You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తమిళనాడులోని కీళడి తవ్వకాల్లో బయల్పడిన 2,600 ఏళ్ల నాటి పట్టణ నాగరికత... ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో తొలి పట్టణ నాగరికత సింధూ లోయ నాగరికత. గంగా నదీ తీర పట్టణ నాగరికత ఒక్కటే దేశంలో రెండో పట్టణ నాగరికతని, ఆ కాలంలో మరే పట్టణ నాగరికతా లేదని భావిస్తూ వస్తున్నారు. తమిళనాడులోని కీళడిలో ఇటీవల బయల్పడిన ఆధారాలు ఈ భావనను తోసిపుచ్చుతున్నాయి.
మదురై నగరానికి సమీపంలోని కీళడిలో పురావస్తు తవ్వకాల్లో 13 మనిషి బొమ్మలు, జంతువుల బొమ్మలు మూడు, టెర్రకోటతో చేసిన 650 ఆటవస్తువులు, 35 చెవి రింగులు బయల్పడ్డాయి. పురావస్తు శాఖ గుర్తించిన వస్తువుల్లో పూజించడాన్ని సూచించేది ఏదీ లేదు.
శివగంగ జిల్లా పరిధిలోకి వచ్చే కీళడి గ్రామం మదురై నగరానికి ఆగ్నేయ దిశలో 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. కీళడిలో పురావస్తు పరిశోధకులు పెద్దయెత్తున పరిశోధన నిర్వహించారు. తవ్వకాలు జరిపిన ప్రదేశం వైగై నదికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
దక్షిణ భారతంలో సంగం కాలం వాస్తవానికి ఇంతకుముందు నమోదు చేసినదాని కన్నా 300 ఏళ్లు ఎక్కువ ప్రాచీనమైనదని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. వీటి ప్రకారం 2,600 ఏళ్ల క్రితమే సంగం పట్టణ నాగరికత ఉంది.
ఈ ప్రాంతంలో సుమారు రెండు వేల ఏళ్ల క్రితం మనిషి ఆవాసం ఉండిందనే ఆధారాలను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) 2014లో గుర్తించింది.
2017 కీళడి తవ్వకాల్లో బయటపడ్డ ఒక చార్‌కోల్ (బొగ్గు) పదార్థం ఈ ఆవాసం క్రీస్తుపూర్వం రెండు వందల ఏళ్ల నాటిదని సూచించింది. కార్బన్ డేటింగ్ పరీక్షలో ఈ విషయం వెల్లడైంది.
అప్పటి తవ్వకాల పర్యవేక్షణాధికారి అమర్‌నాథ్ రామకృష్ణన్, మరిన్ని పరిశోధనల కోసం దరఖాస్తు చేశారు. తర్వాత ఆయన అస్సాంకు బదిలీ అయ్యారు.
ఆ తర్వాత తమిళనాడు ఆర్కియలాజికల్ సర్వే విభాగం ఈ పరిశోధనను కొనసాగించాలని నిర్ణయించింది.
2018లో చేపట్టిన నాలుగో విడత పరిశోధన ఫలితాల ఆధారంగా రూపొందించిన ఒక నివేదికను ఈ నెల 19న తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసింది.
ఏ కాలానివి?
కీళడి తవ్వకాల్లో వెలుగుచూసిన ఆరు వస్తువులను అధికారులు అమెరికాలోని ఫ్లోరిడాకు 'యాక్సిలరేటెడ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ' అనే పరీక్ష నిమిత్తం పంపించారు. ఈ వస్తువులు క్రీస్తుపూర్వం ఆరు, మూడు శతాబ్దాల మధ్య కాలానివని పరీక్షలో తేలింది.
భూమి ఉపరితలం నుంచి 353 సెంటీమీటర్ల లోతులో బయటపడిన వస్తువులు క్రీస్తుపూర్వం 580వ సంవత్సరానివని, 200 సెంటీమీటర్ల లోతులో దొరికినవి క్రీస్తుపూర్వం 205వ సంవత్సరానివని పరిశోధనలో వెల్లడైంది.
ఈ రెండు లోతుల ఎగువన, దిగువన ఇంకా వస్తువులు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకొని, కీళడి తవ్వకాల ప్రాంతం క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానిదని ఆర్కియలాజికల్ విభాగం తేల్చింది.
