పీరియడ్స్ లీవ్ అడగడానికి ఇంకా సిగ్గుపడాలా, వివిధ దేశాలలో చట్టాలు ఏం చెబుతున్నాయి?

    • రచయిత, క్రిస్టియన్ జానెట్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ఉద్యోగం చేసే మహిళలకు వేతన చెల్లింపుతో కూడిన 'నెలసరి సెలవు' ఇవ్వాలని స్పెయిన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా చట్టానికి స్పెయిన్ ఆమోదం తెలిపింది. అయితే, ఈ చట్టాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది.

ఈ ముసాయిదా ప్రతి పీరియడ్స్ సమయంలో మహిళలకు వేతనంతో కూడిన మూడు రోజుల పాటు సెలవు ఇచ్చే నిబంధనను చేర్చారు. నొప్పి తీవ్రంగా(డిస్మెనోహియా) ఉన్న సందర్భంలో దీన్ని 5 రోజులకు పొడిగించవచ్చని కూడా అందులో పేర్కొన్నారు.

మహిళల పునరుత్పత్తి హక్కులకు సంబంధించిన చట్టంలో భాగంగా ఈ నిబంధనలను ప్రవేశ పెట్టాలని ఆ దేశ ప్రభుత్వం భావించింది. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే ఈ తరహా చట్టం చేసిన తొలి యూరప్ దేశంగా స్పెయిన్ నిలుస్తుంది.

''నెలసరికి సంబంధించిన చర్చ ఒక రహస్యంగా ఉండాలని మేం కోరుకోవడం లేదు. ఏదైనా సమస్య ఉంటే అది వైద్యపరంగా చికిత్సకు నోచుకోవాలి. సిక్ లీవ్ ఇవ్వడం అనేది ఒక మంచి ప్రయత్నంగా భావిస్తున్నాం'' అని స్పెయిన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సెక్రటరీ ఏంజెలా రోడ్రిగెజ్ స్థానిక మీడియాతో అన్నారు.

నెలసరి సమయంలో మెడికల్ లీవ్‌ను ఇస్తున్న దేశాలు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా ఆసియా దేశాలు ఎక్కువగా ఈ చొరవ తీసుకున్నాయి. జపాన్, తైవాన్, ఇండోనేషియాలాంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారతదేశంలో పలు కార్పొరేట్ సంస్థలు కూడా పీరియడ్స్ సెలవులు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.

ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ తమ కంపెనీలో పనిచేసే మహిళలకు పీరియడ్స్ లీవ్ పాలసీ ప్రకటించింది. దీనికి ముందే మూడు భారతీయ సంస్థలు కూడా మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ లీవ్ ప్రకటించాయి.

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో 2020లో మహిళలకు పీరియడ్స్ లీవ్ ప్రకటించింది. 2021లో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ మహిళలకు నెలకు 2 రోజులు "టైమ్ ఆఫ్"ను ప్రకటించింది. ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ కూడా మహిళా ఉద్యోగులకు నెలకొక పీరియడ్స్ లీవ్ ప్రకటించింది.

మహిళలకు మెటర్నిటీ లీవ్ లాగే ఇది కూడా చాలా ముఖ్యమైన నిర్ణయమని ఈ చట్టానికి మద్ధతిచ్చే వారు చెబుతున్నారు. దీనిపట్ల ఉన్న అపోహలు తగ్గుతాయని, ఈ కారణంగా మహిళలకు ఉద్యోగం ఇవ్వకుండా ఉండాలనుకునే మనస్తత్వం ఉన్నవారిపై ఇది ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు.

'పురుష సహోద్యోగులు వ్యతిరేకించారు'

తాను స్కూలు రోజుల నుంచి పీరియడ్స్ సమయంలో ఎంతో నొప్పిని అనుభవించేదానినని ఇండోనేషియాకు చెందిన టీవీ జర్నలిస్ట్ ఇరీన్ వర్ధనీ అన్నారు. ఇప్పుడామె తన సంస్థ నుంచి ప్రతి నెలా రెండు రోజులు పీరియడ్స్ లీవ్ తీసుకుంటున్నారు.

''పీరియడ్స్ రావడానికి ముందు నాకు విపరీతమైన నొప్పి కలుగుతుంది. బాగా అలసిపోతాను. మైగ్రైన్ తలనొప్పి వచ్చేది. కండరాలు తీవ్రంగా నొప్పి పెట్టేవి. జ్వరం వచ్చినట్లు అనిపించేది. ఇలా రెండు మూడు రోజులుండేది'' అని ఇరీన్ వర్ధనీ అన్నారు.

