)
డోనల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ
డోనల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
అబార్షన్ హక్కులను హారిస్ సమర్థిస్తున్నారు. ఆహార పదార్థాల రేట్ల తగ్గింపు, ఇళ్ల కొరతను తగ్గించడం వంటి హామీలను ఆమె ఇచ్చారు.
ట్రిలియన్ల విలువైన పన్నుల తగ్గిస్తానని ట్రంప్ ప్రచారం చేశారు.
డోనల్డ్ ట్రంప్ వయసు 78 ఏళ్లు కాగా, కమలా హారిస్ వయసు 60 ఏళ్లు.
పోటాపోటీ హామీలు
‘‘మీ గొంతులు వినిపించే సమయమిది’’ అని కమలా హారిస్ పోలింగ్ మొదలైన కాసేపటికి ట్వీట్ చేశారు.
బయటకు వచ్చి ఓటువేసి అందరం కలిసికట్టుగా ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ చేయాలని పోలింగ్‌కు మూడు గంటల ముందు ట్రంప్ తన సోషల్ ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టుచేశారు.
మనం మళ్లీ వెనక్కి వెళ్లకూడదని హారిస్ అన్నారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు ఆర్థిక ప్రణాళికను ఆమె ప్రకటించారు. అమెరికాలో ఇళ్ల కొరతకు ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు.
జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలిగిన నెల తర్వాత ఆగస్టులో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో చేసిన ప్రసంగం హారిస్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైనది.
పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి బయటపడిన వెంటనే ట్రంప్ ముఖంపై రక్తపు మరకతో పిడికిలి బిగించి కనిపించడం ఆయన ఎన్నికల ప్రచారంలో కీలకమైన అంశం.
అక్రమవలసదారులను అడ్డుకునేందుకు సరిహద్దులను మూసివేస్తానని ట్రంప్ ప్రకటించారు.
ఇక పోలింగ్ ప్రారంభమైన దగ్గరినుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.
కొన్నిచోట్ల ఓటర్ల క్యూ లైన్లలో కాఫీ కప్పులతో కనిపించారు.
భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు హవాయి, అలస్కా మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిపోతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)