You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జైలు నుంచి విడుదలయ్యాక దిల్లీ చేరుకున్న షేక్ ముజిబుర్ రహ్మాన్ ‘జైహింద్’ అని ఎందుకన్నారు?
- రచయిత, అమితాబ్ భట్టసాలి
- హోదా, బీబీసీ
- నుంచి,
ఆ రోజు 1972, జనవరి 10.
దిల్లీలో వాతావరణం చాలా చల్లగా ఉంది. చల్లని గాలి వీస్తోంది.
ఉదయాన్నే దిల్లీ పోలీసు కానిస్టేబుళ్లంతా ఖాకీ ఓవర్‌కోట్లు వేసుకుని ఓ ప్రత్యేక డ్యూటీకి దిగారు.
ఈ దృశ్యం అమెరికన్ టీవీ ఛానల్ ఎన్‌బీసీ ప్రసారం చేసిన వీడియోలో కనిపించింది.
ఆ రోజున బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఓ ప్రత్యేక విమానం దిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగింది. అందులోంచి ఓ ప్రత్యేక అతిథి దిగారు.
భారతదేశ అగ్రశేణి రాజకీయ నాయకత్వం ఆ అతిథికి స్వాగతం పలికేందుకు అక్కడ ఉంది. వారిలో ప్రెసిడెంట్ వి.వి.గిరి, ప్రధాని ఇందిరాగాంధీ ఉన్నారు.
వీరితోపాటు కేబినెట్ మంత్రులు, ఆర్మీ అధికారులు, వేలాదిమంది సామాన్యప్రజలు కూడా ఉన్నారు.
లండన్ నుంచి చాలా దూరం ప్రయాణించిన బ్రిటిష్ విమానం జనవరి 10 ఉదయం 8 గంటల 10 నిమిషాలకు దిల్లీలో దిగింది.
ఆ విమానంలోంచి దిగిన వ్యక్తి పేరు షేక్ ముజిబుర్ రహ్మాన్.
ఆయన బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయనతోపాటు ఇద్దరు భారతీయ అధికారులు ఉన్నారు.
షేక్ ముజిబుర్ రహ్మాన్‌తోపాటు బెంగాలీ అధికారి శశాంక్ శేఖర్ బెనర్జీ , ఐపీఎస్ అధికారి వేద్ మార్వా కూడా లండన్ నుంచి దిల్లీకి వచ్చారు.
1960 ప్రాంతాలలో ఢాకాలో భారత దౌత్యవేత్తగా పనిచేసిన శశాంక్ బెనర్జీ, షేక్ ముజిబుర్ రహ్మన్‌ను కలిశారు.
తరువాత ఆయనను 1972లో లండన్‌లోని ఇండియన్ హై కమిషనర్ గా నియమించారు.
ఈ విషయాలను బెనర్జీ తన జ్ఞాపకాలలో ఇలా రాసుకున్నారు. ‘‘విమానం లండన్ నుంచి బయల్దేరిన తరువాత మార్గమధ్యంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు ఎయిర్ బేస్‌లలో ఆగింది. వాటిలో ముందుగా సైప్రస్‌లోని ఆక్రితిలోనూ, తరువాత ఒమెన్‌లో ఆగింది’’ అని రాసుకున్నారు.
లండన్ నుంచి దిల్లీకి వచ్చే సమయంలో షేక్ ముజిబుర్ రహ్మన్ రక్షణ బాధ్యత భారత పోలీసు ఆఫీసర్ వేద్ మార్వాకు అప్పగించారు. ఈయన పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్‌లో సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు.
తరువాత దిల్లీ పోలీసు కమిషనర్ అయ్యారు.
రిటైర్ అయ్యాక జమ్ముకశ్మీర్ సహా ఆయన అనేక రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు.