''నెలసరి కోసం పురుషులను సెలవు అడగడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించుకోండి. మొదట్లో ఇతరులు ఏమనుకుంటారో అని ఇబ్బంది పడేదాన్ని. కానీ, ఇప్పుడు మా మేనేజర్‌ కు చిన్న మెయిల్ పంపుతాను. వాళ్లు నాకు ఎంతో సహకరించారు'' అని ఇరీన్ అన్నారు.

''ఇది చాలా చిన్న విషయం. నెలసరి లీవ్ గురించి సూపర్‌ వైజర్‌కు మెయిల్ చేసి, షెడ్యూలర్‌కు గుర్తు చేస్తే సరిపోతుంది. మొదట్లో కొందరు నా మగ సహోద్యోగులు ఇది అన్యాయం అని వాదించారు'' అని ఇరీన్ వెల్లడించారు.

అయితే, నెలసరి రోజున సెలవు అడగొచ్చని ఇరీన్ లాగా ఇండోనేషియాలో చాలామంది మహిళా ఉద్యోగులకు తెలియదు.

''నేను మీడియాలో పనిచేసే చాలామంది మహిళలతో మాట్లాడాను. వాళ్లలో ఎక్కువమందికి ఈ పాలసీ ఒకటి ఉన్నట్లు తెలియదు. నెలసరి సమయంలో ఇబ్బంది పడుతూనే వారు ఉద్యోగం చేసేవారు'' అన్నారు ఇరీన్.

ఏడాదికి 24 రోజులు పీరియడ్స్ సెలవులు ఇవ్వాలని ఇండోనేషియాలో నిబంధనలు ఉన్నాయి. కానీ వాటి అమలు గురించి ఎవరికీ పెద్దగా పట్టింపు ఉన్నట్లు కనిపించదు.

''ఈ నిబంధనల అమలులో అనేక లోపాలున్నాయి. కొందరికి కేవలం ఒక్కరోజే సెలవు ఇస్తున్నారు. కొందరికి అది కూడా లేదు'' అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పేర్కొంది.

దుస్తుల తయారీ రంగంలో పని చేస్తున్న వివి విద్యావతి మహిళల హక్కుల పై పని చేస్తున్నారు. సర్వీస్, రిటైల్ సెక్టార్ లో ఉన్నవారితో పోలిస్తే దుస్తుల పరిశ్రమలో ఉండేవారు నెలసరి సెలవులు పొందడం చాలా కష్టమని వివి విద్యావతి అన్నారు.

''చిన్నచిన్న వృత్తుల్లో కొనసాగేవారికి అసలు ఈ నిబంధనలు ఉన్నట్లు తెలియదు. పైగా, దీనిలో ఉన్న ప్రధానమైన ఇబ్బంది వారు డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి. పీరియడ్స్ లీవ్ అడిగే సందర్భంలో వారు లైంగిక వేధింపులకు, ఇబ్బందులకు గురవుతారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, పీరియడ్స్ సెలవులకు జీతం ఇవ్వరు'' అని విద్యావతి అన్నారు.

డిస్మెనోహియా అంటే ఏంటి ?

  • నెలసరి సమయంలో దాదాపు మహిళలందరూ నొప్పిని అనుభవిస్తారు. కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుంది. దీనినే వైద్య పరిభాషలో డిస్మెనోహియా అంటారు.
  • డిస్మెనోహియా కలిగినప్పుడు పొట్టలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అది పొట్ట నుంచి నడుము, తొడల వరకు వ్యాపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒక్కోసారి కడపులో వికారం, వాంతులు, విరేచనాలు, మైగ్రైన్ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
  • డిస్మెనోహియాకు అనేక అంశాలు కారణమవుతాయి. ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ స్థాయిల్లో అసమతుల్యత వల్ల ఇది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ హార్మోన్ గర్భసంచి అంచులలో విడుదలై, అది కుచించుకు పోవడానికి కారణమవుతుంది. ఇది ఎంత ఎక్కువ విడుదలైతే, అంత ఎక్కువగా గర్భసంచి కుచించుకుపోతుంది. అప్పుడు నొప్పి కూడా పెరుగుతుంది.
  • డిస్మెనోహియా సమస్య మహిళల్లో సర్వసాధారణంగా కలుగుతుందని, 20శాతం మంది మహిళలకు ఈ సమస్య కారణంగా రోజువారి పనుల్లో ఇబ్బంది కలుగుతుందని పరిశోధనల్లో తేలింది.
  • బీబీసీ రేడియో-5 కోసం 2016 లో వెయ్యిమంది మహిళలపై యూగవ్(YouGov) సర్వే నిర్వహించారు. ఇందులో 52శాతం మంది మహిళలు డిస్మెనోహియా సమస్య కారణంగా పనిలో ఇబ్బంది ఎదుర్కొన్నారని, వారిలో 27శాతం మంది మాత్రమే పీరియడ్స్ కారణంగా తాము పని మీద శ్రద్ధపెట్ట లేకపోయామని తమ బాస్‌కు చెప్పగలిగారు.

