You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్, సిరియా, ఇరాక్ దేశాల మీద ఇరాన్ ఎందుకు క్షిపణులతో దాడి చేసింది?
- రచయిత, జియార్ గోల్
- హోదా, బీబీసీ పార్సీ ప్రతినిధి
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యుషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇటీవలి సంవత్సరాల్లో ప్రాంతీయ శక్తుల్లో (రీజినల్ పవర్స్) తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది.
మధ్య ప్రాచ్యంలో అమెరికా స్థావరాలతో పాటు టెల్ అవీవ్, హాఫియాలోని ఇజ్రాయెల్ స్థావరాలన్నీ తమ క్షిపణుల పరిధిలో ఉన్నాయని ఐఆర్‌జీసీ బహిరంగంగా చెబుతోంది.
సోమవారం రాత్రి ఇరాన్ రివల్యుషనరీ గార్డ్ కార్ప్స్ 11 బాలిస్టిక్ క్షిపణులను కుర్దిస్తాన్ రాజధాని ఇర్బిల్‌పై ప్రయోగించింది. ఇరాక్‌కు చెందిన సెమీ అటానమసన్ ఏరియా కుర్దిస్తాన్.
ఈ దాడుల్లో నలుగురికి పైగా చనిపోయారని, ఆరుగురు గాయపడ్డారని కుర్దిస్తాన్ పాలక వర్గం తెలిపింది.
కుర్దిస్తాన్ ప్రధానమంత్రి మస్రూర్ బర్జానీ ఈ దాడులను కుర్దిష్ ప్రజలపై జరిగిన నేరంగా అభివర్ణించారు.
ఈ దాడుల్లో ఇజ్రాయెల్ గూఢచార సర్వీస్ మోసాద్‌కు చెందిన మూడు స్థావరాలు ద్వంసం అయ్యాయని ఐఆర్‌జీసీ సన్నిహిత ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
తమ భూభాగంలో విదేశీ ఏజెట్ల ఉనికిని కుర్దిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. ఇజ్రాయెల్ ఈ అంశంపై ఇంకా ఏమీ అనలేదు.
ఒకేసారి మూడు దేశాలపై దాడులు
ఐఆర్‌జీసీ, కోటీశ్వరుడైన కుర్దిష్ ప్రముఖ వ్యాపారవేత్త పేశ్రవ్ డిజాయి ఇంటిపై దాడిచేసి ఆయనను చంపింది. లక్షిత దాడుల్లో తాము విజయవంతం అయినట్లు ఇరాన్ చూపించింది.
2003లో ఇరాక్ మీద అమెరికా దాడి తర్వాత ఫాల్కన్ గ్రూప్, ఎంపైర్ వరల్డ్ అనే రెండు కంపెనీలను డిజాయి ఏర్పాటు చేశారు. కుర్దిస్తాన్ ప్రధానమంత్రి బర్జానీ కుటుంబానికి పేశ్రవ్ డిజాయి సన్నిహితంగా ఉండేవారని వార్తా ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది.
పేశ్రవ్ డిజాయి ఇంటి మీద నాలుగు క్షిపణుల్ని ప్రయోగించారు. స్థానిక మీడియా వార్తల ప్రకారం, ఈ దాడులో డిజాయి 11 నెలల కూతురు కూడా చనిపోయారు.
ఫాల్కన్ గ్రూపు భద్రత, నిర్మాణం, చమురు, గ్యాస్ రంగాల్లో సేవలు అందిస్తోంది. ఇరాక్‌లో ఫాల్కన్ గ్రూప్ సెక్యూరిటీ డివిజన్ అమెరికాతో పాటు పలు పశ్చిమ ప్రతినిధులతో ముడిపడిన కంపెనీలకు సహకారం అందిస్తోంది.
ఐఆర్‌జీసీ ఈ దాడుల ద్వారా తాము కేవలం పౌర సదుపాయాల మీదే కాకుండా ఇర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకోగలమనే సందేశాన్ని పంపడానికి ప్రయత్నించింది.
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ స్థావరం, ఇర్బిల్ విమానాశ్రయానికి కొన్ని మైళ్ల దూరంలోనే ఉంది.
ఇరాక్‌లో దాడులు ఎందుకు?
ఇరాక్‌లో ఇప్పుడు 2500 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వీరిలో కొంతమంది సైనికులు ఇర్బిల్‌లో కూడా ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూపు వ్యతిరేక అమెరికా నేతృత్వంలోని సంకీర్ణంలో ఈ సైనికులు కూడా భాగం.
ఐఎస్ మళ్లీ ఆవిర్భవించకుండా ఆపేందుకు, స్థానిక ప్రజలకు సహాయం చేసేందుకే తమ సైనికులు ఉన్నారని అమెరికా చెబుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో ఐఎస్ ప్రభావం చాలా ఉండేది.
