పాకిస్తాన్ ఎన్నికలు: షరీఫ్, భుట్టో పార్టీల కూటమి సాధ్యమవుతుందా?

    • రచయిత, రోహన్ అహ్మద్
    • హోదా, బీబీసీ ఉర్దూ

ఎన్నికల్లో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక సీట్లను గెలుపొందారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

అధికారం దక్కించుకునే క్రమంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక పార్టీ మరో దానితో సంప్రదింపులు జరుపుతున్నాయి.

పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకారం స్వతంత్ర అభ్యర్థులు 101 సీట్లను గెలుచుకున్నారు. వీరిలో 93 సీట్లలో గెలుపొందిన వారు ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పీటీఐ మద్దతుదారులే.

రెండో స్థానంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) 75 సీట్లను, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లను, ఎంక్యూఎం పాకిస్తాన్ 17 సీట్లను గెలుపొందాయి.

ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఏమేర ఉందో మనం ఇక్కడ చూద్దాం..

పాకిస్తాన్‌లో ఎన్నికల నిబంధనలు

పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ నేత నవాజ్ షరీఫ్ సాధారణ ఎన్నికల్లో తమ విజయాన్ని ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ముత్తాహిదా ఖ్వామి మూవ్‌మెంట్ పాకిస్తాన్, జమాతే ఉలేమా ఇస్లాం, ఇతర పార్టీలతో మాట్లాడాలని తన తమ్ముడు షాబాజ్ షరీఫ్‌ను ఆదేశించారు నవాజ్ షరీఫ్.

మరోవైపు నేషనల్ అసెంబ్లీలో గరిష్ట సీట్లను తాము గెలుచుకున్నామని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చైర్మన్ గౌహర్ ఖాన్ చెప్పారు. కేంద్రంలో, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్‌లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.

మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో తమ రెండు పార్టీల మధ్యలో ఎలాంటి చర్చలు ప్రారంభం కాలేదని ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు చెబుతున్నాయి.

పాకిస్తాన్‌లో ఎన్నికలు జరగడానికి ముందే, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం తిరస్కరించింది. అంతేకాక, ఎన్నికల గుర్తు బ్యాట్‌ను రద్దు చేసింది. దీంతో, ఇమ్రాన్ ఖాన్ పార్టీ సభ్యులు స్వతంత్ర సభ్యులు ఎన్నికల్లో పోటీ చేశారు.

పాకిస్తాన్ ఎన్నికల నిబంధనల ప్రకారం, స్వతంత్రులుగా గెలిచిన అభ్యర్థులందరూ, ఫలితాల ప్రకటన తర్వాత మూడు రోజుల లోపల ఏదైనా పార్టీలో చేరాలి.

గెలిచిన స్వతంత్ర అభ్యర్థులందరూ అసెంబ్లీలలోని చిన్న పార్టీలో చేరి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళ్దామని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ తన అభ్యర్థులకు సూచిస్తుంది.

కూటమి ప్రభుత్వం సాధ్యమవుతుందా?

2022లో ఇమ్రాన్ ఖాన్‌ పార్టీ పీటీఐ పడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ముత్తాహిదా ఖ్వామీ మూవ్‌మెంట్, జమాతే ఉలేమా ఇస్లాం, ఇతర పార్టీలు ఏడాదిన్నర పాటు పాకిస్తాన్ డెమొక్రాటిక్ మూవ్‌మెంట్‌లో చేరాయి.

పాక్లిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్‌)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు.

ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ముత్తహిదా ఖ్వామీ మూవ్‌మెంట్, జమాతే ఉలేమా ఇస్లాంలు పరస్పరం విమర్శించుకున్నాయి.

ప్రస్తుతం ఏ సింగిల్ పార్టీకి కూడా మెజార్టీ రాలేదు. కూటమి ద్వారానే పాకిస్తాన్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో, కూటమి ఏర్పాటయ్యే అవకాశాలు ఏమేరకు ఉన్నాయి? దాని రూపురేఖలు ఎలా ఉండనున్నాయి?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఏ రాజకీయ పార్టీతో, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్‌తో కూడా చర్చలు జరగలేదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి చెప్పారు.

రాజకీయ పరిణామాలు

‘‘పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్‌)తో కానీ, పీటీఐతో కానీ లేదా మరేదైనా ఇతర రాజకీయ పార్టీతో కానీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధికారికంగా ఎలాంటి చర్చలు జరపలేదు’’ అని జియో న్యూస్‌తో చెప్పారు బిలావల్ భుట్టో జర్దారి.