ఇప్పటికీ ఇది సిగ్గుపడే అంశమా?

గత 70 ఏళ్లుగా జపాన్ లో పీరియడ్స్ లీవ్ అమల్లో ఉంది. మైనింగ్ కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్లకు కంపెనీలు సరైన బాత్‌రూమ్ సదుపాయాలు కల్పించలేకపోవడంతో ఇది వారికి హక్కుగా లభించింది. అయితే, ఈ లీవ్ తీసుకునేవారు ఇప్పటికీ తక్కువేనని అక్కడి ప్రచారకర్తలు చెబుతున్నారు.

''చాలా కొద్దిమంది మహిళలు మాత్రమే జపాన్ లో పీరియడ్స్ లీవ్ తీసుకుంటారు'' అని మిన్నా నో సీరి ( ప్రతిఒక్కరి పీరియడ్) అనే మెనుస్ట్రువల్ యాక్టివిజమ్ ఆర్గనైజేషన్ కు చెందిన అయుమి తనిగుచి అన్నారు.

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 మధ్య కేవలం 0.9శాతం మంది మాత్రమే పీరియడ్స్ లీవ్ అడిగారు.

''దీని చుట్టూ ఒక అపోహ నెలకొని ఉంది. రుతుక్రమంలో ఉన్న మహళలు, పని చేసేచోట చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా పురుషాధిపత్యం ఉండే వర్క్‌ప్లేస్‌లలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువ'' అని అయుమి తనిగుచి అన్నారు.

''చాలా కంపెనీలు పెయిడ్ పీరియడ్ లీవ్‌లు ఇవ్వడం లేదు. అందుకే వాటిని వార్షిక సెలవుల్లాగే తీసుకుంటున్నారు తప్ప పీరియడ్స్ లీవ్ గా చెప్పడం లేదు. అసలు దీని గురించి అడగడం చాలా బిడియం, సిగ్గుతో కూడిన వ్యవహారం'' అన్నారామె.

దక్షిణ కొరియా 1953లోనే పీరియడ్స్ లీవ్‌ను అమలులోకి తెచ్చింది. 2001లో లేబర్ స్టాండర్డ్స్ యాక్ట్ లోని ఆర్టికల్ 73ని అమలు చేయడం ద్వారా నెలలో ఒక రోజు ఉద్యోగి అభ్యర్ధన మేరకు అదనంగా సెలవు పొందవచ్చు. అయితే, ఇది అన్ పెయిడ్ లీవ్.

అదే సంవత్సరం మహిళలకు చట్టబద్ధమైన పీరియడ్స్ లీవ్ ను ఉపయోగించడానికి అంగీకరించని ఒక కంపెనీ సీఈఓ కు దక్షిణ కొరియా కోర్టు 1800 డాలర్ల( దాదాపు రూ. 1 లక్షా 40 వేలు ) జరిమానా విధించింది.

''నేను ఇంతకు ముందు పని చేసిన కంపెనీలో మహిళలు ఈ సమస్య వచ్చినప్పుడు భరించేవారు. లేదంటే వార్షిక లీవులను ఉపయోగించుకునే వారు. నాకు కూడా వేరే ఛాయిస్ ఉండేది కాదు. భరించేదాన్ని'' అని కిమ్ మిన్-జి అన్నారు.

ఆమె దక్షిణ కొరియాలో పీరియడ్స్ పై అవగాహన కలిగించే ఒక సంస్థలో పని చేస్తున్నారు.

''దక్షిణ కొరియాలో పోటీ తత్వం ఎక్కువ. కాబట్టి, ఉద్యోగులు ఈ బాధను భరిస్తూ పనిచేసే వారు. భరించక తప్పేది కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సమస్య సామాజికమైంది. ఇక్కడ పీరియడ్స్ లీవ్ తీసుకోవడం చాలా కష్టం'' అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)