పాకిస్తాన్ టార్గెట్ చేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చరిత్ర ఏంటి... ఈ మిలిటెంట్ సంస్థ ఇరాన్ నుంచి పని చేస్తోందా?

ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌‌లో పాకిస్తాన్ జనవరి 18న క్షిపణి దాడులు చేసింది. 16న తమ భూభాగంలో ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఈ దాడులకు దిగింది.

ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ‘టెర్రరిస్టుల రహస్య స్థావరాలను’ లక్ష్యంగా చేసుకుని ‘మర్గ్ బర్ సర్మచార్’ పేరిట ఆపరేషన్ నిర్వహించినట్లు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది.

ఇరాన్‌లోని పాకిస్తాన్ మూలాలున్న టెర్రరిస్టులు తమని తాము సర్మచార్ అని చెప్పుకుంటారని నిపుణులు అంటారు.

మర్గ్ బర్ సర్మచార్ అంటే ఇరాన్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ ‘తీవ్రవాదులను’ చంపేసే కార్యక్రమం.

పాక్ విదేశీ వ్యవహారాలశాఖ విడుదల చేసిన ప్రకటనలో పాకిస్తాన్‌లో రక్తపాతానికి కారణమైన టెర్రరిస్టులు, ఇరాన్‌ భూభాగంలో ప్రభుత్వ నియంత్రణ లేని ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని పేర్కొంది.

టెర్రరిస్టు గ్రూపుల గురించి ఇరాన్‌కు చాలాసార్లు చెప్పి చూశామని, కానీ ఇరాన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తామే చర్యలకు ఉపక్రమించామని పాకిస్తాన్ తెలిపింది.

జనవరి 16న పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. ఆ ప్రాంతంలో మిలిటెంట్ సంస్థ జైష్ అల్ అదిల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది.

పాకిస్తాన్‌ భూభాగం నుంచి తమ దేశంపై జైష్ అల్ అదిల్ సంస్థ దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది.

అయితే, పాకిస్తాన్ విడుదల చేసిన ప్రకటనలో ఏ మిలిటెంట్ సంస్థకు వ్యతిరేకంగా దాడులు చేపట్టారో ప్రస్తావించలేదు.

అయినప్పటికీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) లక్ష్యంగానే ఈ దాడులు చేసినట్లుగా చెప్తున్నారు.

అయితే ఇరాన్‌లో తమకు ఎలాంటి స్థావరాలు లేవని బీఎల్ఏ చెబుతోంది.

‘‘ఇరాన్ ఆక్రమిత బలూచిస్తాన్‌లో బీఎల్ఏకు ఎలాంటి స్థావరాలు లేవు. పౌరులపైనే పాకిస్తాన్ దాడులు చేసింది’’ అని బీఎల్ఏ అధికార ప్రతినిధి ఆజాద్ బలోచ్ ఒక ప్రకటనలో ఆరోపించారు.

‘ఇరాన్ ఆక్రమిత బలూచిస్తాన్(పశ్చిమ బలూచిస్తాన్)’లో ఉన్న బీఎల్ఏపై, స్వతంత్రం కోసం జరిపే పోరాటానికి మద్దతిస్తున్న ఇతర సంస్థలపై దాడులు చేస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. ఈ ప్రకటనను బీఎల్ఏ ఖండించింది.

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మూలాలేంటి?

భారత్, పాకిస్తాన్‌ల విభజన సమయంలో తమను బలవంతంగా పాక్‌లో విలీనం చేశారని బలూచిస్తాన్‌ ప్రజల అభిప్రాయం. తాము కూడా స్వతంత్ర దేశంగా మారాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు.

అప్పటి నుంచి వారు స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది.

పాకిస్తాన్‌ నుంచి బలూచిస్తాన్‌కు స్వాతంత్య్రాన్ని కోరుతూ బలూచిస్తాన్‌లో చాలా వేర్పాటువాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

వాటిల్లో ప్రధానమైనది, చాలా కాలంగా మనుగడలో ఉన్నదే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. 1970ల్లోనే ఈ సంస్థ ఏర్పాటైందనే వాదన ఉంది.