అయితే ఈ దాడుల్లో ఇరాన్ సొంత ప్రయోజనాలు ఉన్నట్లుగా కూడా చూస్తున్నారు. సిరియాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా వీటిని చూస్తున్నారు.
సిరియా రాజధాని దామస్కస్ శివార్లలో డిసెంబర్ 25న ఒక ఐఆర్‌జీసీ సీనియర్ కమాండర్‌ను చంపారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఇరాన్ కమాండర్ చనిపోయినట్లుగా నమ్ముతున్నారు.
ఐఆర్‌జీసీ జనవరి 15న వాయువ్య సిరియా ఇద్బిల్ ప్రావిన్సులో బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇరాన్ ఈ దాడుల ద్వారా ఐఎస్, ఇతర తీవ్రవాద సమూహాలను లక్ష్యంగా చేసుకుందని చెబుతారు.
ఇద్బిల్‌లో 30 లక్షల మంది నిరాశ్రయులైన సిరియా ప్రజలు ఉంటున్నారు. వీరంతా 2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ వ్యతిరేక తిరుగుబాటుకు మద్దతు ఇచ్చినవారు.
బషర్ అల్ అసద్‌కు ఇరాన్ మద్దతు ఇస్తుంది. షియా ముస్లిం మెజారిటీ ఉన్న దేశం ఇరాన్. సున్నీలు అధికంగా ఉండే సిరియాలో బషర్ అల్ అసద్ షియా నాయకుడు.
ఇరాన్ సందేశం
బషర్ అల్ అసద్‌ను అధికారం నుంచి తప్పించడానికి పశ్చిమ దేశాలు చాలా ప్రయత్నించాయి. కానీ, ఇరాన్, రష్యా మద్దతుతో అసద్ ఇప్పటికీ అధికారంలో ఉన్నారు.
ఇద్బిల్‌లో ఇస్లామిక్ గ్రూప్ హయాత్ తహ్రీర్ అల్-షర్మ్ ఉనికి చాలా బలంగా ఉంటుంది. ఐఎస్‌తో పాటు అల్ ఖైదాకు కూడా ఇక్కడ ప్రభావం ఉంది.
జనవరి 3న దక్షిణ ఇరాన్‌లోని కర్మన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతిస్పందనే ఇద్బిల్‌లో క్షిపణి దాడులు అని ఐఆర్‌జీసీ చెప్పింది.
కర్మన్‌లో ఐఆర్‌జీసీ కమాండర్ కాసిమ్ సులేమానీకి శ్రద్ధాంజలి ఘటించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పోగయ్యారు. అప్పుడే ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.
ఇద్బిల్‌పై దాడిలో 1450 కిలోమీటర్లు దూరం పరిధిలోని లక్ష్యాల్ని ఛేదించే కాస్టల్ బస్టర్ క్షిపణిని ఉపయోగించినట్లు ఐఆర్‌జీసీ చెప్పింది.
దక్షిణ ఇరాన్‌లోని ఖుజెస్తాన్ నుంచి ఈ క్షిపణి దాడులు చేసినట్లు ఐఆర్‌జీసీ తెలిపింది.
నిజానికి ఐఆర్‌జీసీ, ఇద్బిల్‌లో పశ్చిమ అజర్‌బైజాన్ నుంచి కూడా క్షిపణి దాడులు చేయొచ్చు. ఇద్బిల్‌కు అజర్‌బైజాన్ చాలా దగ్గరగా ఉంటుంది. కానీ, తాము ఉపయోగించిన క్షిపణి గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఇరాన్ ప్రయత్నించింది. ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల వరకు ఈ క్షిపణి చేరుకోగలదు.
ఇరాక్, సిరియాల తర్వాత పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఒక తీవ్రవాద సమూహ స్థావరంపై కూడా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.
ఈ దాడిలో ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు, మరో ముగ్గురు గాయపడినట్లు పాకిస్తాన్ తెలిపింది. పాకిస్తాన్ ఈ దాడులను తమ సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణిస్తూ తీవ్ర హెచ్చరికలు చేసింది.
ఇరాన్ ఇంతకుముందు కూడా పాకిస్తాన్‌లో చొరబడి దాడులు చేసింది.
ఇవి కూడా చదవండి:
- భారత సరిహద్దుకు సమీపంలోని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామన్న మియన్మార్ తిరుగుబాటుదారులు
- మాల్దీవులు దూకుడుపై భారత్ మౌనం ఎందుకు?
- పాకిస్తాన్‌లో ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు... దీనికి భారతదేశమే కారణమా?
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- ఇరాన్ క్షిపణి దాడుల్లో తమ చిన్నారులు చనిపోయారన్న పాకిస్తాన్, తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)