You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఆఫ్రికాలో ప్రమాదకరమైన మిలిటెంట్ గ్రూపుగా ఎలా మారింది?
- రచయిత, ప్రియా సిప్పీ, జాకబ్ బొస్వాల్
- హోదా, బీబీసీ న్యూస్, బీబీసీ మానిటరింగ్
మాలి, బుర్కినా ఫాసో, నైజర్ వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ -ముస్లిమిన్ (జేఎన్ఐఎం) మిలిటెంట్ జిహాదీ దాడులు చేస్తోంది.
జులై 1న సెనెగల్, మోరిటేనియా సరిహద్దుల సమీపంలో పశ్చిమ మాలిలోని ఏడు సైనిక స్థావరాలపై తాము భారీ దాడులు చేసినట్లు ఈ సంస్థ క్లెయిం చేసుకుంది.
ఈ ప్రాంత సుస్థిరతపై జేఎన్ఐఎం ప్రభావం చూపిస్తుందేమోనన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
బుర్కినా ఫాసో, మాలి, నైజర్ హింసను అదుపు చేయడానికి చాలా శ్రమించాయి. గత ఐదేళ్లలో సహేల్ దేశాలలో సైనిక కుట్రలకు కారణమైన అంశాలలో ఇదొకటి.
అయితే పౌర ప్రభుత్వాల స్థానంలో ఏర్పడిన సైనిక ప్రభుత్వాలు పెరుగుతున్న జిహాదీ ముప్పును, ప్రత్యేకించి జేఎన్ఐఎం నుంచి ఎదురవుతున్న ప్రమాదాన్ని ఆదిలోనే అరికట్టడంలో విఫలం అవుతున్నాయి.
ఏమిటీ జేఎన్ఐఎం
జేఎన్ఐఎం కొన్ని సంవత్సరాలలోనే ఆఫ్రికాలో ప్రమాదకర జిహాదిస్ట్ గ్రూప్‌గా ఎదిగింది.
2017లో మాలిలో ఐదు మిలిటెంట్ గ్రూపులతో కలిసి జేఎన్ఐఎంఈ ఏర్పడింది.
ఆ 5 సంస్థలు ఏంటంటే..
- అన్సార్ డైన్
- కటిబట్ మసినా
- అల్ మోరాబిటౌన్
- అన్సార్ అల్ ఇస్లాం
- ది సహారా బ్రాంచ్ ఆఫ్ అల్‌ఖైదా ఇన్ ది ఇస్లామిక్ మఘ్‌రెబ్
2012లో ఉత్తర మాలిలో పని చేస్తున్న అనేక జిహాదిస్టు గ్రూపులు, వేర్పాటువాద సంస్థలను ఫ్రెంచ్ సైన్యం తరిమి కొట్టింది. దీంతో ఆయా గ్రూపుల నాయకులు జేఎన్ఐఎం ఏర్పాటు చేసేందుకు ఒకరికొకరు సహకరించుకుంటూ ఏకతాటిపైకి వచ్చారు.
ఇటీవలి సంవత్సరాలలో వాళ్లు భౌగోళికంగా విస్తరిస్తూ కొత్త ప్రాంతాల్లో తమ కార్యక్రమాలను చేపడుతున్నారు.
జేఎన్ఐంకు తువారెగ్ తెగకు చెందిన మాలీ మాజీ రాయబారి ‘ఇయాద్ అగ్ ఘలీ’ నాయకత్వం వహిస్తున్నారు. తువారెగ్ ప్రజల కోసం అజావద్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలంటూ 2012లో మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తువారెగ్ ప్రజలు నిర్వహించిన ఆందోళనలకు ఆయన నాయకత్వం వహించారు.
జేఎన్ఐఎం డిప్యూటీ లీడర్ అమడౌ కౌఫా.. ఫులాని వర్గానికి చెందిన వ్యక్తి.