ఇద్దరు అధికారుల వేర్వేరు ప్రకటనలు
షేక్ ముజిబుర్ రహ్మన్‌తో పాటు భారత అధికారులు శశాంక్ శేఖర్ బెనర్జీ, వేద్ మార్వా లండన్ నుంచి దిల్లీకి, దిల్లీ నుంచి ఢాకాకు ప్రయాణించారు.
ఈ ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలు ఈ ఇద్దరు అధికారులు గుర్తు పెట్టుకున్నారు. కానీ వీరు చెప్పే విషయాలలో చాలా తేడా కనిపిస్తుంటుంది.
బెనర్జీ ఏకంగా ఓ పుస్తకం రాశారు. కొన్నేళ్ల కిందట ‘ది క్వింట్’ న్యూస్ పోర్టల్‌లో ఈ ప్రయాణం గురించి ఓ వ్యాసం కూడా రాశారు.
ఈ విమాన ప్రయాణ వివరాల గురించి వేద్ మార్వా చెప్పిన వివరాలను జర్నలిస్ట్ సురంజన్ సేన్ గుప్తా తన పుస్తకం ‘భాంగా పాథర్ రంగా ధులై’లో రాశారు.
‘‘వారిద్దరు చెప్పిన విషయాలను నేను విన్నాను. ఇందిరాగాంధీ ఆదేశాలమేరకు వారిద్దరు ముజిబుర్ రహ్మన్ తో కలిసి లండన్ నుంచి దిల్లీ మీదుగా ఢాకాకు చేరుకున్నారు’’ అని బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రకారుడు మయుద్దిన్ అహ్మద్ చెప్పారు.
‘‘కానీ శశాంక్ బెనర్జీ రాసిన జ్ఞాపకాలు విశ్వసనీయంగా లేవు. ఆయన ఇండియన్ ఇంటలిజెన్స్ సంస్థ ‘రా’లో ఒక అధికారి. వేద్ మార్వా ఐపీఎస్ అధికారి. వీరిద్దరిని విమానంలో కూర్చోపెట్టి షేక్ ముజిబుర్ ఫోటో తీశారు’’ అని చెప్పారు
‘‘60ల మధ్యలో బెనర్జీ ఢాకాలో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన షేక్ ముజిబుర్ రహ్మన్‌ను కలిశారు. ఆ సందర్భంగా ముజిబ్‌ను కలిసిన మొట్టమొదటి భారతీయుడిగా చెప్పుకొన్నారు’’ అని ఆయన తెలిపారు.
‘‘లండన్‌లో కూడా షేక్ ముజిబుర్ రహ్మన్‌కు స్వాగతం పలికేందుకు ఉన్నట్టుగా చెప్పారు. కానీ ఇది పూర్తిగా అబద్ధం. నా అభిప్రాయం ప్రకారం వేద్ మార్వా చెప్పిన వివరాలే ఎక్కువ విశ్వసనీయంగా ఉన్నాయి. కానీ బెనర్జీ వివరాలే ఇండియాలో బాగా ప్రసిద్ధి పొందాయి’’ అని మయుద్దిన్ అహ్మద్ తెలిపారు.
అయితే వేద్ మార్వా చెప్పిన వివరాలను అవామీ లీగ్ ఆఫ్ బంగ్లాదేశ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
భుట్టో వీడ్కోలు
రావల్పిండిలోని మియాన్వాలీ జైలు నుంచి షేక్ ముజిబుర్ రహ్మన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసి, ఆయన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానంలో ఉంచారు.
అదే రోజున డాక్టర్ కమాల్ హుస్సేన్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు.
‘‘జుల్ఫీకర్ అలీభుట్టో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి షేక్ ముజిబ్ ను కలిశారు. ఈ విషయాన్ని 2004లో కెనడాలోని మాంట్రెల్‌లో డాక్టర్ కమాల్ హుస్సేన్ నాతో చెప్పారు’’ అని ఢాకాలోని సీనియర్ జర్నలిస్ట్ సలీమ్ సమద్ చెప్పారు.
