దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడు, పాకిస్తాన్ గతంలో ఏం చెప్పింది...

ముంబయి వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇల్లు కరాచీలో ఉన్నట్లు, అతడిపై ఆర్థిక ఆంక్షలు విధించినట్లు పాకిస్తాన్ 2020లో విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన ద్వారా తెలిసింది.

అయితే, అది కొత్త నోటిఫికేషన్ ఏం కాదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అప్పట్లో చెప్పింది. 2020 ఆగస్టు 18న జారీ అయిన ఒక నోటిఫికేషన్ గురించి స్థానిక విలేఖరులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ చౌధరి మాట్లాడారు.

‘‘పాకిస్తాన్ 2020 ఆస్టు 18న జారీ చేసిన ఎస్ఆర్ఓ (చట్టబద్ధమైన నోటిఫికేషన్) చాలా పక్కా సమాచారంతో ఉంది. ఇంతకు ముందు జారీ చేసిన ఎస్ఆర్ఓను కూడా ఒక ప్రక్రియ ప్రకారమే ఇచ్చాం. అందుకే నిషేధిత జాబితా, నిషేధిత చర్యల్లో ఎలాంటి మార్పులూ ఉండవు” అని ఆయన అప్పట్లో అన్నారు.

“ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో తాలిబాన్, ఐఎస్, అల్‌ఖైదాల ప్రస్తుత స్థితిని చూపించడానికి 2020 ఆగస్టు 18న రెండు సంయుక్త ఎస్ఆర్ఓలు జారీ చేశాం. అప్పుడప్పుడూ ఈ ఎస్ఆర్ఓలు విడుదల అవుతుంటాయి. అలాగే, చట్టపరమైన అవసరాలు, అంతర్జాతీయ బాధ్యతల ప్రకారం విదేశాంగ శాఖ ఈ ఎస్ఆర్ఓలను ప్రచురిస్తుంది. చివరి ఎస్ఆర్ఓను 2019లో ప్రచురించాం” అని ప్రతినిధి తెలిపారు.

“ఈ ఎస్ఆర్ఓలో ఐక్యరాజ్యసమితి నిషేధించిన వ్యక్తులు, సంస్థల సమాచారం ఉంది. మీడియాలో కొన్ని వర్గాలు ఈ రిపోర్ట్ ద్వారా పాకిస్తాన్ ఏవో కొత్త ఆంక్షలు విధించిందని కథనాలు నడిపిస్తున్నాయి. అది సరికాదు. ఈ ఎస్ఆర్ఓను చూపిస్తూ మా దేశంలో కొందరు ఉన్నట్లు పాకిస్తాన్‌ అంగీకరించిందని భారత మీడియాలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అవి నిరాధారం, కల్పితం” అన్నారు.

పాకిస్తాన్ విదేశాంగ శాఖ గతంలో ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏయే వ్యక్తులు, సంస్థల ఆర్థికకార్యకలాపాలు, పర్యటనలపై నిషేధం విధించిందో, ఆ వ్యక్తులు, సంస్థల ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లను ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా జప్తు చేస్తున్నామని చెప్పింది.

2018 జూన్‌లో పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో పెట్టిన పారిస్‌లోని ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ (ఎఫ్ఏటీఎఫ్), పాకిస్తాన్ 2019 లోపు సదరు సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పింది.

దావూద్‌కు ఎన్ని అడ్రస్‌లు ఉన్నాయి?

పాకిస్తాన్ విదేశాంగ శాఖ జారీ చేసిన జాబితాలో 1993 ముంబయి వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం చిరునామా క్లిఫ్టన్, వైట్‌ హౌస్ అని ఉంది. అది కాకుండా కరాచీలో దావూద్ పేరున మరో రెండు అడ్రస్‌లు కూడా ఉన్నట్టు అందులో చెప్పారు.

దీనితోపాటూ దావూద్‌కు చాలా పేర్లు ఉన్నాయని ఆ జాబితాలో చెప్పారు. ఆతడు మహారాష్ట్రలోని రత్నగిరిలో పుట్టాడని, అతడి భారత పాస్‌పోర్టును రద్దు చేశారని కూడా అందులో ప్రస్తావించారు.

పాకిస్తాన్ ప్రభుత్వం 2020 ఆగస్టు 18న ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 88 తీవ్రవాద సంస్థలు, వ్యక్తులపై విధించిన ఆర్థిక ఆంక్షల సమాచారం ఉంది.

వాటిలో జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పేర్లు కూడా ఉన్నాయి.

సోషల్ మీడియాలో జోరుగా చర్చ

దావూద్ ఇబ్రహీం చిరునామాకు సంబంధించిన వార్తలు వెలుగులోకి రాగానే, సోషల్ మీడియాలో దీనిపై జోరుగా చర్చ జరిగింది. చాలా మంది దీని గురించి ట్వీట్లు చేశారు.

“భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన సమయం వచ్చింద”ని మంజరీ యశ్వంత్ ట్వీట్ చేశారు.

జర్నలిస్ట్ రవిందర్ సింగ్ రాబిన్ మాత్రం “పాకిస్తాన్ ఇందులో కొత్తగా ఏం చెప్పలేదు. పాకిస్తాన్ పీఆర్ ఎక్సర్‌సైజ్ చూసి మోసపోకండి. అసలు నిజం ఏంటంటే పాకిస్తాన్‌లో వీళ్లంతా జల్సా చేస్తున్నారు” అని అప్పట్లో అన్నారు.

దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉంటున్నాడని భారత్ చాలాకాలంగా చెబుతోంది. కానీ పాకిస్తాన్ భారత్ వాదనలు కొట్టిపారేస్తూ వస్తోంది.

దావూద్ ఇబ్రహీంపై ముంబయి బాంబు పేలుళ్లతోపాటూ హవాలా, కిడ్నాపింగ్ లాంటి కేసులు ఉన్నాయి. ముంబయి బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోయారు, 700 మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)