పశ్చిమ ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో పని చేస్తున్న స్థానిక శాఖలకు మార్గనిర్దేశనం చేయడంలో కేంద్ర నాయకత్వం సాయం చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
జేఎన్ఐంలో వివిధ ర్యాంకుల్లో ఎంత మంది ఫైటర్లు ఉన్నారో, ఇటీవల ఎంత మందిని నియమించుకున్నారో చెప్పడం కష్టం. పేదరికం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఆర్థికంగా ఇతర అవకాశాలు లేని యువకులు, పిల్లల్ని వేల సంఖ్యలో నియమించుకుని ఉండొచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.
‘జేఎన్ఐఎం’కు ఏం కావాలి?
ఈ గ్రూపు సహేల్ దేశాల్లోని ప్రభుత్వాల అధికారాన్ని వ్యతిరేకిస్తోంది. తమ ఆపరేషన్స్ ఉన్న ప్రాంతాలలో ఇస్లాం, షరియా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతోంది.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం జేఎన్ఐఎం కొన్ని ప్రాంతాల్లో డ్రెస్‌కోడ్‌ను కఠినంగా అణలు చేస్తోంది. సంగీతం, పొగతాగడంపై నిషేధం విధించింది. మహిళలు ఒంటరిగా వీధుల్లోకి రావడాన్ని అడ్డుకోవడంతో పాటు పురుషులు గడ్డం పెంచాలని ఆదేశించింది.
ఇదంతా స్థానిక సమూహాలు ఆచరించే మత విధానాలకు వ్యతిరేకంగా ఉండవచ్చని బాన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ స్టడీస్‌లో సీనియర్ రీసెర్చర్ వైవాన్ గుయిచౌవా అన్నారు.
"ఇవన్నీ ఇప్పటికే ఆచరణలో ఉన్న వాటికి విరుద్ధంగా ఉన్నాయి. ఇవి ప్రజాదరణ పొందలేవు" అని ఆయన చెప్పారు.
"ఇవి ఆకర్షణీయంగా ఉన్నా లేకున్నాయా లేవా అనేది ప్రభుత్వాలు చేసే కార్యక్రమాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొన్నేళ్లుగా ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉంది" అని ఆయన వివరించారు.
లౌకిక న్యాయ వ్యవస్థపై భ్రమలు తొలగిపోవడంతో కొంతమందికి షరియా కోర్టులు ఆకర్షణీయంగా కనిపించవచ్చు.
జేఎన్ఐఎం కార్యక్రమాలు ఎక్కడెక్కడంటే..
మధ్య, ఉత్తర మాలిలో తన కార్యకలాపాలను ప్రారంభించిన జేఎన్ఐఎం వేగంగా విస్తరించింది. మాలి, నైజర్, బుర్కినా ఫాసోలో బలంగా వేళ్లూనుకుంది. బెనిన్, టోగో, ఒక దశలో ఐవరీకోస్ట్‌లోనూ దాడులు చేసింది.
జేఎన్ఐఎం ప్రస్తుతం మాలిఅంతటా, బుర్కినా ఫాసోలోని 13 ప్రాంతాలలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోందని పౌర సంస్థ గ్లోబల్ ఇనిషియేటివ్ ఎగెనెస్ట్ ట్రాన్సిషినల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (జీఐటీఓసీ) తెలిపింది.
గత ఏడాది ఈ గ్రూపు కార్యకలాపాలకు బుర్కినా ఫాసో కేంద్ర స్థానంగా మారింది. ప్రధానంగా ఉత్తర, తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో జేఎన్ఐఎం యాక్టివ్‌గా ఉంది. సైన్యంలో విభజన, ఫిరాయింపులు, మిలిటెంట్లకు స్థానిక ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు లాంటివి దీనికి కారణమని కంట్రోల్ రిస్క్అనే సెక్యూరిటీ కన్సల్టెన్సీలో సీనియర్ అనలిస్ట్ బెవర్లీ ఒచెంగ్ చెప్పారు.
