బంగ్లాదేశ్ ఇస్కాన్ టెంపుల్: 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయంపై దాడి, అసలు కథ ఏంటి?

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం ఒక హిందు దేవాలయంపై ఆందోళనకారుల సమూహం దాడికి తెగబడింది. ఆలయ ప్రహారి గోడలోని కొంతభాగాన్ని కూల్చివేసింది.

ఆందోళనకారుల దాడిలో తన సహాయకులు ఇద్దరు గాయపడినట్లు రాధాకాంతా ఇస్కాన్ దేవాలయ పూజారి కృష్ణా దాస్ ఆరోపించారు.

ఈ ఘటన వెనుక భూమికి సంబంధించిన వివాదం ఉన్నట్లు చెబుతున్నారు.

స్థానిక మత సంస్థలు ఆలయంపై దాడిని ఖండించాయి. ఆలయ భూమి విషయంలో స్థానికంగా బలంగా ఉన్న ఒక వర్గానికి మధ్య ఏర్పడిన వివాదం కారణంగానే తాజా ఘటన జరిగిందని 'హిందూ బౌద్ధ్ ముస్లిం ఏక్తా పరిషత్' వ్యాఖ్యానించింది.

అదే సమయంలో దాడి ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు చెబుతున్నారు.

భూయాజమాన్య హక్కులు ఉన్న ఒక వర్గం అక్కడ మరమ్మతులు చేస్తోన్న సమయంలో ఆలయ పాత గోడలు పడిపోయినట్లు పోలీసులు అంటున్నారు.

అయితే, దాడి ఆరోపణల తర్వాత ఆలయం చుట్టూ పోలీసు బలగాలను మోహరించారు.

ఈ ఆలయం పాత ఢాకాలోని వారీ అనే ప్రాంతంలో 16 కత్తల (0.26 ఎకరాలు) భూమిలో ఉంది. అధికారులు చెప్పినదాని ప్రకారం ఇది 200 ఏళ్ల పురాతన ఆలయం.

ఘటనపై భిన్న వాదనలు

గురువారం ఆలయంపై జరిగిన దాడి పరిణామాలపై భిన్న వాదనలు ఉన్నాయి.

గురువారం సాయంత్రం కొంతమంది ఆలయ ప్రహారి గోడను కూల్చివేశారని ఆలయ పూజారి కృష్ణా దాస్ ఆరోపించారు.

అడ్డుకోవడానికి వెళ్లిన ఇద్దరు ఆలయ సిబ్బందిని వారు కొట్టారని ఆయన అన్నారు.

ప్రహారీగోడను కూల్చివేసి దేవాలయ పరిసరాల్లోకి ప్రవేశించిన కొంతమంది దుండగులు మరమ్మతుల పని కోసం తెచ్చిన ఇనుప కడ్డీలతో పాటు ఒక విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారని తెలిపారు.

మరోవైపు హిందూ బౌద్ధ్ ముస్లిం ఏక్తా పరిషత్‌కు చెందిన ఒక బృందం శుక్రవారం ఆలయాన్ని సందర్శించింది. ఆలయానికి చెందిన ప్రహారి గోడ కూలిపోయిందని, కానీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పరిషత్ పేర్కొంది.

పరిషత్ సంయుక్త కార్యదర్శి మోనిందర్ కుమార్ నాథ్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులు ఆలయాన్ని సందర్శించారు.

ఆలయంలో శిథిలావస్థలో ఉన్న ప్రహారి గోడలోని కొంతభాగం ఆందోళనకారుల దాడుల్లో కూలిపోయిందని, ఈ సందర్భంగా ఇద్దరు ఆలయ సహాయకులు గాయపడ్డారని ఆయన తెలిపారు.

ఆలయంలో ఇవి తప్ప మరే ఇతర ఘటనలు జరిగిన సూచనలు లేవని ఆయన అన్నారు.

ఏం కారణం చెబుతున్నారు?

ఈ ఘటన వెనుక ఉన్న భూవివాదం తెరపైకి వస్తోంది.

స్థానికంగా బాగా పేరున్న ఒక వ్యక్తి, ఆలయంలోని కొంత భాగం తనకు చెందినదే అని కొన్నేళ్లుగా వాదిస్తున్నారని మోనిందర్ నాథ్ చెప్పారు.

దీనికి సంబంధించి చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ గొడవకు ఇంకా పరిష్కారం లభించలేదు.

ఆలయ భూమిపై తనకు హక్కు ఉందని చెప్పుకొనే ఆ వ్యక్తికి చెందిన మనుషులే తాజా దాడికి పాల్పడ్డారు. ప్రహారి గోడ కొంతభాగాన్ని ధ్వంసం చేసి భూమిని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నించారు అని అక్కడివారు పేర్కొంటున్నారు.

ఆలయ పూజారి కృష్ణా దాస్ కూడా ఈ రకమైన వాదననే వినిపించారు.

అయితే స్థానిక పోలీసులు మాత్రం ఆలయంపై దాడి ఆరోపణలను ఖండిస్తున్నారు. ఎలాంటి దాడి జరగలేదని అంటున్నారు.

ఆలయంపై దాడి ఆరోపణలు నిజం కావు అని వారీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ కబీర్ హుస్సేన్ అన్నారు.

కబీర్ హుస్సేన్ చెప్పినదాని ప్రకారం, స్థానిక వ్యాపారవేత్త హాజీ సఫీవుల్లా ఆలయానికి సమీపంలో ఉన్న ఒక స్థలంపై యాజమాన్య హక్కులను కలిగి ఉన్నారు.

అక్కడ నిర్మాణ పనుల కారణంగా ఆలయానికి చెందిన శిథిలావస్థలో ఉన్న గోడ కొంతభాగం కూలిపోయిందని కబీర్ చెప్పారు.

తమ ఫిర్యాదుపై పోలీసుల ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆలయ పాలకులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు పోలీసులు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.

ఆలయంపై దాడి చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తితో బీబీసీ మాట్లాడలేకపోయింది.

ట్విట్టర్‌లో ఆలయంపై దాడి వార్తలు

ఆలయంపై దాడికి సంబంధించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంలో ఈ ఘటనపై సర్వత్రా చర్చ ప్రారంభమైంది.

''ఆలయంపై దాడి జరిగింది. గోడను ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ఎత్తుకెళ్లిపోయారు'' అని వైర్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూ ట్విట్టర్ హ్యాండిల్‌ ఒక ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ ఆధారంగా భారత మీడియాలో ఈ దాడికి సంబంధించిన వార్తలు ప్రసారం అయ్యాయి.

గురువారం 'షబ్-ఎ-బారాత్' సందర్భంగా హిందూ దేవాలయంపై దాడి జరిగిందని నివేదికలు పేర్కొన్నాయి.

అయితే నివేదికల్లో పేర్కొన్నట్లుగా గురువారం బంగ్లాదేశ్‌లో 'షబ్-ఎ-బారాత్' జరుపుకోలేదు. ఆలయం లోపలి పరిసరాల్లో దాడులతో పాటు విగ్రహ చోరీ ఆరోపణలు కూడా నిజం కావని తేలాయి.

ఈ ఘటన మతపరమైన కోణంలో జరగలేదని, కేవలం భూవివాదం కారణంగానే తలెత్తిందని అన్ని వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)