బంగ్లాదేశ్‌లో ప్రశాంత్ కుమార్.. భారత్‌లో శివశంకర్ - ఎన్నో దేశాల పాస్‌పోర్ట్‌లు, మరెన్నో మారు పేర్లున్న ఈ హవాలా కింగ్ ఎవరు

భారతదేశంలో అరెస్ట్ అయిన బంగ్లాదేశ్ పౌరుడు ప్రశాంత్ కుమార్‌‌ హల్దార్‌(పీకే హల్దార్)ను తమకు అప్పగించాలని ఆ దేశం కోరింది.

పీకే హల్దార్‌ను హవాలా ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని 'ఉత్తర 24 పరగణాలు' జిల్లాలో అరెస్ట్ చేసింది.

మంగళవారం కోల్‌కతా కోర్టు విచారణ నిమిత్తం హల్దార్‌ను 10 రోజుల కస్టడీకి పంపింది. అంతకుముందు శనివారం ఆయనను కోర్టులో హాజరుపరచగా, విచారణకు రెండు రోజుల సమయం కావాలని ఈడీ కోరింది.

బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మసూద్ బిన్ మోమిన్ మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ, భారతదేశంలోని చట్టాల ప్రకారం హల్దార్ విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.

"ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత భారత్ మాకు సహకరిస్తుంది, మా అభ్యర్థన పరిశీలిస్తుంది. సహకారం అందిస్తామని భారత్ హామీ ఇచ్చింది" అని మోమిన్ చెప్పారు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఖైదీల మార్పిడి కార్యక్రమం కింద పీకే హల్దార్‌ను తమ దేశానికి భారత్ అప్పగిస్తుందని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు.

బంగ్లాదేశ్‌ విదేశాంగ కార్యదర్శి, భారత హైకమిషనర్‌ భేటీ

మంగళవారం ఢాకాలో బంగ్లాదేశ్‌ విదేశాంగ కార్యదర్శి మసూద్ బిన్ మోమిన్, భారత హైకమిషనర్ విక్రమ్ కుమార్ దొరైస్వామి మధ్య జరిగిన భేటీలో పీకే హల్దార్ అంశం చర్చకు వచ్చింది.

బంగ్లాదేశ్‌లో హల్దార్‌పై ఉన్న పెండింగ్‌ కేసుల గురించి మోమిన్, భారత హైకమిషనర్‌కు తెలియజేశారు. ఆయన్ను తమ దేశానికి అప్పగించాలని కోరారు.

హల్దార్‌ను అప్పగించమని భారత్‌ను అధికారికంగా అడిగారా అని మోమిన్‌ను విలేఖరులు ప్రశ్నించగా, "మాకు సహకరించమని భారత్‌ను కోరాం. బంగ్లాదేశ్‌లో హల్దార్‌పై ఉన్న పెండింగ్ కేసుల విచారణ జరపాలంటే ఆయన తిరిగి ఇక్కడకు రావాలి" అని జవాబిచ్చారు.

డిప్లమాటిక్ ఛానల్ ద్వారా పీకే హల్దార్‌ను వెనక్కు పంపించమని అభ్యర్థించనున్నట్లు మోమిన్‌ తెలిపారు.

బంగ్లాదేశ్ ఇచ్చిన సమాచారంతోనే హవాలా వ్యాపారి ప్రశాంత్ కుమార్ హల్దార్‌ను అరెస్ట్ చేసినట్లు భారత హైకమిషనర్ తెలిపారు.

"మీ ప్రభుత్వమే ఈ సమాచారాన్ని భారత ఏజెన్సీలతో పంచుకుంది. భారత ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకున్నాయి. హల్దార్‌ను అరెస్టు చేశారు" అని ఆయన అన్నారు.

హల్దార్‌ను బంగ్లాదేశ్‌కు అప్పగిస్తారా అని విలేఖరులు అడిగారు.