పాకిస్తాన్‌లోని జుల్ఫీకర్ అలీ భుట్టో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు దళాన్ని ఏర్పాటు చేసింది బలూచిస్తాన్.

అనంతరం సైనిక నియంత జియావుల్ హక్ అధికారం చేపట్టాక బలూచ్ కమ్యూనిటీ నాయకులతో చర్చలు జరిగాయి.

ఆ ఫలితంగా సాయుధ దళం తిరుగుబాటుకు స్వస్తి పలికింది. అలా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అప్పుడు అదృశ్యమైంది.

మళ్లీ ఎప్పుడొచ్చింది?

బీఎల్‌ఏ మళ్లీ 2000లో తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది. 2000 సంవత్సరాన్ని అధికారికంగా బీఎల్ఏ ఏర్పాటైన సంవత్సరంగా పేర్కొంటారు పలువురు విశ్లేషకులు.

2000లో బలూచిస్తాన్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతా బలగాలపై బీఎల్ఏ వరుస దాడులకు పాల్పడింది.

మౌరీ, బుగ్తీ తెగలకు చెందిన వారే ఎక్కువగా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో సభ్యులుగా ఉన్నారు. ప్రాంతీయ అస్తిత్వం కోసం పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తున్నారు.

బలూచిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ అక్బర్ ఖాన్ బుగ్తీ. ఆయన్ను బీఎల్ఏ అత్యంత సీనియర్ నాయకులలో ఒకరిగా పరిగణిస్తారు.

అయితే, 2006 ఆగస్టు 26న పాకిస్తాన్ భద్రతా బలగాల ఆపరేషన్‌లో అక్బర్ ఖాన్ మరణించారు. అనంతరం నవాబ్ ఖైర్ బక్ష్ మీరీ కుమారుడైన నవాబ్జాదా బాలాచ్ మీరీని అధికారులు చీఫ్‌గా చేశారు.

2007నవంబర్‌లో బాలాచ్ మీరి కూడా చనిపోయారనే వార్త బయటికి వచ్చింది. అదే ఏడాది పాకిస్థాన్ ప్రభుత్వం బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.

బలూచిస్తాన్‌ను విదేశీ ప్రభావం నుంచి ముఖ్యంగా చైనా, పాకిస్తాన్‌ల నుంచి విముక్తి కల్పించాలని బీఎల్ఏ కోరుకుంటోంది.

బలూచిస్థాన్ వనరులపై తమకు మొదటి హక్కు ఉందని బీఎల్ఏ వాదిస్తోంది.

బీఎల్ఏ బాధ్యత వహించిన పెద్ద దాడులివే..

2000 జులై: క్వెట్టాలో జరిగిన బాంబు పేలుడుకు బీఎల్ఏ బాధ్యత వహించింది. ఈ పేలుడులో ఏడుగురు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు.

2003 మే: బీఎల్ఏ వరుస దాడులను నిర్వహించడంతో పోలీసులు, బలూచ్‌ ప్రాంతంలోని కొందరు స్థానికేతరులు మరణించారు.

2004: పాకిస్తానీ మెగా-డెవలప్‌మెంట్ ప్రాజెక్టులలో పాల్గొన్న చైనీస్ విదేశీ కార్మికులపై బీఎల్ఏ దాడి చేసింది. (పాకిస్తాన్‌లో చైనా ప్రారంభించిన ప్రాజెక్టులను బీఎల్ఏ వ్యతిరేకించింది.)

2005 డిసెంబర్: అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సందర్శిస్తున్న కోహ్లులోని పారా మిలిటరీ శిబిరంపై బీఎల్ఏ ఆరు రాకెట్లను ప్రయోగించింది.

ముషారఫ్ క్షేమంగా బయటపడ్డారు. అయితే, పాక్ ప్రభుత్వం ఈ దాడిని హత్యాయత్నంగా అభివర్ణించింది. ప్రతీకారంగా భారీ సైనిక చర్యను ప్రారంభించింది.

