ఏపీలో వాట్సాప్‌ పాలన, ఏమిటి దీని ప్రత్యేకత..161 సేవలు ఎలా అందిస్తారు?

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

సులభంగా పౌరసేవలు అందించడానికి వీలుగా వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై ప్రజలు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా వాట్సాప్‌లోనే పౌరసేవలు, ప్రభుత్వ ధృవపత్రాలు పొందవచ్చని పేర్కొంది.

ఇందుకోసం వాట్సాప్ మాతృసంస్థ మెటాతో ఏపీ ప్రభుత్వం అక్టోబర్‌ 22, 2024న దిల్లీలో ఒప్పందం చేసుకుంది.

అధికారికంగా ఈ సేవలను ''మన మిత్ర' పేరుతో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ గురువారం అమరావతిలో ప్రారంభించారు.

మొత్తం 161 సేవలు

పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు ఈ వాట్సప్‌ పాలనను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

ఇందుకోసం 9552300009 ఫోన్‌ నెంబర్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ అకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉందని వెల్లడించింది. 9552300009 నెంబర్‌కు వాట్సాప్‌ చేస్తే చాలు.. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఈ సేవల ప్రారంభానికి ముందు రోజు అధికారులతో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోనే తొలి సారిగా ఏపీలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. వాట్సాప్‌ ద్వారా సేవలు ఎలా పొందాలో, ఆప్షన్లు ఎలా ఎంచుకోవాలో ప్రజలకు సులువుగా అర్ధమయ్యేట్టుగా తీర్చిదిద్దామన్నారు. జనరేటివ్‌ ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా వాట్సప్‌ గవర్నెన్స్‌ పని చేస్తుందని ఆయన వెల్లడించారు.

ఇదే సమయంలో ప్రజల సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,ఈ మేరకు ఫోరెన్సిక్, సైబర్‌ సెక్యూరిటీని బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించారు.

ఈ వాట్సాప్‌ సేవలు పొందడం ఎలా?

వాట్సాప్‌ గవర్నెన్స్‌లో ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నెంబర్‌ 9552300009 కీలకం.

ప్రభుత్వం ప్రజలకు ఏదైనా సమాచారాన్ని తెలియజేయాలంటే ఈ వాట్సప్‌ ఖాతా ద్వారా మెసేజ్‌లు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. ప్రజలు వినతులు, ఫిర్యాదులు చేయడానికి ఈ వాట్సాప్‌ నంబర్‌కి మెసేజ్‌ చేస్తే వెంటనే ఒక లింక్‌ వస్తుంది అందులో పేరు, ఫోన్‌ నెంబర్, చిరునామా తదితర వివరాలు పొందుపరిచి వారి వినతిని టైప్‌ చేయాలి. అలా చేసిన వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నెంబర్‌ వస్తుంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు.

ప్రభుత్వ పథకాల సమాచారం కూడా...

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర వివరాలన్నింటినీ ఈ వాట్సాప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఆ పథకాల అమలుపై వాట్సాప్‌ ద్వారా ఫీడ్‌బ్యాక్‌ కూడా ఇవ్వవచ్చు.

అర్హులైనవారికి పథకాలు అందకపోయినా ఫిర్యాదులు చేయవచ్చు.

పౌరులకు కావాల్సిన సర్టిఫికెట్లను ఈ వాట్సాప్ గవర్నెన్న్‌ ద్వారా పొందవచ్చు.

అన్ని కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు తీసుకోవచ్చు.

కరెంటు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి కూడా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా చెల్లించవచ్చు. పొందవచ్చు.

రెవిన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్‌ రికార్డుల సర్టిఫికెట్లు సైతం పొందవచ్చు.

ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు

ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్‌లను బుక్‌ చేసుకోవచ్చు. అలాగే టికెట్‌ రద్దుతో పాటు ట్రాకింగ్‌ సర్వీస్‌తో బస్సు గమనాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

అక్కడి టికెట్లు, వసతి సహా అన్ని సౌకర్యాలూ బుక్‌ చేసుకోవచ్చు. అలానే తిరుమల తిరుపతి మినహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దర్శనాలు, వసతి బుక్‌ చేసుకోవడంతో పాటు విరాళాలు కూడా పంపొచ్చు.

తిరుమలను రెండో దశలో భాగం చేసే అవకాశం ఉందని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

‘‘తొలి దశలో 161 సేవలు ప్రారంభించాం. రెండో విడతలో 360 సర్వీసులు అందుబాటులోకి తెస్తాం. ఇప్పుడు రెవిన్యూ, పురపాలక, దేవాదాయశాఖతో సహా 36 ప్రభుత్వ శాఖలను ఇందులో భాగం చేశాం’’ అని లోకేశ్ అన్నారు.

వరదలు, పిడుగులు, వడగాడ్పులు తదితర ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని ఎప్పటికప్పుడుఅందిస్తారు. ఏ ప్రాంతంలోనైనా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడితే, ఆ ప్రాంత ప్రజలకు ఈ వాట్సాప్ ద్వారానే సమాచారం అందిస్తారు.

ఏదైనా ప్రాంతంలో అంటువ్యాధులు ప్రబలుతుంటే ఆ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు. అలాగే ఆ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తపై సూచనలు కూడా పంపుతారు.

తొలిరోజు సరిగ్గా పనిచేయడం లేదంటూ..

కాగా, వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన వెంటనే తమ ఫోన్ల నుంచి ప్రయత్నించామనీ, అయితే, సర్వీసులు అందుబాటులోకి రావడం లేదంటూ పలువురు సోషల్‌ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. కాగా, దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)