ప్రస్తుతం తమిళనాడు చరిత్ర క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంతో మొదలవుతుంది. గంగా నదీ తీర పట్టణ నాగరికత మాదిరి, అప్పట్లో తమిళనాడులో పట్టణ నాగరికత లేదని అధ్యయనకారులు భావిస్తూ వస్తున్నారు. గంగా పట్టణ నాగరికత కాలంలోనే తమిళనాడులో పట్టణ నాగరికత ప్రారంభమైందని కీళడి తవ్వకాల్లో లభించిన తాజా ఆధారాలు చెబుతున్నాయి.
కోడుమనల్, అళగాంకులంలో లోగడ లభించిన శాసనాలను బట్టి తమిళ బ్రాహ్మి లిపి క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నాటిదని భావించారు. కీళడిలో బయల్పడిన వస్తువులు ఈ లిపి క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దానిదని సూచిస్తున్నాయి.
కీళడిలో సుమారు 2,600 ఏళ్ల క్రితం నివసించినవారు అక్షరాస్యులని, వారికి చదవడం, రాయడం వచ్చని ఈ ఆధారాలను బట్టి తెలుస్తోందని తమిళనాడు పురావస్తు శాఖ తెలిపింది.
కీళడి తవ్వకాల్లో పరిశోధకులకు సుమారు 70 ఎముకలు లభించాయి. వీటిలో 53 శాతం ఎముకలు ఎద్దు, బర్రె, మేకలు, ఆవులు లాంటి జంతువులవి. నాటి ప్రజలు పశుపోషణ చేసినట్లు వీటిని బట్టి స్పష్టమవుతోంది.
ఇక్కడ దొరికిన షెల్స్, కళాఖండాల్లో ఇసుక, ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం ఉన్నట్లు గుర్తించారు.
భారత్‌లో గుర్తించిన అత్యంత పురాతన శాసనం సింధు లోయ నాగరికతది. సింధు లోయ నాగరికత ముగిశాక, తమిళ బ్రాహ్మి లిపిలో శాసనాలు రూపొందించక ముందు శాసనాలు వేయడానికి గ్రాఫిటీ అనే పద్ధతి వాడుకలో ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
సింధూ నాగరికత శాసనాల మాదిరి, ఈ గ్రాఫిటీ పద్ధతులను అర్థం చేసుకోవాల్సి ఉంది. మెగాలిథిక్ నాగరికతలో, కాంస్య యుగ నాగరికతలో ఈ పద్ధతుల్లో రాసిన శాసనాలు ఉన్నాయి.
తమిళనాడులో అతిచనలూర్, అళగాంకులం, కోడుమనల్, తవ్వకాలు జరిపిన ఇతర ప్రదేశాల్లో ఇలాంటి శాసనాలు కుండలపై కనిపించాయి. శ్రీలంకలోని తిస్సమహరామ, కంథరోడై, మంథయి, రిడియగామల్లోనూ ఇవి బయటపడ్డాయి.
కీళడిలో 1001 కళాఖండాల్లో ఈ శాసనాలు కనిపించాయి. 56 కళాకృతులపై తమిళ బ్రాహ్మి లిపిలో శాసననాలు ఉన్నాయి. ఆద, ఆదన్ అనే పదాలు కూడా ఉన్నాయి.
అత్యధిక కళాఖండాలపై ఈ రాతలు కుండకు భుజం భాగంపై ఉన్నాయి. ఈ రాతలను సాధారణ పద్ధతికి భిన్నంగా, కుండ పూర్తిగా తయారై ఆరిపోయాక రాశారు. ఒకరి కంటే ఎక్కువ మంది వీటిని రాసి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.
కీళడిలో నాలుగు మీటర్ల ఎత్తున్న కుండ లాంటి కళాఖండాలను పెద్దమొత్తంలో రెండు చోట్ల కనుగొన్నారు. నాడు కుండల తయారీ పరిశ్రమ భారీగా ఉండేదని వీటి ఆధారంగా ఆర్కియలాజికల్ విభాగం అంచనాకు వచ్చింది.
నేత పనిలో వాడే సామగ్రిని కూడా ఇక్కడ గుర్తించారు.