"గత వారం హల్దార్‌ను చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు. మా వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా, బంగ్లాదేశ్‌కు అందజేస్తాం. ఇది క్రిస్మస్ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది కాదు. దీనికి కొంత సమయం పడుతుంది" అని ఆయన జవాబిచ్చారు.

ఈడీ అరెస్టులు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హవాలా కేసుల దర్యాప్తు నిర్వహించింది ఈడీ. అరెస్ట్ అయిన వారిలో కొందరికి భారత నకిలీ గుర్తింపు కార్డులు ఉన్నాయి.

పీకే హల్దార్ " ఈ గ్రూప్ మాస్టర్ మైండ్" అని చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లోని బ్యాంకులో 10,000 కోట్ల టాకాల (బంగ్లాదేశ్ కరెన్సీ) మోసానికి పాల్పడినట్టు పీకే హల్దార్‌పై ఆరోపణలు ఉన్నాయి.

హల్దార్‌కు చాలా మారు పేర్లు ఉన్నాయని ఈడీ చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. భారతదేశంలో ఆయనకు శివశంకర్ హల్దార్ అనే పేరు ఉంది. ఇంటర్‌పోల్ ఆయనపై గ్లోబల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

పీకే హల్దార్‌కు భారత్‌, బంగ్లాదేశ్‌ పాస్‌పోర్టులే కాక కరేబియన్‌ దేశమైన గ్రెనాడా పాస్‌పోర్టు కూడా ఉందని ఈడీ తెలిపింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద పీకే హల్దార్‌తో పాటు అరెస్ట్ అయినవారిలో స్వపన్ మాయిత్రా అలియాస్ స్వపన్ మిస్త్రీ, ఉత్తమ్ మాయిత్రా అలియాస్ ఉత్తమ్ మిస్త్రీ, ఇమామ్ హుస్సేన్ అలియాస్ ఇమాన్ హల్దార్, అమనా సుల్తాన్ అలియాస్ షర్మీ హల్దార్, ప్రాణేశ్ కుమార్ హల్దార్ ఉన్నారు.

శనివారం పీకే హల్దార్‌ను కోర్టులో హాజరుపరిచారు. పశ్చిమ బెంగాల్‌లోని 11 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. పీకే హల్దార్‌కు ఈ ప్రాంతాలన్నిటితో సంబంధం ఉన్నట్టు అనుమానించారు.

పీకే హల్దార్ భారత్‌లో శివశంకర్ హల్దార్ పేరుతో చెలామణీ అవుతున్నారు. ఆయనకు రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాన్, ఆధార్ కార్డ్‌ అన్నీ ఉన్నాయి.

అరెస్ట్ అయిన బంగ్లాదేశీయులు పశ్చిమ బెంగాల్‌లో ప్రోపర్టీ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టారని, భారత్‌లో కంపెనీలు తెరిచారని ఈడీ తెలిపింది.

పీకే హల్దార్ ఎవరు?

పీకే హల్దార్ బంగ్లాదేశ్‌లోని ఒక బ్యాంక్, మరొక ఆర్థిక సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన చాలాకాలంగా పరారీలో ఉన్నారు.

బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్.. పీకే హల్దార్, ఆయన సహచరులపై 34 కేసులు నమోదు చేసింది. హల్దార్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

బంగ్లాదేశ్ మీడియా కథనం ప్రకారం, హల్దార్ తండ్రి ఒక రైతు, తల్లి టీచరు. ఆయన బాల్యం పేదరికంలో గడిచింది. పీకే హల్దార్ ఇంజినీరింగ్ చేసి, తరువాత ఎంబీఏ చేశారు.

బ్యాంకింగ్ రంగంలో పదేళ్ల అనుభవం సంపాదించారు. 2009లో బంగ్లాదేశ్‌లో రిలయన్స్ ఫైనాన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఆరేళ్లపాటు ఎన్‌ఆర్‌బీ గ్లోబల్ బ్యాంక్ ఎండీగా వ్యవహరించారు.

ఈ కాలంలోనే పలు ఆర్థిక సంస్థల్లో 10,000 కోట్లు టాకాల మోసానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)