"జేఎన్ఐఎంకు స్థానిక ప్రజల్లోకి చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంది లేదా అది స్థానిక ప్రజల కష్టాలను ఉపయోగించుకుని వాళ్లను రిక్రూట్ చేసుకోవడం లేదా వారి పట్ల సానుభూతి చూపించడం లాంటివి చేస్తుంది" అని ఒచెంగ్ బీబీసీతో చెప్పారు.
జేఎన్ఐఎం దాడులు పెరుగుతున్నాయా?
ఇటీవల కొన్ని నెలలుగా బుర్కినా ఫాసోలో హింసాత్మక ఘటనలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని బీబీసీ మానిటరింగ్‌కు చెందిన మీడియా టీమ్ విశ్లేషణలో తేలింది.
మాలి, నైజర్, బెనిన్‌లోనూ ఇటీవల భారీ దాడులు జరిగాయి.
2025 తొలి ఆరు నెలల్లో బుర్కినా ఫాసోలోనే జేఎన్ఐఎం 280 దాడులు చేసింది.
2024లో తొలి ఆరు నెలలతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపైందని బీబీసీ పరిశీలనలో తేలింది.
2025 ఏప్రిల్ నుంచి సహేల్ ప్రాంతంలో దాదాపు వెయ్యి మందిని హత్య చేసినట్లు ఈ గ్రూపు ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది భద్రతా బలగాలకు చెందిన వారు లేదా ప్రభుత్వ బలగాలతో కలిసి పోరాడుతున్న మిలీషియాలకు చెందినవారని బీబీసీ డేటా ద్వారా తేలింది.
అందులో 800 మంది బుర్కినా ఫాసోకు చెందినవారు. గాయపడిన వారిలో మాలిలో అత్యధికంగా 117 మంది ఉన్నారు. బెనిన్‌లో74 మంది ఉన్నారు.
"జూన్‌లో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని స్థాయిలో దాడులు తరచుగా జరుగుతున్నాయి. కొన్ని వారాలుగా వాళ్లు తమ కార్యకలాపాలను విస్తృతం చేశారు" అని గుయిచౌవా చెప్పారు
ఎక్కువ నష్టం చేయడానికి తీవ్రవాదులు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తున్నారని ఒచెంగ్ వివరించారు.
"ప్రధాన రహదారుల మీద వాళ్లు ఐఈడీలను ఏర్పాటు చేస్తారు. సైనిక స్థావరాలలో బలగాలను లక్ష్యంగా చేసుకుంటారు. అక్కడ దాడి చేస్తే వారికి ఆయుధాలు కూడా లభిస్తాయి. వాళ్లు పౌరుల మీద కూడా దాడి చేస్తారు. ఉదాహరణకు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తెలిస్తే వారిపై దాడులు చేస్తారు" అని ఆమె చెప్పారు.
ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. జేఎన్ఐఎం తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ సంస్థను కూడా వదల్లేదని జీఐటీఓసీ తాజా నివేదిక చెబుతోంది.
సాధారణ మొబైల్ నెట్‌వర్క్ పని చేయని చోట స్టార్‌లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది.
మిలిటెంట్ సంస్థలు స్టార్‌లింక్ పరికరాలను కొన్ని నిషిద్ధ మార్గాల ద్వారా దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని జీఐ టీఓసీ తెలిపింది.
"మిలిటెంట్ గ్రూపులు దాడుల్ని ప్లాన్ చేయడం, అమలు చేయడం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సభ్యుల్ని నియమించుకోవడం, ఆర్థిక లావాదేవీలు, ఘర్షణాత్మక పరిస్థితుల్లో కమాండర్లతో సమాచార మార్పిడి లాంటి వాటిని స్టార్‌లింక్ తేలిగ్గా మార్చింది" అని జీఐ టీఓసీ నిపుణుడు బీబీసీ ఆఫ్రికా పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
దీనిపై స్పందన కోసం బీబీసి స్టార్‌లింక్‌ను సంప్రదించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)