2009 ఏప్రిల్: బీఎల్ఏ లీడర్‌గా చెప్పుకొంటున్న బ్రహ్మదాగ్ ఖాన్ బుగ్తీ బలూచిస్థాన్‌లో నివసిస్తున్న స్థానికేతరులను చంపాలని బలూచ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

అనంతరం జరిగిన దాడుల్లో దాదాపు 500 మంది పంజాబీలు ప్రాణాలు కోల్పోయారని బీఎల్ఏ తెలిపింది.

2009 జులై: సూయ్‌లో 19 మంది పాకిస్తానీ పోలీసులను అపహరించింది బీఎల్ఏ. అంతేకాకుండా ఒక పోలీసు అధికారిని చంపేసింది. మరో 16 మందిని గాయపరిచింది. మూడు వారాల వ్యవధిలో కిడ్నాపైన పోలీసులలో ఒకరిని మినహాయించి అందరినీ చంపేశారు.

2011 నవంబర్: ఉత్తర ముసాఖేల్ జిల్లాలో ఒక ప్రైవేట్ బొగ్గు గనిని కాపాడుతున్న ప్రభుత్వ భద్రతా సిబ్బందిపై బీఎల్ఏ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఇందులో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 10 మంది గాయపడ్డారు.

2011 డిసెంబర్: రాష్ట్ర మాజీ మంత్రి మీర్ నసీర్ మెంగల్ ఇంటి వెలుపల కారును బీఎల్ఏ పేల్చేసింది. ఈ దాడిలో 13 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు.

2013 జూన్: పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా ఇంటిపై రాకెట్ దాడి జరిగింది. దానికి బీఎల్ఏ బాధ్యత వహించింది. జిన్నా నివాసం వద్ద ఉన్న పాకిస్తాన్ జెండాను తీసేసి బీఎల్ఏ జెండా పెట్టేశారు.

2015 జూన్: పిర్ మసోరి ప్రాంతంలోని యునైటెడ్ బలూచ్ ఆర్మీకి చెందిన కరమ్ ఖాన్ క్యాంపుపై బీఎల్ఏ మిలిటెంట్లు దాడి చేశారు. ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

2017 మే: బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌లో భవన నిర్మాణ కార్మికులపై బీఎల్ఏ ఫైటర్లు మోటార్‌సైకిళ్లపై వెళుతూ కాల్పులు జరిపారు.

2017 ఆగస్ట్: బలూచిస్తాన్‌లోని హర్నైలో జరిగిన ఐఈడీ దాడికి బీఎల్ఏ బాధ్యత వహించింది. పాకిస్థాన్ పారామిలిటరీ సరిహద్దు దళం ఫ్రాంటియర్ కార్ప్స్ సభ్యులపై ఈ దాడి జరిగింది. ఘటనలో 8 మంది మృతి చెందారు.

2018 నవంబర్: కరాచీలోని చైనా కాన్సులేట్‌పై బీఎల్ఏ మిలిటెంట్లు దాడికి ప్రయత్నించారు. ఇందులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

బలూచిస్తాన్ విస్తీర్ణం ఎలా ఉంటుంది?

విస్తీర్ణం పరంగా పాకిస్థాన్‌లో బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్, అయితే దేశంలోని ఇతర నాలుగు ప్రావిన్సులతో పోలిస్తే దాని జనాభా అతి తక్కువ. దీని సరిహద్దులు ఇరాన్, అఫ్గానిస్తాన్‌తో ఉన్నాయి.

మొత్తం బలూచిస్తాన్‌‌లో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్, ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్, అఫ్గానిస్తాన్‌లోని నిమ్రూజ్, హెల్మాండ్‌ సహా కొన్ని ప్రాంతాలున్నాయి.

పాకిస్తాన్‌లో భాగమైన బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ గ్యాస్, బొగ్గు, రాగి నిల్వలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. అయినప్పటికీ, ఇది పాకిస్తాన్‌లోని అత్యంత పేద ప్రావిన్స్‌గానే మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)