లండన్‌లో షేక్ ముజిబుర్ రెహ్మాన్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడేటప్పుడు కూడా భుట్టోకు అనేకసార్లు శుభాకాంక్షలు చెప్పడం విన్నాను అని చెప్పారు.
‘‘షేక్ ముజిబుర్ రెహ్మన్ జైల్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌కు ఏ స్థాయిలో నష్టం కలిగిస్తుందనే విషయం పై ఎరుకతోనే ఉన్నారు. కానీ ఆయన ఢాకాకు తిరిగొచ్చి, ఇక్కడి పరిస్థితులను చూశాకా, సహజంగానే ఆయన స్వభావంలో మార్పు వచ్చింది’’ అని సమద్ వివరించారు.
గ్రే సూట్, బ్రౌన్ ఓవర్ కోట్
‘‘ముజీబ్ పాలం విమానాశ్రయంలో విమానం నుంచి కాలు బయట పెట్టి, రెడ్ కార్పెట్ పై నడుస్తున్నంతసేపూ ఆయనపై రోజా, మారిగోల్డ్ పూల రేకులు చల్లుతూనే ఉన్నారు. ఆయన సిమెంట్ రంగు సూట్ ధరించారు. దిల్లీలోని చలిని తట్టుకోవడానికి ఆ సూట్ పై కాఫీపొడి రంగు ఓవర్ కోట్ వేసుకున్నారు’’ అని షేక్ ముజిబుర్ రహ్మాన్ దిల్లీ విమానాశ్రయంలో దిగినప్పటి సంఘటననున్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
ఇక బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు భారత ప్రెసిడెంట్ వి.వి.గిరి, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె మంత్రివర్గ సహచరులు విమానం దగ్గరకు రావడం ఎన్‌బీసీ వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో జై బంగ్లా, జైబంగ్లా బంద్ అనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి.
ఆరోజు సాయంత్రం కోల్‌కతా ఆల్ ఇండియా రేడియో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.
ఈ ప్రత్యేక వార్తా కార్యక్రమాన్ని దెబ్దులాల్ బంధోపాధ్యాయ చదివారు.
ఈ ప్రోగ్రామ్ ప్రసారభారతి లైబ్రరీలో నిక్షిప్తమై ఉంది.
‘సంవాద్ విచిత్ర’ పేరుతో ప్రసారమైన ఈ కార్యక్రమం బంగ్లా విముక్తి యుద్ధం సమయంలో అటు బంగ్లాదేశ్‌లోనూ, ఇటు పశ్చిమబెంగాల్‌లోనూ బాగా ప్రసిద్ధి పొందింది.
బంగారు బంగ్లాకు తిరిగివెళుతున్నా
‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా బంగబంధు, బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు, ఏడున్నరకోట్ల బెంగాలీల వివాదరహిత నాయకుడు. షేక్ ముజిబుర్ రహ్మాన్ కు స్వాగతం పలికింది. ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా సమర్పించారు. అని రేడియో కార్యక్రమంలో దెబ్దులాల్ బంధోపాధ్యాయ చదివారు.
ఇండియన్ ప్రెసిడెంట్ వి.వి. గిరి ప్రసంగం కూడా ఈ కార్యక్రమంలో ప్రసారం చేశారు.
దీనికి ప్రతిగా షేక్ ముజిబుర్ రహ్మాన్ మాట్లాడుతూ ‘‘బంగ్లాదేశ్‌కు వెళ్ళే మార్గంలో గొప్పదేశానికి గొప్పరాజధానిగా ఉన్న చోట ఆగాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు.
‘‘బంగారు బంగ్లాకు తిరిగి వెళుతూ నా ప్రియ స్నేహితులకు, భారత ప్రజలకు, ప్రభుత్వాన్ని నడుపుతున్న గొప్ప ప్రధాని ఇందిరాగాంధీకి నా ప్రత్యేక గౌరవాన్ని తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు.