ఫలితాలన్నీ వచ్చేంత వరకు తమ పార్టీ వేచి చూస్తుందన్నారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి బిలావల్ భుట్టో జర్దారి అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది.

ప్రభుత్వ ఏర్పాటుపై స్పందించిన పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు, ‘‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయి’’ అని తెలిపారు.

పాకిస్తాన్ డెమొక్రాటిక్ మూవ్‌మెంట్‌తో పోలిస్తే కొత్త ప్రభుత్వం ఎంత భిన్నమైంది?

ఇప్పటి వరకు పాక్లిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. ఎన్నికల ప్రచారంలో ఒకదానికొకటి విమర్శించుకున్న ఈ పార్టీలు కూటమిగా ఏర్పడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయి.

ఈ సమయంలో, ముందటి పాకిస్తాన్ డెమొక్రాటిక్ మూవ్‌మెంట్‌తో పోలిస్తే కొత్త ప్రభుత్వం ఎంత భిన్నంగా ఉండనుంది?

ప్రభుత్వ ఏర్పాటుపై ముత్తహిదా ఖ్వామీ మూవ్‌మెంట్ నేత హైదర్ అబ్బాస్ రిజ్వి బీబీసీ‌తో మాట్లాడారు.

‘‘మఖ్బూల్ సిద్దిఖీ సోదరుడికి షాబాజ్ షరీఫ్ ఫోన్ చేశారు, చర్చల కోసం ఆహ్వానించారు’’ అని అబ్వాస్ రిజ్వి బీబీసీకి చెప్పారు.

పీఎంఎల్-ఎన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? లేదా? అన్న విషయం తొలుత తేలాల్సి ఉందని హైదర్ అబ్బాస్ రిజ్వి అన్నారు.

‘‘ఏదైనా విషయం ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే, స్వతంత్ర అభ్యర్థులు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితంతా అస్పష్టంగా ఉంది’’ అని తెలిపారు.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌తో చర్చలు జరపకుండా ఏ ప్రభుత్వమైనా ముందుకు వెళ్లగలదని తాము అనుకోవడం లేదని పాకిస్తాన్ ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు.

నవాజ్ షరీఫ్ ప్రసంగం తర్వాత, పాకిస్తాన్ డెమొక్రాటిక్ మూవ్‌మెంట్ 2.0(పీడీఎం 2.0) ఏర్పాటవుతున్నట్లు కనిపించింది. కానీ, పీడీఎం ప్రభుత్వం విజయవంతమవుతుందా? అన్నది అసలైన ప్రశ్న అని లాహోర్‌కు చెందిన జర్నలిస్ట్, అనలిస్ట్ అజ్మల్ జమి బీబీసీ తో అన్నారు.

ఆయన ముందున్న అసలైన సవాలు దేశ రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావాలి. కానీ, కూటమి ప్రభుత్వానికి ఇది సాధ్యమవుతుందా? ఇది వారికి సాధ్యం కాకపోవచ్చన్నారు.

అసిఫ్ జర్దారి కోర్టులోనే నిర్ణయం

కొత్త ప్రభుత్వం ఏర్పాటులో మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి కీలక పాత్ర పోషించనున్నారని అజ్మల్ జమి అభిప్రాయపడుతున్నారు.

‘‘ప్రస్తుతం నిర్ణయం అసిఫ్ అలి జర్దారి కోర్టులో ఉంది. తన కొడుకు కోసం ప్రధానమంత్రి పదవిని ఆయన కోరతారా? అన్నది ప్రశ్నార్థకం. అలా కూడా జరగవచ్చు’’ అని చెప్పారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చాలా ఫార్ములాలు ముందుకు వస్తాయని, వాటిలో ఒకటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి, రెండున్నరేళ్ల చొప్పున పాలిస్తాయని అజ్మల్ జమి చెబుతున్నారు.

అదేకాక, బిలావల్ భుట్టో జర్దారి ప్రధానమంత్రిగా, షాబాజ్ షరిఫ్ లేదా మరియం నవాజ్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి కావొచ్చన్నారు.

‘‘రాజకీయ పార్టీల నేతలు ఇమ్రాన్‌ ఖాన్‌తో కూడా మాట్లాడుతున్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఇతర వ్యక్తులతో మాట్లాడటం కూడా అవసరమే’’ అని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ను ఉద్దేశించి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)