You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రతన్ టాటా: ‘గుడ్ బై మై డియర్ లైట్‌హౌస్’ అంటూ భావోద్వేగ పోస్ట్ చేసిన శంతను నాయుడు
రతన్ టాటా మరణంపై ఆయన స్నేహితుడు శంతను నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లింక్డ్ఇన్ వేదికగా ఆయన రతన్ టాటాతో కలిసి ఉన్న చిత్రంతో భావోద్వేగమైన పోస్టు చేశారు.
రతన్ టాటాకు శంతను నాయుడు గత కొన్నేళ్లుగా మంచి స్నేహితుడు.
‘‘మన స్నేహానికి బ్రేకప్ చెబుతూ నువ్వు వదిలి వెళ్లిన లోటును భర్తీ చేసేందుకు నా జీవితమంతా ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ భరించలేని దుఃఖాన్ని మిగిల్చింది. నా ప్రియమైన లైట్‌హౌస్‌కు సెలవు, గుడ్‌బై’’.. అంటూ శంతను నాయుడు ఎమోషనల్ పోస్టు చేశారు.
రతన్ టాటాకు అత్యంత సన్నిహితుల్లో 31 ఏళ్ల శంతను నాయుడు ఒకరు. రతన్ టాటా ఎక్కడికి వెళ్లినా నాయుడు ఆయన వెన్నంటే ఉంటారు.
వీధి కుక్కలపై ఉన్న ప్రేమ కారణంగా రతన్ టాటా, శంతను నాయుడు మధ్య అనుబంధం బలపడింది.
శంతను నాయుడు కుటుంబం పుణేలో స్థిరపడింది. వారిది తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబంగా చెప్తారు. శంతను నాయుడు తన లింక్డిన్ ప్రొఫైల్‌లో సైతం తెలుగు భాషపై తనకు ప్రావీణ్యం ఉన్నట్లు పేర్కొన్నారు.
‘‘రతన్ నాకు కఠినంగా వ్యవహరించే బాస్. మంచి మార్గదర్శి. నన్ను బాగా అర్థం చేసుకునే మంచి మిత్రుడు’’ అని గతంలో శంతను నాయుడు బీబీసీతో చెప్పారు.
శంతను నాయుడు పుణెలోని సావిత్రిభాయి ఫూలే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.
ఆ తర్వాత 2014లో పుణెలోనే ఉన్న టాటా టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు. ఆ తర్వాత టాటాలో డిజైన్ ఇంజినీర్‌గా చేరారు.
ఆ సమయంలో ఆయన మోటోపాస్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు.
వీధి కుక్కుల మెడలకు రాత్రి పూట మెరిసే కాలర్లు అమర్చేవారు.
ఆయన చేస్తున్న ఈ పని గురించి సంస్థ న్యూస్‌లెటర్‌లో ప్రధానంగా వచ్చింది.
శంతను ఆలోచన నచ్చి, ఆయన్ను ముంబయికి ఆహ్వానించారు రతన్ టాటా.
‘‘వీధి కుక్కలపై ఉన్న ప్రేమ కారణంగానే తొలిసారి శంతనును కలిశాను. కళాశాల కుర్రాళ్లతో కలిసి ఓ బృందాన్ని నడిపిస్తూ, వీధి కుక్కలను అతడు చేరదీశాడు. వాటి ఆలనాపాలనా చూసుకున్నాడు’’ అని బీబీసీతో గతంలో రతన్ టాటా చెప్పారు.
‘‘మోటోపాస్ పెరుగుతున్న కొద్దీ, మేం మరింత దగ్గరయ్యాం. పని గురించిన ఈ-మెయిళ్ల నుంచి ఒకరి గురించి ఒకరు అడిగే స్థితికి చేరుకున్నాం’’ అని శంతను చెప్పారు.
రతన్ టాటా చదువుకున్న అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలోనే శంతను చేరారు. శంతను గ్రాడ్యుయేషన్ డేకు రతన్ టాటా స్వయంగా హాజరయ్యారు.
‘‘ఏదో మాట్లాడుతూ నా గ్రాడ్యుయేషన్ డే గురించి ఆయనకు చెప్పా. ఆ రోజు వచ్చే సరికి ఆయన అక్కడున్నారు’’ అని శంతను చెప్పారు.
అమెరికా నుంచి భారత్‌కు తిరిగివచ్చాక రతన్ టాటా దగ్గర బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగంలో శంతను చేరారు.
బిజినెస్ అసిస్టెంట్‌గా రోజూ ఏం చేయాల్సి ఉంటుందని అడిగినప్పుడు... ‘‘సమావేశాల్లో నోట్స్ రాసుకుంటా. రతన్ టాటా రాగానే ఆయనకు ఆ రోజు విషయాల గురించి క్లుప్తంగా చెప్తా. ఆ రోజు తన ప్రణాళిక ఏంటో ఆయన చెబుతారు. ఒక్కో పని చేస్తూ పోతాం. ఆయన చాలా ఫోకస్డ్‌గా ఉండే మనిషి. విరామాలు తీసుకోకుండా పని చేస్తూనే ఉండేవారు’’ అని శంతను గతంలో వివరించారు.
2022 నుంచి రతన్ టాటా కార్యాలయంలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు శంతను నాయుడు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా కూడా రతన్ టాటాను తీసుకుని శంతను నాయుడు పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
వయసులో 50 ఏళ్లకు పైగా అంతరం ఉన్న వీరి స్నేహం గురించి తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. అయితే, తనకది చాలా ప్రత్యేకమని శంతను నాయుడు చెప్పేవారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)