మూడు వాగ్దానాలు నిలుపుకొన్నాం
పాలం విమానాశ్రయంలో షేక్ ముజిబుర్ రహ్మాన్ కు స్వాగతం పలికాక, దిల్లీ కంటోన్మెంట్ సమీపంలో ఆయనకు పౌరసత్కారం చేశారు.
ఈ కార్యక్రమానికి వేలాదిమంది ప్రజలు హాజరైనట్టుగా సంవాద్ విచిత్ర కార్యక్రమంలో దేబ్దులాల బందోపాధ్యాయ చెప్పారు.
ఈ సందర్బంగా ఇందిరాగాంధీ చేసిన ప్రసంగాన్ని కూడా ఈ కార్యక్రమంలో ప్రసారం చేశారు.
‘‘మేం మా భారత ప్రజలకు మూడు వాగ్దానాలు చేశాం. ఇక్కడకు వచ్చిన బంగ్లా శరణార్థులను జాగ్రత్తగా వెనక్కి పంపుతామని చెప్పాం. ముక్తి వాహినికి, బంగ్లా ప్రజలకు వీలైన ప్రతిసాయమూ చేస్తామని చెప్పాం. మూడోది షేక్ సాహెబ్ ను జైలునుంచి తప్పనిసరిగా విడుదల చేయిస్తామని చెప్పాం. మేం మా వాగ్ధానాలను నెరవేర్చాం. షేక్ సాహెబ్ ఇప్పుడు ఆయన ఇంటికి, తన ప్రజల వద్దకు వెళుతున్నారు. జై బంగ్లా’’ అంటూ ఇందిరాగాంధీ తన ప్రసంగాన్ని ముగించారు.
బెంగాలీలో ప్రసంగించిన ముజిబుర్ రెహ్మాన్
పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభలో షేక్ ముజిబుర్ రహ్మాన్ చేసిన ప్రసంగాన్ని ఆకాశవాణి ప్రసారం చేసింది.
‘‘ లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదంపై నాకు నమ్మకముంది. మీ ఆలోచనలు ఇందిరాగాంధీ ఆలోచనలు ఒకేలా ఎందుకు ఉంటాయని నన్ను అడుగుతుంటారు.అవును ఈ ఆదర్శాలు, విధానాలే మా ప్రపంచం, వీటితోనే శాంతి ముడిపడి ఉంది. నేనీ రోజు కొంచెం భావోద్వేగంతో ఉన్నాను. నన్ను క్షమించండి. మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటున్నాను. జై బంగ్లా..జైహింద్’’ అని కొన్ని క్షణాల తరువాత ఆయన జై ఇందిరాగాంధీ అని కూడా అన్నారు.
దీని తరువాత ఇందిరాగాంధీ మైక్‌లో ‘లాంగ్ లివ్ షేక్ ముజిబుర్ రహ్మాన్ ’ అనడం వినిపించింది.
ఇవి కూడా చదవండి :
- ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్: ‘మహిళను గర్భవతిని చేస్తే రూ.5 లక్ష లు ఇస్తాం’ అంటూ సాగే ఈ స్కామ్‌లో బాధితులు ఎలా చిక్కుకుంటున్నారంటే...
- దళితుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని కూతుర్ని చెట్టుకు ఉరివేసి చంపిన తండ్రి... తమిళనాడులో ఘాతుకం
- ఫిటో జైలు నుంచి తప్పించుకుంటే దేశంలో ఎమర్జెన్సీ, నగరాల్లో కర్ఫ్యూ... ఇంతకీ ఎవరీ గ్యాంగ్‌స్టర్?
- చిట్టిమల్లు: పల్నాటి యుద్ధానికి కారణమని చెప్పే ఈ కోడి చరిత్రేంటి?
- E. coli: ఈ 'సూపర్ బగ్' బాక్టీరియా ప్రాణాలు తీస్తుంది... ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్త
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)