నాటి మహిళలు ధరించిన ఏడు వేర్వేరు ఆభరణాల్లోని కొన్ని భాగాలను పరిశోధకులు కనుగొన్నారు. టెర్రకోటతో తయారుచేసిన ఆటవస్తువులు కూడా గుర్తించారు.
కార్నీలియం, అకోట్‌తో తయారుచేసిన పూసలు కీళడిలో దొరికాయి. ఇవి సాధారణంగా గుజరాత్, మహారాష్ట్రల్లో లభిస్తుంటాయి.
13 మనిషి బొమ్మలు, జంతువుల బొమ్మలు మూడు, టెర్రకోటతో తయారుచేసిన 650 ఆటవస్తువులు, 35 చెవిదిద్దులను ఆర్కియలాజికల్ విభాగం గుర్తించింది. పూజించడాన్ని సూచించే వస్తువేదీ కనిపించలేదు.
కీళడి ప్రత్యేకత
ఇటుక ఆధారిత నిర్మాణం ఆధారాలు తొలిసారిగా కీళడిలోనే బయటపడ్డాయి. తమిళ్ సంగం కాలం మూడో శతాబ్దం, రెండో శతాబ్దం మధ్యదని ఇప్పటివరకు పరిగణిస్తూ వచ్చారు.
కీళడిలో ఇటీవల బ్రాహ్మి లిపిలో లభించిన శాసనాలను బట్టి సంగం కాలం అంతకంటే ఇంకా మూడు వందల ఏళ్లు పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు.
భారత్‌లో తొలి పట్టణ నాగరికత సింధూ లోయ నాగరికతది. గంగా పట్టణ నాగరికత రెండో పట్టణ నాగరికత. గంగా పట్టణ నాగరికత కాలంలో భారత్‌లో మరే పట్టణ నాగరికతా లేదని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఈ భావన తప్పని తొలిసారిగా కీళడి ఆధారాలు రుజువు చేశాయి. గంగా పట్టణ నాగరికత కాలంలోనే భారత్‌లో మరో పట్టణ నాగరికత ఉందని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
సింధు లోయ పట్టణ నాగరికత తర్వాత, గంగా పట్టణ నాగరికత మాదిరి దక్షిణ భారతదేశంలోనూ తమిళ్ సంగం పట్టణ నాగరికత రెండో పట్టణ నాగరికతగా విలసిల్లిందని వీటిని బట్టి చెప్పొచ్చు.
ఉత్తర భారతదేశంలోని ప్రజలతో, రోమన్లతో కీళడి ప్రాంత ప్రజలు వ్యాపారం సాగించినట్లు ఇక్కడ లభించిన చాలా కళఖండాలు సూచిస్తున్నాయి.
తదుపరి విడత తవ్వకాల్లో భాగంగా కీళడి పరిసర ప్రాంతాలైన కొంతగయ్, అగరం, మనలూర్‌లలో పరిశోధనలు సాగించనున్నామని తమిళనాడు ఆర్కియలాజికల్ సర్వే విభాగం కార్యదర్శి టి.ఉదయచంద్రన్ చెప్పారు. అతిచనలూర్లో కొత్తగా పరిశోధనలు చేపట్టనున్నామని తెలిపారు.
ఈ ప్రాంతంలోని తొలి మానవులు చనిపోయినవారిని కొంతగాయ్‌లో ఖననం చేసి ఉండొచ్చని తాము భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తాము కామరాజ్ విశ్వవిద్యాలయంతో, అలాగే అవసరమైన డీఎన్‌ఏ పరిశోధనల కోసం అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో కలిసి పనిచేస్తున్నామని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు: అసలు భారతదేశ జాతీయ భాష ఏమిటి? అధికార భాషలు ఏవి?
- ‘ఉద్యోగాల లోటు లేదు, ఉత్తర భారతీయుల్లో వాటికి అర్హులు లేరు’ - కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
- మన్మోహన్ సింగ్: ప్రొఫెసర్ నుంచి ప్రధాని పదవి వరకు..
- చిన్మయానందపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విద్యార్థిని అరెస్టు
- శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు?
- చెన్నైలో 20 ఏళ్ల కిందట కిడ్నాపైన బాలుడు.. అమెరికా నుంచి తిరిగొచ్చాడు. ఎలాగంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)